హాస్య సంధ్య జంధ్యాల - అచ్చంగా తెలుగు

హాస్య సంధ్య జంధ్యాల

Share This
హాస్య సంధ్య జంధ్యాల


  శ్రీదేవి సిరి కవుటూరు


శ్రీశ్రీ కవిత...బాపు బొమ్మ...ఆత్రేయ ప్రేమ.....లాంటి బ్రాండ్ ఇమేజ్ జంధ్యాల హాస్యానికుంది..
అలసిన మనసులకు సేదతీర్చేది హాస్యం. సిమెంటు అడవుల్లో, రణగొణ ధ్వనుల మధ్య సగానికిపైగా జీవితం అశాంతిలో గడిపేస్తున్న ఈ రోజుల్లో హాస్యం (కూసింత నవ్వు) కోసం అర్రులు చాస్తున్న పరిస్థితి ప్రతీ చోట ప్రతీ ఒక్కరిలో కనిపిస్తుంది.
ఆంగ్ల సాహిత్యంలో కామెడీ నాటికలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో హాస్యానికి పెద్దపీట వేస్తూ సినిమా మాధ్యమం ద్వారా ఒక రూపు తెచ్చింది హాస్య బ్రహ్మ జంధ్యాల గారే.   
జంధ్యాల శకం
జంధ్యాల పేరు తలుచుకోగానే నవ్వుల సెలయేరు ఎలా పారుతుందో అ సెలయేటి మీదుగా  ‘పడమటి సంధ్యారాగం’ ‘ఆనందభైరవి’ వినిపిస్తుంది. `పుత్తడిబొమ్మ’ ‘రెండుజళ్ళ సీత’.. ‘బావా బావా పన్నీర’ని పాడుకుంటూ..‘చూపులు కలిసిన శుభవేళ’..  ‘అహ నా పెళ్ళంట’ అని గారాలుపోతుంది. ‘బాబాయ్ అబ్బాయ్’ ‘చంటబ్బాయ్’ కి  ‘హైహై నాయకా’.. ‘జయమ్ము నిశ్చయమ్మురా.’.! అంటూ ‘బాబాయ్ హోటల్లో’ ఏర్పాటు చేసిన వివాహభోజనం ఊరిస్తుంది. హాస్యానికే (ఛార్లీ) ఛాంప్లిన్ అని గర్వంగా తెలుగు వారు ప్రకటించేంతటి హాస్య యోగి.. జంధ్యాల. అందుకే అది హాస్య శకం -జంధ్యాల శకం అయింది.
జంధ్యాల పూర్తి పేరు `జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి  1941 జనవరి 14 న నరసాపురం లో జన్మించారు జంధ్యాల. విజయవాడ .ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ కళాశాలలో కామర్స్లో డిగ్రీ పూర్తిచేశారు..  చిన్న తనం నుంచే జంధ్యాలకి నటనపై మక్కువ ఎక్కువ. పాఠశాల స్థాయిలోనే అనేక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చేవారు.
తరువాత అనేక నాటకాలు రచించి నాటకరంగం పై తన మమకారాన్ని చాటుకున్నారు.  కానీ సినిమారంగంలోకి వస్తారని మాత్రం ఎప్పుడూ ఊహించలేదని చెపుతారు. అయితే ఒకానొక సందర్భంలో ఈయన గుమ్మడి వేంకటేశ్వర రావు గారిని కలవటం ఆయన సలహాపై సినిమా రచనపై ఆసక్తిని పెంచుకోవటం తద్వారా కాశీనాథుని విశ్వనాథ్ గారు వంటి ప్రముఖుల ప్రోత్సాహం లభించటం వెంటవెంటనే జరిగిపోయాయని చెబుతారు. 
 అచ్చతెలుగు హాస్య బ్రహ్మ :
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటూ తన పరిచయాన్నే హాస్య పదాలతో చెప్పిన జంధ్యాల, తన రచనల్లో మాటల్లో దర్శకత్వంలో హాస్యానికి ఒక ప్రతేక స్థానాన్ని కల్పించారు. హాస్యం పండించాలంటే జంధ్యాలే సాగు చేయాలనేంతగా ప్రేక్షకుల, నిర్మాతల మనసు గెలుచుకొన్నారు. భారీ బడ్జెట్లు, పెద్ద పెద్ద హీరోలు, మాస్ మసాలాలు ఉంటేనే సినిమా సూపర్ హిట్ అనుకునే రోజుల్లోనే అతితక్కువ బడ్జెట్, అనామకులైన హీరోలు, మాస్ మసాలా లేని క్లాస్ హ్యూమర్ తో, తీసిన ప్రతీ సినిమాని వంద రోజులవైపు పరుగెత్తించిన ప్రతిభాశాలి మన జంధ్యాల. `ముంజేతి కంకణానికి అద్దమేల?` అన్నట్లు జంధ్యాల హాస్య ఝరి గురించి చెప్పుకోవటానికి ఒక్క `అహనా పెళ్ళంట` సినిమా చాలు.
అరగుండు: యావండోయ్ మాట..  మనం ఇక్కడ నుంచి మనం
ప...ప..ప..ప..ప..
గుండు : అలాగే కానిద్దాం
అరగుండు : ఏం కానిద్దాం నా బొంద నేనింకా చెప్పందే..!
అర: మనం ఇంకో ప..ప..ప..ప..
గుండు : శభాషో.. బాగుంది..అలాగే..!
అర: పదినిమిషాల్లో బయలుదేరాలి
గుండు: వినబళ్ళా..
అర: మనం ఇంకా ప..ప..ప..
గుండు: అలాగే చేద్దాం.. దానికే..!
అర:  (తల గోడకేసి బాదుకుని జారుకున్నడు)
గుండు: ఇప్పుడు వీళ్లేం మా..
(అరగుండు ఇద్దరు భారీ కాయుల చాటూన దాక్కున్నాడు... గుండు చుట్టు తిరిగి వచ్చి అరగుండును అడుగుతున్నాడు)
గుండు : ఇప్పుడు వాళ్లేం మాట్లడుకుంటున్నారు..?
అర: పక్కన ఇద్దరు మనుషులను వదిలిపెట్టి నన్నే అడగాలావాళ్ళనడగొచ్చుగా..నీయమ్మరేయ్
నీ చెవిటికి నా నత్తికి సరిగ్గా సరిపోయిందిరా.. నేను సరిగ్గ చెబితే నీకు వినబడదు. నాకు నత్తి అడ్డం పడి ఆగంగానే.. అలాగా అంటావ్.. న్
గుండు: వినబళ్ళా
అరగుండు: నాకు నత్తి..నీకు చె..చె..చె..చె..
గుండు: అలాగాబావుంది..చాలా బాగుంది
అర: ఎలా చావన్రా నీతో..
గుండు: వినబళ్ళా..
...............................
ఇలాంటి బూతు పలకని స్వచ్ఛమైన తెలుగు హాస్యాన్ని ఏపుగా పండించిన వారు జంధ్యాల గారు. హాస్యం కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మన మధ్యే అనేక రకాల మ్యానరిజాల్ని ప్రదర్శించేవారినుంచే హాస్యాన్ని తోడుకోవొచ్చంటారు జంధ్యాల. నలుగురు మధ్య జరిగే హాస్య సన్నివేశాల్ని గాలం వేసి పట్టుకోవటంలో ఈయనకు ఈయనే సాటి.
ఒక సందర్భంలో నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ గారిచే చెప్పించిన హ్యూమర్ ఆహుతులను థియేటర్లకు కట్టిపడేసింది. ఓ సీనియర్ ప్రేక్షకుడు అన్నట్లు `గతంలో సినిమాలన్నీ ఆల్ టైం హిట్లు, ఇప్పుడు హాల్ టైం హిట్లు` అన్న నానుడి జంధ్యాలకు మాత్రం వర్తించదు. వర్తమానంలో కూడా ఆల్ టైం హిట్లు జంధ్యాలవి. మాయాబజార్ లాంటి పౌరాణిక సినిమాలోని పాట పల్లవిలోని వాక్యాన్ని వాడుకుని అందమైన హాస్య వల్లరిగా దిద్ది చలన చిత్ర చరిత్రలో రికార్డులు లాంటివేమైనా ఉంటే పగలుపూటే పగులగొట్టింది జంధ్యాల సినిమా.  విదేశీ హీరో స్వదేశీ హీరోయిన్ తో జంధ్యాల పండించిన హాస్య, ప్రేమ, బంధుత్వాల కలబోత 'పడమటి సంధ్యారాగం'. జంద్యాల సినిమాలలోనే కాదు.. యావత్ భారతీయ సినిమాలలోని అణిముత్యాల లో మొదటి వరుసలో ఉంటుంది. ఇప్పుడు మరలా విడుదలైనా ఆయన సినిమా వందరోజులు ఆడుతుందని ఆనాటివారు చెబుతుంటారు. 
తిట్లలో కొత్తపోకడ జంధ్యాల స్టైల్:
ఆరోగ్యకరమైన హాస్యం అందించటానికి తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయరు జంధ్యాల. రెండున్నర గంటల నిడివి గల చిత్రంలో హాస్యం లేకుండా ఒక్క నిముషం కూడా ఉండకూడదని నమ్ముతారాయన. ప్రేక్షకుల మదినెరిగి వారిని నవ్వించటం కోసం ఆయన నిరంతరం పరిశ్రమ చేస్తారు, పరిశోధిస్తారు, పరిశీలిస్తారు, పంచ్ లు విసురుతారు. తిట్టడంలో కూడా హాస్యం ఉంటుందంటారు జంధ్యాల. తిట్టడం కోసం బూతుల్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదని ఆయన నిక్కచ్చిగా చెప్పేవారు. ఒక లోభి పాత్రలో ఒక అసిస్టెంట్ని పెట్టి మనం చేసే చెత్త పనుల్ని చూసి ఎదుటి వారు లోపల ఎలా తిట్టుకుంటారో చూపడం జంధ్యాల హాస్యానికి పరాకాష్ట.
అరగుండు: 
(కోటాశ్రీనివాసరావు లోభిగా వ్యవహరిస్తూ.. తన గురించి బయటి వాళ్ళతో హేళన చేశాడని అరగుండు జీతంలో 6రూపాయలు కట్ అంటాడు)
అర గుండు: ఆరు రూపాయల పది పైసల్లో ఆరు రూపాయలు కోసేస్తావా.. దొడ్డికాళ్ల దద్దమ్మ..
ఆ పది పైసలు మాత్రం నాకు దేనికిరా నువ్వే ఉంచుకో రేపు నీ పాడె మీద వేయించుకుందువు..
వాష్ బేసిన్ లో చేపలు పట్టే మొఖంలా ఆ మొహం చూడు..
పోతావ్ రెరేయ్.. నాశనం అయిపోతావ్
(ఇక చాయ్ అమ్మేందుకు కోట అరగుండు ను బస్టాండ్ కి తీసుకెళ్తాడు)
అర: చివరికి నా చేత బస్టాండ్ లో టీ అమ్మిస్తావా అంట్ల వెధవ..
గుండు గీసిన గండు పిల్లి మొహంలా ఆ మొహం చూడు..
పోతావ్ రెరేయ్... నాశన మై పోతావ్..
కోట: టీ అడగరెరేయ్.. అరగుండు వెధవ.. చాయ్.. టీ చాయ్
(అంతలో కోట బావమరిది కోటను గుర్తు పడతాడు)
 దాంతో కోట)
కోట: పైసే దేవోజీ.. హం జానా హై.. చాయ్ పీవోజీ.. అచ్చా చాయ్ పీవోజీ (అని పాడుకుంటూ అక్కడనుండి పరారౌతారు.)


ఆయన సినిమాలకు ఆయనే మాటలు, స్క్రీన్ ప్లే రాసుకునే జంధ్యాల తొలినాళ్ళలో మాటల రచయితగా అనేక చిత్రాలకు పనిచేశారు. తరువాత దర్శకత్వంతో పాటు తన మార్ధవమైన గొంతుతో డబ్బింగ్ అందిస్తూ, నటుడిగా కూడా తన ప్రతిభను చాటిన 'ఆల్ రౌండర్' జంధ్యాల. గొప్ప రచయితగా తన కావ్యాలను ముద్రితం గావించిన పనివాడికి కాళ్ళు కడిగి కావ్యాన్ని అంకితమిచ్చిన పాత్రలో 'ఆపద్బాంధవుడు' చిత్రంలో ఆయన నటన అజరామరం.
సుత్తిలేని హాస్యం:
సుత్తి కొట్టకుండా సూటిగా హాస్యంతో నవ్వించటంలో ప్రేక్షకుల మనసెరిగిన వాడు జంధ్యాల. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అతితక్కువే అయినా ఎందరో నటులకు హాస్యనటులుగా పునర్జన్మ ఇచ్చిన బ్రహ్మ జంధ్యాల. `కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రాజేంద్రప్రసాద్, నరేష్, శ్రీలక్ష్మి, వై. విజయ, వంటి ఆనాటి వర్ధమాన నటులకు తరువాతి కాలంలో అనేక సినిమాలకు ఆధారంగా నిలిచారు. మూస హాస్య సన్నివేశాల నుండి ప్రత్యేకంగా,అసహజంగా అతికించే కామెడీ ట్రాక్ ల నుంచి పూర్తి స్థాయి హాస్య నిడివి కల చిత్రాలు అతి తక్కువ బడ్జెట్ లో చక్కగా తీయవచ్చని బాటవేసి చూపింది జంధ్యాల గారే. ఆయన శిష్యులుగా ఈ.వి.వి తదితరులు అదే బాటలో నడిచారు కూడా. జంధ్యాల దర్శకత్వం వహించినవి 20 సినిమాలే అయినా అన్నీ హాస్య చిత్రాలే. అవి కూడా ఒక దాని మించి ఒకటి కళాఖండాలుగా చెపాల్సిందే. 
అంతా విజయవాడే:
తను  పెరిగిన విజయవాడ అంటే జంధ్యాలకి వల్లమాలిన ప్రేమ. విజయవాడ లేదా కృష్ణా జిల్లాలోని ఊరి పేర్లు తరచూ ఈయన చిత్రాల్లో వినిపిస్తుంటాయి. ‘ష్ గప్ చుప్’ అనే సినిమాలో ఎస్.ఐ పాత్రలోని కోట ఊతపదం ‘మీది బందరా’.. అలా బందరని చెప్పిన వారికి బందరు గురించి ఓ పెద్ద లెక్చరిచ్చి... వారిని దొంగలైనా వదిలేసేంత వీక్నెస్ ఆ చిత్రంలో కోటది.చివరికి బ్రహ్మి.. తనది ‘బంటుమిల్లి’ అని చెబితే వెంటనే అరెస్ట్ చేసేస్తాడు.  పైన వాడిన రెండు ఊర్లు.. కృష్ణాజిల్లా లోవే..విజయవాడ లో ప్రతీ ఒక్కరికీ సుపరిచితమైన హోటల్ పేరు బాబాయ్ హోటల్. `నీ ఉప్పుకీ, నీ సాంబార్కీ ఋణపడిఉన్నా’ అని ఒక సినిమాలో అన్నట్లు జంధ్యాల వారు అక్కడ తరచూ టిఫెన్ చేసేవారో ఏమో! ఆ బాబాయ్ హోటల్ పేరుతో బ్రహ్మానందం ముఖ్యపాత్రలో ఓ చక్కని హాస్య ప్రేమ కథా చిత్రాన్ని తీశారు. జంధ్యాల దర్శకత్వంలోని కృష్ణాజిల్లా పదాలు గమనిస్తే మచిలీపట్నం లోని అనేక సెంటర్ల పేర్లు, విజయవాడ లోని అన్ని రోడ్ల పేర్లు చక్కగా వాడారు జంధ్యాల. హైదరాబాదు లోని `బాదు`లు కూడా వదిలిపెట్టలేదు. వాచకంలో హాస్యాన్ని పండించగల సుత్తి వీరభద్రరావు వంటి నటుల్ని తన హాస్యానికి పూర్తి స్థాయిలో వినియోగించున్నారు జంధ్యాల.
(మడ్ బాత్ మీద జంధ్యాల వ్యంగాస్త్రం..  సుత్తివీరభద్రారవు..  కవైన బ్రహ్మానందం కధ సినిమాగా తీస్తానంటూ నమ్మించిమడ్ బాత్ కి తీసుకెళ్ళి బురద రాయించి..హింసిస్తుంటాడు)
బ్రహ్మి: ఇంకెంతసేపు మహాప్రబో..ఈ మట్టి పట్టి..
సుత్తి వీరభద్రారావు: ఇంకొక గంటుంటే.. ఒంటికి మంచిదయ్య.. ఈ చెమ్మంతా ఎగిరిపోవాలి
బ్రహ్మి: ఈ చెమ్మంతా ఎగిరిపోయే లోపు.. మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభో..!
ఇట్లా మనల్నెవరైనా చూస్తే ప్రమాదమేమో మహాప్రభో..
ఇట్లా జూ వాళ్ళు చూస్తే..వళ్ళ కోతులు తప్పించుకు తిరుగుతున్నయేమో అని పట్టుకుపోతారు.
జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరైనా వచ్చారేమో ననుకొని రాళ్ళిచ్చుకు కొడతారు. ..ఇంకెంచ్చక్కా కడిగేసుకుందామా మహాప్రభో..!
సుత్తి: తిత్తితీస్తా..
అయినా సినిమా కధలంటే.. ఎలా వుండాలో నే చెప్తా..!
సినిమా పేరు..
మధ్యతరగతి యధవ నాయాల..
బ్రహ్మి: నన్ను తిట్టీనట్టుంది మహాప్రభో..
సుత్తి: తిట్టుంటేనే సినిమా హిట్టౌతుందయ్యా..
తెరలెగవంగానే.. హీరో హోటెల్ కెళతాడు.. వెళ్లి అక్కడ సర్వరుని హోటల్లో ఏమున్నయ్ అని అడుగుతాడు..
అప్పుడు సర్వరు... ఇడ్లీరవ్వ ఇడ్లీగారెమసాలా గారెఉప్మాకిచిడిపెసరట్టుమినపట్టురవ్వట్టుమసాల అట్టు,బాతుటొమాటోబాతుబోండాబజ్జిమైసూరు బజ్జీమిరపకాయబజ్జీఅరటికాయబజ్జీతమలపాకు బజ్జీలడ్డు,బందరులడ్డురవ్వలడ్డుమిఠాయిపీచు మిఠాయిబందరు మిఠాయిబొంబాయి మిఠాయికలకత్తా  మిఠాయిజాంగ్రీ,కోవాపాలకోవామైసూరుపాకుఅమలాపురంకాజాభీమవరం బాజాపెద్దాపురం కూజ.. ఉన్నాయన్నాడు.
అప్పుడు హీరో ‘అట్టుతే’ అన్నాడు
అఫ్ఫుడు సర్వరు ‘ఏమట్టు.. పెసరట్టా,మినపట్టా,రవ్వట్టా,మసాలా అట్టా70 ఎంఎం అట్టా.. ఎమ్మెల్యే అట్టానెయ్యేసి కాల్చాలా.. నూనేసి కల్చాలా.. పెట్రోలుపోసి కాల్చాలా..కిరోసిన్ పోసి కాల్చాలా.. అసలు కాల్చాలా వద్దా
అంటూ సుధీర్ఘంగా సాగే ఏకబిగి డైలాగ్ ఏకబిగిన పోట్టచెక్కలైయ్యేలా చేస్తుందంటే.. అది ఒక్క జంధ్యాలగారికే సాధ్యం అంటారు బ్రహ్మానందం లాంటి హాస్యనటులు.. బ్రహ్మానందం లాంటి అనేకమందికి ఆయన సినిమా అవకాశం కల్పించారు. ఇక శ్రీలక్ష్మి లాంటి హాస్య నటితో జంధ్యాల ప్రయోగాలు.. ఇంటి ఇల్లాలిని తలపిస్తాయ్.
అలసిన మనసులని సేదతీర్చే జంధ్యాల వారి హాస్యానికి ముగ్ధులు కాని వారు ఉండరు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నవ్వులు మరచిపోయిన నేటితరం జీవితాలకు హాస్య గుళికలు అందించిన వైద్యులు జంధ్యాల. ఆరోగ్య కరమైన హాస్యంతో తీపి ఙ్ఞాపకాలను మిగిల్చిన జంధ్యాల వారికి ప్రతీ తెలుగు సదా ఋణపడి ఉన్నాము. ఎన్నో అవార్డులు..అందుకున్న  అంతటి మాహా హస్య బ్రహ్మ.. హస్య వైద్యలు.. హాస్యం కి తెలుగులో కేరాఫ్.. నవ్వని వారుండరనేంతగా.. మూడు తరాలుగా పొట్ట చెక్కలయ్యేలా.. కళ్లలో నీళ్ళు సుడులు తిరిగేంతగా నవ్విస్తూనే ఉన్న జంధ్యాల జూన్ 19, 2001 న హటాత్తుగా హార్ట్ ఎటాక్ రావటంతో హుటాహుటిన అందరినీ వెక్కివెక్కి ఏడ్చేలాచేసి.. ట్రాజెడీ మిగిల్చి.. వెళ్ళిపోయారు.. కాదు కాదు.. పై లోకంలో నవ్వించేందుకు.. ఇక్కడ శుభం పలికారు. జంధ్యాల వారికి మరొక్కసారి నా హ్రుదయ పూర్వక నమస్సుమాంజలులు తెలియజేస్తూ......_/\_

No comments:

Post a Comment

Pages