ఒక్కరోజు దేవుడు
పి. ఫణిరాజా 9290523901
ఆనందకేతన పట్టణంలో మార్కండేయుడు అనే పది సంవత్సరాల బాలుడు ఉన్నాడు. అతను ఒక అనాధ. ఆ ఊరిలో అందరూ వాళ్ళ అమ్మా నాన్న మంచితనాన్ని చూసి వారు చనిపోయిన తర్వాత ఆ పిల్లవాడ్ని ఊరి వారందరూ ప్రేమగా చూసుకునేవారు, తను ఒక అనాధ అని ఎప్పుడూ బాధపడలేదు, అంతే కాకుండా అందరికీ చేతనైన సహాయం చేసేవాడు. అందరిలోకి మార్కండేయుడు తనకు విద్య చెప్పే ‘సుబ్రహ్మణ్యం’ పంతులుగారి దగ్గర, పురాణ పఠనం, దేవతల కథలు ఎన్నో విన్నాడు. “దేవుడు మనలో ఉన్నాడు” అని పంతులుగారి ఉపదేశం మార్కండేయుడికి ఎంతో నచ్చింది. ఇలా ఆ ఊరు సుఖఃశాంతులతో పచ్చగా కళకళలాడుతూ ఉండేది.
ఇంతలో క్రమంగా ఆ ఊరిలో కరువు, కాటకాలు అంతుపట్టని వ్యాధులు ప్రబలసాగాయి. రాజవైద్యులు, శాస్త్రవేత్తలు ఎంతోమంది రాజాస్థానంలో వాటిని, వారి రాజ్యానికి వచ్చిన ముప్పును నివారించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవ్వసాగాయి. ఇంతలో, మార్కండేయుడు వెళ్తుండగా, అతని ఊరి దుస్థితి చూసి అతని గుండె బరువెక్కింది. తమ గ్రామ బాగు సమాధానం కోసం వెతకసాగాడు. మార్కండేయుడు తన గురువుగారు చెప్పిన ఒక విషయం గుర్తుచేసుకున్నాడు. “వాళ్ళ ఊరి దగ్గర్లో ఉన్న అడవిలో ఎంతో మంది ఋషులు తపస్సు చేస్తున్నారు అని, వారి ఆశయం దైవ దర్శనమని” అనుకొని మార్కండేయుడు ఆ మునుల దగ్గరకి రోజుల తరబడి అడవిలో ప్రయాణించి వాళ్ళ దగ్గరకి వెళ్ళి అందరినీ అడగసాగాడు. కానీ ధ్యానముద్రలో “ఓంనమఃశ్శివాయ” అని పఠిస్తూ వారందరూ నిశ్చలంగా ఉండసాగారు. ఆ బాలుడికి మరొక కథ జ్ఞప్తికి వచ్చింది. “బాలుడై ధ్రువుడు విష్ణువు కోసం ఘోర తపస్సు ఆచరించి, ఒక నక్షత్రమై వెలుగుపొంది, ప్రజలకు ఒక గొప్ప రాజై సేవ చేశాడు.” అని, ఆ క్షణమే ఆ మునులందరూ పఠిస్తున్న “ఓంనమఃశ్శివాయ” అనే మంత్రాన్ని ధ్యానముద్రలో కూర్చొని తనకు తెలియకుండానే తపస్సు ఆరంభించాడు.
రోజులు గడిచాయి. ఇంతలో మార్కండేయుడికి “నేనువచ్చా- లే” అనే మాటలు వినబడ్డాయి. కళ్ళు తెరిచి చూస్తే కళ్ళ ముందు “మహాశివుడు” దాంతో బాలుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి “నువ్వు శివుడివా సామీ?” అని ప్రశ్నించాడు. “అవును” అని సమాధానం ఇచ్చాడు శివుడు. దాంతో ఆ శివుడి మీదకి ఎక్కి కూర్చున్నాడు మార్కండేయుడు, కోపంగా శివుడిని “మా అమ్మా నాన్నను ఎందుకు దూరం చేశావు?” అని అన్నాడు. దాంతో శివుడు నవ్వుతూ, “నేను ఉన్నానుగా వారు నాలోనే ఉన్నారు. నీ కోసం నన్ను పంపించారు మార్కండేయా!” అని అన్నాడు. వాళ్ళ బాగోగులు అడిగి, సామి మా ఊరు పరిస్థితి బాగోలేదు సామి” అని జరిగినదంతా చెప్పాడు. దానికి శివుడు “కర్మఫలం, నువ్వైనా, నేనైనా అనుభవించక తప్పదు” అని అన్నాడు.
దాంతో ఆ బాలుడికి తన గురువుగారు చెప్పిన పాఠం “దేవుడు మనలో ఉన్నాడు” అని గుర్తొచ్చి, శివుడిని “నువ్వు మాలోనే ఉన్నావా, సామి” అని అన్నాడు. దాంతో శివుడు “అవును, అది తెలుసుకోవడమే, నన్ను తెలుసుకోవడం” అని అన్నాడు. “నీకేం వరం కావాలి?” అని శివుడు చొరవగా అడిగాడు, అపుడు మార్కండేయుడు తెలివిగా “నువ్వు నాలోనే ఉన్నావుగా సామి అంటే నేను కూడా శివుడినేనా” అని అన్నాడు. దానికి శివుడు “అవును” అని అన్నాడు. “ఐతే సామి నేను శివుడినైతే నీ శక్తులు మొత్తం నాకు ఒక రోజు ఇవ్వు అదేనే కోరుకునే వరం” అన్నాడు.
దాంతో ఆ బాలుడికి, శివుడు “తథాస్తు” అని అభయమిచ్చి “చావు పుట్టుకలను మార్చకూడదు, అన్యాయమైన పనులు చేయకూడదు అని షరతు పెట్టి, తన శక్తిని ఆ బాలుడికి ఒక్కరోజు ఇచ్చాడు. అంతే కాకుండా ఆ బాలుడు సామి నువ్వు నాతో పాటే ఉండు అని చెప్పి, తనవెంట తీసుకెళ్ళాడు. “శివుడిని తెలుసుకున్నశివుడు, మహాశివుడు కానీ సాధారణశివుడితో” పయనమయ్యాడు.
మార్కండేయుడు, శివుడిని వెంటబెట్టుకుని “మొదట తన ఊరి పొలిమేర దగ్గరకి వెళ్ళి అంతుబట్టని వ్యాధులు తన శక్తితో మాయం చేశాడు. తర్వాత ఇలా ఆజ్ఞాపించాడు. “నీరు అవసరమైనంత సకాలంలో అందరికీ రావాలి అని, ఘోర తుఫానులు జలప్రళయాలు రాకూడదని, పంటలు పండాలని, సకాలంలో వర్షం కురవాలని, ఆకలి బాధ ఉండకూడదని, ప్రకృతి విలయాలు జరగకూడదని, అంతుబట్టని వ్యాధులు, రోగాలు రాకూడదని కరువుకాటకాలు ఉండకూడదని” తర్వాత మనుషులందరి మీద ఇలా ఆజ్ఞాపించాడు.
“మనుషులు అందరూ మంచోళ్ళుగా మారిపోవాలని, అరిషడ్వర్గాలకు లొంగకూడదని, చావుపుట్టుకలను సమానంగా చూడాలని, అందరూ తనలాగే శివుడిని తెలుసుకోవాలని” దాంతో, శివశక్తితో ఆ బాలుడు చేసిన ఆజ్ఞను అందరూ తమకు తెలియకుండానే అవలంబింపసాగారు.
చివరగా ఆ బాలుడు – “ప్రపంచం మొత్తం ఇంతే ఉండాలి” అని ఆజ్ఞాపించాడు.
అంతా చూస్తున్న శివుడు “నేనెప్పుడూ చెప్తూ ఉంటా, నా సృష్టిలో దేవతలకన్నా మనుషులే గొప్పవారని” అది నీవు నిరూపించావు, ఇలాంటి ఆలోచనలు వచ్చినందుకే నీవు తొందరగా నన్ను తెలుసుకోగలిగావు, పసిమనసుతో దేవుడిని ప్రార్థిస్తే దేవుడు కూడా పసివాడైపోయి వస్తాడు, అదే ఇప్పుడూ జరిగింది మార్కండేయా..!” అని అన్నాడు.
మార్కండేయుడు, శివుడితో – “సామి, నేను చేయాలనుకున్నవన్నీ చేశాను. నీ శక్తి నువ్వు తీసుకో” అనిఅన్నాడు.
శివుడు – “ఇంకా ఒక్కరోజు కాలేదుగా” అంటే దానికి ఆ బాలుడు “అయితే ఏంది సామి, నా పని అయిపోయిందిగా, ఇక నేనే వెళ్తా, చివరగా ఒక ప్రశ్న సామి” అన్నాడు.
దానికి శివుడు – “ఏంటి” అంటే, మార్కండేయుడు – “ఆ మునులు ఎప్పటినుంచో తపస్సు చేస్తుంటే వాళ్ళకి కనబడకుండా నాకెందుకు నువ్వు కనిపించావు సామీ..” అన్నాడు. దానికి శివుడు – “వాళ్ళు వాళ్ళను ఉద్ధరించుకోవడానికి తపస్సు చేస్తున్నారు, కానీ నీవు స్వార్ధరహితంగా, పసిమనసుతో నన్ను అందరికోసం పిలిచావు.” అందుకే నీకోసం వెంటనే వచ్చా” అని సమాధానం చెప్పాడు.
శివుడు, మార్కండేయుడి దగ్గర తన శక్తిని తిరిగి తీసుకొని బాలుడిని ఊరికి చేర్చి, తనకు మంచి భవిష్యత్తుని ప్రసాదించి, తాను కైలాసం వెళ్ళి, నందీశ్వరుడికి, పార్వతీదేవికి జరిగినదంతా చెప్పాడు. దానికి వాళ్ళిద్దరూ “బాలుడు మనిషికి దేవుడితో పనిలేకుండా చేశాడే” అనిఅనుకున్నారు.
మార్కండేయుడు కూడా తన గురువుగారు సుబ్రహ్మణ్యం పంతులు దగ్గరకి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. దాంతో ఆయన చాలా ఆనందపడి తమ ఊరి బాగు, మరియు మనుష్యులలో సత్ప్రవర్తనకు కారణం మార్కండేయుడే అని సంతసించాడు. శివుడితో అతను కలిసి ఉన్న విషయం తెలుసుకొని ఆనందపడ్డాడు. ఈ విషయం గోప్యంగా ఉంచమని ఆ బాలుడికి చెప్పాడు.
ప్రపంచం మొత్తం మార్కండేయుడు మహాశివుడై ఆజ్ఞాపించిన ఆజ్ఞలను పాటించసాగింది.
*****
No comments:
Post a Comment