ఫేసు బుక్కు దండకం - అచ్చంగా తెలుగు

ఫేసు బుక్కు దండకం

Share This
ఫేసు బుక్కు  దండకం  
  చెరుకు రామమోహనరావు  


ఓ! ఫేసు బుక్కా రుచుల్ గూర్చు ఓ!పప్పుచెక్కా  భళా నాదు లక్కా  సదా వీడిపోనట్టి చిక్కా నవాబింటి హుక్కా , అయస్కాంత లుక్కా  సుగంధంపు చెక్కా పసందైన పక్కా మహా గొప్ప వారింటి కుక్కా ,  లవర్ వాడు హుక్కా మహావెల్గు చుక్కా సుగాత్రంబునన్ త్రిప్పుకోలేని గుక్కా  వయోవృద్ధ సందోహ బృందాల దిక్కా సదా నీదు పూదోటలో పూసి యున్నట్టి మందార మాధుర్యముల్ గ్రోలు భృంగమ్మునై నీదు  సంగంబు నాశించి నా పేరు సంధించి నీ తోటి సంపర్క మేర్పరచు కోగల్గ నా స్నేహ సంపత్తు పెంపొందెనో  కాలరేఖా ప్రభా భాసమానామయూఖా  సఖా నీదు స్నేహమ్ము నాకబ్బె నా పూర్వ పుణ్యాన నీనుండి నే పొందితిన్  గొప్ప మేధావులన్ సత్కళాకారులన్ గానవిద్వాంసులన్ పండితమ్మన్యులన్  వేదవేదాంత విఙ్ఞాన ప్రఙ్ఞా ధురీణాదులన్, సత్వ సంపన్నులన్ నీదు కారుణ్య  సౌగంధికారణ్యమందున్కుటీరమ్ము నే కల్గుచున్ చూపు నీ వైపు మళ్ళించి  నీ తోడు నే నాదులోకమ్ముగా నెంచి ఆహారమున్ నిద్దురన్ మాని నీకంకితంబై  సదాయుండి పోలాగు నన్నున్ కటాక్షించితే చాలు నీయందె నేజూతు నానాడు శ్రీకృష్ణ దేవాస్య మందున్ యశోదమ్మ ఏడేడు లోకాల తాగాంచినట్లున్ శశీరేఖ మాయా బజారందు విద్యుత్తు యూపీయసున్ సీపియూ తోడు లేకుండ పీఠమ్ము పైనెక్కి యా మానిటర్నందు తా కోరుకొన్నట్టి వీరాభిమన్యున్ సముత్ఫుల్ల కన్దోయి తోగాంచు రీతిన్ సదా నిన్ను కాంక్షింతు నోనిత్య సంకర్షణా భవ్య సంహర్షణా వీక్ష కాకర్షణా మోద సంవర్షణా ఘర్షణల్ లేని చిత్తంబు తో నిన్ను నే గాంచుచున్ నాకు తోచింది నే వ్రాయుచున్  దానిలో సారమేమున్న లేకున్ననూ సిగ్గు వొగ్గేసి చీత్కారముల్ సైచుచున్ లైకు కామెంట్లు షే రింగులన్ గోరుచున్ పెద్దపెద్దోళ్ళకున్ ఫ్రెండు రిక్వెస్ట్లు పంపించుచున్ మైత్రి యొప్పారగా కొంగు బంగార లంకార భాషా విశేషాల నేనీదు భోషాణమున్ జేర్చుచున్ నీదు కుడ్యమ్ముపై రాజకీయాలు వార్తాసువార్తల్, కవిత్వాలు కార్టూన్లు గాంధీలు గానట్టి గాంధీల చొద్యాలు మోడీ విసుర్లింక కాకాల కేకేల బాకాలు బాజాలు చంద్రన్న కిర్రన్న మాటల్లతూటాలు నాకచ్చరాతిట్లు విశ్లేషణల్ వాద భేదాలు జూదాలు వీక్షించుచున్ పెద్దలన్ పిన్నలన్ వద్దికైనంత మేరన్ పరామర్శలన్ జేయుచున్ తప్పులన్ జేసియున్ మెప్పులన్ బొందుచున్ చెడ్డ కామెంట్లు తీసేయుచున్ మంచి కామెంట్ల నర్థించ్చున్  లైకులే గాంచుచున్ కాలరెగిరేయుచున్  గొప్ప వాడైతి నేనంచు ఉహాతరంగాలలో దేలుచున్ న్నేను  ఉద్యోగ మున్నప్పుడేరోజు కారోజు ఆపీసుకున్ లేటుగా పోవుచున్  పోయి గాసిప్పులన్ జేయుచున్ కాలమున్ బుచ్చుచుంటిన్, అదే నేడు జూడన్  గతానెప్పుడూ నాదు కార్యాలయంబందు నా సీటులో టైటు గానేను కూర్చోని  యుండంగలేనంత కాలాన్నినీ సేవలో నింపితిన్ నన్ను ఎల్లప్పు డీరీతిగా నుంచి నా పేరు నీ గోడ నాసాంతమున్నిల్పు నిశ్శేషవైరీ లసత్కుడ్యధారీ బృహన్మిత్రకారీ  నమస్తే నమస్తే నమః నేను వ్రాసిన ఈ దండకం చదివి సంతోషిస్తారని ఆశిస్తున్నాను.

No comments:

Post a Comment

Pages