పరుసవేది పుస్తకం గురించి....
పరవస్తు నాగసాయి సూరి
పరుసవేది(The Alchemist), పాలో కొయిలో అనే రచయిత వ్రాసిన ఒక దృష్టాంత (allegorical) నవల. ఇది మొదట 1988లో ముద్రితమైంది. "శాంటియాగో" అనే స్పానిష్ గొర్రెల కాపరి తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సాగించినప్రయాణమే ఈ పుస్తకం. దీనిని ఒక modern classic గా అభివర్ణించారు. ది ఆల్కెమిస్ట్నవల మొదట పోర్చుగీస్ భాషలో ప్రచురితమైంది. తరువాత 67 భాషల్లో అనువాదంగా వెలువడింది. అత్యధిక భాషలలోకి అనువదింపబడిన జీవించి ఉన్నఒక రచయితయొక్క రచనగాగిన్నీస్ ప్రపంచ రికార్డుసాధించింది. 150 దేశాలలో ఈ పుస్తకం కోట్లాది కాపీలు అమ్ముడయ్యింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయిన పుస్తకాలలో ఇది ఒకటి. ఒక్క మాటలో చెప్పాలంటే......ఏ ఒడిదొడుకులు లేకుండా సాగిపోతే అది జీవితం అవుతుందా..? ఏ ఒత్తిళ్ళు లేకుండా ప్రశాంతంగా ఉంటే అది జీవించడం అవుతుందా..? జీవితంతో పోరాడలేక అలసిపోయిన వాళ్ళు ఇదే జీవితం అనుకుంటారు. ఏ బాదరబందీ లేకుండా హాయిగా జీవించవచ్చు అనుకుంటారు. ఏటి ప్రవాహం ఆగిపోతే నీరు మురికిగా మారుతుంది. జీవన ప్రవాహం ఆగిపోతే మనసు మురికి అవుతుంది. ఇలాంటి గమనం వెనుక అసలు విషయాన్ని మన ముందు ఆవిష్కరించే పుస్తకమే పరుసవేది. కథ ఏమిటంటే.....శాంటియాగో అనే యువకుడు. ప్రశాంతంగా సాగే జీవితం అతడికి ఇష్టం లేదు. ప్రయాణాలంటే ఆసక్తి. గొర్రెల కాపరిగా కొత్త కొత్త ప్రదేశాలు చూడొచ్చని తండ్రి ద్వారాతెలుసుకుని, తండ్రి ఇచ్చిన మూడు బంగారు నాణేలతో గొర్రెలను కొని ప్రయాణాలుసాగిస్తుంటాడు. తన గొర్రెలకు పుస్తకాలు చదివి వినిపిస్తూ, తాను చూసినవింతలను వాటికి వర్ణించి చెబుతుంటాడు. అలా రెండేళ్లు గడిచిపోతుండగా అతన్నిఒక కల వెన్నాడుతుంది. స్పెయిన్ లో ఒక పాడుబడిన చర్చిలో గొర్రెలతో పాటునిద్రించిన ఆ యువకుడికి ఆ రాత్రి రెండోసారి అదే కల వచ్చింది.ఆకల గురించి తెలుసుకోవడానికి బంజార ముదుసలిని, వృద్ధరాజును కలుస్తాడు. ఆకలకు అర్థం ఆఫ్రికాలోని పిరమిడ్ల వద్ద ఆ యువకునికి నిధి దొరుకుతుందనివారిద్దరు చెబుతారు.ఎన్నో శకునాల మధ్య, హృదయం మాట వింటూ, విశ్వాత్మ భాష నేర్చుకుని, ఆపదలెన్నిఎదురైనా ఒయాసిస్సులో, ఎడారిలో ప్రయాణాలు చేసి ఈజిప్టులోని పిరమిడ్ల చెంతకుచేరుతాడు. అక్కడ నుంచి యువకుని జీవిత గమ్యం కనుక్కోవడం ప్రారంభం అవుతుంది. యువకునికి జీవిత గమ్యం చేరేలోగా మూడుసార్లు వున్నదంతా పోగొట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకొనే పరిస్థితులు సంభవిస్తాయి. అయితే అదే సమయంలో ఆయువకుడికి మార్గ మధ్యంలో కలిసిన ఆంగ్లేయుడు, ఫాతిమా, పరుసవేది అతని జీవితగమ్యానికి తోడ్పడుతారు. పుస్తకం విషయానికి వస్తే....ఇందులో అడుగడుగునా విశ్వాత్మ అనే మాట వినిపిస్తుంది. నిజానికి విశ్వాత్మ అనేది మనుషులందరి జీవితానికి సంబంధించిన ఓ భావనే అనిపిస్తుంది. మనిషి మనిషిగా జీవించాలంటే, అతనికి మరిన్ని సంపదలు అందాలంటే.... ( ఇక్కడ సంపద అనే పదానికి ఎన్నో అన్వయాలు ఉన్నాయి ) సాయం అవసరం. ఒకరికొకరు సాయం చేసుకున్నప్పుడే మనిషి మనిషిగా బతకడం సాధ్యమౌతుంది. పరుసవేది కథంతా అలానే సాగుతుంది. నిజానికి పరుసవేది అంటే సత్తును బంగారంగా మార్చే విద్య. ఇది లోహాలకు కాకుండా మనిషికి అన్వయించుకునే కథ. సత్తు బంగారంగా మారడం వెనుక ఎన్ని అవస్థలు ఉంటాయో... మనిషి మనీషిగా మారడం వెనుకా అన్నే అవస్థలు ఉంటాయి. అన్ని రకాల రసాయనాలు ఒకే స్థాయిలో కలవాలి. ఎక్కువైనా తక్కువైనా కుదరదు. మనిషి జీవితం కూడా అంతే. నిధి కోసం అన్వేషణ వృత్తాంతం వెనుక మనిషిలో మనిషిని అన్వేషించే కథ ఇందులో మనకు కనపడుతుంది. చివరగా...పేరుకు అనువాద పుస్తకమే అయినా... ప్రతి జాతికి పరుసవేది ఎన్నో విషయాలు నేర్పుతుంది. ఒక్క సారి చదవడం ప్రారంభిస్తే చివరిదాకా ఆపలేము. మళ్ళీ మళ్ళీ చదివినా విసుగు అనిపించదు. చదివే ప్రతిసారి ఎదో ఒక కొత్త విషయం కనుగొంటూనే ఉంటాము. ఇలాంటి మంచి పుస్తకాన్ని వీలైనన్ని ఎక్కువ మార్లు చదవడం మాత్రం మరచిపోకండే....
No comments:
Post a Comment