ముల్లంగి పరాఠాలు - అచ్చంగా తెలుగు

ముల్లంగి పరాఠాలు

Share This


ముల్లంగి పరాఠాలు

-  ఉషారాణి నూతులపాటి


ముల్లంగి (Radish) ఆరోగ్యానికి చాలా మంచింది. చాలా మంది ఇష్టపడరు వాసన వస్తుందని. కానీ అది పోషకాల గని.ముల్లంగి ఆకులు, వేరు(root) కూడా ఆహారంలో తీసుకోవచ్చు. వాటిలో విటమిన్ 'C', కెరోటిన్ చాలా ఎక్కువ. అందువల్ల అది ఫ్లూ,జ్వరం, దగ్గు,శ్వాస సంబంధ, జీర్ణ వ్యవస్థకు సంబంధించినవ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. రాడిష్ మంచి ఎపిటైజర్, పాలిచ్చే తల్లులకుకూడా ఆకుతో సహా కూర చాలా మంచిది. అంతే కాకుండా డయటరీ ఫైబర్ ఎక్కువగా వుండి, కాలరీలు తక్కువగా వుండే కాయగూర. రక్త సరఫరామెరుగుపరచి,తలనొప్పి, ఎసిడిటీ, మూలశంక,మూత్ర సంబంధ వ్యాధులు,గాల్ బ్లాడర్లో రాళ్ళను కూడా కరిగించగల ఔషధ గుణాలున్నాయి .
దీన్ని ఇతర కూరగాయలతో కలిపి సలాడ్ గా, పులుసు, పెరుగు పచ్చడి, ఆకుతో సహా సన్నగా తరిగి పప్పుకూరగా.. చేసుకోవచ్చు.
కానీ ఇన్ని సుగుణాలున్న 'ముల్లంగి' ని పిల్లలు అస్సలు ఇష్టపడరు.  మరి చిన్న పిల్లలు,టీనేజ్ పిల్లలకి దీన్ని ఎలా అలవాటు చెయ్యాలి..?
నేను చెప్పబోయే ముల్లంగి పరాఠా లని ప్రయత్నించండి. తప్పక తింటారు.ఇవి చాలా ఆరోగ్యం కూడా.
కావలసిన పదార్ధాలు :-
1. నాలుగు ముల్ల్లంగి దుంపలను బాగా కడిగి తురిమి వుంచుకోవాలి 2. ఉల్లిపాయలు 2 + కొత్తిమిర 1 కట్ట + పుదినా 1 కట్ట + పచ్చిమిర్చి 5 + జీలకర్ర పొడి 1 sp + ఉప్పు + కరివేపాకు అన్నీ కలిపిన పేస్ట్ 3. గోధుమ పిండి అరకిలో 4. కాల్చడానికి నెయ్యి / బట్టర్(పిల్లలకి) / నూనె కొద్దిగా మెంతి ఆకు .
చేయువిధానం:-  
వెడల్పు గా వున్న పాత్రలో గోధుమపిండి + ఆకులుగా గిల్లి కడిగి పెట్టుకున్న మెంతి ఆకు + ముల్లంగి తురుము + మనం  చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అన్నీ కలుపుకోవాలి. ముందే నీళ్ళు పోయకూడదు. ముల్లంగితురుములో తడి, ఉల్లి ముద్దలో వున్న తడి చూసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసి గట్టిగా చపాతి పిండిలా తడుపుకోవాలి . ఒక అరగంట నాననిచ్చి.. కొద్దిగా పెద్దవుండలు చేసుకొని, పొడి పిండి చల్లుతూ.. కొద్ది మందంగా చపాతీ పీట మీద, కర్రతో వత్తుకోవాలి.  పెనం మీద రెండువైపులా కొద్దిగా కాల్చి చిన్నపిల్లలకి అయితే నెయ్యి/బట్టర్ , పెద్దవారికి కొద్దిగా నూనె తో కాల్చు కోవాలి. కమ్మటి పరాఠా లు సిద్ధం .
వీటిలోకి రైతా / పెరుగు చట్నీ బావుంటుంది. ముల్లంగి రైతా పెట్టాను నేను.
ముల్లంగి  రైతా: ముల్లంగి తురుము + పెరుగు + సన్నగా తరిగిన పచ్చిమిర్చి + ఉల్లితరుగు + కొత్తిమిర + జీలకర్ర పొడి+ ఉప్పు .
ఈ పరాఠా లకి సరిగ్గా సరి పోయె కూర టమాటా కర్రీ..చక్కగా సరిపోతుంది. మరి ట్రై చేసి చూస్తారు కదూ..

No comments:

Post a Comment

Pages