నీతి కధ : వెనుకటి గుణమేల మాను.... - అచ్చంగా తెలుగు

నీతి కధ : వెనుకటి గుణమేల మాను....

Share This

 నీతి కధ  : వెనుకటి గుణమేల మాను..
రచన - దేసు వేంకట సుబ్బారావు.

ఒకనాడు ఒక ముని నదీ స్నానం చేస్తూ దోసిలితో సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్నాడు. ఆ సమయంలో ఆకాశంలో ఒక గ్రద్ధ ఒక ఎలుకను నోట కరచుకొని వుంది. గ్రద్ధ నుండి ఎలుక ఎలాగో తప్పించుకుని ముని దోసిటలో పడింది. అప్పుడు ఆ ముని ఆ ఎలుకను ఒడ్డుకు చేర్చి తన తపఃశ్శక్తితో ఒక ఆడ పిల్లగా మార్చి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. ఇంతలో ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చింది. అప్పుడు ఆ అమ్మాయిని పిలిచి ఆ మునీశ్వరుడు అమ్మా నీకు యుక్త వయసు వచ్చింది నీకు వివాహం చేయాలని అనుకుంటున్నాను. ఎవరిని ఇచ్చి పెండ్లి చేయమంటావో చెప్పు తల్లీ అని గారాబంగా అడిగాడు. దానికి ఆ అమ్మాయి మీ ఇష్టం తండ్రీ అని చెప్పింది. దానికి ఆ ముని సంతోషంతో అయితే సకల చరాచర సృష్టికి వెలుగునిచ్చే ఆ సూర్య భగవానుని చేసుకుంటావా అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి తండ్రీ మబ్బులు వస్తే మసకబారి మూసుకు పోయే ఆ సూర్యునిదేమి గొప్ప అని అంది. దానికి ఆ మునీశ్వరుడు అయితే అమ్మాయి నీకు ఆ మేఘుడిని ఇచ్చి పెండ్లి చేయనా అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి మేఘడిదేమి గొప్ప తండ్రీ గాలి వీస్తే కొట్టుకు పోయి మేఘుడు ఏమి గొప్ప అని అంది. దానికి ఆముని మరింత గారాబంగా అయితే నీకు వాయుదేవుడినిచ్చి పెండ్లి చేయనా అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి తండ్రీ వాయుదేమునిదేమి గొప్ప కొండ అడ్డు వస్తే వెనక్కి వచ్చేస్తాడు కదా అని తన సందేహాన్ని వెలిబుచ్చింది. ముని నిగ్రహాన్ని ఆపుకొని అయితే ఆ పర్వతరాజుకి ఇచ్చి చేయనా అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి ఎంత పర్వతరాజైనా ఎలుక తలచుకుంటే కొండను కూడ తవ్వేయగలదు కదా అని అంది. దానికి ఆ ముని ఆలోచించి దీనికి పుట్టుకతో వచ్చిన బుద్ధి పోలేదు. ఉచితానుచిత జ్ఞానం లేకుండా ఎంతటి వారినైనా విమర్శిస్తూ, జన్మతః వచ్చిన తన బుద్ధి పోనిచ్చుకోలేదు అని భావించి ఆ అమ్మాయిని మరల ఎలుకగా మార్చి అడవిలో వదిలేసాడు. అందువల్ల తమ తమ తెలివి తేటలు పెద్దల వద్ద చూపించ కూడదు. అలా చూపిస్తే ఎలుకకు పట్టిన గతే పడుతుంది. అలాగే కొంతమంది ఎంతటి ఉన్నత స్థానానికి వచ్చినా తమ తమ బుద్ది పోనిచ్చుకోరు.

No comments:

Post a Comment

Pages