ఉద్యోగ విరమణానంతర జీవిత పురాణం - అచ్చంగా తెలుగు

ఉద్యోగ విరమణానంతర జీవిత పురాణం

Share This




ఉద్యోగ విరమణానంతర జీవిత పురాణం

రచన : జోగారావు వెంకట రామ సంభర
వేదవ్యాస మహర్షి ఈ కాలంలో ఉంటే, అష్టాదశ పురాణాల తరువాత ఉద్యోగ విరమణానంతర జీవిత పురాణమని పందొమ్మిదో పురాణము వ్రాసి ఉండేవారని నా ప్రగాఢ నమ్మకము.
పుట్టిన ప్రతి జీవికి జనన మరణములు ఎలా తప్పవో, ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పదు. ఉద్యోగ విరమణమును తెలుగులో విశ్రాంతము అని హిందీలో సేవా నివృత్తి అనీ, ఇంగ్లీష్ లో రిటైర్మెంట్ అని వాడుకలో అంటారు. రిటైర్ అయ్యేక వచ్చే పరిస్థితులు అనుభవిస్తున్న వారికే తెలుస్తుంది. ఆ పరిస్థితులు అనుభవైకవైద్యము మాత్రమే!
ఇప్పుడు, ఉద్యోగము చేస్తున్న ప్రతివారు ఎప్పుడో ఒకప్పుడు ఉద్యోగవిరమణము చేయవలసి ఉంటుంది కనుక, స్వానుభవముతో ఉద్యోగ విరమణ జీవిత పర్వమును కాస్తంత హాస్యం మేళవించి ,మీ ముందు ఉంచుతున్నాను.
‘ఉద్యోగ విరమణము ఒక విధముగా మరణముతో సమానము....’ అంటూ ఉంటారు. చెట్టంత మనిషి ఎదురుగా ఉన్నా, అంతా లేనట్టే ప్రవర్తిస్తారు కనుక ఇలా అంటారేమో! కూరలో కరివేపాకులా అంతా తీసిపడేస్తూ ఉంటారు. సింహంలా ఒక్కసారి గర్జించగానే పరిగెత్తుకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు మన కేకలు విన్నా, గ్రామసింహం మొరిగినట్లు పట్టించుకోరు.
ప్రఖ్యాత  హిందీ హాస్య రచయిత స్వర్గీయ శరద్ జోషి గారు రిటైర్ అయ్యిన ప్రతి ఒక్కరు సంఘములో అదృశ్య వ్యక్తిగా  ఉండి పోతారు అని సెలవిచ్చేరు. ఉద్యోగ విరమణము పొందిన జనరల్ మేనేజర్ కన్నా, ఉద్యోగములో ఉన్న ప్యూన్ గొప్పవాడు అంటే ఆశ్చర్య పోనక్కరలేదు. అప్పటి వరకు, ఊటబావిలా, కామధేనువులా, అక్షయ పాత్రలా, కుబేరుడికే అప్పునివ్వగల ఏ.టి.ఎం లా ఉన్నవాడు హఠాత్తుగా, థార్ ఎడారిలా, వట్టిపోయిన పాడి ఆవులా, బీట వేసిన మట్టి కుండలా, మారలేని చెక్కులా అయిపోతాడు.
అప్పటి వరకు పరిచయమున్నవారు కాని, తోటి ఉద్యోగస్తులు కాని, ఇరుగింటి పొరుగింటి వారు కూడా ఆ వ్యక్తి ఉనికిని గుర్తించరు. అసలు, పట్టించుకోరు. కనిపించనట్టే, ముందుకు సాగిపోతారు. హలో అన్నా, నమస్కారం అన్నా ‘బాబోయ్... పనీపాటా లేని  జిడ్డుగాడు, దొరికితే ఒదలడు’ అన్నట్లు ముఖం చాటు వేసుకునో  , పక్కకు తిప్పుకునో వెళ్ళిపొతారు. గుడి ముందు కూర్చునే ముష్టి వాడు సైతం నాకు రెండు చేతుల నిండా పనికి పని, సొమ్ముకి సొమ్ము ఉన్నాయి మరి నీ దగ్గరో అన్నట్లు, హుందాగా చూస్తాడు .చివరకు, ఇంటిలో పని మనిషి కూడా తప్పించుకు తిరుగుతుంది. అప్పటి వరకూ, పనిమనిషి రాకపొతే, సెల్ ఫోన్ లో పనిమనిషితో " ఏమమ్మా, పనికి వస్తావా నన్ను గిన్నెలు తోమేసుకోమన్నావా" అని అడిగే ఇంటావిడ, ఇంటిలో రిటైర్ అయిన భర్త ఉంటే, పనిమనిషిని  "ఏమమ్మా పనికి వస్తావా మా ఆయన్ని గిన్నెలు తోమేమంటావా?” అని అడుగుతుంది.
అప్పటి వరకూ ధైర్యము చేసి మాటలాడని సహధర్మచారిణి గొంతు పెంచుతుంది. వాదించడము మొదలు పెడుతుంది. అప్పుడు అడగకుండానే గంటకొకసారి కాఫీ టీ ఇచ్చే శ్రీమతి ఒక్క చుక్క కాఫీకి గంటల కొద్దీ ఏడిపిస్తుంది.  మునుపు  ఆఫీస్ లో పని చేసే తోటి ఉద్యోగస్థులు ఇంటికి వస్తే, కనీసం కాఫీ లేదా టీ ఇచ్చే అర్థాంగి ఇప్పుడు పని ఉన్నట్టు పక్కింటికి వెళ్ళిపోతుంది. అప్పుడయితే, గొడ్డు చాకిరీ చేస్తున్నారంటూ జాలి పడుతూ,మైసూరు పాక్ లు, సున్నుండలు, రవ్వలడ్డూలు, గులాబ్ జామున్ లు, చిరుతిళ్ళు చేసి ఉంచే శ్రీమతి, ఇప్పుడు ఖాళీగా తిని కూర్చుని ఏ రోగమైనా తెచ్చుకుంటే నేను చాకిరీ చేయ లేను బాబూ అంటూ, ఈ పూటకి ఆ పూటకి భోజనముతో సరిపెట్టుకోమంటుంది. జీతం కోసి పెన్షన్ ఇచ్చినట్లే, ‘వడ్డించిన విస్తరి’ వంటి జీవితపు విలాసాలు కోతకు గురవుతాయి.
నాన్నగారు, మావగారు అని గౌరవించే కుటుంబ సభ్యులు, బంధువులు వాళ్ళలో వాళ్ళు మాటలాడుకొంటున్నపుడు ముసలోడు అని నామకరణము చేస్తారు. పాల పాకెట్ల దగ్గర్నుంచి, పిల్లల్ని స్కూల్ లో దింపడం, తేవడం, కూరలు, అవసరమైన సరుకులు తేవడం, బిల్లులు కట్టడం ఇలా అదనపు బాధ్యతలు తలకెక్కుతాయి. నెమ్మదిగ మాటాడితే వినిపించుకోరు. గట్టిగా అంటే, ఎందుకు అరుస్తున్నారని విసుక్కుంటారు. పెన్షన్ కోసము వెడితే, నెల రోజులు కష్టపడుతున్న మాకంటే , ఏ పనీ చేయకుండా, ఠంచన్ గా నెల మొదటి తారీఖున రాబందులా వాలిపోతాడని, పెన్షన్ ఇచ్చే పడుచు వారు సణుక్కుంటూ, ముష్టి వేస్తారు. పొద్దుటే తాజా కూరలు తెచ్చుకుందామని సంచీతో రైతు బజారు, బిగ్ బజారు వెడితే, పని పాటు లేని ముసలోళ్ళు గీసి గీసి బేరం ఆడుతారు, బేరాలు చెడగొడుతుంటారని కూరల వాళ్ళు చీదరించుకుంటారు.
అవసరము వచ్చి ఊరికి వెడదామని,రెండు నెల్ల ముందే ట్రైన్ లో రిజర్వేషన్ చేయించుకుంటే, బండీలో ని పడుచు వారు, " పనీ పాటు లేని ఈ ముసలాళ్ళు ఇంటిలో హాయిగా రామా కృష్ణా అని కూర్చోకుండా, సీనియర్ సిటిజన్ కోటాలో  కన్సెషన్  వస్తున్నదని ప్రయాణాలు పెట్టేసుకుని, ఉన్న బెర్తులు అన్నీ వీళ్ళే ఆక్రమించేస్తున్నారు. అదీ ఏసీ లో.   పైగా వీళ్ళకి లోయర్ బెర్తులే కావాలట... అని ముఖం ముందే తమ  అక్కసు వెళ్ళగక్కుతారు. అప్పటివరకూ ‘మర్యాద రామన్న’ లా వైభోగం మరిగిన జీవితం ఇలా అమర్యాద పాలు అవుతుంది.
పోనీ, ప్రశాంతంగా గాలి పీల్చుకుందామని, పార్కుకు వెడితే, అక్కడ జాగింగ్ చేస్తున్న వారు, అలసి బెంచీ మీద కూర్చున్నవారు ఈ ముసలోళ్ళు అడ్డొస్తున్నారని అసహ్యించుకుంటారు. అలా కాదు అని గుడికి వెడితే, వరమిచ్చే పూజారి శఠ గోపం పెట్టడు, తీర్థం ఇవ్వడు. పూజారికి ఆ రెండు చుక్కల తీర్థం వృధా చేయడం ఇష్టం ఉండదు. లోగడ ఆదివారాలకు శలవు రోజులకు పరిమితమయిన గృహ జీవితం రిటైర్ అయ్యేక గృహ నిర్బంధ జీవితం అవుతుంది.
ఇంటిలోనే ఉందామనుకుని, లుంగీ బనీనులు వేసుకుందామనుకుంటే, అవి వేసుకోవద్దని, వృధా అని, కొడుకులు, మనవలు తాము వాడేసిన బెర్ముడాలు టీ షర్టులు  వెతికి వెతికి ఎదురుగా గుట్టలు గుట్టలుగ పోసేసి , నాన్న గారు /తాత గారు మీకు ఎన్ని బెర్ముడాలో టీ షర్టులో అని ఆశ్చర్య పొతారు. పోనీ అనుకుని, అవి వేసుకుంటే, పిదప కాలం పిదప బుద్ధులు అని చుట్టుపక్కల అమ్మలక్కలు నోళ్ళు పెట్టి చెవులు కొరుక్కుంటారు. అప్పుడు నిండుగ, సూట్లతోను, పట్టు పంచెల తోను కళకళ లాడే బట్టల బీరువా ఇప్పుడు బెర్ముడాల తరువాత నీకు యోగి మేమన వేషము వేస్తారేమో చూసుకో అన్నట్లు హెచ్చరిస్తూంటుంది.
ఖర్మ కాలి ఒంట్లో బాగులేక పొద్దుట ఎనిమిది గంటలకు హాస్పిటల్ కు వెళ్ళి కూర్చుంటే, అక్కడ కూడా అదే తంతు.
నిరీక్షిస్తున్న పేషేంట్లు అర్జెంట్ పని ఉంది సార్ అనో, ఉద్యోగానికి టైం అయిపోతోంది అంకుల్ అనో చెప్పి ముందుకు దూసుకు పోతారు. మధ్యాహ్నము ఒంటి గంటకో, రెండు గంటలకో డాక్టర్ లంచ్ కు ఇంటికి వెళ్ళ బోయే  సమయానికి డాక్టర్ దర్శనం చేయిస్తారు రిసెప్షన్ వారు.
ప్రతి ఒక్కరు నీకు పనీ-పాటా లేదు కదా అని వ్యంగ్యంగా పరిహసిస్తూంటారు. చివరికి, నిముషాలు గంటల్లా, గంటలు రోజుల్లా రోజులు సంవత్సరాలుగా భారముగా గడుస్తూంటాయి.  ఎందుకూ కొరగాని వాడినయిపోయేనని అనిపిస్తుంది.
రిటైర్ అయ్యిన వాళ్ళలో, అధిక శాతం రిటైర్ అయ్యిన ఐదేళ్ళలో జీవిత విరమణ చేస్తారని సాంఖ్యక శాస్త్రము ఘోషిస్తూన్నది. ఈ భావనలు మనిషిలో జనించకూడదనే ఉద్దేశంతోనేమో,  మన పురాణాల్లో రాజులు ‘వానప్రస్థం’ స్వీకరించి, భోగాలను వారే త్యజించి, అడవులకు వెళ్ళేవాళ్ళు.
జీవితపు అన్ని పార్శ్వాలనీ హుందాగా ఆహ్వానించాల్సిందే! ఉద్యోగ జీవితం మొదటి పుట్టుక అయితే, పదవీ విరమణ తదుపరి జీవితం మనిషికి రెండవ పుట్టుక వంటిది. నేటి ఉద్యోగులే రేపటి కాబోయే ‘ముసలోళ్ళు’. అందుకే ప్రతీ ఒక్కరూ ఇప్పటినుంచే పదవీవిరమణ పొందిన పెద్దలను మన్నించడం, వారి అభిరుచికి తగ్గట్టు కొన్ని సౌకర్యాలు కల్పించడం నేర్చుకోవాలి. ఉన్నంతవరకూ వారి మనసు నొప్పించకుండా చూసుకోవాలి. సేవాకార్యక్రమాలు, ఆధ్యాత్మిక యాత్రలు, వంటి వాటి దిశగా ప్రోత్సహించి, వారికి వెలితి కలగకుండా చూసుకోవాలి. పసివయసులో ప్రతీ క్షణం కంటికి రెప్పలా కాపాడి, మనల్ని ఇంత వాళ్ళు చేసిన పెద్దలకు, ఇదే మనం సమర్పించే కృతజ్ఞతాంజలి.
ఈ గల్పిక నా శ్రీమతి, ధర్మపత్ని, సహధర్మచారిణి మూడూ ఒకటే అయిన శంభర శ్రీలక్ష్మి కి ప్రేమతో అంకితం.

No comments:

Post a Comment

Pages