వ్యక్తిత్వ వికాసం : సంతోషానికి 90/10 సిధ్ధాంతం
- బి.వి. సత్యనాగేష్
మన జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ సంఘటనలకు మనం స్పందించే తీరునుబట్టి మన మానసిక స్థితి ఆధారపడి వుంటుంది. ప్రపంచం ఎంతో ప్రసిధ్ధికెక్కిన పుస్తకం-The Seven Habits Of Highly Effective People . ఈ పుస్తక రచయిత STEPHEN R. COVE ప్రతిపాదించిన 90/10 సిధ్ధాంతం చాలా గణనీయమైనది. ఈ సిధ్ధాంతం మన జీవితాన్ని మార్చివేయ గలదంటున్నారు రచయిత. ఈ సిధ్ధాంతం, దాని వివరాలు చూద్దాం. మన జీవితంలో జరిగే సంఘటనలలో 10% మన అదుపులో వుండవు. మిగిలిన 90% సంఘటనలు మనం స్పందించే తీరుపై వుంటాయనేదే ఈ సిధ్ధాంతంలోని ముఖ్యాంశం . What I am Today is The Sum Total of Decisions Taken by Me in The Past అన్నారు ఓ మహానుభావుడు. నిజమే మన నిర్ణయాలే మన జీవితానికి ప్రమాణాలు. ఈ రోజు వాతావరణంలో తేమ ఉష్ణోగ్రతల తీవ్రత,రైళ్ళు ఆలస్యంగా రావడం, వర్షం రావటం, ట్రాఫిక్ జాం కావటం, బాంబులు పేలడం, బ్రిడ్జీలు కూలటం లాంటి విషయాలను మనం అదుపు చేయలేం. వాటికి మనం ఎలా స్పందించాలా అనేదే ముఖమైన విషయం. మరి STEPHEN R. COVE ఉదాహరణను చూద్దాం. "మీరు ఆఫీసుకి వెళ్ళడానికి తయారై డైనింగ్ టేబుల్ దగ్గర మీ కుటుంబ సభ్యులతోపాటు ఉదయం స్వల్పాహారం తీసుకుంటున్నారు. మీ అమ్మాయి తొదరపాటులో కాఫీకప్పు పడేసింది. ఆ కాఫీ మీ షర్ట్ పై పడింది. ఈ సంఘటనపై నిజంగానే ఎటువంటి ఊహగాని,అదుపుగాని లేవు." "తరువాత ఏం జరిగిందనేది మీరు స్పందించే తీరుపై ఆధారపడి వుంటుంది. మీరు మీ అమ్మాయిపై తిట్లవర్షం కురిపించేరు. కోపం ప్రదర్శించారు. డైనింగ్ టేబుల్ కి చివర కాఫీకప్పు పెట్టినందుకు మీ శ్రీమతిపై కోపం ప్రదర్శించి నోరు జారారు. ఈ విధంగా తిట్టుకుంటూ డ్రెస్సింగ్ రూం లోకి వెళ్ళి షర్ట్ మార్చుకొని ఆఫీస్ కి బయల్దేరారు. మీ అమ్మాయి మీ తిట్లకు స్పందించి ఏడుస్తూ కూర్చుని స్కూల్‌కి తయారు కాలేదు. ఈలోగా స్కూల్ బస్సు వెళ్ళిపోయింది. అప్పుడు మీ అమ్మాయిని మీరే స్కూల్ కి తీసుకెళ్ళాలి. ఆ తర్వాతే మీరు ఆఫీస్ కి వెళ్ళాలి. మీరు ఖచ్చితంగా ఆఫీస్ కు ఆలస్యంగానే వెళ్తారు. ఈ ప్రయత్నంలో ట్రాఫిక్ సిగ్నల్ ఇవ్వకుండానే బయల్దేరారు. అప్పుడు ట్రాఫిక్ పోలీసు ఫైను వేసాడు. ఈ కంగారులో మీరు ఆఫీస్ కి తీసుకెళ్ళాల్సిన బ్రీఫ్ కేస్ ఇంట్లోనే మర్చిపోయారు. ఈ విషయం ఆఫీస్ కు చేరిన తర్వాతనే తెలిసింది. తప్పనిసరిగా ఇంటికి వెళ్ళి బ్రీఫ్ కేస్ తీసుకురావాల్సిందే. సమయానికి ఆఫీస్ కి చేరకపోవడం వలన ఆఫీస్ లో అంతా అయోమయమే! రాత్రి ఇంటికి చేరాకా ఎడమొహం పెడమొహం. ఇదీ జరిగిన విషయం. దీనంతటికీ కారణం ఉదయం జరిగిన సంఘటనకు మీరు స్పందించిన తీరు మాత్రమే అంటాడు స్టీఫెం కోవె. ఈ సంఘటనకు ఎవరు కారణం అని ప్రశ్నించుకుంటే............. 1. కాఫీ 2. మీ అమ్మాయి అజాగ్రత్త. 3. ఫైను వేసిన పోలీసు. 4. మీ స్పందన. పై నాలుగు కారణాలలో నాల్గవ కారణమే అసలైనది. ఇక విశ్లేషణ చూద్దాం. కాఫీ పడిన వెంటనే ఆ నాలుగైదు సెకండ్లలో కలిగిన మీ స్పందన మీదనే ఆ తర్వాత పరిస్థితి ఆధారపడి వుంటుంది. కాఫీ పడిన వెంటనే మీ అమ్మాయివైపు చూసారనుకుందాం. ఏడ్వడానికి సిధ్ధంగా వుంది మీ అమ్మాయి. “ జాగ్రత్తగా వుండాలి. ఇంకెప్పుడూ ఇలా చేయకు" అని సుతిమెత్తగా మందలించి అక్కడినుంచి డ్రెస్సింగ్ రూముకి వెళ్ళీ షర్ట్ మార్చుకొని వచ్చి వుంటే పరిస్థితి వేరేగా వుండేది. మీ అమ్మాయి కూడా స్కూల్ కి వెళ్ళడానికి సిధ్ధంగా వుండేది. సమయానికి బస్సు దగ్గరకి వెళ్ళి వుండేది. మీరు స్కూల్ కి వెళ్లవలసిన పరిస్థితి వుండేది కాదు. సిగ్నల్ దాటవలసిన అవసరం వుండేది కాదు. ఫైను కట్టాల్సిన అవసరం వుండేది కాదు. ఆఫీస్‌కి సమయానికి చేరేవారు. బ్రీఫ్ కేసు కోసం గాని పేపర్ల కోసం గాని తిరిగి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు. అలాగే రాత్రి ఇంట్లో ఎడమొహం పెడమొహంగా వుండేవారు కాదు. కనుక మనందరం ఒప్పుకోవల్సిన విషయమేమిటంటే..... జీవితంలో జరిగే సంఘటనలలో 10 శాతం మాత్రమే మన ఆధీనంలో లేవు. మిగిలిన 90 శాతం సంఘటనలు మన స్పందన మీద మాత్రమే ఆధారపడివుంటాయని చెప్పేదే 90/10 సిధ్ధాంతం. మన సమాజంలో కొందరు మామూలు సంఘటనలకు కూడా విపరీతంగా స్పందిస్తూ వుంటారు. ఉదాహరణకు ఒక అపార్ట్ మెంట్ దగ్గర సెక్యూర్టీగార్డు అపార్ట్ మెంట్ కి వచ్చినవారిని "విజిటర్స్ బుక్ " లో విధిగా వివరాలు రాయమంటాడు. అతని డ్యూటీ అతను చేస్తున్నాడనుకొంటే అసలు గొడవలే వుండవు. అలాంటి చోట కూడా కొంతమంది అల్లుడి మర్యాదలు కావాలని అహంకారంతో ఊగిపోతూ వుంటారు. అలాగే ఆటోలో మీటరు తప్పు చూపిస్తే విపరీతంగా స్పందించి సంఘసంస్క్ర్తర్తలా మాట్లాడుతారు. మరి ఇలాంటి సందర్భాలలో ఏం చెయ్యాలి అనేదే మన చర్చ! ఇవన్నీ 10 శాతంలోకి వస్తాయనుకుంటే మన స్పందన వేరేగా వుంటుంది. కనుక ఆచరణలో పెట్టి చూస్తే ఎంత హాయిగా వుంటుందో మీరే చూడండి.
No comments:
Post a Comment