ఆనాటి వానచినుకులు/ఆకుపచ్చని జ్ఞాపకం – వంశీ
పరిచయం: రమా దేవి
వంశీ పూర్తి పేరు నల్లమిల్లి వంశీ. ఆలిండియా రేడియోలో 'సత్యసుందరి నవ్వింది' అనే కథని చదవడం ద్వారా 1974 లో రచనల్ని ప్రారంభించిన వంశీకి రచయితగా తగిన గుర్తింపు వచ్చింది మాత్రం 'మా పసలపూడి కథలు' తోనే. ఆనాటి వానచినుకులు పుస్తకాన్ని ఎమెస్కో వారు మొదట పదహారు కథలతో ఫిబ్రవరి 2003లో ప్రచురించారు. అందులోని పదిహేను కథలకి మరికొన్ని కథలను చేర్చి 32 కథలతో 'ఆకుపచ్చని జ్ఞాపకం' పుస్తకంగా విశాలాంధ్ర వారు 2010 లో మొదటిముద్రణ చేశారు. ఆకుపచ్చని జ్ఞాపకం' పూర్తిగా ఆర్ట్ పేపర్ మీద అన్ని పేజీలూ రంగుల్లో ఉన్న ఈ 360 పేజీల మేలిమి బౌండు పుస్తకంలో ప్రతి కథతోనూ బాపుగారి బొమ్మలు అద్భుతంగా అచ్చు వేయబడ్డాయి. వంశీ కథలు నచ్చేవారికి ఈ కథల గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన పని లేదు. కోనసీమ వాతావరణం, గోదావరి అందాలు, ఆ మనుష్యుల భాషా, యాసా, నడకా, నడతా మంచి నేర్పుతో చిత్రీకరించే వంశీ కథల్లో చెమక్కుమనిపించే మెరుపులు, కిసుక్కుమనిపించే హాస్యం, చురుక్కుమనిపించే వ్యంగ్యం,చివుక్కుమనిపించి మనసు మెలితిప్పే విషాదం కొద్దిగా శృంగారంతో కలగలిసిపోయి, పాత్రలు సజీవంగా కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి. 'ఆకుపచ్చని జ్ఞాపకం' ముందుమాట వంశీ కథలతో సీరియస్ గా కాసేపు.. వాసిరెడ్డి నవీన్ ఇలా అంటారు. ముప్ఫై ఒక్క కథలు, ఒక నవలిక - ఇదీ ఈ ఆకుపచ్చని జ్ఞాపకం. వంశీ కథలు ఎంత సరదాగా ఉంటాయో, కథలు అంత సీరియస్ గా ఉంటాయి.తనను తానూ అవిష్కరించుకావడానికే వంశీ ఈ కథలు రాసినట్లు అనిపిస్తుంది. ఒకటి, రెండు కథల్లో అయితే తన ఫిలాసఫీని నేరుగానే చెప్పుకున్నాడు. తనకు తెలిసిన, తను తిరిగిన ప్రాంతం, వాతావరణం, తన మనుషులు, తనకు తెలిసిన మనుషులు, వారి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు, అనురాగాలు-అప్యాయతలు, రాగద్వేషాలు, ఇంకా సజీవంగా నిలిచి ఉన్న ప్రేమాభిమానాలు, మూగప్రేమలు-ఆరాధనలు ఈ కథల నిండా పరుచుకుని ఉంటాయి. "విశాల దృక్పథమే జీవితం, సంకుచితత్వమే మృత్యువు, స్వార్ధపరత్వమే సర్వనాశనం - ఇదే జీవిత సత్యం.' బాచీ కథ చివర్లో కథానాయకుడు ఉటంకించిన మాటలు వంశీ రచనలకు గైడింగ్ ఫోర్స్ లాంటివి. వంశీని ఆకర్షించిన ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న మనుషులు తన కథల్లో పాత్రలుగా తీర్చిదిద్దాడు ఈ ఏటిగట్టు , కుమారి దంటు రామసీత వీలునామా కథల్లో. రాజహంసలు వెళ్ళిపోయాయి, వంతెన మరియు సీతారామా లాంచి సర్వీసు కథల్లో రాజకీయ దృక్పథాన్ని ప్రకటించడం కోసం రాసిన కథలు కాకపోయినా, అభివృద్ధికి, విధ్వంసానికి మధ్యనున్న వైరుద్యాన్ని ఎత్తిచూపుతూ విధ్వంసంపట్ల నిరసన వ్యక్తం చేసిన కథలు. ఎదుర్లంక, యానాం బ్రిడ్జి అభివృద్ధిలో భాగమే అయినా బ్రిడ్జి వల్ల నిర్మానుష్యంగా, నిర్జీవంగా మిగిలిపోయిన రెండు రేవులను చూస్తే ఏదో తెలియని బాధ, వెళితే ఆక్రోశం వెంటాడతాయి. కథ చదివాక రచయిత కన్నా పాఠకుడే ఆ బాధను ఎక్కువగా అనుభవిస్తాడు. తన బాధలను, సంతోషాలను పాఠకుల్లోకి ప్రవహింప చేయడంలో వంశీ కథన పద్దతికి ప్రత్యేకత వుంది అని నవీన్ అంటారు. వంతెన కథలోనూ అంతే. కట్టుదాటి వెళ్ళబోయిన అమ్మాయిని బల్లకట్టు ముసలోడు రేవు దాటకుండా ఆపగలిగాడు. వంతెన వచ్చాక ఎవరాపగలుగుతారు? వంతెనలు, రోడ్లు, బస్సులు మానవ ప్రగతిలో భాగం. అయితే, వాటి నుండి వచ్చే దుష్ఫలితాలను ఆపగలిగే స్థితికి సామాజిక ప్రగతి స్థాయి ఎదగకపోతే, వచ్చే అనర్ధమే వంతెన కథ. సీతారామా లాంచీ సర్వీస్ ...ఒక నవలిక.. ఈ కథలో ఎక్కడా విలన్ అనేవాడు ఉండదు. భావాల ఘర్షణ లేదు. మనుషుల మధ్య దూరాలు పెరిగిపోయాక జీవితాలు అల్లకల్లోలమైపోయక , అక్కడ అభివృద్ధి ఎవరి కోసం? ఈ ప్రశ్న ప్రతీ పాఠకున్ని వెంటాడుతుంది? ఇది ఒక విధంగా పాపికొండల భవిష్యత్ పటం లాంటిది. కారైకూడి నాగరాజన్, శిల, బాబూరావు మాస్టారు వంటి కథల్లో సంగీత రాగాలు వినబడుతూ ఉంటాయి. సంగీతపు లోతులు తెలియకపోతే ఈ కథలు రాయడం కష్టం. ఈ మూడు కథలు చదివాక అవి చదివిన ఆనందంతో పాటు సంగీత జ్ఞానం సంపాదించుకున్నామన్న తృప్తి కలుగుతుంది. భాగ్యమతి కథ చదివితే ప్రేమకున్నవిలువ తెలుస్తుంది. ఆ కథను చదివిన వాళ్ళు అరకు వెళ్ళే దారిలో చిమిడిపల్లి స్టేషన్ లో దిగి భాగ్యవతి కోసం కట్టిన గుడి గురించి తప్పకుండా వాకబు చేస్తారు. అలాగే, ఆకుపచ్చని జ్ఞాపకం కథ చదివాక, హైదారాబాద్ లో సంజీవయ్య పార్కుకు వెళ్ళినప్పుడు పరిమళ కోసమూ వెతుకుతారు. ప్రతీ కథ ప్రారభించడం, ముగించడంలో వంశీకి తన స్వంత ముద్ర వుంది. ముఖ్యంగా కథా ప్రారంభం విషయంలో, మొదటి రెండు లైన్లు చదివేసరికి పాఠకుడు కథలో భాగమైపోవాల్సిందే. గోదారి తల్లి, వంతెన, ధారావాహికం, ఆకుపచ్చని జ్ఞాపకం, రోడ్ షో కథలు చదివాక, వాటి ప్రారంభాలను మర్చిపోవడం అసాధ్యం. అలాగే వర్ధనరాజుగారి దివాణం, న్యూ గ్రాండ్ సర్కస్ కంపెనీ, ఒక అనుభవం..ఒక ప్రారంభం, భాగ్యవతి, వంతెన వంటి కథల ముగింపులు కూడా. వాటి అద్బుతమైన ముగింపుల వల్లే ఆ కథలకు ప్రాణం వచ్చి పాఠకుల్ని వెంటాడుతూ ఉంటాయి. యాత్ర కథ థీమ్ అద్బుతమైనది, . -దృక్పథాలు రకరకాల మనుషులభిన్న భావాలు, మనస్తత్వాలు వాటి మధ్య సంఘర్షణలతో పూర్తిస్థాయి నవలకు కావలసిన అన్ని హంగులతో ఉన్న ఈ కథ నవల అయితే బాగుందని పాఠకుడు ఆశ పడతాడు. ఇన్ని కథలు చదివాక... మనం చూడని ప్రాంతాలు చూసినట్లు, మనకు తెలియని జీవితాలు తెలిసినట్లు, అర్ధం కాని మానవ హృదయపు లోతులు అర్ధమైనట్లు, ఆ పాత్రల జీవితాల్లో మనమూ భాగమై పోయినట్లు అనిపిస్తుంది. మనసు ఆనందంతో తేలిపోతుంది, గుండె బాధతో బరువెక్కుతుంది. ఆకుపచ్చని జ్ఞాపకంలోని ముప్ఫై రెండు కథలు పేర్లు ఇవే .. ఇందులో మొదటి పదిహేను కథలు ఆనాటి వానచినుకులలోనివే. 1. కరైకుడి నాగరాజన్; 2. బాచి; 3. బాబురావు మేష్టారు; 4. అలా అన్నాడు శాస్త్రి; 5. సీరియల్ రాత్రులు; 6. ధారావహికం; 7. ఒక అనుబంధం-ఒక ప్రారంభం; 8. ది ఎండ్; 9. బొత్తిగా అర్ధం కాని మనిషి; 10. యానం ఏటి గట్టు మీద; 11. శిల; 12. ఆనాటి వాన చినుకులు; 13. ఆకుపచ్చని జ్ఞాపకం; 14. ఎర్రశాలువా; 15. నల్లసుశీల; 16. సీతారామా లాంచీ సర్వీసు - రాజమండ్రి 17. భాగ్యమతి ; 18. గోదావరి తల్లి; 19. యాత్ర; 20. న్యూ గ్రాండ్ సర్కస్ కంపెనీ; 21. అలా కాకుండా ఉంటే ఎంత బాగుండేది; 22. వంతెన; 23. కాబూలోడు; 24. 13వ నెంబరు మైలురాయి; 25. రోడ్ షో; 26. ఏకాదశి చంద్రుడు; 27. రాజహంసలు వెళ్ళిపోయాయి; 28. కుమారి దంటు రామసీత వీలునామా; 29. వర్ధనరాజుగారి దివాణం; 30. కల; 31 అదా విలువ; 32. మిస్డ్ కాల్ చదువుకొని, చూసుకొని, మెచ్చుకొని, దాచుకొని అందమైన పుస్తకం ఈ ఆకుపచ్చని జ్ఞాపకం……ఇదీ వంశీకథల ప్రత్యేకత….
No comments:
Post a Comment