ఆమె ముందు అతనుగా నేను
- రచన :బంగారు రామాచారి
అతనుగా మారి నిశ్చలమనస్సుతో
ఆమె ముందు మోకరిల్లి అన్నాను
"నిజంగా నువ్వు నేను పొగొట్టుకున్న
అమ్మలా వరమై దొరికావు"
ఆమె కళ్ళలో నేను దాచుకున్న
పసితనపు ప్రాయం గలగల నవ్వింది.
లేమిలోను తపనలను తీర్చే
ఆమె మనసెరిగి మసలుకునే
నేను తాయిలంకోసం మారాడే
పసివాడిభావనల మోముతో
ఈ చీకటి జీవితంలో వెలుగు చూపే
నువ్వే నా కంటి పాపవు అన్నాను.
ఆమె కళ్ళతోనే ముసిముసిగా నవ్వింది.
బాల భానుని నులివెచ్చని లేత కిరణాలు
కిటికీని వంచి మరిలోపలికి వచ్చి ముద్దాడినప్పుడు
రెండు చేతుల్లో ఆమె రూపమే
కమనీయంగా కనిపించింది.
కంపన, ప్రకంపనల లోకంలో
వెలుగు చీకటులేమైన ఉండనివ్వు
కాని ఒంటి చేత్తో ఇంటినిలాగుతూ
నా బ్రతుకులో సూర్యోదయాలు,
చంద్రోదయాలు విరజిమ్ముతున్న
సూర్యుడు, చంద్రుడు, వెన్నెల
వెలుగులన్ని నీవే కదా అన్నాను.
ఆమె అటువైపుకు మరలింది
అంతలోనే తిరిగి కళ్ళతో నవ్వింది
అతనికి తాయిలం దొరికింది.
బ్రతుకు కల(త)బడినప్పుడు
ముడుచుకున్న తాబేలుగా
భారజలనయనాలతో నేను
లాలించి పాలించే భూమికగా
ఆమె సమస్యను సాగదీయవు,
కానీ ఘడియ లోపే రాజీకి రప్పిస్తావుగా
నీ మోములో పూచే ఆనందవర్ణాలు
లెక్కింప నాతరమా అని నవ్వాను.
"నాకింకా బుద్దిపెరగలేదన్నావు"
నిజమే అతనుగా ఎల్లకాలం ఆమెకు
ఉపగ్రహాన్నేమరి వర్తమానంలోను,
అనంత(ర) కాలంలోను ఆమే వెన్నెల,
వెలుగులు పంచే మణిదీపమే.
No comments:
Post a Comment