అగ్నిసంస్కారం
- మణి వడ్లమాని
“తన మీద నమ్మకంతో తమ పెద్దల ఆకాంక్షను నెరవేర్చడం కోసం యాజ్ఞేష్ చేసిన కృషిని, ప్రయత్నాన్ని అభినందిస్తూ ఫ్రాంక్ “అగ్నిసంస్కారం” అనే పుస్తకం రాసాడు...
అప్పుడే ఆ పుస్తకం గురుంచి విమర్శకుల దగ్గరి నుంచి ఎన్నో ప్రశంసలు కూడా వచ్చాయి. ఆ పుస్తకావిష్కరణ కూడా యాజ్ఞేష్ చేతులమీద జరగాలని ఫ్రాంక్ కోరాడు. అందుకు యాజ్ఞేష్ తన స్నేహితుడికి, తన కన్నా భావితరాలకు ప్రతీకలైన ఆ వేదపాఠశాల లోని విద్యార్థులు చేతి మీదుగా పుస్తకావిష్కరణ చేయిద్దామని ఒక చిన్న ప్రతిపాదన చేసాడు. ఈ ఆలోచన చాల బావుందని ప్రశంసగా తల వూపాడు ఫ్రాంక్. అది నాకు కూడా సమ్మతమే అన్నట్టుగా గుడిలోని జేగంట మ్రోగింది.
” ఉదయం తొమ్మిది గంటలు కావస్తోంది. ఎప్పటిలాగే న్యూయార్క్ నగరం ఉరుకు పరుగుల జనసందోహంతో, రయిరయి మని దూసుకుపోయే కార్లతో హడావుడిగా, సందడిగా వుంది. ఒకప్పటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గరేవున్న ఇరవై అంతస్తుల భవనంలోకి యాజ్ఞేష్, అప్పుడే అక్కడకు వచ్చిన కొలీగ్ ఫ్రాంక్ కలిసి పద్ధెనిమిదవ అంతస్తులోని వాళ్ళ ఆఫీసులోకి వెళ్లారు. అది వారంలోని మొదటి రోజు కావటంతో పని చాలా ఉంటుంది కాబట్టి వెంటనే ఎవరి సీట్ల లోకి వాళ్ళు వెళ్లి కూర్చున్నారు. యాజ్ఞేష్ తన ‘లాప్ టాప్’ ని ఓపెన్ చేసి మెయిల్స్ చెక్ చేసుకుంటూ, ఫోన్లో ఎమన్నా మెసేజ్ లు వున్నాయామో అని ఆన్సరింగ్ మెషిన్ ఆన్ చేసాడు.
నాలుగు మెసేజ్ లు వున్నాయి, మూడు మెసేజ్ లు ఆఫీసుకు సంబంధించినవి. ఆఖరిది మాత్రం ఇండియానుంచి రామం మావయ్య చేసింది. మెసేజ్ బటన్ ఆన్ చేసాడు. “హలో యాజ్ఞేష్ , నేను రామం మావయ్యని. కంగారుపడకు ఈ టైం లో చేసానని. అసలు పొద్దునే ఇంటికి ఫోన్ చేశాను. అప్పటికే నువ్వు బయలుదేరావని సంధ్య చెప్పింది. అదే, సాయంత్రం ఇంటికి వచ్చాక నాకు ఫోన్ చెయ్యి, ఉంటాను”. మెసేజ్ బటన్ ఆఫ్ చేస్తూ “ఇంత హడావుడిగా మాట్లాడాడు, దేని గురుంచి ఫోన్ చేసివుంటాడబ్బా! సాధరణంగా ఇండియా కాల్స్ అన్ని శని, ఆదివారలలోనే వస్తాయి. ఇలా సోమవారంనాడు రావే” అని అనుకున్నాడు. లంచ్ టైం అయందని ఫ్రాంక్ వచ్చే వరకు తెలియలేదు. అంతగా పనిలో మునిగి పోయాడు. ఇద్దరు కలిసి లంచ్ కి వెళ్లారు .
మళ్ళీ సాయంత్రం అయిదు గంటల వరకు వూపిరి సలపనంత పని. రిపోర్ట్స్ చెక్ చెయ్యడం, మిస్టేక్స్ కనిపిస్తే కరెక్ట్ చెయ్యడం, నెక్స్ట్ వీక్ లో మీటింగ్స్ కోసం డేట్స్ అరేంజ్ చెయ్యడం, COOతో వీడియో కాన్ఫరెన్స్ కూడా అదే వీక్ లో వుండటంతో తన టీం అందరకి కమ్యూనికేట్ చెయ్యడంలో సమయం గడిచిపోయింది. “బాయ్! యాగీ! ఇట్స్ ఆల్రెడీ 5 o'clock” అని ‘మెలిసా’ తన సీట్ ముందు నుంచి వెళుతూ చెప్పింది. “ఓహ్! యా! థాంక్స్ అండ్ బాయ్ మెలిసా” అని అంటూ, అప్పడు గభాలున వాచ్ చూసుకొని, లాప్ టాప్ ఆఫ్ చేసి, టేబుల్ కూడా లాక్ చేసి వస్తూ వుంటే ఫ్రాంక్ కూడా కలిసాడు. ఇద్దరు కలిసి కిందకి దిగి, అక్కడికి దగ్గరలోనే వున్న స్టేషన్ కి వెళ్లి “6 o'clock” ట్రైన్ ఎక్కి వాళ్ళు దిగాల్సిన స్టేషన్ లో ట్రైన్ దిగి, ఎవరి కార్లు వాళ్ళు తీసుకొని, ఇంటి ముఖం పట్టారు. యాజ్ఞేష్ ఇంటికి చేరుకోనేసరికి భార్య సంధ్య, కొడుకు అభినవ్ అప్పటికే వచ్చేసి వున్నారు. అభికి తొమ్మిదేళ్ళు, 4th స్టాండర్డ్ చదువుతున్నాడు. సంధ్య కూడా మరీ దూరంగా కాకుండా, కొంచెం దగ్గర్లోనే ఒక ‘కన్సల్టెన్సీ’లో వర్క్ చేస్తోంది. అభిని స్కూల్ దగ్గర దింపడం, సాయంత్రం తీసుకొని రావడం, స్విమ్మింగ్ క్లాసుకి, పియానో క్లాసులకి తీస్కుని వెళ్లడం లాంటి పనులు తనే చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వాడి భాద్యత అంతా తనే చూసుకొంటొంది. “సంధ్య డియర్, ప్లీజ్ ఓ కప్ కాఫీ కావాలి” అని అడిగాడు యాజ్ఞేష్ .
“యా!! జస్ట్ టు మినిట్స్ యాగీ” అంది సంధ్య. రెండు నిముషాల తరువాత కాఫీ కప్ అందిస్తూ “యాగీ! రాగానే చెప్పడం మర్చిపోయాను. పొద్దునే మీ రామం మావయ్య ఫోను చేసారు నీ కోసం. వీలు కుదిరితే సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక కాల్ చెయ్యమని చెప్పారు” అని చెప్పింది. తెలుసు అన్నట్లుగా తలాడించాడు యాజ్ఞేష్ . ఫోన్ తీసుకొని కంప్యూటర్ కం రీడింగ్ రూంలోకి వెళ్ళాడు. రామం మావయ్య ఇంటి కి కాల్ చేసాడు.
నాలుగురింగుల తరువాత అవతలనుంచి “హలో, ఎవరు?” అనగానే “హలో అత్తయ్యా! నేను యాజ్ఞేష్ ని” అని అన్నాడు. “ఆ ! ఆ ! యాజ్ఞేష్ , బావున్నావా? సంధ్య, అభి బావున్నారా ? ” అని అడుగుతూనే సమాధానం కోసం ఎదురు చూడకుండా “ఇదిగో మిమ్మల్నే అమెరికా నుంచి మన శారద కొడుకు, యాజ్ఞేష్ ” అంటూ ఆవిడ ఫోన్ ని భర్తకి ఇచ్చింది. వెనకాల నుంచి ‘ నమకం,’ సన్నగా వినిపిస్తోంది. “హలో యాగీ బావున్నావా” రామం మావయ్య అడిగాడు. “బానేవున్నాను మావయ్యా, నువ్వేంటి మాకు పొద్దునే ఫోన్ చేసావు? ఏమిటి విశేషం?” అని అడిగాడు.
ఆయన గట్టిగా ఊపిరి పీల్చుకుని చెప్పడం మొదలుపెట్టారు, “విశేషం కాదు కానీ, ఒక విషయము చెపుతాను ఖంగారుపడకుండా చెప్పేది విను. నిన్న మధ్యాహ్నం మీ తాతగారి ఇల్లు కాలిపోయింది. అదే సమయానికి ఊళ్ళో అందరం గుడిలో వున్నాం. సుబ్రమణ్యంవాళ్ళు నిన్న అభిషేకాలు, లింగార్చన చేసి ఊరు అంతా సంతర్పణ పెట్టారు. నాకు విషయం తెలిసి, అక్కడకి వెళ్లేసరికి మొత్తం ఇల్లు కాలిపోయింది. అందులో అది వంద సంవత్సరాల నాటి ఇల్లేమో, తొందరగా అంటుకుపోయింది. మీ ముత్తాతలు కాలం దగ్గర్నుంచి దాచి వుంచిన ఆ తాళపత్రాలు, అయిదు పెద్ద వెదురు పెట్టలలోవుండేవి, అవి ఎప్పుడూ అగ్నిహోత్రం వుండే ఆ కటకటాలగదిలోనే ఉండేవి. అవి పిసరంత ఆనవాలు కూడా లేకుండా అగ్నిదేవుడుకి ఆహుతి అయ్యాయి. ఇప్పడు ఆ ఇల్లు ఒక మట్టి దిబ్బలా ఉంది. ఆ సరస్వతి నిలయం ఇప్పుడు లేదనుకొంటే నాకు చాలా బాధ వేసిందిరా. ఎప్పుడూ నిత్యాగ్నిహోత్రంతో వేదపారాయణం జరిగే ఆ ఇంట్లో మీ ముత్తాతలకి,తాతలకి కూడా దేవతలు కనిపించేవారని మా చిన్నతనంలో చెప్పుకునేవారు.
విచిత్రమేమిటంటే అసలు ఇల్లు ఎలా అంటుకొందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆ ఇంట్లో అద్దెకున్న వాళ్ళు చెప్పారురా, అసలు నిన్న వాళ్ళు నిప్పే రాజేయలేదుట. వాళ్ళుకూడా తాళం వేసి గుడిలో భోజనానికి వచ్చారుట. కాని యాగీ! నేను ఒకటి మటుకు నమ్ముతున్నాను. మీ పెదనాన్న కోరుకున్నట్లు ఆ అగ్నిదేవుడే ఈ పని చేసాడని నా ప్రగాడ నమ్మకం” అని ఆయన అన్న తరువాత ఒక్కక్షణం మౌనం రాజ్యమేలింది ఇద్దరి మధ్య.
యాగి తేరుకొని “మావయ్యా, సుధా అన్నయ్యకి, శ్యామలక్కకి చెప్పావా?” “ఆ ఆ ! చెప్పాను. ఆ భాద్యత నాదే కదా. అయినా నేను ముందుగా ఊహించినట్లే వాళ్ళిద్దరూ ఈ విషయం చాలా మాములుగా తీసుకొన్నారు. పెద్దగా భాదకూడా పడలేదు. పైగా అది చాలా పాత ఇల్లుకదా ఏవో వైర్లు అంటుకొని కాలిపోయింది అని అన్నారు ఇద్దరూ కూడా. ఇంకో విషయం యాగీ, నాకు, మీ పెదనాన్నగారికి మధ్య మంచి గురుశిష్యఅనుబంధం వుండేదని నీకు తెలుసు కదా. ఆయన పోయిన తదనంతరం నీకు ఇమ్మని నాకు ఓ కవరు ఇచ్చారు. నేను కాశియాత్రలో ఉన్నప్పుడు ఆయన పోవడం, మీరందరూ వచ్చి వెళ్లడం జరిగింది. నీకు ఇమ్మన్న కవరు నా దగ్గరే ఉండిపోయింది. అది నీకు ఓ రెండురోజులలో పోస్ట్ చేస్తాను. ఈ సంగతి చెపుదామనే నీకు ఫోన్ చేశాను. చాలాసేపు అయింది ఇంక వుంటాను” అంటూ ఫోన్ పెట్టేసారు.
ఫోన్ మాట్లాడటం అయిన వెంటనే యాజ్ఞేష్ కళ్ళ మీద చేతులు పెట్టుకొని, అలసటగా సోఫాలో కూలబడ్డాడు. అభి అది చూసి సంధ్యతో “అమ్మ, లుక్ ఎట్ డాడ్” అంటూ తండ్రిని చూపించాడు. సంధ్య దగ్గరగా వచ్చి, యాజ్ఞేష్ నుదుటి మీద చెయ్యివేసి “ఏమిటి యాగి? ఏమైంది? మళ్ళీ ఏదైనా న్యూసా?” అని అడిగింది. “నథింగ్ సంధ్యా, ఏమి లేదు. అదే మా ఊర్లో మా తాతగారి ఇల్లు కాలిపోయిందట. దాదాపు వందేళ్ళు ఆ ఇంటికి, నీకు గుర్తుందా? అదే మన పెళ్లి అయిన కొత్తలో నిన్నుతీసికొని వెళ్ళాను పెద్ద మండువా, నాలుగు సావళ్ళు, వెనకాల పెరడు, ఆ పెరట్లో కొబ్బరి చెట్లు, పెద్ద నుయ్యి దానిని ఆనుకొని ఆ ఎర్ర మందారంచెట్టు, అన్నికళ్ళకి కట్టినట్లు కనిపిస్తున్నాయి. మేము ఆడి, పాడి తిరిగిన ఇల్లు దానంతట అదే కాలిపోయిందనేసరికి చాల భాదగా వుంది. నేను లేట్ గా డిన్నర్ చేస్తాను ముందు నువ్వు,అభి తినేయండి” అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకొన్నాడు.
“అలాగే యాగి,కాని నువ్వు మరి అంతా అప్సెట్ కావద్దు” అని అతని భుజం మీద ఓదార్పుగా తట్టింది. కళ్ళు మూసుకున్నాడే గాని అతని మనసు మాత్రం గతం గురుంచి ఆలోచించడం మొదలు పెట్టింది.తన చిన్నతనంలో సెలవులకి విధిగా తాతగారి ఊరికి వెళ్ళేవాళ్ళు. అక్కడికి పెదనాన్న పిల్లలు కూడా వచ్చేవారు. తాతగారు తనకి, సుధాకర్ అన్నకి(పెదనాన్నకొడుకు) చిన్నతనంలోనే ఉపనయనం చేయించారు. తాతగారి దగ్గర వేదం నేర్చుకునే పిల్లలతో పాటుగా గాయత్రి మంత్రం, రుద్రం, నమకం, చమకం, మంత్రపుష్పం తను, సుధా అన్నయ్య కూడా నేర్చుకునే వాళ్ళం .
తరువాత ఇక్కడ ఇంజనీర్ పట్టతీసికోని నేను,సుధా అన్నయ్యకూడా పై చదువులకోసం అమెరికాకి వెళ్ళిపోయాము,అక్కయ్య మాత్రం పెళ్లిచేసికొనే వెళ్ళింది అమెరికా. తరువాత కొంతకాలానికి తాతగారు చనిపోయారు. పెదనాన్న రిటైర్ అయినవెంటనే తాతగారి ఊరు వెళ్లి పోయారు. అప్పటికే పెద్దమ్మ కూడా కేన్సర్ తో పోవడంవల్ల ఆయన ఒంటరిగా వుండటంవల్ల ఆయనకి ఒక వ్యాపకం కావలిన్పించింది. అందులో ఆయన బాగా వేదం నేర్చుకొన్నారు కూడా! తను నేర్చుకొన్నది తాతగారిలాగే నలుగురికి చెప్పాలనే మంచి ఉద్దేశ్యంతో ఊర్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఎంతోశ్రద్ధతో చెప్పేవారు. తనకి చిన్నప్పటినుంచి అమ్మానాన్న కన్నా పెదనాన్న యజ్ఞమూర్తి దగ్గర చాలచనువు.అందులోను తనతండ్రి అన్నగారి మీద గౌరవంతో ఆయన పేరే తనకి పెట్టారు. ఆయని కి కూడా తనుఅంటే చాలా ఇష్టం. అలా పెదనాన్నతో తనకి అనుబంధం ఎక్కువే.
“ఇంత మంచి జీవితం మనకి లభించడానికి మన పూర్వికులు చేసిన పుణ్యం, దాని వల్లనే మనం ఇలా వున్నాము. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా, మన పెద్దవాళ్ళని, మన సంస్కృతిని, మన సంస్కారాన్ని, తక్కువ చెయ్యకుండా ఉండాలి, ఒక విధంగా చెప్పాలంటే మనదికాని సంస్కృతిలోకి పరకాయప్రవేశం చెయ్యకూడదు” అని చెప్పేవారు. అలా పెదనాన్న చెప్పిన మాటలు మనసులో నాటుకొని పోయాయి. పెదనాన్న పోయినప్పుడు తనుఇండియా వెళ్ళాడు. కాని అప్పుడు అక్కడ తనకి సుధా అన్నయ్య, శ్యామలక్కల పద్దతి అస్సలు నచ్చలేదు. వాళ్ళు ఎవరితోనూ కలవనే కలవరు అందులో వాళ్ళు అమెరికాలో నాకు దగ్గర లోనే వుంటారు. అయిన ఎప్పుడూ కూడా సరదాగా కలవడం అనేది లేదు వాళ్ళతో.
అవడానికి సొంతవాళ్ళమే కాని అంత అనుబంధం, చనువు మా మధ్యలేదు. పెదనాన్నతో ఉన్న చనువు,దగ్గరతనం వీళ్లతో లేవు.నేను ఎన్నిసార్లో ప్రయత్నం చేశాను దగ్గరవడానికి కానీవాళ్ళు నన్ను కలుపుకోవడానికి ఇష్టపడలేదు అంటే సబబుగా వుంటుంది. ఇక్కడ మన ఇండియా పద్ధతులు అవి కూడా వాళ్ళకినచ్చలేదు. అంతా ‘డర్టీ డర్టీ’అంటూ మొదలుపెట్టారు. ఆ ఇల్లు అమ్మడం గురుంచి కూడా మాటలు వచ్చాయి. అది తాతల ఆస్తి కాబట్టి వాళ్ళకి ఒక్కళ్ళకేకాదు, నాకూ కూడా కొంత చెందుతుంది. కాని అది అమ్మే ప్రపోజల్ కి నేను ఒప్పుకోలేదు. అందుకే నేనంటే వాళ్ళకి కోపం. అప్పటికే అందులో ఎవరో పెదనాన్నని కనిపెట్టుకున్న కుటుంబం ఉంది. వాళ్ళు చాలా బీదవాళ్ళు; వాళ్ళని వెళ్లిపొమ్మని చెప్పడం మానవత్వం అనిపించుకోదు. అందుకే వాళ్ళని వుండమని చెప్పడంతో ఎంతో సంతోషించారు.
కాని ఇప్పడు ఆ ఇల్లు కాలిపోవడంతో పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో? అసలు ఆ ఇల్లు దానంతట అదే ఎలా కాలిపోయిందో?ఎవరు చూడలేదా? ఇంకా నయం ఆ ఇంట్లో వాళ్ళు అప్పుడు లేకపోవడం ఎంత అదృష్టమో! అన్ని జవాబులేని ప్రశ్నలే అనుకుంటూ లేచి వెళ్లి, నిద్రపోతున్నఅభిని ముద్దుపెట్టుకొని బెడ్ మీదకి చేరుకొని నిద్రపోవడానికి ప్రయత్నం చేసాడు. పొద్దుటనుంచి బాగా అలిసిపోయిందేమో సంధ్య అప్పటికే పడుకొని ఉంది. రెండురోజులు గడిచాయి. ఆఫీసునుంచి ఇంటికివచ్చిన యాజ్ఞేష్ కి రామం మావయ్య పంపిన పెదనాన్న ఉత్తరం ఆ రోజు మెయిలులో వచ్చింది. ఉత్తరం తీసి చదవసాగాడు. అక్షరాల వెంట చెమ్మగిల్లిన కళ్ళు పరుగు తీసాయి.
“నాన్న! యాజ్ఞేష్ , మీ పెదనాన్న నీకు ఆనేక ఆశీర్వాచనాలతో రాయునది. ఇది ఒకరకంగా నా ఆవేదన నీకు చెప్పుకుంటునట్లు నాభౌతికశరీరానికి “అగ్నిసంస్కారం” నా సొంత కొడుకుచేసినా, నా మనసుకు సంబంధించిన “అగ్నిసంస్కారం” మాత్రం నువ్వే చేయాలి.ఇది నా కోరిక! నువ్వు తప్పక తీరుస్తావనే నమ్మకం నాకుంది. నీకు తెలుసు కదా,మన పూర్వికులు ఎక్కడో తమిళ దేశంనుండి అగ్నిహోత్రంతో సహా ఇక్కడ కి వచ్చి ఈ మారుమూల గోదావరితీరాన స్థిర పడ్డారని,కొన్ని వందల సం|| చరిత్ర కలిగిన ఈ ఊరిని “బ్రహ్మపురి’ అంటారని, నిత్యాగ్నిహోత్రంతో,నిరంతరంగా సాగే వేద పఠనంతో, ఆ సరస్వతీదేవి అక్కడ కూరుచొని తన వీణ మీద సామ వేదం వాయించేదని,మన ముత్తాతలు చైనం,యజ్ఞం చేసేవారని, అప్పుడు ఆ దేవతలంతా ఇక్కడే వుండే వారని చెప్పుకొనేవారు.
స్వయంగా ఆ దేవతలే “హవిస్సు’ అందుకోవడానికి వచ్చే వారని కూడా అనేవారు. అంతటి ఘన చరిత్ర వున్నవంశంలో పుట్టాం మనం. కాలక్రమేణా దేశ,కాల,పరిస్థితులు మారాయి. మార్పు సహజమే కదా,అలాగే అనివార్యం కూడా. మావరకు మేము వేదం నేర్చుకొన్నా, పొట్టకోసం ఇంగ్లీషు చదువు కూడా చదవుకొన్నాము. అది భుక్తికోసం అయితే,ఈ వేదం మాత్రం మనఊపిరి. మనలో ఒక భాగం. అది మన జీవనగమనాన్నినిర్దేశించేది. నా మటుకు నాకు రిటైర్ అయిన తరువాత మనవూరు వచ్చి మన ఇల్లునే ఒక వేద పాఠశాలగా మార్చాలని, మా నాన్నగారి కోరిక తీర్చాలని ఎంతో ఆశగా వుండేది.
మీ నాన్న, అమ్మ అర్దాంతంగా పోవడం కొంత కుంగి పోయాను. అయినా గుండె దిటవు చేసుకొని అనుకొన్న పనిని పూర్తి చేద్దామని అనుకొన్నాను. కాని పరిస్థితులు,ఆరోగ్యం ఆఖరికి ఆ దైవం కూడా నాకు సహకరించలేదు. ఏ వేదమాతకు నేను పెద్దపీఠం వేద్దామని కలలుకన్నానో. అది నేను బతికుండగా జరగదని నాకు తెలిసిపోయింది. అంతటి అగ్ని హోత్రుల ఇల్లు నా తరువాత దీపం పెట్టె దిక్కులేకుండా పోతుంది.నీకు నా కోరిక తెలుసుకదా,మనఇల్లుని వేద పాఠశాల చెయ్యాలని ఎంతలా అనుకొనేవాడిననో! ఇప్పుడు నాకా ఓపికలేదు,అందులోను నేను జీవితం చివరిదశలో ఉన్నాను,ఈ విషయం గురుంచి నా పిల్లలని అడిగి భంగపడ్డాను ఈ తండ్రి కోరిక తీర్చెంత సమయం,ఓపిక రెండు లేవుట వాళ్ళకి.
విదేశివ్యామోహంలో పడి, తన పుట్టుక మూలాలు మరచి పరాయి దేశపు సంస్కృతిలో కొట్టుకుపోతూ, మన ఆచారాలు, మన సంప్రదాయాలని ”ట్రాష్” అని కొట్టిపడేసే యువత కి వాటి విలువ ఎలా తెలుస్తుంది? ఎంతో మంది విదేశీయులు మన వేదాలు,ఉపనిషత్తుల గురుంచి తెలిసుకొని, వాళ్ళకి ఆ ఉచ్చారణ రాకపోయినా కష్టపడి నేర్చుకొని మరీ పలుకుతున్నారు. అలాంటిది , నా ఇంట్లోనే ఇంతటి అపవిత్రం జరుగుతూ వుంటే ,ఇంక వేరేవాళ్ళకి ఏం చెబుతాను విలువలుగురుంచి. అందరూ మొహం పట్టుకొని ఈడ్చరూ.? ముందు నీ ఇల్లుని సరి దిద్దుకొని కొని అప్పుడు బయటవాళ్ళకు చెప్పు అని అనరూ!నిప్పుకి చెదలుపట్టడం అంటే ఇదేరా! అందుకే ఆ అగ్ని దేవుడుని ప్రార్దించాను నా వంటి తో పాటు నా ఇంటికి కూడా అగ్నిశుద్ధి జరగాలని. ఒక వేళ నా కోరికను మన్నించి ఆ అగ్నిదేవుడే కనక మన ఇల్లును శుద్దిచేస్తే నువ్వు తప్పకుండా ఆ ఇంటికి పూర్వపు వైభవం తెప్పించు ,నిత్యాగ్నిహోత్రంతో ,వేదగోష ప్రతిధ్వనిస్తూ అది వేదగాయత్రి నిలయంగా మారాలి.
ఈ ఇంటి వారసుడివి, పైనుండి మన పితృదేవతలు కూడా ఆశీర్వాదింస్తారు. నా పేరు పెట్టుకొన్న వాడివి, నా కోరికను తప్పకుండా తీరుస్తావన్న ఆశతో నిండు మనసుతో ఆశీర్వాదిస్తూ. ఇట్లు, నీ పెదనాన్న” ఈ ఉత్తరం సాంతం చదివేసరికి ఒక్కసారిగా దుఃఖం ముంచుకువచ్చింది యాజ్ఞేష్ కి. పెదనాన్నపోయినప్పుడు కన్నా ఇప్పడు ఇంకా ఎక్కువ భాద కలిగింది. ఆయన నిజంగా ఎంత క్షోభ అనుభవించారో ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని నిండుగా ఆ భగవంతుడిని ప్రార్ధించాడు. అప్పుడు పెదనాన్న పిల్లల ప్రవర్తన మూలంగా దూరంగా వుండిపోయాడు. కాని ఇప్పడు ఈ ఉత్తరం తన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. పెదనాన్న సర్వహక్కులు తనకి ఇచ్చాడు. తప్పకుండా ఆయన కోరిక తీరుస్తాను అని దృడంగా అనుకున్నాడు. అతని కళ్ళముందు అప్పడే“యజ్ఞ గాయత్రీ వేద పాఠశాల” రూపుదిద్దుకుంది.
కాలగర్భలో కొన్నిసంవత్సరాలు గడిచి పోయాయి. యాజ్ఞేష్ తన పెదనాన్న ఆఖరికోర్కెని తీర్చడం కోసం ఎంతో కృషిచేసాడు, ప్రతి సంవత్సరం వాళ్ళ వూరు వెళ్లి అక్కడి పెద్దలసహకారంతో ఆ ఇంటికి పూర్వ వైభవం తెప్పించడానికి చాలా శ్రమపడ్డాడు. చేసాడు. ఒక్క వేదమే కాకుండా ఇప్పటి జీవనవిధానానికి సరిపోయే ఇంగ్లీషు,కంప్యూటర్స్ కూడా చేర్చాడు.దీని మూలంగా ప్రపంచంలో ని ఏ ప్రాంతం వారైనా వచ్చి చదువుకోవచ్చు. అందుకు తగ్గ అనుకూలమైన ఆధునిక వసతులు కూడ వుండేలా ఏర్పాట్లు చేసాడు అంతే కాకుండా వేదపాఠశాల నిర్మాణానికి, నిర్వహణకు కూడా కావలిసిన ప్రభుత్వ అనుమతులను, ఆ గురుకుల ఆశ్రమ భాధ్యతలు నిర్వహించే ప్రతిభావంతులైన ఆచార్యులను కాకుండా సమర్ధవంతమైన నిర్వహకులను కూడా ఏర్పాటుచేసుకొన్నాడు. ఈ ప్రయత్నంలో సంధ్య తన సహాయ, సహకరాలని ఎంతగానో అందించింది. ఒక్కసారి కూడా అసహనం గాని విసుగుకాని చూపించలేదు. ఇంకా చెప్పాలంటే నీకు నేనున్నాను అనే మానసిక ధైర్యంఇచ్చింది.
ఎన్నిసార్లు ఈ పని కోసం ఇండియా వెళ్ళవలసివచ్చిన ఇక్కడ పనులన్నీ తను ఒక్కతే చూసుకొనేది. సంధ్య సహాయం వల్లనే ఇంత బృహత్తరమైన పనిని సునాసయంగా చెయ్యగలిగాడు. అమెరికా నుంచి యాజ్ఞేష్ స్నేహితుడు ‘ఫ్రాంక్’ వేదపాఠశాల ప్రారంభోత్సవానికి మిత్రుడి ఆహ్వానం మేరకు బయలుదేరాడు. ఫ్రాంక్ కి యాజ్ఞేష్ తో విడదీయలేని స్నేహబంధం పెనవేసుకుపోయింది. అందుకే ఇన్ని ఏళ్ల నుంచి కూడా వాళ్ళ స్నేహం ఎంతో పటిష్ఠంగావుంది.ఎందుకో తెలియదు కానీ ‘ఫ్రాంక్’ కి ఇండియా అన్న హిందుమతమన్న కూడా చాల గౌరవం అతను బైబిల్ ని ఎంత నమ్ముతాడో మన భగవద్గీత ని కూడా అంతే సమానంగా చూస్తాడు. యాజ్ఞేష్ ఆహ్వానంతో ఇండియా చూడాలన్న ‘ఫ్రాంక్’ కోరిక కూడా తీరింది.
హైదరాబాద్ లో విమానం దిగి అక్కడ నుండి రాజమండ్రికి వచ్చి, యాజ్ఞేష్ అతని కోసం పంపిన మనిషితో కారులో వాళ్ళ వూరికి బయలుదేరాడు. సుమారు ఒక గంటలో వాళ్ళ వూరు పొలిమేరలో వున్నాడు. దారిపొడవున అతని వీడియో కెమేరాకి పని చెప్పాడు. భూదేవి ఆకుపచ్చటి చీరకట్టుకొన్నట్ట్లుగా ఆ పచ్చటిపొలాలు, ఎత్తయిన ఆ కొబ్బరిచెట్లు, అతనితో పాటే ప్రయాణం చేస్తూ వచ్చిన అందమైన ఆడపిల్ల లా వంపులు తిరిగిన ఆ గోదావరి పాయ- వీటన్నటిని చూస్తూవచ్చిన ఫ్రాంక్ ఆ ప్రకృతి అందాలకు ముగ్ధుడై పరవశించిపోయాడు. రాజమండ్రిలో తన వస్త్రధారణ కూడా మార్చేసాడు. చక్కటి అంచువున్నపట్టు పంచ, తెల్లటి సిల్కు లాల్చీ, పైన ఉత్తరీయం- ఇవన్ని యాజ్ఞేష్ కారుతో పాటుగా పంపిoచాడు. అచ్చు పండితుడులా వున్నాడు. కారు ఊర్లోకి రాగానే కారాపి, తను దిగి నడవటం మొదలెట్టాడు, కారు వెనకాలే వస్తోంది.అలా నడుస్తూ వూరుని చూస్తూనే అనుకున్నాడు ఫ్రాంక్, యాజ్ఞేష్ తను చెయ్యాలనుకున్నది చేసి చూపించాడు అని.
ఊరంతా కలిపి ఒక పది వీధులు వుంటాయేమో,చక్కగా కలకలలాడుతూ అందమైన పల్లె పడచులా వుంది. ప్రతి ఇంటి ముందు ముగ్గులేసారు.గుమ్మాలకి పచ్చటి మామిడి తోరణాలు స్వాగతం పలుకుతూ న్నట్లు గా ఊగుతున్నాయి. ఈ పండగ సంబరం ఊరంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటోంది. అలా శివాలయం దాటి, కొంచెం దూరం వెళ్లి తల పైకెత్తిసరికి ‘యజ్ఞ గాయత్రీ వేద పాఠశాల’ కొబ్బరిఆకులుతో, మామిడి తోరణాలతో, విద్యుత్ దీపాలంకరణ తో స్వాగతం పలుకుతోంది. పాతకొత్త కలయకతో చక్కటి ఇల్లు,ఇంటి చుట్టురా అరటి,కొబ్బరి మామిడి చెట్లే కాక మందారాలు,నిత్యగోరింటలు లాంటి పూల చెట్లు ఆ చెట్లమధ్య పచ్చనితివాసీ పరిచినట్లు ఆకుపచ్చటి గరిక పరుపులు, ఒక పక్క యజ్ఞకుండం, ఇంకోపక్క యాగశాల వున్నాయి.అచ్చు ఆశ్రమ వాతావరణంలో ఎంతో పవిత్రంగావుంది. దేశం నాలుగు మూలలనుంచి వచ్చిన “ఘనాపాఠీలకు, వేదపండితులకు” ఎటువంటి లోటు రాకుండా చక్కటి వసతులు బోజన సదుపాయాలు ఘనంగా ఏర్పాటు చేసారు.
వచ్చే రెండు రోజులలో జరిగే యాగానికి, హోమలకి కావాల్సిన వన్నీ సిద్దం చేస్తున్నారు. ఊరంతా ఒక్కతాటి మీద నిలిఛి అన్నికార్యక్రమాలు చూసుకొంటున్నారు. ఇంతలో ఇంటి లోపల్నుంచి యాజ్ఞేష్ వచ్చాడు. వస్తూనే ఫ్రాంక్ ని ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు. ఒక్కక్షణం ఆ మిత్రులిద్దరూ ప్రపంచం మర్చిపోయారు. నెమ్మదిగా యాజ్ఞేష్ తేరుకొని, ఫ్రాంక్ కి తన ప్రణాళిక అంతా వివరంగా చెబుతున్నాడు. యాజ్ఞేష్ కూడా పట్టు పంచ, సిల్క్ లాల్చీ, పైన ఉత్తరీయం,నుదిటినబొట్టు, అన్నిటికంటే కూడా చక్కటి శిఖతో వున్నాడు. అనుకొన్న కార్యం చెయ్యగలిగాను అన్నతృప్తి కనిపిస్తోంది అతనిమొహంలో. పట్టుచీర నగలతో తలనిండ పూలతో కళకళలాడుతూ సంధ్య పక్కనే నిలుచుంది. పదమూడేళ్ళ అభి కూడా వాళ్ళ నాన్నలాగే పట్టుపంచ కట్టుకొని పెద్ద మనిషి లా అక్కడఎవరికో పనులుపురమాయిస్తున్నాడు.
వాళ్ళిద్దర్నీ చూసి ఫ్రాంక్ అభిమానంగా “గ్రేట్ అచివెమేంట్” అని బొటకనవేలు చూపించాడు. అది చూసి తృప్తిగా నవ్వింది సంధ్య. దానికి ప్రతిగా అభి “విక్టరీ” అన్నట్లు రెండు వేళ్ళు చూపించాడు ఫ్రాంక్ కి. తన మీద నమ్మకంతో తమ పెద్దల ఆకాంక్షను నెరవేర్చడం కోసం యాజ్ఞేష్ చేసిన కృషిని, ప్రయత్నాన్ని అభినందిస్తూ ఫ్రాంక్ “అగ్నిసంస్కారం” అనే పుస్తకం రాసాడు.అప్పుడే ఆ పుస్తకం గురుంచి విమర్శకుల దగ్గరినుంచి ఎన్నో ప్రశంసలు కూడా వచ్చాయి. ఆ పుస్తకావిష్కరణ కూడా యాజ్ఞేష్ చేతులమీద జరగాలని ఫ్రాంక్ కోరాడు. అందుకు యాజ్ఞేష్ తన స్నేహితుడికి, తన కన్నా భావితరాలకు ప్రతీకలైన ఆ వేదపాఠశాల లోని విద్యార్థులు చేతి మీదుగా పుస్తకావిష్కరణ చేయిద్దామని ఒక చిన్న ప్రతిపాదన చేసాడు. ఈ ఆలోచన చాల బావుందని ప్రశంసగా తల వూపాడు ఫ్రాంక్. అది నాకు కూడా సమ్మతమే అన్నట్టుగా గుడిలోని జేగంట మ్రోగింది. ఇద్దరి మనసులు అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. దూరంగా వేద పఠనం వినిపిస్తోంది, వచ్చే ఆహుతులు గురుంచి, అలాగే ఇంకా జరగవలసిన కార్యక్రమాల గురుంచి వివరాలు మాట్లాడుకుంటూ అలా గోదావరి ఒడ్డుకు సాగి పోయారు ఆ మిత్రులిద్దరూ !!!!!
|| పూర్ణమదః పూర్ణ మిదం పూర్నాత్ పూర్ణ ముదచ్చతే ||
|| పూర్ణస్య పూర్ణ మదయ పూర్ణ మేవ వశిష్యతే ||
No comments:
Post a Comment