ఉగాది - రచన: చెరుకు రామమోహనరావు - అచ్చంగా తెలుగు

ఉగాది - రచన: చెరుకు రామమోహనరావు

Share This
 వేపపూవుల చీరతో విలసితముగ
మావిచిగురుల రవికెతో మరువకముతొ
మొల్లలన్నియు మాలగా ముడిని జేర్చి
మందగమనాన 'జయ' వచ్చె మదను గూడి
వేపపూవుల చీరతో , మావిచిగురుల రవికెతో, మరువము కలిపి కట్టిన మల్లెచెండు కలిగిన జడతో, మెల్లమెల్లగా అడుగులు వేసుకొంటూ 'జయ' మన్మధుని గూడి వచ్చుచున్నది.
చేదును తీపియున్ వగరు చేర్చుచు పుల్పున కుప్పుకారమున్
మీదగు రీతినన్ గలిపి మిక్కిలి వేడుక వేప పచ్చడిన్
ఆదరమంద ఇంటినెడ యందరికిచ్చి యభీప్సితమ్ములన్
పొందుడు, శ్రీపతిన్ మిగుల పోరిమి భక్తికి చేర్చి మ్రొక్కుచున్
చేదు,తీపి,వగరు,పులుపు,ఉప్పు,కారము అను ఆరు రుచులతో కూడిన వేప పచ్చడి ఎంతో ఆదరముతో ఇంటిల్లపాదికీ పంచి ఆ శ్రీమహావిష్ణువును ఎంతో ఓర్పుతో కూడిన భక్తితో ధ్యానించి మీ మీ కోరికలను నేరవేర్చుకొనుడు .
బాలేందు మౌళియౌ బహుసర్ప భూషుండు
నీలకంఠుడు నిటల నేత్రధరుడు
నిండు చందురునేలు నెమ్మోము జిగివాడు
శ్రీదేవి నెదపైన జేర్చువాడు
కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి
తల్లుల తనయందు దాల్చు తల్లి
అష్టలక్ష్ముల రూపు ఐశ్వర్యముల చూపు
కరుణ గల్గినదేవి కలిమి తల్లి
దేవతలు వాణి వాణీశు దీవెనలను
కురియజేయగ శుభమంచు కోయిలమ్మ
కూసె సన్నాయి నొక్కుల కోర్కె మీర
'జయ'జయ' ధ్వని జయఘంట జగతి నింప
చంద్రమౌళి, పాములను ఆభరణములుగా కలిగిన వాడు, నీలకంఠుడు , ఫాల నేత్రుడు అగు శివుడు, నిండు చందమామ కన్నా అందమైన ముఖము గలవాడు, మహాలక్ష్మిని ఎదలో గలిగినవాడు అగు విష్ణువు, కామాక్షి, మీనాక్షి, కాశీ విసాలాక్షిని తనలోకలిగిన తల్లి గౌరీదేవి,అష్టలక్ష్ముల రూపును తనలో ఇముడ్చుకోన్నాట్టి,ఐశ్వర్య మార్గములను చూపే తల్లియగు లక్ష్మీదేవి, సకల దేవతలు ,భారతీ బ్రహ్మ దేవుడు అందరూ శుభము శుభమని పలుకుచుండగా కోయిల సన్నాయి నొక్కులు వారి ఆశీర్వాదములలో కలిసిపోవగా 'జయ' జయ' అని జగతికి వినిపించు రీతిగా జేగంట మ్రోగింది.
అల్లనల్లన మంచు మెల్ల మెల్లగ జారి
*కరువ పై సెలయేటి *కరణి కాగ
*కరువలి తోడౌచు కదిలిన ఝరి నీరు
*జలతరంగిణులతో జాలువార
*ఉదయ రాగముతోడ *ఉల్లముల్లసిలంగ
*తను విస్మృతులచేత తరువులాడ
వాద్య గోష్ఠికి నెల్ల వన విహంగములైన
*శుకపిక హిందోళ సుధల గురవ
శోభలను జల్ల సతత యశోక వనిని
మంద్రమున సాగు సంగీత మహిమవలని
జంతుకులమన్నదే మరచి *జంతుతతులు
'జయ'ము'జయ' మనె 'జయ' నామ జననమందు
కరువ = కొండ ; కరణి = వలె ; కరువలి = గాలి ; జలతరంగిణులు = నీటి పై చిన్న అలలు ; వాద్య విశేషము ;
ఉదయ రాగము = ఉదయభానుని జలతారు వెలుతురు ; ఉదయించిన రాగము ; ఉల్లసిలు = సంతసించు
*తను విస్మృతుల = మైమరచి ; శుకపిక = చిలుక కోకిల హిందోళ = తుమ్మెదల సమూహము ;
హిందోళము =సంగీతము లోని ఒక రాగము (రెండవ అర్థము); జంతు తతి = జంతు సమూహము
భావము : చలితో కూడిన శిశిరము గడిచి మెల్లమెల్లగా కొండపై మంచు కరుగ నారంభించి సెలయేరై మందగతిలో పాడుతూ పారుతూ వుంది . దాని నడక గాలి తో కలిసి చిన్నచిన్న అలలను రేపుతూవుంది. ఆ వయ్యారము జలతరంగిణులను వాయించుచున్నట్లు వుంది. చెట్లు ఆ రాగానికి అనుగుణంగా మైమరచి నర్తిస్తున్నాయి. దీనికి చిలుకలు కోకిలలు తుమ్మెదలు సంగీతాన్ని సమకూరుస్తున్నాయి. తదేకముగా వినే ఆ శోకమేలేని అశోకవనములో గల జంతువులు తాము జంతువులమన్న మాటనే మరచి 'జయ' 'జయ' 'జయ' మంటున్నాయి .
దక్ష వాటి పవిత్ర ధరపైన భీమేశు
డానంద మూర్తియై నలరుదాక
ఇంద్రకీలాద్రి పై ఇమ్ముగ దుర్గమ్మ
అవనిని పాలించు నంతదాక
రాజరాజేశుండు రంజింపనీ భూమి
వేములవాడలో వెలయుదాక
శ్రీశైల మల్లన్న శ్రీమాత భ్రమరతో
చింతల బాపుచూ చెలగుదాక
సిరుల వరదలు పారించు శ్రీనివాసు
కరుణ కాణాచిగా ధర కాయుదాక
కలిసియుందము పున్నమి కలువ తతిగ
తపనమునగూడ తనిసెడు తామరలుగ
దక్షారామములో భీమేశ్వరుడు ఈ పవిత్రభూమి పై ఆనందముగా ఉన్నంతవరకు (అంటే దక్షుని యజ్ఞము ధ్వంసము చేసినపుడు కలిగిన కోపము కలగకుండా , శాంత మూర్తియై ఉన్నంతవరకు), ఇంద్రకీలాద్రి పర్వతము పైన కనక దుర్గమ్మ ఆదరముతో మనల కాపాడు వరకు, వేములవాడలో రాజరాజేశ్వరుడు ఈ భూమిని ఆనందమయముగా కాపాడునంత కాలము,శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునులు మనకు ఎటువంటి చింతలు లేకుండా కాపాడువరకు , సంపదల వరదాయకుడైన శ్రీనివాసుడు మనకు సంపద వరదలు పారించ్చున్నంత వరకు అందరమూ పున్నమి నాటికలువలలాగా , కష్టము అన్న సూర్యుని వేడిమిని భరించి ఆనందమును వదలని తామరల లాగా అందరమూ కలిసిమెలసి ఆనందముగా వుందాము.

No comments:

Post a Comment

Pages