నూతన వత్సరానికి స్వాగతం! - అచ్చంగా తెలుగు

నూతన వత్సరానికి స్వాగతం!

Share This

నూతన వత్సరానికి స్వాగతం!
రచన :శ్రీనివాస్ యనమండ్ర
----------------------------------------

ప్రభాత ప్ర్యత్యూష కిరణాలు - ఉషోదయపు ఉషస్సులు
నమామి దైవ స్త్రోత్రములు - స్మరామి గురుప్రవచనాలు
తలుపులకు మామిడాకు తోరణాలు – తలపులకు ధ్యానమార్గ ప్రేరణలు
తనువు చుట్టిన కొంగొత్త వస్త్రములు – తపన పెంచిన సరికొత్త వర్ణములు
షడ్రుచుల ప్రసాద సేవనము – షట్కర్మల ఫలితముపై అవలోకనము
షడ్రసోపేత మృష్టాన్న భోజనము – షడ్రుతువుల పంచాగఫల శ్రవణము
ఉగాది పర్వదిన సంబరాలివికాదె ఎంచిచూడగన్
అనాదిగ ఆచరించు సనాతన సంప్రదాయ రీతిన్
మరిదేమి ఈనాడు ఒక్కటీ కనిపించకుండగన్?
ఉగాదినాడే ఆర్ధిక సంవత్సరాంతమొచ్చి చచ్చెన్
ప్రత్యూష కిరణాలు పోయె, ఆడిటర్ ప్రభాత్ కిరణ్ అగుపించ
ఉషస్సు తేజస్సు కొల్పోయె, ఉస్సురని నిద్రలేమి ఆవరించ
స్త్రోత్రములు మరపు కొచ్చే, స్టోరు ఇన్వెంటరీ లెక్కతేలక
ప్రవచనాలు అటకక్కె, ప్రయాణ బిల్లు సెటిల్చెయ్యాలికనక
వస్త్రము కొత్తదనముపోయి, దస్త్రము దుమ్ము ఆవరించగ
ప్రసాద సేవనము సరిపోక, తేనీటి పావనములు సల్పంగ
దేవాలయ సందర్శన ఫలముల మాట దేవుడెరుగు
ఏటి బోనసు పుట్టముంచె ఆర్ధిక ఫలితాల పురుగు
సాయంత్ర పంచాగ శ్రవణమొక్కటి మటుకు తప్పదాయే
జాతకం మారునేమో మరు ఏడు అనె ఆశ చావనిదాయే
ఆశ మనిషి జీవనపు దిక్సూచి అని తెలిసినవాడిని కనక
మనసు ఊరకుండ మిత్రులకు అక్షర శుభాకాంక్షలు తెల్పక
పర్వదిన ప్రాముఖ్యత అదియె కదాయని సరిపెట్టుకునుచు
కొంగొత్త ఆశలతొ ఈ నూతన వత్సరమును స్వాగతించుచు

No comments:

Post a Comment

Pages