మాతృత్వపు ముచ్చట్లు :: పసి పాపలు – పాటలు విజయ లక్ష్మి సువర్ణ - మాంట్రియాల్, కెనడా - అచ్చంగా తెలుగు

మాతృత్వపు ముచ్చట్లు :: పసి పాపలు – పాటలు విజయ లక్ష్మి సువర్ణ - మాంట్రియాల్, కెనడా

Share This
నవ మాసాలు పొట్టలో మోసి శిశువుకు జన్మనివ్వడం వనితకు ప్రకృతి మాత ప్రసాదించిన వరం. ఇది ప్రతి తల్లి అనుభవించే మధుర ప్రక్రియే కాని వివరించే వీలుకాదు. కొత్తగా మాతృత్వం పొందిన తల్లులు చంటి పిల్లల విషయంలో ఎన్నెన్నో సన్నివేశాలు ఎదుర్కో వలసి వచ్చినప్పుడు వెంటనే తోచిన మనోభావం (instincts) బట్టి కాని, పెద్దలు సూచించిన సలహా బట్టి కాని నడుచు కోవాలి కాని పుస్తకాల్లో రాసినట్టుగా పాటించడం కుదరదు. ఈ రోజు ‘పిల్లలు – పాటలు’ గురించి తెలుసుకుందాము. పసివాళ్ళు పుట్టక ముందే అంటే 7వ నెల, తల్లి గర్భం లో ఉన్నప్పుడే వివిధ రకాల శబ్దాలు విని ఉత్తేజితు లవుతుంటారు. వినిపించే శబ్దాలనుబట్టి రకరకాల భావనలు ఏర్పరుచుకొంటారు. అందుచేత పసివాళ్ల నుద్దేశించి తల్లి తండ్రులు, ఇతరులు కూడా సున్నితమైన గొంతుతో ఆహ్లాదకరమైన విషయాలు మాట్లాడాలి. ముఖ్యంగా తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు ఇతర పెద్దవాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి మొదలెట్టి పుట్టిన పసికందుకు మరియు పెరిగే వయసు పిల్లలకు రకరకాల పాటలు పాడి వినిపించవచ్చు. కనీసం 4, 5 సంవత్సారాలు నిండే వరకు పసివారికి పాటలు వినిపిస్తే వారి మేధా శక్తి పెరిగి వికసిస్తారు. పసివారు పుట్టినప్పటినుండే తల్లి గొంతు వైపు ఆకర్షితులవుతారు. ఆ క్షణం నుంచే తల్లి గొంతు మృదువుగా వినిపిస్తూ ఉంటె వాళ్లకి ప్రశాంతమైన మనః స్థితి ఏర్పడుతుంది. ఆ గొంతుతో పాటలు పాడుతూ పాపలను సముదాయిస్తూ ఉంటె ఇంకా అంతకంటే మధురం ఏముంటుంది. గొంతు లేదని, పాట రాదనీ, రాగంతో పాడలేనని వెనుకాడకండి. మీ చంటిపాప ఉద్దేశంలో పాడే తల్లి గొంతుకన్నా మధురమైనది, అందమైనది మరేమీ లేదు. పాటలు రావని, నేర్చుకోలేదని సంకోచ పడకండి. మీరందరూ సొంతంగా పాటలు కల్పించేసుకుని పాడుకోవచ్చును. మామూలు మాటలే పాటల రూపంలో పాడడం చాలా సులువు. ఉదాహరణకి చూడండి: పాపాయికి లాలలు పోయాలి, లా లా లల లాలలు పోయాలి, నీళ్ళను కలిపి వేడిని చూసి లాలలు పోసి తుడవాలి ....... చిన్నారికి చొక్కా వెయ్యాలి..... బుజ్జి బాబుకు బొజ్జను నింపాలి, మా పాపకు బొజ్జను నింపాలి ... పసి బాబుకు పాలను పట్టాలి.... చిన్నారి కి ఉగ్గును పెట్టాలి ...... ఇలాగ పాడుతూ ఉంటె అనుకోకుండానే పాడేవాళ్ళ పెదవులమీద ఒకచిరునవ్వు వెలుగుతూ ఉంటుంది. ఇలా మొట్ట మొదట పసివారితో పలికే పదాలు పాటలు అన్ని తెలుగులో వింటూ ఉంటె వారి భాషకి ఒక పునాది లాగ ఏర్పడుతుంది. లేత వయసులో ఒక పునాది ఏర్పడితే ఆ పైన కట్టడాలు ఏ వయసులోనైనా కట్టుకోవచ్చును. అందుకే చిన్న పిల్లలతో మాట్లాడినా, పాడినా, తెలుగు భాషనే వాడితే వాళ్లకి మాతృభాష ప్రారంభించ బడుతుంది. మరి తల్లి నేర్పే భాష కాబట్టి మాతృభాష అంటారుగా. ఈ మధ్యన విదేశాల్లో ఇటువంటి చిరకాల అలవాట్లను కాబోవు తల్లులకి విశదీకరించి ప్రోత్సహిస్తున్నారు. తల్లి పిల్లల మధ్య బాంధవ్యాలు గర్భంలో మొదలయి పెరిగే వయసులో గట్టి పడడానికి ఈ పాట-పద్దతి (Sing–Song method) తోడ్పడుతుందని భావన. పసి వారిని పడుకో పెట్టడానికి తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో అందరికి మనోరంజకం గా ఉండేది పాటలు పాడడం ... పసి పాపాలను ఎత్తుకుని తిరుగుతూనో, ఉయ్యాల్లో వేసి ఊపుతూనో పాటలు పాడుతుంటే ఇటువంటి గొంతు ఉన్నా కూడా అ చంటి వాళ్ళకి నున్నితమైన ఓదార్పుగా ఉంటుంది... ఈ కింది పాటను ప్రయత్నించండి ఇది మీ అందరి కోసమే ... ఈ (___) గుర్తు ఉన్న చోట మీ ఇష్టం వచ్చిన పేర్లను ఈ పాటలో చేర్చి పాడుకోవచ్చు... ఉదాహరణకు: మా ఇంటి పేరు పెట్టామనుకోండి.. ఇలా ఉంటుంది: ( సువర్ణముల వారి ... ) ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! ( _______ ) వారి అపురూప బాల, ఊగవె హాయిగా ఆనంద డోల |( ____ ) | నవ లేత చిగురాకు లతల తీగల జేర్చి, మీ అమ్మ అలరించె అందాల జోల, తేనె లూరే రాగ మాలికల సరి గూర్చి, మేనత్త మురిపెముగ పాడేటి జోల, సన్న జాజుల పోలు సున్నితాలను పేర్చి, నానమ్మ ఊపేటి గారాల జోల |( ____ ) | తార లన్నియు పేర్చి తోరణము గా గుచ్చి, తాతయ్య అమరించే వాసిగల జోల, చుక్క లన్నిటి నడిగి చక్క దనమును తెచ్చి, చిన్నాన్న పేర్చిన చందాల జోల, మేఘ మాలికల మెత్త దనమును తెచ్చి, మీ నాన్న పొందించే మురిపాల జోల |( ____ ) | ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * ! * !

No comments:

Post a Comment

Pages