శ్రీరామచంద్రమూర్తి జననం
రచన : రాధ
శ్రీరాముడు ఈ పేరు వినగానే మనకు ఒక మంచి కుమారుడు ,మంచి భర్త ,ఒక మంచి సోదరుడు అన్నిటికీ మించి ప్రజలకోసం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యను సైతం విడిచిన ప్రభువు ఒక్క మాటలో చెప్పాలంటే సకలలక్షణములు కలబోసిన పురణ పురుషుడి స్వరూపం మనకన్నులకు కనిపిస్తుంది.శ్రీమహావిష్ణువు దుష్టసంహారం కోసం ఎన్ని అవతారాలు లో భూమిపైన జన్మించినా అన్నిటికంటే శ్రీరామచంద్రమూర్తిగా జన్మించినా రామావతారం సకల జనులకు ఆదర్శం.ఆ ప్రభువు చెప్పిన ప్రతిమాట ఒక మంత్రం,తన తత్త్వం మనకు ఆదర్శం, అలాంటి ప్రభువు జననం గురించి కొంత తెలుసుకొందాం తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం | నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం || వాల్మీకి మహర్షి రామాయణంలొ రాసిన మొదటి శ్లోకం. దీని అర్ధం ఏంటంటె, తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటె................ కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ | ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః || చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః | విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః || ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః | కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే || ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు. నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలొ ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు........ ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు. దాశరధమహారాజు పుత్రకామిష్టియాగం సంతానంకోసం చేయిస్తున్నాడు ఆ యిష్టి జెరుతున్నప్పుడు, అందులో తమ తమ భాగాలని పుచ్చుకోడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దెగ్గరికి వెళ్లి, " పితామహ! మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు, మీరు ఇచ్చిన వరముల వలన గర్వంపొంది వాడు ఈనాడు..... నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః | చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి న కంపతే || రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు, సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది, వాయువు రావణుడి దెగ్గర అవసరంలేకపోయినా మెల్లగా వీస్తుంది, ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధపెడుతున్నాడు, ఎక్కడా యజ్ఞములు జెరగనివ్వడంలేదు, ఋషులని హింసిస్తున్నాడు, పర భార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించె మార్గం చెప్పవలసింది" అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు " నేనూ వాడి అకృత్యాలు వింటున్నాను, వాడు తపస్సుతో నన్ను మెప్పించి, రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు, కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు" అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు. ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా, అంతా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయాముర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలొ తనంతట తానుగా వచ్చారు.... ఏతస్మిన్ అనంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః | శఙ్ఖ చక్ర గదా పాణిః పీత వాసా జగత్పతిః || ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందొ, అందమైన రూపంతొ, మెడలొ వైజయంతి మాలతొ, శంఖ చక్ర గధ పద్మాలని పట్టుకొని శ్రీమహా విష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు...... హత్వా క్రూరం దురాధర్షం దేవ ఋషీణాం భయావహం | దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ || వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృధ్వీం ఇమాం | ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణుః ఆత్మవాన్ || మీరెవరు కంగారు పడొద్దు, రావణుడు చేసే అక్రుత్యాలన్ని నాకు తెలుసు, వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధపెడుతున్నాడు, అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద పదకొండు వేల సంవత్సరాలు ఉండి ఈ పృథ్వి మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు. తతః పద్మ పలాశాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం | పితరం రోచయామాస తదా దశరథం నృపం || నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలొ వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని, సింహంలా నడుస్తూ బయటకి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమిచెయ్యగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడ! ు " నాయనా దశరథానన్నుప్రాజాపత్ర్య పురుషుడు అంటారు, నన్ను ప్రజాపతి పంపించారు, ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతొ ఉంటారు" అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురినీ పిలిచి, ఆ పాయసంలొ సగభాగం కౌసల్యకి ఇచ్చాడు, మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి, ఒక భాగాన్ని కైకేయకి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. యాగం పూర్తయ్యాక, అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. రుష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనని సత్కరించి శాంతా రుష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరిని తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు. కొంత కాలానికి దశరథ మహారజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు. తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ | నక్క్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు పంచసు || గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ | ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతం || జగన్నాధుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కారింపబడే వాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి, చైత్ర మాసంలొ, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలొ, కర్కాటక లగ్నంలొ రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలొ కైకేయకి పుష్యమి నక్షత్రంలొ, మీన లగ్నంలొ భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అతీత్య ఏకాదశ ఆహం తు నామ కర్మ తథా అకరోత్ | జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీ సుతం || సౌమిత్రిం లక్ష్మణం ఇతి శత్రుఘ్నం అపరం తథా | వసిష్ఠః పరమ ప్రీతో నామాని కురుతే తదా || రాముడు పుట్టిన 11 రోజులకి జాతాసౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు కులగురువైన వశిష్ఠ మహర్షి, సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయెదరు కనుక ఆయనకి రామ (రా అంటె అగ్ని బీజం, మ అంటె అమృత బీజం) అని, సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మి సంపన్నుడు (రామ సేవే ఆయన లక్ష్మి) కనుక ఆయనకి లక్ష్మణ అని, కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకి భరత అని, శత్రువులను (అంతః శత్రువులు) సంహరించగలవాడు కనుక శత్రుఘ్ను అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి.
No comments:
Post a Comment