మీరు మీ పిల్లలకు వారసత్వంగా ఏమిస్తారు ? ఆస్థిపాస్తులు, విద్యాబుద్ధులు, సంస్కృతీ సాంప్రదాయాలు ఇవే కదూ. అదే ఆ కుటుంబం అయితే వారసత్వంగా తప్పక ఇచ్చే ఆస్తి ఏమిటో తెలుసా? వైణిక విద్యా వారసత్వం... ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు’ అంటారు. కాని, మా కుటుంబం ఈ సామెత తప్పని నిరూపించింది’, అంటారు వీణా వాద్య విశారద, సంగిత విద్వన్మణి , సునాద సుధా నిధి, వీణా వాదన చతుర, వంటి అనేక బిరుదులు పొందిన అయ్యగారి శ్యామసుందరం గారు. మనోధర్మ సంగీతంలో తమకంటూ ప్రత్యేక ముద్రను కలిగిన ,ప్రఖ్యాత విజయనగర వీణా సాంప్రదాయంలో, ‘వైణిక రత్న’ శ్రీ అయ్యగారి సోమేశ్వర్రావు ‘ గారి కుమారులుగా 1948 లో జన్మించారు శ్యామసుందరం గారు. ప్రఖ్యాత వైణికులు ‘వైణిక శిరోమణి’ పప్పు సోమేశ్వర్రావు గారు(మేనమామ) కూడా అయ్యగారి సోమేశ్వర్రావు గారి శిష్యులే! తల్లికి విద్య నేర్పితే, ఆమె తన పిల్లలకు శ్రద్ధగా విద్యను నేర్పుతుంది, అలా విద్య చక్కగా వస్తుంది, నిలుస్తుంది – అన్నది వీరి కుటుంబ సిద్ధాంతం. తల్లి , జయకుమారి గారి కడుపులో ఉండగానే సంగీత పాఠాలు నేర్చారేమో, నాలుగేళ్ళకే 20 కృతులు వీణపై వాయించడం, రాగాలు చెబితే కీర్తనల పల్లవి చెప్పడం ఆయనకు అలవోకగా అబ్బాయి. తన తండ్రి వద్ద వీణా వాద్యంలో నిపుణత సాధించిన తల్లి, ఈయన వీణా సాధన గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారట ! 8 ఏళ్ళు వచ్చేసరికి 50 కీర్తనల దాకా అభ్యసించి, గాత్రం, వీణ కచేరీలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. వారి వైణిక ప్రస్థానం గురించి వారి మాటల్ల్లోనే... “ఏ మనిషిలోనైనా జ్ఞానం సూక్ష్మ రూపంలో ఉంటుంది, సరైన మార్గం చూపే జ్ఞాన సూర్యుడు వంటి సద్గురువు దొరికితే, ఆ జ్ఞానం విస్త్రుతమౌతుంది. నా విషయంలో తండ్రి, గురువు, సద్గురువు, అన్నీ మా నాన్నగారే! నాకు మంచి గ్రహణశక్తి ఉంది. నన్ను పెంచడమే మా నాన్నగారి ధ్యేయం. నన్ను సంగీత ధ్యేయంతో పెంచారు. మంచి గురువు పధ్ధతి ఏమిటి అంటే, తన శిష్యులకు తనతోపాటు కచేరీలు చేసే అవకాశం ఇవ్వడం. ఎందుకంటే, వేదిక చాలా నేర్పుతుంది. సాధన, సరికొత్త ప్రయోగాలు చెయ్యటం, సమకాలీకులతో ఆరోగ్యకరమైన పోటీతత్వం, ఇవన్నీ ఆయన నుంచే నేర్చుకున్నాను. నన్నెప్పుడూ పొగిడేవారు కాదు. 1965 లో ఆయన చనిపోయే వారం రోజుల ముందు మాత్రం, రేడియో ప్రోగ్రాం నుంచి బయటకు వచ్చి, తన వీణను నా చేతిలో పెట్టి, ‘ఇక నా రెండవ జీవితం నీతోనే మొదలవ్వాలి...’ ,అని అన్నారు. ఆ మాటలు నేనెప్పటికీ మర్చిపోలేను. విజయవాడ ఎస్.ఆర్.ఆర్ కాలేజీ లో బి.కాం వరకూ చదువుకున్నాను. నాకు 23 ఏళ్ళ వయసు ఉండగా, సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా పాఠాలు చెప్తుండేవాడిని. ఆ సమయంలోనే 16 ఏళ్ళ వయసున్న మా మేనమామ కూతురు జయలక్ష్మితో పెద్దలు వివాహం జరిపించారు. అప్పటికే ఆమె తండ్రి పప్పు సోమేశ్వర్రావు గారి వద్ద వర్ణాల వరకూ నేర్చుకుంది.’ స్త్రీని వంటింటికే పరిమితం చెయ్యకూడదు. కళలు నేర్పి ప్రోత్సహించాలి, స్త్రీలు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. స్త్రీలు ఎప్పుడూ ఒకడుగు ముందుండాలి. వారికి బ్రతికే ధైర్యం ఇవ్వాలి.’ అన్న మా కుటుంబ సిద్ధాంతం ప్రకారం జయలక్ష్మికి వీణా వాదనలో శిక్షణ ఇచ్చాను. ఆమె ‘గాన విపంచి’గా బిరుదు పొందింది. మేమిరువురం జంటగా అనేక ప్రోగ్రాంలు ఇచ్చాము. వీణలోనే కాక వ్యక్తిగత జీవితంలోనూ, జయలక్ష్మి నా మనసున మనసై, మాకు ‘ఉత్తమ వీణ దంపతులు’ అన్న పేరు తెచ్చిపెట్టింది. సంగీతం అంటే పండితపామర రంజకంగా ఉండాలి. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చెయ్యాలి. అలౌకిక ఆనందం వైపు తీసుకుపోవాలి. మా వీణ పాడుతుంది, వీణకు ప్రాణం పోసి పాడించే మా పద్ధతిని ‘గాయక’ పధ్ధతి అంటారు. ఈ పధ్ధతి ద్వారానే మేము దేశ విదేశాల్లోని ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాం. మేము ప్రోగ్రాం ఇవ్వని రాష్ట్రం దేశంలో లేదు. అప్పట్లో ఒకమారు ‘సూరజ్ కుండ్’ అనే ప్రాంతంలో వీణ కార్యక్రమానికి వెళ్ళాము. అది గిరిజన ప్రాంతం. వాళ్లకు వీణ అంటేనే తెలియదు. కళాకారులు అడుగు పెట్టడానికి సైతం వెరచే ఆ ప్రాంతంలోకి మేము వెళ్లి, అక్కడ ప్రదర్శన ఇవ్వగానే, పామరులైన వారు పరవశించిపోయి, వారి ఉద్వేగాన్ని ఎలా తెలియచేయ్యాలో తెలియక, మాకు వీణ మాంత్రికులు’ అన్న పేరు పెట్టారు. నిష్కల్మషమైన వారి మనసులు రంజింప చేసినప్పుడు, వాళ్ళ కళ్ళలో, మాటల్లో కనిపించిన ఉద్వేగం అనిర్వచనీయం! ప్రతీ సంగీతజ్ఞుడిలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు కళాకారుడు, మరొకరు గురువు. ఒక కళాకారుడిగా నేను ప్రతీ ప్రధాన నగరంలో, దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి, అనేక అవార్డులు గెల్చుకున్నాను. 13 జాతీయ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. మద్రాస్ దూరదర్శన్ వారు రికార్డింగ్ లేకుండా ప్రసారం చేసిన మొదటి వీణ లైవ్ ప్రోగ్రాం నాదే! 1970 లో కొన్ని సినీ గీతాలకు వీణ వాయించాను. ప్రేమనగర్ చిత్రంలోని ‘ఎవరో రావాలి...’ , అమాయకురాలు చిత్రంలోని ‘పాడెద నీ నామమే...’ వంటి పాటలు అందులో కొన్ని. అనేక యక్షగానాలకు బాణీలు కూర్చాను. ఆల్ ఇండియా రేడియో లో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ ని. ఇంట్లో వాళ్ళు పొగిడే కంటే, బయటి వాళ్ళు పొగిడితే, ఎక్కువ ఆనందంగా ఉంటుంది. అలా నేను 1978 లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ లో వీణ వాయించి, ‘బెస్ట్ వీణ కాన్సెర్ట్’ అవార్డు పొందినప్పుడు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను. అలాగే 1980 లో ప్రతిష్టాత్మక మద్రాస్ శ్రీ కృష్ణ గాన సభ అవార్డు ను కూడా పొందాను. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సంగీత నాటక అకాడమీ పురస్కారం’ నాకు 2011 లో అందింది. ఇది వైణిక కళకు దక్కిన అరుదైన, అమూల్యమైన పురస్కారం. బెంగుళూరు లో జరిగిన ‘వీణీయ బెడగు’ అనే నాలుగు వీణ సాంప్రదాయాల సమ్మేళన కార్యక్రమంలో, విజయనగర ఆంధ్ర సాంప్రదాయానికి ప్రతినిధిగా పాల్గొన్నాను. మా కుటుంబ సంప్రదాయమైన మనోధర్మ సంగీతంలో నేను చేసిన ప్రయోగాలు నాకు పేరుప్రఖ్యాతుల్ని సంపాదించిపెట్టాయి. ‘నాదబంధం’ అనే సృజనాత్మక ప్రక్రియకు గాను, 83 లో ఆకాశవాణి జాతీయ అవార్డును గెల్చుకున్నాను. ఇందులో వాయిద్యం సంభాషిస్తున్నట్లుగా ఉండడం విశేషం. ‘త్యాగరాజ పంచరత్న ఊహా తరంగిణి’, ‘బ్రహ్మ’, ‘విశ్వ సంగీత పరిణామం’ వంటివి నేను సృష్టించిన మరికొన్ని సంగీత బాణీలు. ‘సునాద సుధానిధి’, ‘అనేక ‘వీణా వాద్య విద్యా విశారద’, ‘సంగీత విద్వన్మణి’, ‘మహతి కళానిధి (న్యూ జెర్సీ, అమెరికా) వంటి అనేక బిరుదులను అనేక సభల్లో పొందాను. చికాగో, పిట్స్ బెర్గ్, అట్లాంటా, డెట్రాయిట్ వంటి అమెరికా రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చాను. తానా, సప్నా, అజోవిభో కందాళం వంటి విదేశీ సంస్థల సన్మానాలు, బిరుదులూ అందుకున్నాను. విజయవాడ నృత్యరవళి వారు నన్ను సువర్ణ ఘంటా కంకణం తో సత్కరించారు. ఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి ఉగాది పురస్కారం, చికాగో లో భారతి తీర్ధ స్వామి గారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాను. 2011 లో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం, అదే సంవత్సరంలో కంచి కామకోటి పీఠం ‘ఆస్థాన విద్వాంసుడి’ గా పదవి అందుకున్నాను. 2012 లో రాష్ట్రపతి అవార్డును, రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాను. ఒక కళాకారుడిగా మా సాంప్రదాయం అందించిన కళను ఎన్నో విధాలుగా మెరుగుపరచి, కొత్త బాణీలు కట్టి, దేశవిదేశాల్లోని అనేక ప్రాంతాలకు వీణ మాధుర్యం పరిచయం చేసి, అనేక పురస్కారాలు గెల్చుకుని, మా నాన్నగారి ఆశలను ఫలవంతం చేసాను. ఇక గురువుగా కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చాను. 34 ఏళ్ళు వీణ నేర్పించే గురువుగా, ప్రిన్సిపాల్ గా అనేక ప్రభుత్వ సంగీత కళాశాలల్లో పని చేసాను. విజయవాడ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు, ప్రతీ కాలేజీ కి వెళ్లి, యాజమాన్యం తో మాట్లాడి, నేను, నా శ్రీమతి ఒక గంట ప్రదర్శన ఇచ్చేవాళ్ళం. అలా వందల్లో ఉన్న సంగీత విద్యార్ధుల సంఖ్య వేలకు పెరిగింది. నా ఉద్దేశంలో మనం విద్యను నేర్పిస్తున్నాం అంటే, ముందుగా మంచి శ్రోతల్ని తయారుచేస్తున్నాం. ఈ శ్రోతల్లో ఆసక్తి ఉండి, ఆ దిశగా మనసు లగ్నం చేసినవారు కళాకారులుగా, తర్వాత విద్వాంసులుగా ఎదుగుతారు. అలా గాత్రంలో, వీణలో అనేకమంది శిష్యులను తయారు చేసాం, ఇప్పటికీ చేస్తున్నాం. మా విద్యార్ధులు దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో, వివిధ గౌరవ పదవుల్లో రాణిస్తున్నారు. ఇది ‘గురువు’ స్థానంలో మా దంపతుల సమిష్టి విజయం. మా అమ్మాయి కళ్యాణి జోస్యుల , అబ్బాయి అయ్యగారి ఆదిత్య అమెరికాలో ఉంటారు. వారికి చదువుతో పాటు చిన్నప్పటి నుంచే వీణలో శిక్షణ ఇచ్చాము. మా అమ్మాయి ప్రస్తుతం న్యూ జెర్సీ లో అనేకమందికి వీణా వాదనలో శిక్షణ ఇస్తోంది. మా మనవడు తేజస్, చిన్నప్పటి నుంచే మా వద్ద వీణ నేర్చుకుని, ప్రస్తుతం అమెరికా లోని టాప్ కంపోసర్స్ లో ఒకడుగా ఉన్నాడు. మా ‘మనోధర్మ సంగీత’ వారసత్వమే వాడికీ అబ్బింది. ఇక మా మ నవరాళ్ళు లాస్య, శ్రియ, ఇద్దరూ, తల్లిదండ్రుల వద్ద, ఆన్లైన్ లో మా వద్ద వీణలో శిక్షణ పొందుతున్నారు. అద్భుతమైన వీణా వాదనా నిపుణతతో మా మనవరాళ్ళు ఇద్దరూ ప్రతీ సంవత్సరం క్లీవ్ ల్యాండ్ లో ప్రత్యేక జరిగే సభల్లో ప్రదర్శనలు ఇస్తుంటారు. అమెరికాలో సైతం వారు మా సాంప్రదాయాన్ని కొనసాగించడం చూస్తే, మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది.మా వైణీక సాంప్రదాయాన్ని, మా పిల్లలకు, మనవడు, మనవరాళ్ళకు పదిలంగా అందించగలిగినందుకు గర్విస్తున్నాం. అరవయ్యేళ్ళ ప్రస్థానం నాది. ప్రస్తుతం నా వయస్సు 66 ఏళ్ళు. లలిత కళలకు ఆదరణ మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో కూడా, వీణ అభ్యాసం పట్ల విద్యార్ధుల్లో ఆసక్తిని రేకెత్తించేలా చెయ్యగల ప్రత్యేక పధ్ధతి మాది. ఇప్పటికీ చిత్తశుద్ధితో వీణ, గాత్రం నేర్చుకోవాలని అనుకునేవారికి మా ఇంటి తలుపులు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాయి. మా చిరునామా…. అయ్యగారి శ్యామసుందరం , ఫ్లాట్ నెం. 102, రిషి రెసిడెన్సి, 2-2-185/63, స్ట్రీట్ నెం :12,సోమసుందర నగర్, బాగ్ అంబర్పేట్ , హైదరాబాద్ – 500013. ఫోన్ నెం. 040 27422411. httpv://www.youtube.com/watch? v=TNV0RQhzIdM httpv://www.youtube.com/watch? v=vo7Rj2ZTG18
No comments:
Post a Comment