శ్రీ అంటే అమృతం... శ్రీ అంటే విషం.... శ్రీ అంటే అలంకారం... శ్రీ అంటే మధురం... శ్రీ అంటే సంపద.... శ్రీ అంటే కీర్తి.... శ్రీ అంటే మోక్షం... శ్రీ అంటే బుద్ధి.... ఇలాంటి ఎన్నో అర్ధాలు తెలుగు నిఘంటువులో శ్రీ అనే పదానికి దొరుకుతాయి. అదే తెలుగు సాహిత్యం రెండు శ్రీలు చుట్టి... శ్రీశ్రీ అనగానే.... శ్రీశ్రీ అంటే కవిత్వం.... శ్రీశ్రీ అంటే నిప్పు.... శ్రీశ్రీ అంటే అరుణం... శ్రీశ్రీ అంటే అరుణోదయం.... శ్రీశ్రీ అంటే విప్లవం... శ్రీశ్రీ అంటే ధైర్యం... శ్రీశ్రీ అంటే తిరుగుబాటు... శ్రీశ్రీ అంటే ఆకలి... శ్రీశ్రీ అంటే కన్నీరు... వెరసి శ్రీశ్రీ అంటే సామాన్యుడి గుండె చప్పుడు. పేదోడి ఆస్థాన కవిగా మారి... విప్లవానికి మారు పేరుగా నిలిచిన మహాకవి శ్రీశ్రీ. తెలుగు సాహిత్యాన్ని నేను నడిపాను అని ప్రకటించుకున్న సాహితీ శకకర్త శ్రీశ్రీ. ప్రాసల పద ఘట్టనలతో కవిత్వాన్ని ముందుకు ఉరికించి.... రేపటి ప్రపంచాన్ని ఊహించిన క్రాంతదర్శి శ్రీశ్రీ. పదండి ముందుకు పదండి తోసుకు పోదాంపోదాం పైపైకి అంటూ... యావత్ జాతినీ ముందుకు ఉరికించారు. ఎక్కడో ఆకాశంలో ఉన్న సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువ చేశారు. నేను సైతం అంటూ.... తెలుగు కవితా మాతకు ఎర్రని కవితా మాలను కానుకగా సమర్పించారు. శ్రీశ్రీ జీవిత గమనాన్ని ఓ సారి పరిశీలిస్తే..... తెలుగు భాష గురించి ఏ మాత్రం పరిచయం ఉన్న వారికైనా శ్రీశ్రీ పేరు సుపరిచితమే. ఆయన రాసిన పదాలు వాడని పాత్రికేయుడు, పత్రికలు లేవంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకనర్హం అంటూ.... అన్నింటినీ కవితామయం చేసిన శ్రీశ్రీ... 1910 ఏప్రిల్ ౩౦న పూడిపెద్ది వెంకట రమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించారు. ( అనంతం పుస్తకంలో తన పుట్టినరోజు గురించి వివరణ ఇచ్చిన శ్రీశ్రీ తను ఏప్రిల్లో పుట్టానని, పాఠశాల అవసరం నిమిత్రం జనవరి 2 అని రాయించారని పేర్కొన్నారు. ). శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడు కావడం వల్ల ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. తెలుగు కవితను శాసించిన శ్రీశ్రీ అలా పూడిపెద్ది శ్రీనివాసరావు.... శ్రీరంగం శ్రీనివాసరావు అయ్యారు. అందులోంచి జనించిన శ్రీశ్రీ అనే రెండక్షరాలే తెలుగు సాహిత్య దిశను, దశను మార్చేశాయి.ఆయన ప్రతి పదం ముందుకు పదమంటూ ఉరికిస్తుంది. అన్యాయాల్ని ఎదిరిస్తుంది. రేపటికి భరోసా ఇస్తుంది. భవిష్యత్ కు దిశా నిర్దేశం చేస్తుంది. అలాంటి శ్రీశ్రీ మాటల్ని కొన్నింటిని గమనిస్తే.... ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం నాడే కాదు... నేటికీ జరుగుతున్న దోపిడీ ఇది. డబ్బు ఉన్న వాడిదే రాజ్యం. దోచుకున్న వాడిదే పెత్తనం. ఇది కాదు మనం కోరుకునే రేపటి ప్రపంచం. ముందడుగు వేసి దీన్ని మార్చండని శ్రీశ్రీ నాడే చెప్పారు. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్... అది మోసిన బోయీలెవ్వరు... తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు... ఇది కదా నిజమైన చరిత్ర. కష్టపడ్డ వాడికి ఫలితం దక్కాలి. రాలిన ప్రతి చెమట చుక్కకు గుర్తింపు దక్కాలి. ఈ విషయాన్ని శ్రీశ్రీ ఎలుగెత్తి చాటారు. చరిత్ర అంటే పాలకులు కాదు.. ప్రజలు అనే ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు. అంతేనా ఓ చోట యువశక్తిని ఆవిష్కరిస్తూ... కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులని శ్రమ చేయని యువతరాన్ని తన పదును తేలిన మాటలతో చెంప చెళ్ళుమనిపించారు. మరో చోట వ్యక్తికి బహువచనం శక్తి అంటూ అహం బ్రహ్మస్మి అనే సిద్ధాంతానికి తనదైన అర్ధం చెప్పారు. నిజమే ఒకడే ఉంటే వ్యక్తి. మరో మనిషి కలిస్తే పెరిగేది శక్తి. బహుశా ఐన్ స్టీన్ సిద్ధాంతం కూడా ఈ సూత్రం కంటే గొప్పది కాదేమో అంటారు కొందరు. అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ల హీనంగా చూడకు దేన్నీ కవితా మయమేనోయ్ అన్నీ కాదేదీ కవితకనర్హం అంటూ నవీన కవితకు నవ్య నిర్వచనం చెప్పారు. ఇప్పటికీ తెలుగు సాహిత్యం ఇదే బాటలో నడుస్తోంది. సినిమా రంగంలో శ్రీశ్రీ.... సాహిత్యంలోనే కాదు... సినిమా రంగంలోనూ శ్రీశ్రీ ముద్ర ప్రత్యేకమైనది. ఆర్థిక విలువలు మాత్రమే పాటించే సినిమా రంగానికి విలువైన సాహిత్యాన్ని అందించిన మహనీయుల్లో శ్రీశ్రీ పేరు మొదటి వరుసలో ఉంటుంది. తెలుగు పాటకు తొలి జాతీయ అవార్డును అందించింది శ్రీశ్రీ కలమే. తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా... దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా.... అంటూ అల్లూరి సీతారామరాజు సినిమాలో ప్రాసలతో కదం తొక్కారు. ఓ పదఘట్టనంగా పాటను తీర్చిదిద్ది, నేటికీ స్పూర్తిని రగిలిస్తూనే ఉన్నారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా నిజం మరచి నిదుర పోకుమా అంటూ భూమి కోసం సినిమాలో నీ కర్మకు నీవే బాధ్యుడవు అనే గొప్పసత్యాన్ని చిన్న చిన్న పదాల్లో ఆవిష్కరించారు. కలకానిది విలువైనది బతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు వెలుగు నీడలు సినిమాలో శ్రీశ్రీ రాసిన ఈ పాట వింటే చాలు ఎవరికైనా జీవితం విలువ తెలుస్తుంది. ఇలా అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ శ్రీశ్రీ ముద్ర ప్రత్యేకమైనది. తెలుగు సాహిత్యాన్ని నేను నడిపించాను అని చాటిన శ్రీశ్రీ లాంటి మహాకవులకు పుట్టినరోజులే తప్ప జయంతులు, వర్ధంతులు ఉండవు. తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం శ్రీశ్రీ కవిత్వం ఉంటుంది. శ్రీశ్రీ కవిత్వం ఉన్నంత కాలం ఆయన చిరంజీవిగానే ఉంటారు.
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
Share This
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment