భారతీయ చలనచిత్రం నూరేళ్ళ వేడుకలు జరుపుకొంటున్న సందర్భమిది. తెలుగు టాకీ పుట్టి ఎనభై మూడు వసంతాలు గడచిపోయాయి. ఈ ఎనిమిది దశాబ్దాల కాలంలో వేలాది సినిమాలు విడుదలయ్యాయి. ఎన్నో మార్పులు సంతరించు కొన్న తెలుగు సినిమా సంగీతం ఎన్నో మలుపులు తిరిగింది. ఎన్నో మజిలీలను దాటింది. ఈ సుదీర్ఘ కాల స్వరయానంలో తెలుగు సినిమా సంగీతం ఎంతో సాంకేతిక విజ్ఞానంతో ఎదిగిపోయి, తెలుగుపాటకి పట్టం కట్టి పల్లకీలో ఊరేగించింది. ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యుల నుండి మాన్యుల వరకు జనజీవన స్రవంతిలో తెలుగు సినీగీతం ఓ ప్రధాన రూపమై విరాజిల్లుతోంది. సినిమాకు పాట ప్రాణ స్థానమైనది. సినిమా లేని పాటలుండవచ్చు.. కానీ పాటలు లేని సినిమాను ఊహించుకోలేము. మూడు గంటల సినిమా గుర్తుండకపోవచ్చు...కానీ, మూడు నిమిషాల పాట మాత్రం తప్పకుండా ఎదలో ఎల్లప్పుడూ ధ్వనిస్తూనేవుంటుంది. తొలి రోజుల్లో 'సినిమా' ఒక వింత అయితే, పాటలు పాడడం ఒక విడ్డూరం ! తెలుగు భాషకి సంబంధించి 1931 లో టాకీల యుగం ప్రారంభమైంది. ఇంపీరియల్ కంపనీ ఆధ్వర్యాన హెచ్. ఎం. రెద్డ్డి గారి దర్శకత్వంలో తొలి తెలుగు టాకీ భక్త ప్రహలాద తయారైంది. ఈ చిత్రానికి పెట్టుబడి మాత్రం బొంబాయి వారిది. ఈ చిత్రానికి హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి సంగీత దర్శకత్వం వహించి తొలి తెలుగు సినీ స్వరకర్తగా గౌరవాన్ని దక్కించుకొన్నారు. అప్పుడాయన వయసు కేవలం 17 సంవత్సరాలే. ధర్మవరం రామకృష్ణాచార్య రచించిన 'సురభీ రంగస్థల నాటకం భక్త ప్రహలాద తొలి టాకీకి మాతృక. పద్మనాభ శాస్త్రి చాలా కాలం బొంబాయిలో గోవిందరావు తెంబే దగ్గర సహాయకుడిగా పనిచేశారు. బెంగాలీ సంగీత దర్శకుడు ఆర్. సి బోరల్ తో పని చేశారు. ఈ అనుభవంతో తొలి టాకీ చిత్రం భక్త ప్రహలాద కు సంగీతం అందించారు. తొలి టాకీ చిత్ర సంగీతం గురించి తెలుసుకొనే ముందు అసలు 'సినీ సంగీతమంటే ఏమిటో, అది శిద్ధ శాస్త్రీయ సంగీతానికి ఎలా విభిన్నమైనదో, ప్రత్యేక శఖగా ఎలా ఎదిగిందో, తదితర కారణాలను పర్యాలొకించాల్సివుంటుంది. భారతీయ సంగీతం దక్షిణాదిన కర్ణాటక సంగీతంగా ఉత్తరాదిన హిందుస్థానీ సంగీతంగా పరిఢవిల్లింది. స్వర, రగ, లయాదులలో, పండిత జనరంజకంగా, భక్తియే ప్రధాన లక్ష్యంగా శుద్ధ శాస్త్రీయ సంగీతం వికసించింది. త్యాగయ్య, తాన్సేన్ వంటి వాగ్గేయకారులు కృతులను రచించి, నిర్దుష్టమైన రాగలక్షణాలతో గానం చేసి, నాదోపాసనగా భగవదర్పితం చేశారు. వాగ్గేయకారుల రచనలను సుశాస్త్రీయంగా సంగీత మార్గంలో అధ్యయనం చేసి ప్రధాన లలితకళలలో ఒకటిగాస్థిరపరిచారు. పద, స్వర, రాగాదులలో ఎలాంటి సంకరము లేని ఈ శాస్త్రీయ సంగీతం శుద్ధగంగాజలం వలే స్వచ్చంగా వెలసింది. సినిమా కళారూపమైనప్పటికీ, దీని లక్ష్యం భగవదర్పితం కాదు. ఇది సమాజం కోసం. వినోద ప్రధానమైన తెలుగు సినిమాకి భూమిక వ్యాపారం. తమ పెట్టుబడి తిరిగి రావాలంటే, ప్రతీ అంశాన్నీ జనరంజకంగా మలచాలి. ప్రతీ ప్రేక్షకున్నీ మళ్ళీ మళ్ళీ రప్పించాలి. ఈ నేపధ్యంలో శుద్ధ శాస్త్రీయ సంగీతాన్ని సినిమాలో ప్రవేశ పెడితే, వ్యాపార లక్ష్యం నెరవేరదు. కాబట్టీ సనివేశాలు రక్తి కట్టడానికి, రసభావాలు నిష్పన్నం కావడానికి సంగీతాన్ని సినిమాకు అనుగుణంగా మలువడనికి, "సినీ సంగీతం" ఒక ఒక ప్రత్యేకాన్శంగా పరిగణింపబడింది. అలా అని సినీ సంగీతం శుద్ధ శాస్త్రీయ సంగీతనికి దూరం అనీ కాదు... సంధర్భాన్నిబట్టి , క్షేత్రయ్య, రామదాసు వంటి సంగీత ప్రధాన చిత్రాలలో శుద్ధ శాస్త్రీయ సంగీతానికే ప్రాధాన్యమీయ బడిన విషయాన్ని గ్రహించవచ్చు. తెలుగు సినీ సంగీత ప్రస్థానం భక్త ప్రహ్లాద (1931) చిత్రంతో మొదలైంది. ఈ చిత్రం కోసం రంగస్థల నాటకంలో వాడిన పాటలు, పద్యాలనే యధాతధంగా వాడారు..కారణం... ఆనాటి గ్రామోఫోను కంపనీలు. ఆ రోజుల్లో గ్రామోఫోను కంపనీ వారు, దేశమంతటా పర్యటిస్తూ, ప్రఖ్యాత గాయనీ గాయకులతో పాటలూ, పద్యాలూ పాడిస్తూ రికార్డులుగా వెలువరించి అమ్మకాలతో లాభాలు గడించ సాగారు. రంగస్థల నాటకాలను కూడా రికార్డులుగా చేసి విడుదల చేసేవారు. ఈ రికార్డులను ప్రజలు కొని, భద్రంగా దాచుకొనేవారు. 1931-1940 మధ్య రైల్వేస్టేషన్లలో బండి ఆగినపుడు, పెట్టె పెట్టెకూ తిరిగి గ్రాంఫోన్ రికార్డులను అమ్మేవారు. ఇవి జనాదరణ పొందేవి. ఈ కారణంగా ఈ రికార్డులనే తిరిగి సినిమాలలో వుపయోగించేవరు. 1933 వరకల్లా నిర్మాతలు, తమ సినిమాల కోసం గాయనీ గాయకులతో పాటలు, పద్యాలు పాడించి రికార్డులుగా విడుదల చేయటం ప్రారంభించారు. తమ సినిమా రికార్డుల గురించి ఇళ్ళల్లో కరపత్రాలు పంచుతూ బ్యాండు మేళం తోడు రాగా, బండ్లపైన పెట్టుకొని వీధి, వీధి తిరిగుతూ ప్రజలనాకర్షించేవారు. ఆ విధంగా సావిత్రి(1932), లవకుశ (1934), శ్రీ కృష్ణ లీలలు (1936), విప్రనారాయణ (1937) మొదలైన సినిమాల తాలూకు గ్రాంఫోను రికార్డులను సంగీత ప్రియులు కొనుగోలు చేసి పదే పదే విని ఆనందించేవారు. దాంతో ఆయా సినిమాలను వెండి తెర పై చూడాలన్న కోరిక గలిగి, సినిమా హాళ్ళ వైపు జనం పరుగెత్తేవారు. గ్రాంఫోను కంపనీ వారు సొంతంగా రికార్డింగ్ స్టూడియోలు పెట్టుకొని, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్కెస్ట్రా, గాయనీ గాయకులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకొనేవారు. వీరందరికీ నెలసరి జీతాలిచ్చే వారు. ఒక కంపనీకి పని చేసే వారు, పాడే వారు వేరొక కంపనీ లో పాడకూడదన్న నిబంధనలుండేవి. సినిమాలు నిర్మించే వారికి సొంత రికార్డింగ్ స్టూడియోలు ఉండేవి కావు. షూటింగ్ జరిగినపుడే, ఆయా నటీ నటులు తమ పాటలు పాడుకొనే వారు. కామెరా ఫ్రేం లో కనిపించకుండా ఒక ట్రాలీని వుంచి, ఆ ట్రాలీ పై వాయిద్యకారులు కూర్చొని వాయిస్తూ ఉంటే విని, నటీ నటులు పాడేవారు. పాట శబ్దాన్ని గాయనీ గాయకుల శబ్దాన్ని ఒకే మైకు ద్వారా రికార్డు చేసే వారు. అంటే బొమ్మ తీయడం, పాట రికార్డు చేయడం ఒకే మారు జరిగేదన్న మాట. అవుట్ డోర్ లో అయితే కాకుల అరుపులు, ఇతర శబ్దాలు, జనం కేకలు, రణగొణ ధ్వనులుగా చుట్టు వినబడుతూ ఉండేవి. దాంతో నిర్మాతలు తమ చిత్రాలలోని పాటలను గ్రాంఫోన్ కంపనీల స్టూడియోలలో రికార్డు చేసుకొనేవారు. ఇలా సాంకేతికంగా ఎన్నో తిప్పలు పడినప్పటికీ సినీ సంగీతాన్ని జనాకర్షకంగా తయారు చేయలన్న తపన 1934 నుండే మొదలయింది. లవకుశ (1934) చిత్రంలో సంగీతదర్శకుడు ప్రభల సత్యనారాయణ రంగస్థల నాటకాలకు భిణ్ణంగా, సంగీతాన్ని రూపొందించారు. "పున్నెం తప్ప అన్నెమెరుగని ఆలిని, నిండుచూలాలిని, అడవి పాల్జేసినావే? రాముడా, దేముడా"అని సీత ఏడుస్తూ పాడిన పాట, అశ్వమేధాశ్వాన్ని పట్టిన లవకుశల అహంకరింపు, శతృఘ్న, లక్ష్మణుల బెదిరింపు, రామకధా గానం మొదలైన పాటలన్ని ప్రజల హృదయాల్లో తిష్ఠ వేశాయి. సినిమాలకు ప్రత్యేకంగా పాటలు రాయించి, స్వరపరచి, రంగస్థల నాటక సంగీతం నుండీ సినిమా సంగీతాన్ని పూర్తిగా వేరు చేసిన ఖ్యాతి గాలి పెంచల నరసిమ్హారావు గారికి దక్కుతుంది. కర్నాటక హిందుస్తానీ సంగీతాల్లో నిష్ణాతులైన నరసిమ్హారావు గారు, సీతకళ్యాణం(1934), శ్రీ కృష్ణ లీలలు (1935), శశిరేఖా పరిణయం (1936), మై రావణ (1939), కృష్ణ ప్రేమ(1943), మాయాలోకం (1945), బాలరాజు(1945), పల్నాటి యుద్ధం (1947), ధర్మాంగధ (1949) మొదలైన చిత్రాలకు సంగీతం అందించారు. శ్రీ కృష్ణ లీలలు చిత్రం ద్వారానే సాలూరు రాజేశ్వరరావు గారు పరిచయం అయ్యారు. శశిరేఖా పరిణయం చిత్రంలో "వివహ భోజనంబు" పాటను లాటిన్ అమెరికన్ ధోరణి లో స్వరపరచి హిట్ చేసారు. చుండూరు సత్యనారాయణ గారు (తులాభారం, సతీ సక్కుబాయి) తో పాటు మహారాష్ట్రకు చెందిన అన్నాసాహెబ్ మణికర్, గోవిందరావు టెంబె మొదలగువారు మరాఠీ ట్యూన్లను ద్రౌపదీ వస్త్రాపహరణం మొదలైన చిత్రాలలో ప్రవేశపెట్టారు. రోహిణి వారి గృహలక్ష్మి (1938) చిత్రం లోని పాటలు తెలుగు వారి ఆదరణకు పాత్రమైనవి. ప్రభల సత్యనారాయణ స్వరపరచగా కాంచనమాల పాడిన 'బిగి కౌగిలి ', నాగయ్య గారు పాడిన 'కల్లు మానండోయి ', కన్నాంబ ఆలపించిన 'సగము రతిరాయెనే ' పాటలను ప్రజలు ఎంతో ఆదరించారు. సినిమా సంగీతానికి కొత్త ఒరవడిని, సినిమా పాటలకు కొత్త వరుసలను, సృష్టించి తెలుగు సినీ సంగీతాన్ని మరో మలుపు తిప్పిన ఖ్యాతి భీమవరపు నరసిమ్హారావు గారికి దక్కుతుంది. సతీ తులసి (1936) చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయమైన బి. ఎన్. ఆర్., కనకతార (1937), రుక్మాంగధ (1937), మాలపిల్ల (1938), రైతుబిడ్డ(1939), మీరాబాయి (1940), అపవాద (1941), భాగ్యలక్ష్మి (1943), అర్ధాంగి (1945) మొదలైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 1938 లో విడుదలైన మాలపిల్ల బి. ఎన్. ఆర్. కెరీర్నే కాదు తెలుగు సినిమా సంగీత రీతుల్నే మార్చి పాడేసింది. తొలిసారిగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రవేశ పెట్టారు. బసవరాజు అప్పారావు ఎప్పుడో రాసిన 'కొల్లాయి గట్టితేనేమి ', ‘నల్లవాడే గొల్ల పిల్లవాడే ', మొదలైన పాటలను భావస్ఫోరకంగా స్వరపరచి సంచలనం సృష్టించారు. సంగీతం రాని వారు, తెలియని వారు కూడా వేళ్ళతో చిటికలు వేసుకొంటూ 'నల్ల వాడే ' పాటను పాడే వారు. ప్రజల పెదవుల పైకి పాటను తెప్పించిన ఖ్యాతి భీమవరపు నరసిమ్హా రావు గారికే దక్కుతుంది. బి. ఎన్. ఆర్. మార్గాన్నే చిత్తూరు వి నాగయ్య అనుసన్రించారు. బెంగాలీ, మరాఠీ, హిందీ, ట్యూన్ల తో బాటు విదేశీ సంగీతాన్ని తీసుకొని తెలుగు సంగీతాన్ని లలితంగా భావప్రాధాన్యం తో కూడిన విధంగా స్వరపరచినారు. వందేమాతరం (1939), సుమంగళి (1940) చిత్రాలకు నాగయ్య అందించిన సంగీతం ఆబాలగోపాలాన్ని ఆకట్టుకొన్నది. అంతే కాదు హిట్టైన హిందీ సినిమా పాటల ట్యూనులను యధాతధంగా తెలుగులోకి తీసుకోవడం 1939 నుండీ ఎక్కువ మొదలైయింది. వందేమాతరం చిత్రం లోని "పూలో పూలో " పాట వరుసను 1938 సంవత్సరంలో హిందీలో దాదా చాందేకర్ స్వరపరచిన 'బ్రహ్మచారి ' చిత్రం లోని "లేలో లేలో " పాటను తీసుకొన్నారు. 1939 లో ఓగిరాల రామచంద్ర రావు 'మళ్ళీ పెళ్ళి ' చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. పురుష పాత్రకు నేపధ్య గానం (ప్లేబ్యాక్) అనేది ఈ చిత్రం తోనే మొదలైంది. అందులో వై.వీ రావుకు ఓగిరాల పాడారు (నా సురుచిర సుందర రూపా), శ్రీ వేంకటేశ్వరమహత్యం (1939), సీతారామ జననం (1943), స్వర్గ సీమ (1945), యోగి వేమన (1947), గుణసుందరి కధ (1949), పెద్ద మనుషులు (1954) మొదలైన చిత్రాలకు ఓగిరాల అందించిన సంగీతం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఓగిరాల వారి ప్రవేశంతో తెలుగు సినిమా సంగీతంలో వైబ్రోఫోన్ వంటి పాశ్చాత్య వాద్యాలకు చోటు దక్కింది. శ్రీ కృష్ణ లీలలు (1935) చిత్రం ద్వారా బాల నటుడిగా, గాయకునిగా ప్రవేశించిన సాలూరు రాజేశ్వర రావు జయప్రద (1939) చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా ప్రవేశించి సినీ సంగీత గతిని మరో వైపు తిప్పి ప్రగతి పధంలోకి మళ్ళించారు. 1950 వరకు జెమిని స్టూడియోస్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. చంద్రలేఖ, మల్లీశ్వరి (1951), విప్రనారాయణ (1951), మొదలగు దాదాపు 150 చిత్రాలకు పని చేసి ట్రెండ్ సెట్టర్ అయ్యారు. తెలుగు సినీ సంగీతం నుండి లలిత సంగీతాన్ని వేరు చేసి ఎన్నో ప్రైవేటు పాటలను గ్రాంఫోన్ కంపనీల కోసం, ఆకాశవాని కోసం ఆలపించి, రెండు రకాల సంగీతాలకు స్పష్టంగా రూపమిచ్చిన ఘనత సాలూరు వారిదే. 1931 నుండి 1939 వరకు తెలుగు సినీ సంగీతం క్రమంగా చివురులు తొడిగి, మొగ్గలేసింది. హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి పాదు వేస్తే, ప్రభల నీరు పోస్తే బీ. ఎన్. ఆర్, ఓగిరాల, నాగయ్య కాపుకాయగా, గాలిపెంచల, సాలురు రాజేశ్వర రావు నవస్వర పుష్పాలను వికసింపజేసారు. 1940 దశకంలో తెలుగు సినీ సంగీతానికి దశా దిశ ఏర్పడినది. మరి కొంత మంది సంగీత దర్శకులు ప్రవేశించారు. తెలుగు సినీ సంగీతాన్ని కొత్త మార్గం పట్టించారు. (సశేషం) డా. వి.వి రామారావు. సింగర్ & మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఏ.పీహెచ్ డీ
No comments:
Post a Comment