భైరవ కోన (జానపద నవల- మొదటి భాగం) - రచన :భావరాజు పద్మిని - అచ్చంగా తెలుగు

భైరవ కోన (జానపద నవల- మొదటి భాగం) - రచన :భావరాజు పద్మిని

Share This
ప్రకృతి ఒడిలో పరవశింపజేసే సువిశాల సామ్రాజ్యం, భైరవపురం.... కంచుకోట వంటి ఆ సామ్రాజ్యంలో ఆకాశాన్నంటే మూడు కొండల నడుమ ఉన్న అందమైన కొనలోని సుందర ఆశ్రమం .... ఆ మూడు కొండల్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కొండలు అంటారు. భైరవుడు క్షేత్రపాలకుడిగా కల ఆ ప్రాంతాన్ని భైరవ కోన అంటారు. పచ్చటి కొండల నుంచి జలజలా జాలువారే జలపాతాలు, కొండ గుహలు, సుందర వనాలు, నిర్భయంగా సంచరించే లేళ్ళు, శుకపికాల కలరవాలు, పురివిప్పి ఆడే మయూరాలు ప్రకృతి అందాలు కనువిందు చేసే ప్రాంతం అది. అక్కడ క్రూర మృగాలు సైతం తమ జాతి వైరాలు మరచి సాధుభావంతో ఉంటాయి. చక్కటి లతలు అల్లిన మునివాటికలో ఏకాంతంలో ధ్యానమగ్నమై ఉన్నారు సదానందమహర్షి. ప్రశాంతంగా ఉన్న ఆయన వదనం నిశ్చల సరోవరాన్ని తలపిస్తోంది. నుదిటిపై త్రిపుండాలతో ప్రత్యక్ష పరమేశ్వరుడిలా ఉన్నారు ఆయన. అలౌకికమైన ఆనందం ఆయన ముఖంలో ప్రస్ఫుటమౌతోంది. నెమ్మదిగా ఆయన్ను సమీపించాడు రాకుమారుడు విజయుడు. విజయుడి రాకను తెలుసుకున్న మహర్షి, నెమ్మదిగా కనులు తెరిచి, ‘రా నాయనా! కూర్చో ’ అంటూ వాత్సల్యంగా ఆహ్వానించారు. విజయుడు మహర్షికి వినమ్రంగా నమస్కరించి కూర్చున్నాడు. విజయుడి ముఖంలో సందేహ ఛాయలు గమనించిన ముని, ‘సంకోచిస్తావెందుకు, నీ మనసులోని సందేహం వెల్లడించు,’ అన్నారు. విజయుడు కాస్త తటపటాయించి, ‘గురువర్యా! కొనలో ఉన్న గుహ్యమైన గుహలోని భైరవ, భైరవి విగ్రహాలను రేపు వెళ్లి పూజించి వద్దామని చెప్పారు. అసలు భైరవుడు ఎవరు ? భైరవ ఆరాధన ఎందుకు చెయ్యాలి ?దయుంచి తెలుపగలరు, ’ అని అడిగాడు. సదానందమహర్షి పున్నమి వెన్నెల కాసినట్టు నవ్వి, ఇలా చెప్పసాగారు... ‘నాయనా! పూర్వం ఒకప్పుడు బ్రహ్మ ,విష్ణువులకు తమ ఆధిపత్యం గురించిన వివాదం చెలరేగింది. ‘తాను గొప్ప’ అన్నాడు బ్రహ్మ, ‘తానే గొప్ప’ అన్నాడు విష్ణువు. వారిలా కలహిస్తూ ఉండగా, వారి మధ్య ఒక జ్యోతిస్థంభం ఆవిర్భవించింది. ఆ జ్యోతి మొదలును తెలుసుకునేందుకు బ్రహ్మ, చివరను తెలుసుకునేందుకు విష్ణువు బయలుదేరారు. ఆద్యంతాలు లేని దివ్య జ్యోతిర్లింగం అది. ఆ జ్యోతి యొక్క అంతాన్ని తెలుసుకోలేని విష్ణువు, ఆదిని కనుగొనలేని బ్రహ్మ అసహాయంగా వెనుదిరిగి వచ్చారు. అప్పుడు పరమశివుడు నిజరూపంతో ప్రత్యక్షం అవ్వగా, విష్ణువు శివుడిని స్తుతించి శరణు కోరతాడు. బ్రహ్మ అహంకరించి, ‘’పూర్వం నువ్వు నా ఫాలభాగం నుండి పుట్టావు ,నన్ను శరణు వేడు నేను నిన్ను రక్షిస్తా‘’అని గర్వంగా అన్నాడు . అప్పుడు కోపంతో శివుడు తన నుంచి ఒక భైరవాకారాన్ని సృష్టించాడు. భైరవుడు తన ఎడమ చేతి బొటన వ్రేలి తో బ్రహ్మ ఐదో తలను గిల్లి వేశాడు. బ్రహ్మకు వెంటనే అహం అణిగి, శతరుద్రీయం తో శివుని స్తుతించి ప్రసన్నం చేసుకున్నాడు. అలా ఆవిర్భవించిన భైరవుడితో శివుడు, ‘‘’నువ్వు ఈ ప్రపంచాన్ని భరించే శక్తి కల వాడివి .నిన్ను ‘’పాప భక్షకుడు ‘’అని పిలుస్తారు. కాశీలోనే నీ ఉనికి; కాలమే నిన్ను చూసి భయపడే కాల భైరవుడివి నీవు, యజ్ఞాలలో మాన్యత్వాన్ని పొందుతావు” అన్నాడు. కాబట్టి , కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. సాధారణంగా అంతా 'కాలభైరవ'లోని 'కాల' పదాన్ని నలుపుగా, 'కాలభైరవుని' నల్లటి భైరవునిగా లేదా భయంకరమైన రూపంగా భావిస్తారు. కాలభైరవుడు అంటే శక్తి భైరవునికి (శివునికి) ప్రతిరూపం, ఈ దేవుడు కాలాన్ని, దాని శక్తిని నియంత్రించగల్గుతాడు. కనుక కాలభైరవుడంటే కాలాన్ని అధీనంలో వుంచుకునే కాల చక్ర భైరవుడు అని అర్థం. ఈయన కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోథ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంబర భైరవుడు అని 8 రకాలు. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. ఈయన వాహనం శునకం. శునకం అంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. ప్రజల బాగోగులు, యోగక్షేమాలు కనిపెట్టుకుని చూసే వాడు, తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే కర్తవ్యమని భావించేవాడు కాలభైరవుడు. ఈయన ఆపడానికి వీల్లేనివిధంగా నిరంతరం పురోగమిస్తుంటాడు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, పూర్తి భక్తిశ్రద్ధలతో కాల భైరవ స్వరూపుని వేడుకున్నట్లయితే ఆ దివ్య శక్తి నిరంతరం కనిపెట్టుకుని వుండి కాపాడుతుంది. అంతే కాదు, కాల భైరవుడు ఈ క్షేత్ర పాలకుడు, అంటే, ఈ ప్రాంతాన్ని రక్షించే కాపలాదారు. గ్రామ నగర రక్షకుడిగా, మంత్ర శాస్త్ర వ్యాఖ్యాతగా, తంత్ర మూర్తిగా ఉంటాడు భైరవుడు. మంత్ర తంత్ర సాధనల్లో ఏం సాధించాలన్నా ముందు ఆయన అనుమతి తీసుకుంటారు. భైరవోపాసన రక్షాకరం, శీఘ్ర సిద్ధి ప్రదం. ఆయన సాధనతో అనేక మంత్రాలు సిద్దిస్తాయి. దేశాన్ని, దేశప్రజలను కూడా రక్షించగల శక్తిసంపన్నుడు భైరవుడు. ఈ భైరవపురానికి కాబోయే రాజుగా నీవు ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి. అందుకే మనం రేపు ఆ గుప్తకోనలోని భైరవ ఆలయానికి వెళ్ళాలని ఆజ్ఞాపించాను” అంటూ ముగించారు మహర్షి. ‘తమరి ఆజ్ఞ శిరోధార్యం మహర్షీ! అంటూ నమస్కరించి నిష్క్రమించాడు విజయుడు. మర్నాడు ఉదయం మహర్షితో కలిసి భైరవ ఆరాధనకై అడవిలో ప్రయాణించ సాగాడు విజయుడు. అందమైన జలపాతం... జలపాతం వెనుక ఒక అద్భుతమైన గుహ ఉంది ... ఆ గుహకు చేరుకోవాలంటే అర్ధ గంట సమయం మోకాలి లోతు నీటిలో పయనించాలి. అక్కడి ప్రకృతి రమణీయతనూ, పక్షుల కూజితాలనూ, జలపాత సౌందర్యాన్ని తిలకిస్తూ మైమరచిపోయి నడుస్తున్నాడు విజయుడు. ఇంతలో దిక్కులు పిక్కటిల్లేలా వినిపించింది ఒక వికటాట్టహాసం... (సశేషం...)

No comments:

Post a Comment

Pages