జ్ఞానులు రాజగురువులు - రచన :డా. బి.వి.పట్టాభిరాం - అచ్చంగా తెలుగు

జ్ఞానులు రాజగురువులు - రచన :డా. బి.వి.పట్టాభిరాం

Share This
జ్ఞానులు రాజగురువులు
 - డా. బి.వి.పట్టాభిరాం 

అతీంద్రియ శక్తులు ఏ ఒక్క దేశానికో, వర్గానికో, కాలానికో పరిమితవైనవి కావని చరిత్ర విశదం చేస్తున్నది. అధ్భుతశక్తులు కలిగిన మహనీయుల ప్రస్తావన పురాణాలాలోనే గాక చరిత్ర గ్రంధాలలో కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు రాజాస్థానాలలో రాజగురువులు ఉండేవారు.జ్ఞానులైన మరికొందరు మహానుభావులు జనావాసాలు విడిచి ఏ అరణ్యాల మధ్యనో తపస్సు చేస్తూ తమ శక్తులను పెంపొందించుకునేవారు. అలా అడవులలో ఉండేవారు కూడా మానవాళి శ్రేయస్సుకోసం అవసరమైనప్పుడు పాలకులకు, పాలితులకు కూడా తగిన సలహాలు ఇస్తుండేవారు. "దివ్యదృష్టి" లాంటి అధ్భుత శక్తులు వారికి సామాన్య విషయాలుగా ఉండేవి. కాల క్రమాన రాజగురు పదవులకు అనర్హుల నియామకం జరిగి, ఆ వ్యవస్థ అపఖ్యాతిపాలై పోయింది. మన దేశంలోనే కాదు, ఇతర దేశాలలోనూ ఇదే పరిణమం కనిపిస్తుంది. క్రీస్తుశకం 96 లో రోమన్ చక్రవర్తి డోమిటియన్ కు ఆతని గురువు ఒక హెచ్చరిక చేశాడు. చక్రవర్తి వయసులో బాగా చిన్నవాడు కనుక శతృవులు చంపడానికి ప్రయత్నిస్తున్నారనీ, సెప్టెంబర్ 16వ తేది ఉదయం అయిదు గంటలకు అతనికి గండం ఉన్నదనీ, కాని అది తప్పించుకుంటే జీవితం నిరాటంకంగా సాగుతుందనీ ఆయన హెచ్చరిక. చక్రవర్తి తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. తన చుట్టూ ఉండేవాళ్ళ చర్యలను కనిపెట్టడానికి గూఢచారులను నియమించాడు. సెప్టెంబర్ 17వ తేది రాత్రి తన మందిరం చుట్టూ సాయుధ దళాలను నియమించి, పడకగదిలో తన అనుచరుడిని తప్ప మరెవరినీ ఉంచక నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం మూడు గంటలకల్లా లేచి తన అనుచరుడితో అయిదు గంటల అయిన తరవాత తనకు చెప్పమన్నాడు. ఈలోగా తనకు మరణం సంభవిస్తే కొత్త రాజు తన శరీరాన్ని ఏం చేయాలో వ్రాసి ఉంచాడు. మరికొంచం సేపటికి అనుచరుడు అయిదు దాటిందని చెప్పాడు. ఉత్సాహంతో చక్రవర్తి లేచి కాలకృత్యాలకు వెళ్ళగనే పొంచివున్న శతృవులు అతణ్ణి పొడిచి చంపారు. అనుచరుడు సతృవులతో చేరిపోయి చక్రవర్తికి సమయం కూడా తప్పు చెప్పాడు. గండం గడిచిందనే ఉత్సాహంతో చక్రవర్తి కాపలా సడలించుకొని మరణం పాలైనాడు. ఫ్రాన్సుకు చెందిన రెండవ హెన్రీ రాజు ఒక నాడు "నాస్ట్రాడమన్" అనే మహా జ్ఞానిని పిలిపించి, తన ముగ్గురు కొడుకుల భవిష్యత్తు తెలుపమని కోరాడు. రెండు నిమిషాలు జ్ఞాన సమాధిలోకి పోయిన అనంతరం అతను రాజుతో ముగ్గురు కొడుకులో రాజ్యాన్ని ఏలుతారని చెప్పాడు. అది విన్న రాజాస్థానంలోని సభికులు ఘొల్లున నవ్వారు. ముగ్గురు కొడుకులో రాజ్యం ఎలా ఏలుతారు? ఆ హక్కు పెద్ద కొడుకుకు మాత్రమే ఉంది, కాబట్టి జ్ఞాని కేవలం మహారాజును, రాణిని మాటలతో సంతోషపెట్టి మాన్యాలు కొట్టుకు పోవాలనే దురుద్దేశ్యంతో చెప్పాడని కొందరు ఆరోపించారు. కాని కొన్నేళ్ళకు జ్ఞాని చెప్పినట్లే జరిగింది. రాజుగారి పెద్ద కొడుకు రెండవ ఫ్రాన్సిస్ పట్టాభిషిక్తుడైనకొద్ది కాలంలోనే మరణించాడు. అప్పుడు రెండవ కొడుకు తొమ్మదవ ఛార్లెస్ రాజై తన ఇరవైనాలుగవ సంవత్సరంలో జబ్బుపడి మరణించాడు. మూడవ కొడుకు మూడవ హెన్రీ రాజ్యం చేపట్టి పదిహేను సంవత్సరాలు పాలించాడు. అంటే, జ్ఞాని చెప్పినట్లుగా ముగ్గురు కొడుకులూ రాజ్యాన్ని ఏలారు. అతీంద్రియ శక్తులపై విపరీతమైన నమ్మకం ఉన్న హిట్లర్ తన వద్ద జ్యోతిషం, భవిష్యత్తు తెలిపే యూరి యమాఖిన్ అనే ఒక వ్యక్తిని నియమించుకుని అనుక్షణం అతని సలహాలు పొందుతూ ఉండేవాడు. స్టాలిన్ అనంతరం అధికారంలోకి వచ్చిన కృశ్చేవ్, యూరిని చేరదీశాడని హెర్బర్ట్ బి. గ్రీన్ హౌస్ అనే రచయిత వ్రాసాడు. అలెగ్జాండరు చక్రవర్తి తన ఆస్థానంలో కొంతమంది జ్ఞానులను నియమించి, వారిద్వారా జరగబోయే విషయాలను తెలుసుకునేవాడు. విరామ సమయాల్లో వారితో చర్చిస్తూ తన జ్ఞానాన్ని పెంపొందించుకునేవాడు.జరగబోయే విషయాలను కొన్నింటిని అలెగ్జాండర్ స్వయంగా ముందుగానే స్వప్నం ద్వారా తెలుసుకొనె, తన సభలో ప్రకటించేవాడు. తరవాత అది నిజమవటం ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది. ఒకప్పటి అమెరికా అధ్యక్షులు అబ్రహం లింకన్, జాన్ కెన్నడీ లకు కూడా అతీంద్రియ శక్తులపై అమితమైన విశ్వాసం ఉండేది. వారు ఏ కార్యం నిర్వహించబోయినా అనధికారికంగా ముందు తమ గురువు అనబడే జ్ఞానులతో సలహా సంప్రదింపులు జరిపేవారు. వారిద్దరికీ తమ చావు దగ్గర పడిందని ముందుగా తెలుసుననీ, అత్మీయులకు ఆ సంగతి చెప్పుకున్నారనీ తర్వాత వెల్లడయింది. సుప్రసిధ్ధ తత్వవేత్త పాటో అతీంద్రియ శక్తులున్నాయని విశ్వసించాడు. ఆయన స్వయంగా కొన్ని పరిశోధనలు చేసి ఫలితాలను సాధించాడు. సోక్రటీసు తన మృత్యువు గురించి మూడు రోజులు ముందే తెలుసుకున్నాడు. భూమ్యాకర్షణ శక్తి సిధ్ధాంతాన్ని ప్రకటించిన సర్ ఐజాక్ న్యూటన్ అతీంద్రియ శక్తులపై తనకున్న గాఢమైన నమ్మకాన్ని తోటి వారితో చాలాసార్లు వ్యక్తపరిచాడు. తన సిధ్ధాంతాం నిజంగా తాను కనిపెట్టినది కాదని, ఒక అధ్భుత శక్తి తనకు చెప్పగా తాను కేవలం నిమిత్త మాత్రుడుగా వ్యవహిరించాననీ ప్రకటించాడు. సుప్రసిధ్ధ మనస్తత్వ శాస్త్రవేత్త ఫ్రాయిడ్ కి అతీంద్రియ శక్తులపై అచంచలమైన విశ్వాసం ఉండేదట. ఒక ప్రకటన్లో తన తరువాత జన్మలో ఇ. ఎస్.పి పై పరిశోధనలు జరుపుతాననీ, ఆ శక్తుల పరిశోధనకు తన జీవితం అంకితం చేస్తాననీ అన్నాడు. అల్బర్ట్ ఐన్ స్టీన్ కి ఇటువంటి శక్తులున్న వారంటే ఎంతో గురి. అతీంద్రియ శక్తులు ఉన్నవారిని ఆయన కలుసుకునేవాడు. పరిశోధనలు జరిపేవాడు. ఒకప్పటి ఇంగ్లండు ప్రధానమంత్రి విలియం గ్లాడ్ స్టన్ అతీంద్రియ శక్తుల సాధనకు ఎంతో కృషిచేశాడు. ఆయన సొసైటి ఫర్ సైకికల్ రిసెర్చి లో మెంబరుగా కూడా ఉన్నారు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి మొదలైన మహనీయుల జీవిత చరిత్రలు చూస్తే అధ్భుత సంఘటన లెన్నో తరచూ జరగడాన్ని గమనించవచ్చు. 
(డా.బి.వి.పట్టాభిరాం గారి ‘అద్భుత ప్రపంచం’ అనే పుస్తకం నుంచి...)

No comments:

Post a Comment

Pages