భాష్పాభిషేకం
జోగారావు వెంకట రామ సంభర
" ఏంవోయ్! నాకు ఉద్యోగం వచ్చింది" ఉదయమే శ్రీ గంగా పరమేశ్వరీ దేవాలయంలో లలితా సహస్రనామ పారాయణం చేసి అక్కడి పూజారి శ్రీనివాస సురేష భట్టారకుల వారు అందచేసిన పుష్పమును పూజామందిరములో ఉంచి, కట్టుకున్న పట్టు పంచె ఉత్తరీయమును మార్చుకోవడానికి తన గదిలోకి వెడుతూ గట్టిగా అన్నాడు ప్రసాద్ అనబడే ప్రసాద రావు . " అమ్మయ్య! నా ప్రార్ధనలు ఫలించాయి మాట. కాఫీ తెస్తున్నాను. " అంది వంట గదిలోనుండి పూజ. "ఆంటీ! అంకుల్ కి వచ్చే మొదటి జీతంలో నాకు కొత్త డ్రెస్ కొని ఇవ్వాలి" ఉత్సాహంగా అంది పింకీ. పింకీ వారింటి పని పిల్ల. ఏం ? పని పిల్లలకు మాత్రం పింకీ, స్వీటీ అనే పేర్లు ఉండ కూడదా? "సరే లేవే! ముందు అర్చన గది, తరువాత అభిషేక్ గది శుభ్రం చేయి" అంది పూజ. ప్రసాద్ తన గది లోకి వెళ్ళి కట్టుకున్న పట్టు పంచే, ఉత్తరీయం విప్పి చక్కగా మడతలు పెట్టి బీరువాలో పెట్టుకుని అభిషేక్ వాడి పడేసిన బెర్ముడా, టీ షర్ట్ వేసుకుని హాల్లో కూర్చున్నాడు. అప్పటికి తొమ్మిది గంటల సమయమయ్యింది. కాఫీతో పాటు లోసార్ టేబ్లెట్ వేసు కున్న ప్రసాద్ తన భార్య పూజ అడగబోయే ప్రశ్నలకు తయారవుతున్నాడు. " మీరు చేస్తున్న పూజలకు అమ్మవారు కరుణించింది మాట!" పూజ మాటలకు అడ్డు తగులుతూ, "అమ్మవారు కరుణించిందో అయ్యవారు కటాక్షించేరో తెలియదు కాని ..." అర్చన గది శుభ్రం చేస్తోందన్న మాటే గాని పూజ ప్రసాద్ ల సంభాషణ వినడానికి కుతూహలంగా ఉంది పింకీకి . ప్రసాద్ రావు నలభై ఏళ్ళు అలుపు తెలియకుండా పనిచేసి క్రిందటి సంవత్సరమే రిటైరయ్యేడు. మొదటి పది రోజులు కాలక్షేపం కాక ఇబ్బంది పడి పోతున్న ప్రసాద్ కి పూజ చెప్పిన సలహా నచ్చింది. ప్రొద్దుటే లేచి కాఫీ తాగి స్నానం చేసి పట్టు పంచె కట్టుకుని గుడికి వెళ్ళి కూర్చోవడం మొదలు పెట్టేడు. ఆ తరువాత అష్టోత్తరాలు విష్ణు సహస్ర నామ పారాయణం ప్రారంభించేడు. ప్రతి శుక్ర వారం లలితాపారాయణము చేయడం కూడా అలవాటయ్యింది. ఈ అలవాటు ఎంత వరకు వచ్చిందంటే, ప్రసాద్ గుడికి వెళ్ళే సమయం బట్టి కోలనీ వాళ్ళు తమ తమ గడియారాలని సరి చేసుకోవడము ప్రారంభించేరు. క్రమేపీ, గుడి పూజారికి,, గుడికి వచ్చే భక్తులకి ప్రసాద్, ప్రసాద్ కు వారు అలవాటు అయ్యేరు. సమయం గడిచే కొద్దీ, పలకరింపు నవ్వులు, మందహాసాలు, పిమ్మట పరిచయాలు, కుశల ప్రశ్నలు, క్షేమ సమాచారాలు, కబుర్ల స్థాయి దాటి పెళ్ళి సంభంధాల చర్చల వరకు వచ్చింది. పింకీ తమ మాటల మీద శ్రధ్ధ పెట్టడం వలన అర్చన గదిలో చీపురు చప్పుడు వినపడటం లేదని, గమనించిన పూజ గట్టిగా అరిచింది, “ పింకీ నేల కంది పోయేటట్టు, చీపురు అరిగిపోయేటట్టు గది తుడవడం మానేసి పని మీద దృష్టి పెట్టు" "ఇప్పుడు చెప్పండి మీ ఇంటర్ వ్యూ కథా కమామీషూ " కుతూహలంగా అడిగింది. " అది అసలు ఇంటర్ వ్యూ లా అనిపించలేదనుకో ! కబుర్లు చెప్పుకున్నట్లుంది " ప్రారంభించేడు ప్రసాద్. " అసలే పెద్ద పోస్టులో రిటైర్ అయ్యేరు కదా మీరు! మీ ఇంటర్ వ్యూ తీసుకోవడం అంటే భయపడి ఉంటారు వాళ్ళు" నిదానంగా అంది పూజ. " ఏమో ఆ సంగతి నాకు తెలియదు కానీ, జీతం సంగతి తరవాత ఆలోచిస్తారట " "సరే! నా దృష్టి లో కనీసం నెలకి ఏభయి ఇస్తారనుకొంటున్నాను" అంది పూజ. " జీతం సంగతి పక్కన పెడితే, ఇన్ సెంటివ్ బాగుంటుంది. ఫ్రీ బ్రేక్ ఫాస్ట్, ఫ్రీ లంచ్" " అయితే నేను రోజూ మీకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ డబ్బా తయారు చేయక్కర లేదన్న మాట. బాగుంది. ఇంకా" " అక్కడస్ మాత్రం డ్రెస్ కోడ్ ఉంటుంది. " అన్నాడు ప్రసాద్. "ఈ రోజుల్లో ఇది కామనే. ఇన్ ఫోసిస్ మూర్తి గారు కూడా యూనిఫార్మ్ లోనే ఆఫీస్ కు వెడతారట. అలాగే మీరూనూ " " డ్యూటీ మాత్రం ప్రొద్దుటే ఆరు గంటల నుండి పన్నెండున్నర వరకు, తరవాత లంచ్ బ్రేక్. సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి ఎనిమిది వరకూ " " రోజూ అంత సేపా?" ఆశ్చర్య పోయింది పూజ " ఇన్ సెంటివ్ ఉంటుంది అని చెప్పేనుగా. ఎక్కువ సేపు పని చేస్తే, ఎక్కువ డబ్బులు వస్తాయి కదా! శుక్ర, శని వారాలలో ఇన్ సెంటివ్ ఎక్కువ ఉంటుంది ట, పైగా మా బాస్ లేనప్పుడు, శలవు పెట్టినప్పుడు ఆయన కేష్ ఇన్ సెంటివ్ కూడా నాకే వస్తుందట " అన్నాడు ప్రసాద్. "అవును ! అదీ నిజమే. ఈ పద్ధతి బాగుందండీ. నాకు నచ్చింది " ఒప్పుకుంది పూజ. “ మధ్య మధ్యలో పానీయాలు కూడా ఉంటాయట. కాఫీ, టీ మాత్రం కాదులే, కొబ్బరి నీళ్ళు ,పాలు," " అవునండీ, కాఫీ టీ లు తాగితే ఏమి ఉంది. ఉన్న ఆరోగ్యం పాడవడం తప్ప! కొబ్బరి నీళ్ళంటారా. చలవకి చలవ.దాహం తీరుతుంది కూడా. ఒంటికి మంచిది" అంది పూజ. "మధ్య మధ్యలో కొత్త బట్టలు కూడా ఇస్తారట భేషుగ్గా! ఇచ్చి కాళ్ళకి దండం పెడతారట ఇచ్చిన వాళ్ళు." అన్నాడు ప్రసాద్. “" ఈ రోజుల్లో కూడా కాళ్ళకి దండం పెట్టే వాళ్ళున్నారంటే నేను నమ్మను " అంది పూజ. "నువ్వే చూస్తావుగా! అప్పుడు నమ్ముదువు గానిలే" అన్నాడు ప్రసాద్. " అన్నట్లు, అప్పుడప్పుడు, లోకల్ టూర్స్ కూడా ఉంటాయట. అదీ కాకుండా, నా పర్ఫార్మెన్శ్ నచ్చితే ఫారిన్ టూర్స్ కూడా ఉండొచ్చట.” " ఇది బాగుందండీ! నలభయ్యేళ్ళు గొడ్డు చాకిరీ చేసినా మీ ఆఫీస్ వాళ్ళు కనీసం నేపాల్ కి కూడా పంపించలేదు. వీళ్ళెవరో గానీ మంచి వాళ్ళు " అంది పూజ. అవునన్నట్లు తల ఆడించేడు ప్రసాద్. " ఫారిన్ పోస్టింగ్స్ కూడా ఉంటాయన్న మాట " అంది పూజ “ ఉండొచ్చు" అన్నాడు ప్రసాద్ "అయితే మీతో పాటు ఫారిన్ టూర్స్ కి నేను కూడా వస్తానండి " అంది పూజ. " ఫారిన్ టూర్లకి నా ఖర్చులు వాళ్ళు పెడతారనుకో. నీకు రావలంటే మాత్రం రానూ పోనూ ఖర్చులు మాత్రం మనం పెట్టుకోవాలి అనుకుంటాను “ అన్నాడు ప్రసాద్. " అంతేగా! ఆ మాత్రం రానూ పోనూ ఖర్చులు మనం పెట్టుకోలేమా ఏంటి?" అంది పూజ మౌనం వహించేడు ప్రసాదు. " పోనీ, ఫారిన్ పోస్టింగ్ అయితే వాళ్ళనే పెట్టుకోమందాం. ఏం?" అంది పూజ " సరే " అన్నాడు ప్రసాద్. " ఇంతకీ ఉద్యోగం ఎక్కడండీ? " అడిగింది పూజ. కుతూహలం పట్టలేక అర్చన గదిలోంచి బయటకు వచ్చింది పింకీ. " మన ఇంటికి దగ్గరలో ఉన్న శ్రీ గంగా పరమేశ్వరీ మందిరంలో పూజారి ఉద్యోగం" తాపీగా అని తన గదిలోకి వెళ్ళి పోయేడు ప్రసాద్. " అందుకనా! ఆ రోజు మీటింగ్ లో అందరూ రిటైర్ అయ్యేక పూజ, అర్చన, అభిషేకాలతో గడపమని అంకుల్ తో చెప్పేరు" అని ఫక్కుమని నవ్వింది పింకీ. భాష్పాభిషేకం మొదలయ్యింది పూజకి.
No comments:
Post a Comment