శ్రీధర వేంకటప్పయ్య
-పెయ్యేటి రంగారావు
బబ్బ్లూకి పన్నెండేళ్ళు. తలిదండ్రుల గారాబం వల్ల వాడు కాస్త పెంకితనం, మరికాస్త మంకుతనం నేర్చుకున్నాడు. బబ్లూ తండ్రి పేరు మనోహర్. తల్లి పేరు రజిత. వాళ్ళకి ఇద్దరు సంతానం. మొదట అమ్మాయి, తర్వాత అబ్బాయి. అబ్బాయి పేరు శ్రీధర వేంకటప్పయ్య. మనోహర్ తండ్రి పేరు వేంకటప్పయ్య. మనోహర్ భార్య రెండవసారి గర్భం ధరించినప్పుడు ఆయన తన కొడుకుని జాలిగా అభ్యర్థించాడు, ' ఒరేయ్ నాయనా! నీకు అబ్బాయి పుడితే నా పేరు పెట్టుకోరా.' మనోహర్ కి ఇష్టం లేకపోయినా, తనని కని, పెంచి, అష్టకష్టాలు పడి చదివించిన తండ్రి మాట కాదనలేక, ' అలాగేలే నాన్నా!' అన్నాడు. ఆతర్వాత కొద్ది రోజులకే వేంకటప్పయ్య కాలం చేసాడు. అది జరిగిన మూడు నెలలకి రజిత పండంటి మొగబిడ్డని ప్రసవించింది. బారసాల నాడు తండ్రి మీద గౌరవంతో మనోహర్ తన బిడ్డకి శ్రీధర వేంకటప్పయ్య అని నామకరణం చేసాడు. కాని రజిత కొడుకుని స్కూల్లో వేసినప్పుడు అతడి పేరు శ్రీధర్ గా మాత్రమే నమోదు చేయించింది.
ఐతే తలిదండ్రులిద్దరూ అతడిని వేంకటప్పయ్య అనీ కాక, శ్రీధర్ అనీ కాక, ముద్దుగా బబ్లూ అని పిలుచుకుంటారు. మనోహర్ కుటుంబం వుండేది రంగా ఎన్ క్లేవ్ లో. వాళ్ళ కాలనీ వెల్ఫేర్ అసోసియేషను వారు శనివారం నాడు వారికి ఒక నోటిఫికేషను పంపారు. ఆదివారం ఉదయం పదిగంటలకి శ్రీదేవి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల సైన్సెస్ నించి ఒక డాక్టర్ల బృందం వారి కాలనీ సందర్శిస్తారట. అప్పుడు కాలనీలోని వారందరికీ ఆరోగ్యసూత్రాల గురించి వివరించడం, ఏవన్నా అపాయాలు సంభవిస్తే తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, చేయవలసిన ప్రాథమిక చికిత్సల గురించి వివరిస్తారట. అందువల్ల కాలనీలోని అందర్నీ తప్పనిసరిగా హాజరు కమ్మని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ఆ నోటిఫికేషను సారాంశం. ఆదివారం వచ్చింది. రజిత, మనోహర్ ముస్తాబై కమ్యూనిటీ హాలుకి వెళ్ళబోతున్నారు. బబ్లూ నేను కూడా వస్తానని పేచీ మొదలుపెట్టాడు.
రజిత అంది, ' ఒరేయి నాయనా1 నువ్వు, అంబుజ ఇంట్లోనే వుండండి. అక్కడ నీకు బోరు కొడుతుంది. డాక్టర్లు వచ్చి ఏవేవో పెద్ద విషయాలు చెబుతారు. అవి నీకేం అర్థం కావు. మేము మీటింగు అవగానే ఇంటికి వచ్చేస్తాం. అందాకా నువ్వు, అక్క టామ్ అండ్ జెర్రీ డి.వి.డి. వేసుకుని చూసుకుంటూ వుండండి. ఫ్రిజ్ లో టూటీఫ్రూటీ ఐస్ క్రీం వుంది. కావాలంటే తీసుకుని తినండి.' బబ్లూ వినలేదు. తను కూడా వస్తానని వీరపేచీ పెట్టేసాడు. టైమయిపోతోంది. ఇంక మనోహర్ కి విసుగేసి, ' వాడి ఖర్మ ! పోనీ రానీ రజితా.' అన్నాడు. రజిత అంది, ' సరేరా బడుధ్ధాయ్ ! వచ్చి తగలడు. కాని అక్కడికొచ్చాక ఐదు నిముషాలన్నా గడవకుండానే, ' అమ్మా! ఇంటికెళిపోదామే' అని వెధవ పేచీలు పెట్టావంటే నీకు అక్కడే తొడపాశం పెట్టేస్తాను.'
బబ్లూ అన్నాడు, ' సరే. కాని నేను మాత్రం వచ్చి తీరతాను.' అంబుజ కాస్త వ్యక్తావ్యక్తతలు తెలిసిన పిల్ల కావడం మూలాన, ' మమ్మీ! నేను మాత్రం మీరు చెప్పినట్లు ఇంట్లోనే వుంటాను. కాని అందుకు బదులుగా మొన్న బట్టలషాపులో చూసిన మిడీ నాకు కొనిపెట్టాలి. అలా ప్రామిస్ చేస్తేనే ఇంట్లో వుంటాను. లేకపోతే నేనుకూడా మీతో వస్తాను.' అంది. రజితకి ఈ బ్లాక్ మెయిలింగ్ నచ్చలేదు. ఐనా గత్యంతరం లేక కోపంగా ' సరేలే' అంది. అంబుజ వదలలేదు. ' అమ్మా, ఇప్పుడలానే అంటావు. కాని తర్వాత ఏరు దాటాక తెప్ప తగలేస్తావు. నేను జ్క్షాపకం చేస్తే, ' ఏడిసావులే, ఇప్పిటికే నీకు బీరువానిండా బోలెడు డ్రస్సులున్నాయి. ఇంక నీకు కొత్త బట్టలేం కొనేది లేదు.' అంటావు. నాకు డాడీ ప్రామిస్ చేస్తేనే ఇంట్లో వుండిపోతాను. లేకపోతే నేనూ వస్తాను.' అని బెదిరించింది. అంబుజకి తెలుసు. డాడీ మేన్ ఆఫ్ ప్రిన్ సిపుల్స్ అని. ఆయన మాటిస్తే ఇంక తిరుగుండదు.
మనోహర్ వెంటనే అన్నాడు, ' నాన్నా అంబుజా! టేక్ మై వర్డ్. తప్పనిసరిగా రేపే నిన్ను కళానివాస్ కి తీసుకెళ్ళి, నువ్విష్టపడ్డ ఆ మిడీని నీకు కొనిపెడతాను. ఒరేయి బబ్లూ! ఇప్పుడే చెబుతున్నాను. నీకు మాత్రం ఏమీ కొనను.' బబ్లూ పెంకిగా అన్నాడు, ' కేరే హూట్! నాకిప్పటికే కోటి డ్రస్సులున్నాయి. రేపు నేను పెద్దయ్యాక అవి నాకెందుకూ పనికిరావు. నేను మాత్రం వస్తున్నాను.' చివరకు రజిత, మనోహర్, బబ్లూ కలిసి మోటర్ సైకిలు మీద కమ్యూనిటీహాలుకెళ్ళారు. సెషను మొదలైంది. అందులో గేస్ స్టవ్ ల వద్ద జరిగే ప్రమాదాలు, బాత్ రూములలో జరిగే ప్రమాదాలు లాంటివన్నీ వివరిస్తున్నారు. ఒక డాక్టరుగారు లేచి గొంతు సవరించుకున్నారు. ' మీకు బాత్ రూములు స్టైలిష్ గా వుండాలి. అందుకని నున్నటి టైల్సు వేసుకుంటారు.
కాని మీకు తెలుసా? ముప్పాతిక ప్రమాదాలు బాత్ రూములలోనే జరుగుతున్నాయి. అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి, ప్రముఖులెందరో బాత్ రూములలో కాలు జారి పడి ప్రాణాలు పోగొట్టుకోవడమో, కాళ్ళు విరగకొట్టుకుని, లక్షలు, లక్షలు ఖర్చు పెట్టుకుని, తొడల దగ్గర మెటల్ స్క్రూలు వేయించుకుని కుంటుకుంటూ నడవడమో చేస్తున్నారు. అందుకని మీరు షోకులకి వెళ్ళకండి. బాత్ రూములలో ఫ్లోరు కాస్త రఫ్ గా వుండే్లా చూసుకోండి. బాత్ రూములలో నీళ్ళు నిలవుండి పాకుడు ఏర్పడకుండా వుండేలా చూసుకోండి. ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు బాత్ రూములోకి నిర్లక్ష్యంగా అడుగు పెట్టకండి. ముందు ఒక కాలు పెట్టి, అక్కడ పాకుడు వుందా అని జాగ్రత్తగా పరిశీలించి అప్పుడు లోపలికి వెళ్ళండి.'
ఇంకొక డాక్టరుగారు లేచారు. ' మీరు స్కూటరు మీద హడావిడిగా ఆఫీసుకి వెడుతున్నారు. దారిలో రైల్వేగేట్ వస్తుంది. రైలు రాబోతోంది కనుక ఆ గేట్ వేసేసి వుంది. మీరు ఆఫీసుకి టైము ఐపోతోందన్న తొందరలో గేటు కిందనుండి దూరి అవతలవైపుకి వెడదామని చూస్తారు. ఈలోపునే ట్రైను వస్తుంది. మీరు ప్రాణాలు కోల్పోవడమో, లేక శాశ్వతంగా వికలాంగులు కావడమో జరుగుతుంది. అందువల్ల తమాయించుకోండి. బెటర్ లేట్ దేన్ నెవర్. మీరు ఆఫీసుకి లేటుగా వెడితే వెడతారు. గాడిదగుడ్డు. కొంపేం మునిగిపోదు. రైలు వెళిపోయి గేటు తీసాక ప్రొసీడవండి. మీకు తెలుసా? ప్రముఖ సినీనటుడు కె.వి.చలం, పశ్చిమగోదావరి జిల్లా వట్లూరులో ఒక ఉపాధ్యాయిని, మరెందరో ఇలాగే రైలు కింద ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు పోగొట్టుకున్నారని?' ' అలాగే మీరు ఆఫీసుకెళ్ళడానికి సిటీబస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తారు.
లోపలికి వెళ్ళడానికి దారి ఇవ్వకుండా కొందరు ఫుట్ బోర్డ్ మీదే వేళ్ళాడుతూ వుంటారు. మీరు కూడా గత్యంతరం లేక ఫుట్ బోర్డ్ మీదే నిలబడతారు. బస్సు ఆగకుండానే దిగడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి సాహసాలు చెయ్యడం వల్ల మన నగరంలో ఏటా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో మీరు పేపర్లలో చదవటల్లేదూ? దయచేసి అటువంటి సాహసాలజోలికి వెళ్ళకండి.' మరొక లేడీడాక్టర్ గారు లేచి ఉపన్యసించడం మొదలుపెట్టారు. ' మీ ఇంట్లో గేస్ స్టౌ ఆన్ చేసి వంట మొదలుపెడతారు. వంటయి పోగానే స్టౌ సరిగ్గా కోజ్ చెయ్యరు. అంటే నాబ్ పూర్తిగా తిప్పరు. అల్లాగే స్టౌని వదిలేసి రాత్రి లేటయిపోయిందని వెళ్ళి పడుకుంటారు. గేసు లీకవుతూ వుంటుంది. చీకటితోనే లేచి వంటగదిలోకి వెళ్ళి లైటు వెలిగిద్దామని స్విచ్ ఆన్ చేస్తారు. మీరు స్విచ్ ఆన్ చెయ్యగానే స్పార్క్ వస్తుంది. వెంటనే కిచెన్ భగ్గుమంటుంది. ఆ మంటల్లో మీరు మాడి మసైపోతారు. మీ విలువైన నిండుప్రాణాల్ని పోగొట్టుకుంటారు. ఇలా జరగాలని మేమెవరమూ కోరుకోవటల్లేదు. దయ చేసి మేము చెప్పేది సహృదయంతో అర్థం చేసుకోండి. ఇలా జరగకుండా చూసుకోమని మాత్రమే మేము మీకు హెచ్చరికలు చేస్తున్నాము. ఎంతో జాగ్రత్తగా వుండి ప్రమాదాలను నివారించుకోమని మేము ప్రాధేయపడుతున్నాము. మీకు తెలుసా? ఆంధ్రదేశంలో అందరూ గర్వపడే ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి మాదిరెడ్డి సులోచనగారు ఇటువంటి ప్రమాదాని గురై తమ విలువైన ప్రాణాల్ని పోగొట్టుకున్నారు.
కొంచెం జాగ్రత్త వహించి వుంటే వారు నిండు నూరేళ్ళు జీవించి వుండేవారు. మరెన్నో అద్భుతమైన రచనలు చేసి మన తెలుగు పాఠకులని అలరించి వుండేవారు.' మరొక డాక్టరుగారు లేచి కొనసాగించారు. ' మీరు ఆఫీసులో వుండగా హోరున వర్షం కురిసి వెలిసింది. రోడ్లన్నీ వాగులై పోయాయి. మీరు ఆఫీసు అవగానే సిటీబస్సు కోసం వెళుతున్నారు. కాస్త జాగ్రత్తగా చూసుకుని అడుగులు వేయండి. దురదృష్టవశాత్తు మన రోడ్లమీద మూతలు మేన్ హోల్సు ఎన్నో వుంటాయి. అక్కడ మేన్ హోలు వున్నట్లు మీకు తెలియక అందులో అడుగు వేస్తే ఇంతే సంగతులు. ఇలా ప్రతి ఏడూ ఎంతో మంది చనిపోతున్న సంగతి మీకు తెలియంది కాదు. అలాగే మీరు ఏ వెహికిల్ మీద వెడుతున్నా, లేక నడిచి వెడుతున్నా తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. కోరి ప్రమాదాలని కొని తెచ్చుకోకండి.' మరొక లేడీడాక్టరుగారు లేచి చెప్పడం ప్రారంభించారు.
' నేనుకూడా మీకొక ముఖ్యమైన హెచ్చరిక చేయదలుచుకున్నాను. మనం లేచినది మొదలు పడుకునేదాకా విద్యుత్తుతోనే వ్యవహరిస్తాం. ప్లగ్ లో వైర్లు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్లగ్ లో వైర్లు పెట్టి అవతలి కొసలు స్పీకర్లకి కనెక్ట్ చెయ్యడానికి ప్రయత్నించరాదు. పొరపాటున చెయ్యి వైరుకి తగిలితే షాక్ కొట్టే ప్రమాదం సంభవిస్తుంది. ఒక్కొక్కసారి స్విచ్ లు సరిగా పని చెయ్యవు. ప్రత్యేకించి కాలింగ్ బెల్ స్విచ్ లు. స్విచ్ మీద చెయ్యి వేసేముందు స్విచ్ ని ఒకసారి పరిశీలించడం అలవాటు చేసుకోండి.' ' పొరబాటున మీ ఇంట్లోని ఎవరికన్నా షాక్ కొడితే మీరు గాబరాగా పరుగెత్తి వారిని తాకకండి. మీరు కూడా షాక్ కి గురై, ఒకరికొకరు అతుక్కుపోయి ఇద్దరూ చనిపోయే ప్రమాదం వుంది. అటువంటి సందర్భాలలో ఒక పొడితువ్వాలు చేతికి చుట్టుకుని వారిని బలవంతంగా బైటకి నెట్టండి. లేదా ముందుగా వెళ్ళి స్విచ్ ఆఫ్ చెయ్యండి. ఆ సందర్భాలలో మీకు ప్రెజెంస్ ఆఫ్ మైండ్ చాలా అవసరం.' ఆ డాక్టర్లు ఇంకా ఏవేవో చెబుతూనే వున్నారు. ప్రమాదాలు జరిగి, రక్తస్రావం అవుతున్నప్పుడు చెయ్యవలసిన ప్రాథమిక చికిత్సలు, ఎవరికన్నా అకస్మాత్తుగా గుండెనొప్పి వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు లాంటి విలువైన విషయాలనెన్నో బోధిస్తున్నారు. కాని రజితకి, మనోహర్ కి అదంతా చాలా బోర్ గా వుంది. కళ్ళు మూతలు పడుతున్నాయి.
ఆ డాక్టర్లు చెబుతున్నవేవీ వాళ్ళ చెవుల్లోకి వెళ్ళటల్లేదు. ప్రతి ప్రసంగం తర్వాత చప్పట్లు వినపడగానే వారు కూడా బలవంతంగా కనురెప్పలు తెరిచి అందరితో పాటుగా చప్పట్లు కొట్టి, మళ్ళీ నిద్రలోకి జారుకుంటున్నారు. కాని బబ్లూకి నిద్ర రావటల్లేదు. వాళ్ళు చెప్పేదంతా శ్రధ్ధగా వింటున్నాడు. సమావేశం ముగిసింది. అందరూ ఎవరి ఇళ్ళకు వారు బయలుదేరారు. స్కూటరు మీద కూర్చున్నాక రజిత అంది, ' ఓ, పరమ బోర్! ఇవన్నీ ఎవరికి తెలీనివి? దీనికోసం ప్రత్యేకించి మీటింగు పెట్టి మన విలువైన సండేని నాశనం చేసారు.' కొన్నాళ్ళు గడిచాయి. ఒకరోజు సాయంత్రం బబ్లూ అప్పుడే స్కూలు నించి ఇంటికి వచ్చాడు. రజిత అంది, ' బబ్లూ! బుధ్ధిగా డ్రస్సు మార్చుకుని రా. నీకు హార్లిక్సు వేడి చేసి ఇస్తున్నాను.' బబ్లూ తన గదిలో తువ్వాలు చుట్టుకుని పేంటు మార్చుకుంటున్నాడు.
ఇంతలో వంటింట్లోంచి కెవ్వున కేక వినబడింది. బబ్లూ హడావిడిగా వంటింట్లోకి పరిగెట్టాడు. అమ్మ చేయి స్విచ్చికి అతుక్కుపోయి వుంది. ఆమె గిలగిలలాడిపోతోంది. బబ్లూ మరేమీ ఆలోచించలేదు. తన ఒంటిమీదున్న తువ్వాలు చేతులకి చుట్టుకుని, తనకున్న శక్తినంతా కూడదీసుకుని అమ్మని బలవంతంగా తోసేసాడు. ఆవిడ కింద పడిపోయింది. బబ్లూ ఏడుస్తూ, ' అమ్మా! అమ్మా!' అన్నాడు. రజిత కొద్ది క్షణాల్లో కొంచెం తేరుకుని బబ్లూని బలంగా గుండెలకి హత్తుకుని ఏడిచేసింది. ' మై చైల్డ్! మై హనీ! మై బబ్లూ! నాకు ప్రాణదానం చేసిన నా కన్నతండ్రీ!' అంది. అప్పుడే ఆఫీస్ నించి ఇంటికి వచ్చిన మనోహర్ ఆమెని జాగ్రత్తగా పొదివి పట్టుకుని లేవదేసి మంచం మీద పడుకోబెట్టి సపర్యలు చేసాడు. కొద్ది క్షణాల్లో రజిత పూర్తిగా కోలుకుంది. బబ్లూ వంటింట్లోంచి హార్లిక్సు కలుపుకుని తీసుకువచ్చి తల్లికి సాదరంగా ఇచ్చాడు. రజిత హార్లిక్సులో, ఉబికివస్తున్న కన్నీళ్ళు కలుపుకుని తాగుతూ, ' ఒరేయ్ బబ్లూ! నీకేం కావాలన్నా అడగరా. ఎంత ఖరీదైనదైనా సరే. వెంటనే కొనిపెడతాను.' అంది. బబ్లూ నిర్లక్ష్యంగా అన్నాడు, ' అలాంటి లంచాలు అక్కకియ్యమ్మా. నాకక్కర్లేదు. మా అమ్మ క్షేమంగా నా కళ్ళముందున్న దానికన్నా విలువైన బహుమతి ఇంకేముంటుందమ్మా నాకు?' రజిత బబ్లూని కవుగలించుకుని ముద్దులతో ముంచెత్తేసింది.
No comments:
Post a Comment