గోదావరి కధలు: తిప్పలు - బి.వి.ఎస్.రామారావు - అచ్చంగా తెలుగు

గోదావరి కధలు: తిప్పలు - బి.వి.ఎస్.రామారావు

Share This
తిప్పలు 
- బి.వి.ఎస్.రామారావు 


తిప్పలు... తిప్పలు... తిప్పలు... 
ఎటు చూసినా తిప్పలు. గోదావరి పొడుగునా తిప్పలు... ఇసుక తిప్పలు, గోదావరికి వరదొస్తే చాలు ఇసుక మేటలు పేరుకుపోతాయి. ఏటేటా ఈ మేటలు ఇంతింతవి అంతంతై పర్వతాల్లా ఎదిగిపోతాయి. అందుకే ఎగువ గోదావరి చూడ్డానికి దిగిడుబావిలా వుంటుంది. నిర్మాణాలకి ప్రశస్తమైన గండ్రు ఇసుక దొరికే తిప్పలు గట్టు పొడుగునా కోకొల్లలు. ఈ తిప్పలు తవ్వి ఇసుక ఎగుమతి చేయడం ఏటి పట్టున సాగే వ్యాపారాల్లో కల్ల గొప్పది. కాంట్రాక్టర్లకి పోటీ పడే పనుల్లోకెల్లా పెద్దది. అలాంటి వ్యాపారం చేస్తున్న ఓ కంట్రాక్టరు ఇసుక తవ్వకం పని బాపతు ఆజమాయిషీని తన బావమరిదికి అప్పగించాడు. అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్న జూలాయి వెధవని దార్లోకి తీసుకురావడం కోసం. దాంతో తన బావగారి నుధ్ధరించడానికి ఉప్పరి బంటా (ముఠా) లని వేయి కళ్లతో అజమాయిషీ చేయడానికి ఉపక్రమించాడు. కాంట్రాక్టరు బావమరిది గట్టువార నీడలో కూర్చోని. పక్కనే బంటా(ముఠా) మేస్త్రి వెండిపూల కొలత కర్రను చంకలో పెట్టుకొని గోతికాడ నక్కలా కూర్చున్నాడు. నుంచున్న ఫళంగా కొలతలను కొలిపించుకొని బట్వాడా తీసుకోవడానికి. ఆడ, మగ వావి వరస లేకుండా బంటా జనాభా కిటకిటలాడుతూ కుప్పంతా కమ్మేసి ఇసుకను కసకసా తవ్వేస్తూ లారీకి చకచక ఎగుమతి చేస్తుంది. "మనిషన్నాక కాస్త కళాపోషణ ఉండాలి" అన్న డైలాగు గుర్తుకొచ్చింది కంట్రాక్టరు బావమరిదికి. ఆ డైలాగే పైకనేశాడు యధాలాపంగా – బంటా బాపతు ఆడ జనాభాలోని ఒక పడుచు పిల్లకేసి దృష్టి సారిస్తూ. "సిత్తం!" అన్నాడు బంటా మేస్త్రి వినయంగా విషయం అర్ధం గాకపోయినా. తట్టను లారీలో దిమ్మరించి, ఖాళీ తట్టను నేలకేసి కొట్టి దులిపి, వెదురు దండేలకు కట్టిన గుడ్డ ఉయ్యాలల బాపతు తడపలను వరుసగా లాగి ఊగుతున్న ఉయ్యాలలోని పసిపిల్లలను పలకరిస్తూ, కిలకిలమంటూ బంటాకొలెం చేరింది ఆ పడుచుపిల్ల. తుమ్మమొద్దులాంటి ఓ గోచీరాయుడు పళ్ళికిలిస్తూ తట్ట లాక్కుని పారకొట్టి పూటుగా నింపేసి ఆ పడుచుపిల్ల నెత్తికెక్కించాడు పరాచకాలాడుతూ. "ఆ దున్నపోతుకా ఈ పిల్ల జోడీ: కోపం ముంచుకొచ్చింది కం.బా.కు. "కాకి ముక్కుకి దొండపండు" అని మండిపడ్డాడు. కం. బా. కి కోపమొచ్చినా, తాపమొచ్చినా మెదడు మొద్దుబారిపోయి మనసు అదోలా ఐపోతూ ఎటెటో పోతుంది. మరుక్షణం ఆ దున్నపోతులోకి పరకాయప్రవేశం చేసింది ఆ మనసు. ఇసుక చాకుతో కోసిన హల్వాలా తెగిపోతోంది. రెండుసార్లకే తట్ట నిండిపోయింది. ఆ పడుచుపిల్లొచ్చి తన ఎదురుగా నిలబడింది. బరువు తట్టను ఆకాశం మీదకెత్తి విల్లులా వంగాడు అతను. దాన్నందుకోవడానికి తానూ విల్లులా వంగిందా పిల్ల. చాతీ చాతీ రాసుకున్నాయి. వళ్లంతా జలదరించింది. రివ్వున తిరిగి నెమలిలా నృత్యం చేస్తూ ఉయ్యాలలోని చంటిపిల్లల బుగ్గలు మీటుతూ లారీకేసి నడిచిందా పిల్ల. ఆ మీటలన్నీ తనమీదే పని చేసినట్లు నిలువునా గిలిగింతలు చెలరేగాయి కం.బా. మనసుకి. ముసిముసి నవ్వులతో మెలికలు తిరిగిపోయాడు. కం.బా. గారు మంచి హుషారుగా ఉన్నారన్న సంగతి గ్రహించాడు బంటా మేస్త్రి. చాంసు చూసుకొని మొదలెట్టాడు. "ఈ వారం బట్వాడాలో రెండొందలు ఒద్దే యియ్యండి బాబుగారు రేపు పున్నమి గందా. ఓ యేటపోతుని కొనాలి. సత్తెమ్మ తల్లికి పూజచేసి మీ పేరు సెప్పుకొని నైయేద్దం పెట్టి పెసాదాలు తింటాం ". "అలాక్కానీ" అన్నాడు కం.బా. వేట ఉధృతంలో పడి. "రేపు ఆదివారం కదా. పొద్దుగానే సంత సేసుకుంటాం. యీయాల సందేలకాడే కొలాలు కొలిసి బట్వాడా సేసేయండి బాబుగారూ". "అలాక్కానీ" అందామనుకున్నాడు కం.బా. కానీ వారం పనీ కొలిచీ శనివారం రాత్రికే బంటాకి డబ్బులిస్తే రాత్రికి టోకరా కొట్తి బజానాలు ఎగమేసి ఉడాయిస్తారన్న సంగతి చటుక్కున గుర్తుకొచ్చింది. అందుకే అలాక్కానీ అనబోయి నాలిక్కరుచుకున్నాడు. గతంలో యిలాగే మరోపిల్ల వేటలో పడి బంటాలకి శనివారం సాయంత్రమే బట్వాడా చేసి, ఆ పిల్లకోసం గుడిసెలకేసి తెల్లవార్లూ చూస్తూ కూర్చున్నాడు. గుడిసెల్లో దీపాలు వెలుగుతూనే వున్నాయి. కాని ఎవ్వరూ బైటకు రాలేదు. తెల్లారాక చూస్తే ఖాళీ గుడిసెల్లో రెపరెపలాడుతున్న గుడ్డి దీపాలు వెక్కిరించాయి. చూస్తూండగా తన్నలా బుట్తలో వేసి ఎలా పరారైనారన్న విషయం ఇప్పటికీ తన కాశ్చర్యంగానే ఉంది. ఈసారలాంటి పప్పులుడకవులే అనుకొన్నాడు. తిప్పమీద లారీ నిండింది. కూచున్న తుండుగుడ్డను దులిపి డ్రైవరు బోన్నేట్ ఎత్తాడు. గోదాట్లో నీళ్ళు ముంచి నిండు కడవను చంకనేసుకొని వయ్యారంగా వస్తోందా పిల్ల. కేలండర్లో బొమ్మలా కడవనందుకొన్నాడు డ్రైవరు. అది చూసి మండిపడింది కం.బా. మనసు. పడుచుపిల్లలతో పని చేయించుకోవడం లారీ డ్రైవర్లకు జన్మహక్కైపోయింది. ఏకంగా లారీ ఎక్కించి సరసాలాడతారు. రోడ్డు రోలర్ డ్రైవర్లు మరీను. అరడజను మందిని ఏరుకొని రోలరెక్కించేస్తారు. చక్రాలకంటుకున్న మట్టిని గోకడానికని, ఇంజన్లో బొగ్గును నింపడానికని. కం.బా. మనసు విసిగిపోయి మరుక్షణం లారీ డ్రైవర్లో దూరిపోయింది. పడుచుపిల్ల హాయిగా నవ్వుతూ, గెంతులేస్తూ అడ్డుపడ్డ ఉప్పరి పిల్లల తలలు తబలా వాయిస్తూ వుషారుగా తన దగ్గరకొచ్చింది నిండు కడవతో. ఠీవిగా రేడియేటర్ మూత తీశాడు. రేడియేటర్ లో బుడగలొస్తున్నాయి. ముఖం మీద ముఖం పెట్టి రేడియేటర్లో నీళ్ళోసిందా పడుచు. ఆవిరి సెగలు క్షణాల్లో ఐస్ మీద సెగల్లా మారిపోతున్నాయి. ఓరగా తనకేసి చూసి కవ్వించిందా పడుచు. దానికి సాయం ఆమె ముంగురులు తన చెంపమీద గిలిగింతలు పెట్టాయి. అమాంతం పైకెక్కి కొంగులాగి ఇద్దరి ముఖాలని చటుక్కున కప్పేశాడు. "అదేమిటి బాబు, నా తుండుగుడ్ద లాగేసి అలా కప్పేసుకొన్నారు, ఏడెక్కి పోనాది కామోసు. ఇలా నీడలోకి రండి బాబు. గొడుగు తెచ్చుకోకపోయారా" అంటూ గుడ్ద లాగేసుకున్నాడు బం. మే. తెల్లబోయాడు కం.బా. "సందాళే కొ్లాలు కొల్చేసి బట్వాడా సేసేద్దురుగాని. మకాం కాడ కాసేపు తొంగుని రండిబాబు. పడమట గాలికి ఏడెక్కువ". 'ఆ పప్పులుడకవులే' అని మరొకసారి అనుకొని తిరిగి బంటాని ఆజమాయిషీ చేయసాగాడు సీరియెస్ గా. మనసుని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ. పని జోరుగా సాగుతోంది. వారం రోజులుగా పట్టిన కొలాలను కొలిపించుకోడానికి గోతులను హడావుడిగా సమమట్టం చేస్తున్నారు బంటా కూలీలు. కొ్లాలనానుకొని తిప్పవారే వాళ్ళ గుడిసెలున్నాయి. జోడాకి ఆరు వెదురు గడలు, నలభై తాటాకుల చొప్పున వాళ్ళ మకాం ఇట్టే యెంచక్కా కుదిరిపోతుంది. వలయాకారంలో గెడలు పాతి వాటిని గోపురమ్లా పైన ముడేసి చుట్టూ ఆకులు నేస్త్సారు. బారెడు ఎత్తు గుడిశెకు జానెడే గుమ్మం. దూరి లోపలికెళ్ళాలి. అవి చూశాక ఒక సందేహం కలిగింది కం.బా. కి. "ఆ గుడిసెల్లో గాలి ఎలా వెడుతుందోయ్? మేస్త్రి ? ఉక్కిపోరూ మనుషులు?" "గుడిసెలో తొంగుని తలకాడ పుల్లెట్టి ఓ ఆకుని ఒత్తిగిస్తే సాలు జోరుగాలి ముకాన్ని కొడుతుంది బాబు. కాసేపటికి ఒళ్లంతా సల్లబడి ఐసై పోద్దండి." "మీది గొప్ప అదృష్టమోయ్. ఒకప్పుడు రాముడూ సీతా పెళ్ళయిన పధ్నాలుగేళ్లు ఏ బాదరబందీ లేకుండా విచ్చలవిడిగా హనీమూను గడిపారు. ఆ పనే మీరు జీవితాంతం చేయగలుగుతున్నారు." "పోండి బాబు. మా యొట్టి అనాదిసత్యపు అడవి బతుకులు. రాములోరికి మాకు సాపత్తెమా?" "కాకుంటే మీరా వంశాన్నో, అంశాన్నో పుట్టుంటారు. అన్నాడు కం.బా. గుంపులో పిల్లని వెయ్యికళ్ళెట్టి వెతుకుతూ. వంశం గురించి అడిగితే చాలు . వెయ్యితరాల చరిత్రను చెప్పేస్తాడీ బం.మే. ఆ మాటకొస్తే ఏ మేస్త్రీ నడిగినా ఆ చరిత్రే చెబుతాడు. అసలా చరిత్ర తెలిసినవాడే బంటా మేస్త్రీ ఔతాడు. "నిజం బాబు. మాదీ రాములోరిదీ ఓటే వంసమండి. ఆమాటకొత్తే రాములోరిదే మా వొంసెమండి. మమ్మల్ని ఉప్పరోళ్ళంటారు. గాని మాది సగర వొంసెం అండి. అంటే రాజ వొంసెం అన్నమాట. సగరుడు గోరు ఓ గొప్ప సెక్రవర్తండి”. కం.బా. మనసు మనసులో లేదు. ఐసురూము లాంటి ఉప్పరి గుడిసెకేసి పోయి ఏవో తిప్పలు పడుతోంది. "సగరుడు గోరు మారాజన్నానాండి. ఆరికి సోయానా యిద్దరు పెళ్ళాలండి". పురాణం విప్పాడు బం.మే. మధ్యలో ఆపితే వంశ ప్రతిష్టకు గౌరవభంగం వస్తుందని చెప్పుకుపోతున్నాడు. ఆయి! యిద్దరు పెళ్ళాలన్నానండి. ఆరిలో ఒకరికి సెవుడు కటాచ్చించి అరవై వేల కొడుకులు పుట్టించేసారండి”. కం.బా. మనసు యీలోకంలో వుంటేగా! సెంటు రాసిన ఖద్దరు సిల్కు చొక్కా, తెల్ల పౌజామా వేసుకొని గుడిసె చుట్టూ తారట్లాడుతోంది. "మరి యింకో పెళ్ళాం ఉండాలి కదండీ. దానికి సింగలుగా ఓడే కొడుకు పుట్టాడండి. అయితేనేం బాబుగారూ అరవై ఏల నాయాళ్ళు సెయ్యనన్ని పాపాలు యీడొక్కడే సేసేసేవాడు. దాంతో సగర సేక్ర్రవర్తికి మా సెడ్డ పేరొచ్చేసిందండి". బోర్లించిన గరాటాలా ఉందా చిన్న గుడిసె... అమంతా చేసి లోపల ఎటుజూసినా రెండుబారల లోపుంటుంది. తాట్సకు వాసి అంత ద్వారంలో సిల్కు చొక్కా, పైజామా వీలైనంత నలక్కుండా చూసుకొని పట్టపగలే లోపలికి దూరబోతున్నాడు కం.బా. తన పగటి కలలో. "ఇంటున్నారా బాబు " అనరిచాడు బం.మే. కన్నంలో దూరుతున్న దొంగని పోలీసు తట్టినట్టయ్యిందా అరుపు. "చీ నోర్ముయ్" అన్నాడు కం.బా. బం.మే. చిన్నబుచ్చుకున్నాడు. సగర చక్రవర్తికి చెడ్డపేరొచ్చేదాకా చెప్పి ఊరుకోడం మహా దారుణం అనుకున్నాడు. అందుకని బలవంతాన చెప్పుకుపోతున్నాడు. ఆ సెడ్డపేరు తుడిసెయ్యడం కోసం అశ్వమేధయాగం సేశాడండి. పూస్సేసి గుర్రాన్నొగ్గేత్తారు సూడండి, అదన్నమాటండి. అశ్వమంటే గుర్రమండి". అక్కడ సగర సక్రవర్తి అశ్వమేధయాగం మొదలెట్టేలోగా ఎలాగో కష్టపడి గుడిసెలోకి దూరుతావుంది కం.బా. మనసు. "గుర్రం సేత దౌడు తీయించి దానెనకాలే కొడుకుల్ని లగెత్తి దాన్నట్తుకు రామన్నాడండి సగర సెక్రవర్తి. పూస్సేసిన గుర్రం కదండీ అంత సులాగ్గా దొరుకుద్దామరి! లగెత్తి,లగెత్తి సక్కగా సముద్రం కాడకెళ్ళి మాయమైపోనాదండి. ఓరి దీ్నమ్మ యిదేదో మాయగుర్రంలా ఉందిరోయ్ మనూరెళ్లి మనయ్యకి సెప్పొద్దారి అని తిరిగి దౌడు తీశారండి రాసకుమారులు" సస్పెంసు థ్రిల్లర్ లా సాగిపోతూంది కథ. పట్టపగలే రంగుల కలల్లో షికారుగా గుడిసెలోకెళ్ళిపోయాడు కం.బా. తాటాకుల గుండా వడపోసిన సూర్యకాంతి గుడిసెలో వెన్నెల కురిపిస్తోంది. మెత్తని మట్టి మీద నున్నగా అలికిన నేల, పట్టుపరుపులా ఉంది. కొత్త తాటాకులూ, పచ్చి వెదుళ్ళ వాసనలూ మనసుకి మత్తెక్కిస్తున్నాయి. ఆబగా గుటకేసాడు. నిద్రలోలా వినీ వినబడకుండా సాగిపోతోంది బంటా మేస్త్రీ వంశచరిత్ర. "అద్గదండి గుర్రాన్నొగ్గేసి తులూపుకుంటూ కనబడ్డ కొడుకుల్ని సూసి, స్సీ! యదవనాయ్యాళ్ళారా! యీ వంసెంలో సెడబుత్తారు, దుర్రాన్నట్టుకొత్తేనే మీకు దానా పడేత్తానుంపోడి". అని పొలిమేరదాకా తన్ని తరిమేశాడండి సెక్రవత్తి. ఇంటున్నారా?" అడిగాడు బం.మే. తన్మయత్వంతో ఉన్న కం.బా.ను చూసి కథలో తన్మయత్వం చెందేశాడని అపోహపడి చెప్పుకుపోసాగాడు మిగతాది. "సముద్రం కాడ మాయమైన గుర్రం మేడ పోతుంది చెప్మా? అని బుర్రెట్తి ఆలోసించి పాతాలానికే పోయుండాలహేస్! ఈ గెడ్దంతా తవ్వేదారి. పనిముట్లట్టుకురండోస్ అన్నారండి. మా అరవైవేల కులపెద్దలు. అంతే! శ్శెణంలో పార, గునపాలు అట్టుకొచ్చి కొలాలెట్టేసారండి పాతాలానికి దారెయ్యటానికి. ఇప్పుడాపనిముట్లేవండి, అన్నీ నెలతక్కువ సరుకులే. ఆ పెట్టిన కొలాల్ని లోతుసేసుకుంటూ పోనారండి". మేస్త్రీ కథలో వాళ్లలా లోతుచేసుకుంటూ పోతున్న సమయంలో కం.బా. మనసు గుడిసెంతా కలయజూసింది. గుడిసెంతా కనుల పండుగగా వుంది. కలగాపులగంగా వున్న పికాసో చిత్రాన్ని చూసినట్టు ప్రతీ అంశాన్ని వెతుక్కొని చూడసాగాడు. సూదంటురాయిని బలాదూరు చేస్తున్న పెద్ద కళ్ళు కనబడ్డాయి చిలిపిగా ఓమూల. వాటి మధ్య కాస్త దిగువగా ఇత్తడి చుట్టుకు సింగారాన్నిచ్చేలా తీర్చిదిద్దిన ముక్కు సిగ్గుతో షోణాలెగరేస్తూ కనబడింది. దానికి మరికాస్త కింద ముత్యాల తళుకులను మూసీమూయకుండా ఊరిస్తూ మత్తెక్కిస్తున్న పెదవులు వున్నాయి. గిర్రున తిరిగి మరోవైపు చూశాడు. వంకీలకు, మట్టెలకు అందాన్నిచ్చిన చక్కని పాదాలు కనబడ్డాయి. దృష్టిని మరికాస్త అటు మళ్లించాడు. చీరకట్టుకు శృంగారాన్నిచ్చిన వంపులు తిరిగిన భాగం పిక్కనుండి నడుందాకా కనబడింది. తిరిగి ఓ చివరికి పోనిచ్చాడు. చూపుని పర్వతాన్ని కప్పిన జలపాతపు జిగితో ఉన్న వత్తైన కేసరాలు, చెదిరిన చారలులా ఉన్న ముంగురులు కనపడ్డాయి. దృష్టిని మరోవైపు తరలించాడు. కంచుపోతలా మెరుస్తున్న బోసి కాళ్ళు కనబడ్డాయి. ఎత్తుగా ఏదో కదలడం చూసి అటుకేసి చూసాడు. పమిటను పొంగించిన చాతీ కనబడింది. దానితోపాటే ఇత్తడి నానుతాడు సాగుతోంది. దానికి బంగారు చాయలిచ్చిన పాలరాయిలాంటి నున్నని కంఠం కనబడింది. ఇవన్నీ ఇరుకు చోటులో తన చుట్టూ వున్నాయి. వీటిని విడివిడిగాను, జమిలిగాను చూసాడు. వీటి మధ్యన ఇమడడానికి ప్రయత్నిస్తున్నాడు కం.బా. సగర పుత్రుల తవ్వకంలా అతని ప్రయత్నం జయప్రదంగా సాగుతుంది. "మడిసికో గజం చొప్పున అరవై వేల నిలువు తవ్వేసి పాతాలానికి సొరంగమెట్టేసారండి మావోళ్ళు. అంటే ఆ కాలం నుండీ మా వొంసెంలో ఉప్పరి విద్దె. ఆ విద్దే మాకీయాల కూడేడుతుందనుకోండి. పడ్ద కట్టం ఉత్తినే పోద్దాండి? గుర్రం దొరికేసినాదండి. కాని దాన్ని కట్టేసి పక్కనే ఓఅ సన్నాసి కళ్లు మూసుకొని తపస్సేత్తున్నాడండి. 'ఈడే గుర్రాన్ని కట్టేసాడు. ఈన్ని సంపేసి గుర్రాన్నట్టుకుపోదారి' అని ఆడిమీద సెయ్యి సేసుకున్నారండి యీళ్లింతమందీను. ఆడు అగ్గిబుగ్గయి కళ్ళు తెరిశాడండి. స్సెణంలో మావోళ్ళందరూ బూడిదైపోనారండి. అంటే ఆ వొంసెంలో అరవైవేలమంది పడుచుపిల్లలు సెణంలో ముండమోశారన్న మాటండి"కథనక్కడాపాడు బం.మే. - కం.బా. శానుభూతి ఎలాగుందో కనిపెట్టడానికి. గులకలలోకొచ్చిన పడుచుపిల్ల బాపతు నసు, శరీరం కాస్త ఒరిగాయి. దాంతో తనూ ఆమె పక్కనే చోటు చేసుకున్నాడు. చిన్న పుడక తీసి తాటాకును ఒత్తిగించింది. చల్లనిగాలి రివ్వున వీచింది. మనసుకు వెర్రెక్కింది. ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె తనలో యిమిడి పోయింది. అక్కడ వాళ్ళు మూకుమ్మడిగా ముండమోస్తుంటే చిరకాల వాంచ తీరినట్టు కం.బా. ముఖం పెట్టేసరికి చిన్నబుచ్చుకున్నాడు మేస్త్రీ. పౌరుషం వచ్చింది. "అరవై యేల గామాల రాజ్యమండి అప్పుడు మాది. యిప్పుడు యీ యేటి పట్టున అరవైగామాలు మావేనండి. మా గుడిసెల పొలిమేరల్లో మా కాయకట్టాల మీద కామందులు మేడలు,మిద్దెలు కట్టేసుకుంటే అవి బెమ్మాండమైన ఊళ్ళయిపోయినాయి. ఇప్పుడాటికి మా గుడిసెలే పొలిమేర్లయి పోనాయి" అని యిదయిపోయాడు. చెదిరిన బొట్టు, రేగిన జుట్టుని సవరించుకుంటూ తన చాతీమీద వాలింది కం.బా. కలలో పడుచుపిల్ల. విరిగిన గాజులను బట్టలనుండి దులుపుతూ ఆ పిల్ల చెపుతున్న కథలను శ్రధ్ధగా వింటున్నాడు కం.బా. "మేము సెక్రవ్త్తులం కదండీ, అందుకే అట్టడుగువరగ్ఫాల లిట్టులో లేము. కాబట్టే మాకీ కట్టాలు. ఆనాడు బగీరధుడు గోరు మా వొంసాన్న పుట్తి గంగమ్మతల్లిని తెచ్చాడు. కనుక మాకు పుట్తగతులొచ్చాయండి". కలలో పిల్ల చెబుతున్న కబుర్లు చెవులో గూడుకట్తి మేస్త్రీ చెబుతున్న కథను కలగా పులగంగా వింటున్న కం.బా.కి భగీరధుడంటే ఎవరు చెప్మా అన్న సందేహం వచ్చింది. ఆ! వాడే. తెల్లారకుండా కోడైకూసి తనలా గుడిసెలోకి చొరబడ్డాడు - వాడే అనుకొన్నాడు. తరువాత శాపం సంగతి గుర్తొచ్చి ఒళ్ళంతా తడిమేసుకొని వెదుక్కుంటున్నాడు కం.బా. ఏటి బాబూ, అట్టా ఎతుక్కుంటున్నారు? ఏ పురుగైనా సొక్కాలోకి దూరిందేవిటి?" అంటూ చొక్కాలోకి చెయ్యెట్టి తనూ వెతకసాగాడు బం.మే. దాంతో ఈ లోకంలో పడ్డాడు కం.బా. "సందాళే డబ్బు చేతికిస్తే తప్పతాగి ఒకడి పెళ్ళాం మీద మరొకడు చెయ్యేసి రాత్రంతా కొట్టుకు చస్తారు. అందుకే రేపిస్తాను" ఖచ్చితంగా చెప్పీఅశాడు కం.బా. "అయ్యబాబు ఎంతమాటన్నారు. ఎంత తాగినా అలా సెడం బాబు. అలా సేత్తే మా ఆడోళ్లూరుకోరండి. మాలో తడికసాటు యవ్వారం జరిగితే పంచాయతీ పెద్దలు తప్పేసి వందలమీద జరీమానాలేత్తారండి. ఆ పాలు కట్టాలంటే యీ జనమే సాలదండి. బాబుగోరు యింకో యిసయం అసలు మడిసి ఆడదై పుట్తకోడదండి. పుట్టినా ఉప్పరికులంలో సత్తే పుట్టకూడదు. ఓ మూల కాపరం సక్క పెట్టుకుంటూ మరోమూల పొద్దస్తమానం రెక్కలు ముక్కలు సేసుకొని తట్టలు మోత్తారండి మా ఆడోళ్ళు. నెలలు నిండి ఇంకాసేపటికి పెసవిత్తుందన్న ఆడది ఆ స్సెణం దాకా తట్ట మోత్తది బాబు. అందుకే నెత్తి మీద గుడ్దసుట్ట తీసి సూత్తే మా ఆడోళ్ళకు ఎంట్రుకలుండవండి. బాబుగోరూ పనికోసం వొళ్లు వంచుతారే కాని, సత్తే వొళ్ళప్పగించరండి". క్షణంలో అక్కడ ఆడాళ్ళందరూ బోడిగుళ్ళేసుకొని కనపడ్దారు అతని మనసుకి. కంగారు పడి కళ్ళు నులుపుకు మళ్ళీ చూశాడు. గుడ్ద చుట్టల వెనుక కొప్పు సింగారాలు మామూలుగానే కనబడ్డాయి. మనసు స్తిమితపడి 'ఆ మా చెప్పొచ్చాడు వెధవ బడాయి వీడూనూ! పచ్చనోటు గాలిలో ఊపితే రెక్కలు కట్టుకు వాల్తారు. వీళ్ల సంగతి నాకు తెలియదా' అనుకొని మళ్లీ సీరియెస్ గా బంటాకేసి దృష్టి సారించాడు ఆజమాయిషీగా. మరో లారీ నిండింది. డ్రైవర్ బోనట్ ఎత్తాడు. మళ్ళీ కడివెడు నీళ్లతో ఆ పడుచుపిల్ల ప్రత్యక్షమైంది. తక్షణం రంగంలోకి దూకడానికి నిశ్చయించుకున్నాడు కం.బా. "ఇదిగో మేస్త్రీ. ఆ పిల్లని ఆ కుండనిలా పట్రమ్మను. చీరాకేస్తోంది. ముఖం కడుక్కోవాలి" అంటూ చిరాకు నటించాడు. బం .మే. ఉప్పరిభాషలో ఓ కూత కూశాడు. మరుక్షణం ఆ కడవనందుకొని అంతవరకు కొలెంలో పారకొడుతున్న దున్నపోతు తనకేసి నడిచి వస్తోంది. అది గమనించి నిజంగా చిరాకుపడి" దాన్ని తెమ్మంటే వీడెవడు తేడానికి" అని మేస్త్రీని కోప్పడ్డాడు. "అదాడి సెల్లండి. దాన్ని కట్టపడనీడండి. దాన్నో మంచయ్య సేతుల్లో పెట్టటానికి డొక్క మాడ్చుకు డబ్బెనకేత్తాడండి. అదంటే ఆడికి వల్లమాలిన పానం " కుండ దింపి యికిలించింది దున్నపోతు. గోచీ దులుపుకుంటూ. ఆ పిల్ల, వాడి స్ఠానే కొలెంలో పార కొడుతోంది. బడితెలాగున్నావు. ఆ పిల్లచేత పార కొట్టించడానికి సిగ్గులేదూ?" కొట్టేటంత కోప్పడ్డాడు కం.బా. "ఈ బంటా వోలు మొత్తంలో నా సెల్లిలా పారకొట్టే మొనగాడెవడో సూపెట్టండి. ఈ ఉప్పరి పారే కాదు-మెట్టపార,పొట్టిపార,గుబ్బెం ఏదిచ్చినా సరే నా సెల్లిలా తిరక్కొట్టు,దడినరకు,కుడపొడుపు,సమ్మటం పూడ్చటం సేసి సూపెట్టమనండి., శాలంజి!" అన్నాడు చాలెంజిగా ఆ బడిత. "అయినా దానిచేత పని సేయనీడండి యీడు. దాన్నో దేవతలా సూసుకొంటాడు. ఆ మాటకొత్తే మా బంటా మొత్తం దాన్నో దేవతలా సూత్తామండి. అది స్తానం చేసి తడి జుట్తు యిరబోసుకుంటే సత్తెమ్మతల్లి,నూకాలమ్మతల్లి,గోదారికాడున్న పోశెమ్మతల్లి దాన్ని పూనేత్తారండి. యెల్లబోత పెడితెగాని దేవతలు శాంతించి పూనకం దిగదండి. దాని జుట్తు ముడవదండి." విషయం పూసగుచ్చినట్లు చెప్పాడు బం.మే. "యెల్లబోత అంటే ఏమిటి?" అనడిగాడు కం.బా. అదేదో వింతగా తోచి. "ఎర్రకూడు, పచ్చకూడు వొండి బలైడానికో పందిపిల్లను కొని బారికతన్ని(గ్రామదేవతల పూజారి) పిలిపించి అతనికిత్తే ఆడు పూస్సేసి దేవతను మా జోలికి రాకుండా సేత్తాడండి. అదన్న మాటండి యెల్లబోత అంటే". "ఓరి వెర్రి నాయాల్లారా? అలాంటిదానికి అలిసిపోయే పనులు చెప్పకూడదు. మనుషులలిసిపోతేనే పూనకాలొస్తాయి. అలాంటోళ్ళు హైక్లాసు పనులే చెయ్యాలి. బంటాలో చిన్నపిల్లలకు కాపలా వుండడం, దాహానికి నీళ్లందివ్వడం, కొలాలు నేను కొలుస్తున్నప్పుడు టేపు పట్టుకోవడం లాంటి పనులు" "అలా సేత్తే దాని కూలి కట్టి వొంతులేసుకోడానికొప్పుకోరు మా వోళ్ళు ఒక్క మేస్త్రీ కూలికే పాలి కడ్తారు." అన్నాడు ఆ పిల్ల అన్న. "సరే. దాని కూలీకి రెట్టింపు నేనిస్త్సాను. నా మకాం కాడికి పంపించు. అక్కడ కాపలా వుండి నాకు నీళ్ళివ్వడం, కారేజి కడగడం లాంటి పనులు కడుపులో సల్ల కదలకుండా చేస్తుంది". ఆ పిల్లనుద్దరించేవాడిలాగా అన్నాడు కం.బా. తన అసలు టెక్నిక్ ఉపయోగిస్తూ. "అది మీ మకాం కాడ కూకుంటే, నా పారకొట్టుకి తట్టెవరెత్తుతారు? నే ఖాళీగా కూకుండిపోనా? అప్పుడు నా కూలీ సెడుద్ది గదా!" "నీ కూలీ నే కట్టుకుంటాను. లారీలన్నింటికి డోర్లు తీయడం,యింజన్లలో నీళ్లేయడం లాంటివి నువ్వు చూసుకో. అంటే క్లీనరు పని అన్నమాట". బుర్ర గోక్కోసాగాడు పిల్ల అన్న. ఇందులో తిరకాసేమన్నా వుందేమోనన్న అనుమానంతో. "ఏరా కొండిగా! ఇంకా ఏటాలోచిస్తున్నావ్. యీ సిట్టం బానే వుంది. అయిగోర్ని మా లష్మి సూసుకొంటుంది. లారీలను నువ్వు చూసుకో. యీ సిన్నయి గారెంతంటె పెద్ద కంట్రాటోరికంత" సిఫార్సు చేశాడు బం.మే. 'మహాలక్ష్మా, ఆ పిల్ల పేరూ' సంబరపడిపోయాడు ఓఅరు తెలుసుకోకుండానే-ఆ పిల్లంటే యిదిలో పడ్ద కం.బా. "అయినా యీరికి నా సెల్లి మీదే ఎందికింతిదీ?" సందేహిస్తున్నాడు కొండయ్య. "ఇదిగో ఈ పాతిక అడ్వాంసు తీసుకో, దాన్ని నా మకాం దగ్గర్తకి పంపించు. పనవ్వగానే వచ్చేస్తుంది. దాని గొడవ నాకొదిలెయ్యి." అని నోట్లందించి " ఇంద యీ చీటీ తీసుకో. పక్కూరి సారా కొట్టతనికి చూపించు. నువ్వు తాగినంత సారా పోస్తాడు ఉట్టినేలే!" చీటీ పుచ్చుకొని ఒక గెంతులో కొలెం లోకి దూ్సుకుపోయాడు కొండయ్య. మనసు తేలిక పడింది కం.బా.కి. తన ఎర చేపకి తప్పక పడుతుందన్న గట్టి నమ్మకం ఎప్పుడూ వుంది. మేస్త్రీకేదో అనుమానం కలిగింది. " బాబుగోరూ కన్నెపిల్ల మీద రంకడితే యేల మీద తప్పేస్త్సారు మా పంచాయితీ పెద్దలు. అందుకే సెరపడానికి సెయ్యేసినోడ్ని , నిలువుగోతిలో పీకలదాకా పూడ్చేత్తారు మా పడుచు పిల్లలు. మీకేం మాట రాకుండా సూసుకోండి. అసలే మాలక్ష్మికి మా పెద్ద పొగరు." పొగరుమోతంటే మనసు మరీ ఊరింది కం.బా.కి. కోతిలాంటి మనసు చటుక్కున మకాం కేసి ఎగిరిపోయింది. మహాలక్ష్మి సులువుగా నిలువుగొయ్యి తవ్వేస్తుంది. ఒంపులు తిరిగిన అవయవాల కదలికల సొంపులు తాపీగా చ్హూస్తున్నాడు అతడు. గొయ్యి ప్ూర్తయ్యింది. " సరే, పూడ్చేయ" అంటూ తనే సరదాగా గోతిలోకి దూకాడు. పొగరుగా పార కొట్తి మట్టిని గోతిలోకి పోస్తోంది మాలక్ష్మి. నింపిన మట్టి మీదకెగుర్తూ అలా అలా పైకొచ్చేస్తున్నాడు అతను. మరుక్షణంలో పూడ్చిన గోతిమీద గోపాలకృష్ణుడిలా పోజెట్టి వెలిశాడు. తెల్లబోయి చిన్నబుచ్చుకుంది మాలక్ష్మి. జాలిపడి, బుజ్జగించి మకాంలోకి నడిపించుకుపోయాడు. అతను ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఆ నవ్వు చూసి "బాబుగోరు! నాకూ ఓ సీటీ యిప్పించండి. పెందరాళే తొంగోని పొద్దుగాల్లే కొలతల కొస్తాను". అంటూ లేచాడు బం.మే. ఇవ్వాళ బట్వాడా ఎలాగూ లేదని ఖరారు చేసుకొని, పార, గునపం భూజాన్నేసుకొని ఎదురుగా నిలబడింది కత్తిలా మాలక్ష్మి. కం.బా. ముఖం చేటంతయ్యింది. "పారగట్రా ఒగ్గేసి అయ్యగారి మకాంకాడుండి ఆరికి కావల్సింది సూసుకో. అట్లా తిప్ప సివర దుబ్బులు కాడుందే పాక అదే యీరి మకామ" అన్నాడు బం. మే. క.బా. చేతిలో చీటీ లాక్కుంటూ. "అట్లాంటి పనులు నాకు సేతకావు. నేసెయ్యలేను, నుయ్యో,గొయ్యో తియ్యమను స్సెణంలో సేసేత్తాను" అంది మాలక్ష్మి ఖచ్చితంగా. "ఆ పనే సేద్దూవుగానీ నడు" అన్నాడు కం.బా. ఇప్పటినుంచే వాదనెందుకని, తరువాత ఆతిప్పలు ఎలాగూ పడొచ్చని. "సరే నెగండి. పనిసూసి సొమ్ముచ్చుకుని బేగిరమ్మాన్నాడు మాయన్న" కైపుగా లేచాడు కం.బా. తప్పతాగిన మైకంలో తిప్పమీద పడున్న కొండయ్యని మలికోడి లేపింది. అంతా అయోమయంగా వుంది. మత్తును చీల్చుకొని అతికష్టం మీద పరిస్థితిని అవగాహన చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతా గ్యాపకానికొచ్చింది. తల విదిల్చి తన గుడిసెకేసి నడిచాడు. మాలక్ష్మి గుడిసెలో లేదు. ఎక్కడుందో అర్ధమయ్యింది. 'ఆడి మకాంకాడ ఆడితో తొంగోని కులుకుతోదన్నమాట" ఇంతవరకు మైకాన్నించ్చిన కడుపులోని మంట బుర్రకెక్కి మా చిర్రెక్కిపోయాడు. కొలాయి దాటి నీటంచుకు చేరాడు. తిప్ప చివర మకాంలో దాన్ని నరికి పోగెట్టడానికి. నాలుగడుగులేసేసరికి పార, గునపం కాళ్లకడ్డుపడ్డాయి. అవి మాలక్ష్మి పనిముట్లు. పార రేకు మీద మొలసంచి వుంది. దాంట్లోంచి తొంగి చూస్తున్న నోట్లకట్ట కనబడింది. పిచ్చెక్కి గోదారంతా కలయజూసాడు. దూరంగా మాలక్ష్మి మొలలోతు నీళ్లల్లో జలకాలాడుతోంది. కిలకిలమంటూ కూనిరాగాలు, తరంగాల చప్పుళ్ళతో బాటు లీలగా వినిపించాయి. 'వుషారెక్కిపోతోంది యీ గుడిసేటి లంజకు" అని మండిపడ్డాడు. అహర్నిషలు దాని బంగారు భవిష్యత్తు కోసం తనుపడ్డ శ్రమ, కాయకష్టం, పోగేసిన డబ్బు ఎదురొచ్చి తన్ను వెక్కిరించినట్టయ్యింది. ఉడుకుమోత్తనంతో నిలువెల్లా కాలిపోతున్నాడు. మాలక్ష్మి స్నానం బాపతు పిల్ల అలలు అతని కాలికి సోకి ఆవిరై పోతున్నాయి. గునపం అందుకున్నాడు తన చెల్లెల్ని పొడవడానికి. బట్యాడా కోసం పెందరాళే లేచిన బంటా జనం చుట్టూ చేరారు. సూర్యోదయం పూర్తిగా అయ్యింది. ప్రవాహాన్ని చీల్చుకొంటూ మాలక్ష్మి అన్నకేసి నడుస్తోంది. మోకాలి నీటిలో ఆగి, గునపం ఎత్తి బిగుసుకుపోయిన అన్నకేసి చూసింది. అన్నచుట్టూ జనం కనబడ్డారు. అన్న తనకేసి తీక్షణంగా చూస్తున్నాడు. ఆగి ముడివిప్పి జుట్టు విరబోసి దులిపింది. "అయ్యబాబోయ్! అమ్మోరు పూనింది మాలక్ష్మికి" అన్నారు చుట్టూ వున్న జనాభా. మాలక్ష్మిలో అమ్మోరు కనబళ్లేదు కొండయ్యకి - ఓ కామ పిశాచి కనబడింది. మడమ నీటిలోకొచ్చి అన్నకేసి ఆశ్చర్యంగా చూసింది మాలక్ష్మి. అన్న అదోలా చూస్తున్నాడు తనకేసి. 'ఏటైపోనాది మాయన్నకి. అనుకొంది హడావుడిగా కొప్పు ముడేసుకొని ఒడ్డును చేరుతూ. కొప్పు ముడేసుకోవడం చూసిన బంటా జనాభాకి మనసు తేలికపడింది. అమ్మోరు పూనకం కాదులే అని. గట్టు చేరి పార, డబ్బులసంచి తీసుకోడానికి వంగింది మాలక్ష్మి. గునపం పట్టుకున్న కొండయ్య చేతులు బిగిశాయి. గురిపెట్టడానికి గునపం ఆకాశంలోకి ఎత్తి వూపిరి బిగించాడు. ఓ క్షణంలో ఆ గునపం మాలక్ష్మి శరీరాన్ని మట్టిలోకి దిగేయబోతోంది. "ఓయ్ రండర్రా రండి. గోరం జరిగిపోనాది. కంట్రాక్టరుగోరి బామ్మర్దిని ఎవరో పీకదాకా పూడ్చేసినారు. సావుబతుకుల్లో వున్నాడు. తొరగా వచ్చి మట్టి తవ్వి ఆడిని బైటికి తీయండి" పరిగెత్తుకొస్తున్న డ్రైవర్ల కేకలు స్పష్టంగా వినబడ్డాయి. వాటిని ఇసుక తిప్పలన్నీ మారుమ్రోగించాయి.
(గమనిక : రచయత అనుమతితో ఈ కధను ప్రచురించడం జరిగింది.)

No comments:

Post a Comment

Pages