వీడెవడండీ బాబూ..! - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ - అచ్చంగా తెలుగు

వీడెవడండీ బాబూ..! - కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

Share This
వీడెవడండీ బాబూ..! 
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ 

ఆ మధ్య నేను ఒక సమావేశానికి వెళ్ళేందుకు విజయవాడ వెళ్ళా.. రైలు దిగి బయటకు రాగానే. ఆ సమావేశానికి హాజరయ్యే మరొక ఇద్దరు తారసపడ్డారు. పరిచయాలు పూర్తయ్యక సమావేశమందిరానికి బయలుదేరాం..ముగ్గురం ఊరు చూస్తూ అక్కడ తిరిగిన పాతరోజులు వాటి జ్ఞాపకాలు షేర్ చేసుకుంటు నడకమొదలెట్టాం.. కొద్దిదూరం వెళ్ళాక కౌతవరపు వారి వీథి దగ్గరకు వెళ్లే సరికి నా ప్రక్కన నడుస్తున్న మూడో వ్యక్తి.. "ఇదగో.. ఈ కౌతవరపు రోడ్లోనే నేను చాలా కాలం వున్నా..! 
ఇక్కడ రూం నుంచి నేరుగా 'ఊర్వస ' 'ధయేటర్ ' కి వెళ్లేవాళ్ళం. 'బాండడ్ క్వన్ ' లాంటి 'సనమాలూ 'ఎన్న ' చూసేమో..! " అన్నాడు. అంతటితో ఆగకుండా కొనసాగిస్తూనే వున్నాడు...ఇక్కడే.. కళ్యాణ రెస్టారెంట్ వుండే. అదిగో అక్కడే 'పద్మనా ఎంక్లేవ్ లో మా ఫ్రెండ్ వుండేవాడు. పేరు '' ప్రతమా 'రావు అని, మాంచి వస్తాదు. వాడంటే అందరం భయపడేటోళ్ళం. ఒన్ టైం ఒక సమావేశం లో నేను ప్రధాన వక్తను.. ఆ సమావేశానక... పద్మన ప్రయదర్శన, వాసుదేవారావు కొండూర , గోటేట వెంకటేశ్వరరావు, దుర్గ భమడపాట,నాగజ్యోత రమణ, కళ్యాణ గార కాసభట్ల, చెరువు రామమోహనరావు, వెంకటప్పారావు, వసంతశ్ర, సహన మనాక్ష , బాలభాస్కర్ చవుకుల,దప్త సతష్ , పావనశ్రనవాస్, శ్రదేవ కవుటూరు, యనమండ్ర శ్రనవాస్..కొల్లూరు వజయా శర్మ, గతా కొరుగంట, సంధ్యప్రయ, నాగార్జున కావూర, జగన్నధ్ వలదమల్ల, నరేష్ కందుల, కమల ఈవన , గోపకృష్ణ తడకమళ్ళ.. " జంధ్యాల గారి సినిమాలో సుత్తి వీరభద్రరావులాగా లిస్ట్ చెప్పేస్తూ పోతున్నాడు.. ఎక్కడైనా బ్రేక్ పడుతుందేమో చూశా.. ఊ హూ లిస్ట్ పెరుగుతూనే వుంది. అతనేం మాట్లడుతున్నాడో నాకు బొత్తిగా అర్ధం కావటంలేదు. ఒకటే టెన్షన్.నత్తి అనుకున్నా.. పదాల స్పష్టంగా పలుకుతున్నారు. వేరే రాష్ట్రం నుంచి వచ్చారేమో అనుకున్నా.. చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు."మరి వీడికి ఇదేం పోయేకాలం అలా తెలుగును.. మనుష్యల పేర్లను ఖూనీ చేసి నన్ను చంపుతున్నాడు".. అసలే తెలుగు అక్షర దోషాలుంటేనే నాకు మహా మంట.. ఎప్పుడెప్పుడు సమావేశమందిరం వస్తుందా.. ఎప్పుడు వీళ్ళ నుంచి పారిపోదామా అని గబగబా నడుస్తున్నా అయాసం తప్ప సమావేశ మందిరం మాత్రం రావట్లే..! 
వీడేంట్రా ఇలా నాకు తగులుకు చచ్చాడని.. చిరాకెత్తింది. అతన్నే అడిగితే నొచ్చుకుంటాడెమో నని ప్రక్కన నడుస్తున్న రెండో వాడిని చిన్నగా అడిగా .. తన చెవుల నుంచి దూది పింజలు రెండు తీసి చెప్పండి అన్నాడు..నేను నా అనుమానం నివృత్తికై అడిగేశా.. "అతగాడేంటి అలా చిత్రవిచిత్రంగా మాట్లాడుతున్నాడు" అని.. " నానోటికి ఎందుకు సార్ పనికల్పిస్తారు వారినే అడగండి.. " అంటూ గుసగుసగా ఒక ఉచిత సలహా ఇచ్చి తప్పించుకున్నాడు. ఇక కుతూహలం,ఉత్సుకత,కోపం ఆపుకోలేక "సారూ! మీరెందుకు ఒక రకంగా మట్లాడుతున్నారు. మీరు మాట్లాడే పదాలలో కొన్ని శబ్ధాలు వదిలేస్తున్నారు" అని ధైర్యం అప్పుతెచ్చుకుని అడిగేశా.. అతను వెంటనే " నేను నాస్తక్ " అని అన్నాడు "నాస్తక.. ఓహో నాస్తికులా..అదిసరే..!.. నాస్తికుడైతే ఏంటి? దేవుడులేడనేది మీ వాదన అంతే కదా..అంత వింతగా విడ్డూరంగా మట్లాడటం ఎందుకు?" అన్నాను మరోకసారి దైర్యం తెచ్చుకుని.. " నేను నాస్తక్ కనుక గుడి నాకు నచ్చదు. దేవుడే లేనప్పుడు గుడి ఎక్కడుంటుంది. అందుకే నేను గుడి గురించి పలకను నాచే పలకించాలని ప్రయత్నంచొద్దు.. ఈప్పటికే ఐదు సార్లు పలకంచావ్.. ఆ" అని సీరియస్ గా సమావేశమందిరంలోకి వెళ్ళిపోయాడు.. దిమ్మతి రిగి మైండ్ బ్లాంక్ అయ్యి..అప్రతిహతంగా తెరుచుకున్న నా నోరు మూతపడలేదు. . " వీడి దుంపతెగ..చేపల మార్కెట్ లో వీభూతి గడ్డలమ్ముకుండే ఫేసూ వీడు.." దేవుడు లేడని గుడి వుండదట.." వీడి పిండం పిచ్చుకలెత్తుకెళ్ళ".. అందుకే అన్నీ పదాలలోని అక్షరాలకూ..గుడి,గుడి దీర్ఘం లేకుండా మాట్లాడేశాడట... అమ్మ భడవ..హేతువాదంటే.. విషయంలో హేతువుండాలి గానీ ..వీడెవడండీ బాబూ.. అక్షరాల గుడి తీసేస్తాడు..అక్షరకుక్షి.. " నాకు తెలుస్తోంది నా బ్లడ్ ప్రెషర్ పెరుగుతోందని.. నా+అస్తి = నాస్తి.. నాస్తికత్వంలోనే ఆస్తికత్వం ఉందన్న విషయం తెలియని వీణ్ణి మూర్ఖుడనుకోవాలో.. అక్షరం పొరబాటు లేకుండా గుడి తీసేసి గడగడ మాట్లడిన వాడి నేర్పరి తనానికి దండం పెట్టాలో అర్ధం కాక తెల్ల మొహం వేయటం నా వంతైంది. చివరాఖరకు నా పేరు మీదే డౌటొచ్చి అక్షరమాల తిరగేశా... కరణం కళ్యాణ కృష్ణ కుమార్..హమ్మయ్య..! నా పేరు మీద ఎవరూ గుడి కట్టలేదు.. గుడికి దీర్ఘమూ కట్టలేదు,,బ్రతికిపోయా..! భగవంతుడా !... వీడి చేతిలో నేను ఖూనా..చీ..చీ.. ఖూనీ కాలేదు అనుకుని సమావేశంలో వాడికి దూరంగా కూర్చున్నా. ప్చ్..! ఏమి సేతురా..లింగా..! 
(అప్పటి అతను పలికిన పదాలు గుర్తులేక మీ పర్మిషన్ లేకుండా స్నేహితులని సరదాగా మీ పేర్లు వాడుకున్నా.. ఎవరికైనా అభ్యంతరంగా ఉంటే చెప్పండి వారి పేర్లు తొలిగిస్తా..!) (ఇప్పుడు వెనక్కి వెళ్ళి మరలా ఒకసారి ఆ నాస్తిక శిఖామణి ఏమి మాట్లాడాడో చదివి తరించండి..)

No comments:

Post a Comment

Pages