ఆ కాలపు అమ్మాయి
డా. లక్ష్మి రాఘవ
కూతురు పార్వతికి మధ్య పాపిడి తీసి చెక్క దువ్వెనతో చిక్కు తీసి బిగించి జడ వేస్తూ౦ ది అచ్చమాంబ. జుట్టు లాగిన నొప్పిని భరించలేక “అమ్మా“ అని అరిచింది ఏడేళ్ళ పార్వతి.
“ఏమిటా అరుపు?“ కసురుకుంది అచ్చమాంబ. “మరీ అంతగా లాగుతావు“ బుంగ మూతితో చెప్పింది పార్వతి. “లాగి వెయ్యకపోతే గంటలో చింపిరి జుట్టుతో వస్తావు” అంటూ పార్వతి ముఖాన్ని తన వైపుకి తిప్పుకుని కణతల దగ్గరనుండి రెండు చేతులు పట్టి తీసి తన తలపై మెటికలు విరిచింది. వేళ్ళు పట పట లాడగానే “నా బిడ్డకు ఎంత దిష్టి!“ అంది. ఇంతలో గుర్రపు బండి చప్పుడయింది. పార్వతి తుర్రున బయటకు పరిగెత్తింది.’నాయన వచ్చా’డంటూ . జరీ అంచు ఉత్తరీయం భుజాన సర్దు కుంటూ వచ్చాడు శ్రీనివాస శర్మ. బయట లోగిలి లోనే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది అచ్చమాంబ. ఉత్తరీయం భార్య కందించి రెండు కాళ్ళు కడుక్కుని ఇంటిలోకి వచ్చాడు శర్మ. నడవలో వున్న ఉయ్యాలపీట మీద కూర్చున్నాక, కంచు చెంబు నిండా నీళ్ళు తీసుకుని, పెద్ద ఇత్తడి గ్లాసులో నీళ్ళు అందించింది అచ్చమాంబ. అతడు నీళ్ళు తాగుతూ, కొంగు భుజం నిండా కప్పుకుని నిలబడ్డ అచ్చమాంబతో “ వెళ్ళిన పని సగం అయినట్టే. ఇల్లు వాకిలి బాగున్నాయి. జమీందారీ రీతిలో వుంది పిల్లకాయ బాగున్నాడు. మన పార్వతికి కొంచెం వయసు తేడా ఎక్కువే అవుతుంది అయినా పిల్ల సుఖపడుతుంది. ఇంటి నిండా పాడి, ఎక్కడ చూసినా ధాన్యపు రాసులు...అన్నిటికంటే చెప్పుకోదగ్గది పిల్లవాడు గుర్రం స్వారి లో దిట్ట!. నాకేమో అన్నీ బాగున్నాయి అనిపించింది. అబ్బాయి తండ్రి గంగాధర శర్మ ఒక సారి వస్తారుట అమ్మాయి నచ్చితే వెంటనే ఖాయం చేసుకుంటాము అన్నారు.” “చాలా మంచి మాట చెప్పారు “ ముఖం వెలిగిపోతూ వుంది అచ్చామాంబకు. అప్పుడే ఇంట్లోకి గెంతుతూ వచ్చిన పార్వతి నాయన పక్కన ఉయ్యాలపీట మీద కూర్చుంది. పార్వతి బుగ్గలు చిదిమి ముద్దు పెట్టు కుంటూ “మా పాపాయి పెళ్లి కూతురాయేనే “ అని నవ్వాడు . “ పెళ్లి నాకేనా నాయనా “ అమాయకంగా అంది పార్వతి . “అవున్రా బుజ్జీ నీకే “ పార్వతిని ఎత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు శ్రీనివాస శర్మ . *************౮ ****************** *************** శ్రీనివాసశర్మది పాలకొండ గ్రామము. యాబై ఎకరాల పొలం వుంది. ఒక్కటే కూతురు పార్వతి. ఏడేళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి ప్రయత్నం చెయ్యలేదు అన్న మాటలు విన బడు తున్నాయి బంధు వర్గం లో. ఉన్న ఒక్క కూతురి కి మంచి సంబంధం చెయ్యాలను కున్నప్పుడు నిదానమే అయ్యి౦ది. ఈసారి వూరి తిరునాళ్ళకు వచ్చిన పూజారి మదనపల్లి దగ్గరలో ఒక మంచి సంబంధం వుందని చెప్పడంతో మధ్యవర్తి ని పంపాడు. వరుడు ఇరవై ఏళ్ళ వాడు. వయసు తేడా ఎక్కువ అనిపించినా పరవాలేదు అనుకుని జాతకాలు చూపిస్తాము అని నిర్ణయానికి వచ్చాడు. జాతకాలు కుదిరితే కబురు పెడితే మొదట నేను వస్తాను అని చెప్పాడుట వరుడి తండ్రి గంగాధర శర్మ. అందుకే తనే స్వయంగా వెళ్లి అబ్బాయి జాతకం తెచ్చి నాడు శ్రీనివాస శర్మ. మరు రోజే జాతకాలు తీసుకుని పూజారి శాస్త్రి గారి ఇంటికి వెళ్ళినాడు శ్రీనివాస శర్మ. జాతకాలు తీసుకుని దేవుడి మందిరంలో పెట్టి క్షణ కాలం ప్రార్థించి, వాటిని తీసుకుని వసారాలో వున్నా చెక్క పెట్టి ముందు కూర్చున్నాడు శాస్త్రి. అతని ముందు వున్న పీటమీద శ్రీనివాస శర్మ కూర్చుని శాస్త్రి గారు ఏమి చెబుతారా అని చూస్తున్నాడు. ఒక అరగంట లెక్కలు వేసాడు శాస్త్రి . ఆత్రుతగా చూస్తున్న శర్మతో “అమ్మాయి జాత కానికి అబ్బాయి జాతకానికి కొంచం తేడా కనబడు తుంది అందు కే ఇతర లెక్కలు వేస్తున్నా “ అన్నాడు . “కుదరదంటారా ?? ఇంత మంచి సంబంధం పోగొట్టుకోలేము శాస్త్రి గారూ..” అర్తింపు గా అన్నాడు. “ మనం సరి అని అనుకున్నా వాళ్ళు కూడా చూపించుకుంటారుగా...“ “నేనొక మాట చెబుతా శాస్త్రి గారూ.. అబ్బాయి జాతకానికి సరి పోయ్యేలా పార్వతి జాతకం రాయండి అప్పుడు వాళ్ళక్కడ చూపించు కున్నా సరిపోతుంది కదా“ కొంచం సేపు జవాబు చెప్పలేదు శాస్త్రి గారు. “నేనేప్పుడు అట్లా చెయ్య లేదు ..” అన్నారు చివరికి “మనపిల్ల కోసం .. మంచి సంబంధం పోగొట్టు కోలేక అడుగుతున్నా“ తనమీద జాలి చూపమన్నట్టు గా చూసాడు శర్మ “సరే లెండి రాత్రికి రాసి పెడతా రేపు రండి“ అన్నాడు . శ్రీనివాస శర్మ సంతోషం గా బయలు దేరాడు ఇంటికి . ఆరాత్రి నిద్ర పట్టక నులక మంచం మీద దొర్లుతూ వున్నా శాస్త్రిగారిని గమనించి “నిద్ర పట్ట లేదా“ అని అడిగింది అతని భార్య జ్ఞానమ్మ.. “ సమస్య వచ్చి మనసు నలతగా వుంది “ “ఏమి సమస్య నాకు తెలీకుండా?” “శర్మ గారు సమస్య తెచ్చి పెటినారు” “అదేమిటి ? “ “కూతురికి ఒక జాతకం తెచ్చ్రుకున్నారు. అమ్మాయి జాతకం పరిశీలిస్తే తనకు వైధవ్యం వుంది. అందుకే అబ్బాయి జాతకం పూర్తిగా చూడలేక పోయా. అందుకని సరి పోదేమో అని అనుమానం వ్యక్త పరిస్తే రెండు సరి పోయ్యే లా అమ్మాయి జాతకం మార్చండి అన్నారు. దానితో సతమత మవుతున్నా. వాళ్ళమ్మాయి జాతకమే ఇలా వుంది అని చెప్పలేను కదా ..” “ఆలోచించి మీకేది మేలు అనిపిస్తే అది చెయ్యండి“ ఆలోచించడం మీ వంతు అన్నట్టుగా అటు తిరిగి పడుకుంది జ్ఞానమ్మ, మరురోజు శర్మ సాయంకాలం వచ్చి శాస్త్రి గారు ఇచ్చిన జాతకాలను తీసుకుని వెళ్లారు. ఆ వారం లోనే మంచి రోజు చూసుకుని మదనపల్లెకు బయలుదేరాడు. మదనపల్లె నుండి గుర్రపు బండి లో ఒక అరగంట ప్రయాణం గంగాధర శర్మ వున్న అగ్రహారం చేరు కోవడానికి . జాతకాలు బాగా కలిశాయని చెప్పి పార్వతి జాతకం ఇచ్చినాడు. “ మీరు చూపించారు గా మళ్లి మేము చూపించాల్సిన అవసరం లేదు లెండి. వారం లోపలే వస్తాము పిల్లను చూడడానికి“ అన్నారు గంగాధర శర్మ. అంత తొందరగా అన్ని నిర్ణయాలు జరిగిపోతాయని వూహించని శ్రీనివాస శర్మ ఆనందానికి అంతులేదు . పెళ్లి చూపులకు ఏడేళ్ళ పార్వతికి చీర కట్టింది అచ్చమాంబ. అది మొయ్యలేక అడుగు వెయ్యటం కష్టమైంది పార్వతికి. అందుకే జాగ్రత్తగా చాపమీద కూర్చోపెట్టింది పార్వతిని అచ్చమాంబ. పెళ్లి చూపులకు గంగాధర శర్మ , అతని భార్య సుందరమ్మ వచ్చారు. పిల్లవాడు రావడానికి కుదరలేదనీ, తమకు నచ్చితే వాడికి నచ్చినట్టే అని చెప్పినారు. బయలు దేరేముందు పార్వతిని దగ్గరగా పిలి ఛి ముద్దు పెట్టుకుని “ మాకు అమ్మాయి నచ్చింది “అని మరీ చెప్పింది . దానికి ఎంతో మురిసి పోయారు శర్మ దంపతులు . అంతే...ఒక నెలలోనే ముహూర్తం కుదరటం పెళ్లి జరగటం అయిపొయింది. పెళ్లి...పెళ్లి అని అందరు సరదా పడ్డా పార్వతి కి మాత్రం ఇంకో వూరికి వెళ్ళచ్చు అనే ఆనందంగా అనిపించింది . కానీ పెళ్లయ్యాక పెళ్లి కొడుకు వాళ్ళు వూరికి వెడుతూ “ పార్వతి పెద్దమనిషయ్యాక...అన్నీ..” అంటూ వెళ్లారు “వాళ్ళతో నేనూ వెడతానూ” అని ఏడ్చింది పార్వతి వాళ్ళమ్మ దగ్గర. “వెడుదూ కానీ కొంచం ఆగాలి. అందరం వెడదాం ఆపైన నీవు అక్కడే..’ అని నచ్చ చేప్పింది కూతురికి. రెండేళ్లు గడిచాయి. పార్వతి పెద్దమనిషయ్యింది. ఒక ఆరు నెల్ల తరువాత మంచి ముహూర్తం చూసి, సారె తీసుకుని పార్వతిని వెంటపెట్టుకుని అత్తవారింట వదిలి పెట్టడానికి సన్నాహాలు చేస్తూ వుంటే పిడుగు లాటి వార్త! పార్వతి భర్త హనుమంత శర్మ గుర్రమం మీద ఏనుగు మల్లమ్మ కొండమీద విడిది చేసిన కలెక్టరును కలవడానికి వెడుతుంటే గుర్రం బెదిరి కొండ లోయలోనికి పడిపోయిందనీ, గుర్రమూ, హనుమంత శర్మా అక్కడి కక్కడే మరణించి నారనీ.......ఈ వార్త విన్న వెంటనే బయలు దేరిన శ్రీనివాస శర్మకి అల్లుడి శవం దర్శనం అయ్యింది. అలా పార్వతి కాపురానికి వెళ్ళకుండానే విధవరాలయింది . సంవత్చరం లోపలే పార్వతికి గుండు గీయించి చీర కట్టించి అత్త గారింట్లో వదలి వచ్చారు శర్మ దంపతులు బరువెక్కిన హృదయాలతో. అప్పటి కాలం లో విధవరాలైన పిల్లకు గుండు గీయించడం ఆనవాయితీ. పదేళ్లు దాటిన పార్వతి అల్లరి మాని, పెద్దమనిషిలా ఆ యింట్లో మసల సాగింది. పెళ్లి అయిన ఆడపిల్ల అత్తగారింట్లోనే అన్న సూత్రం పాటించాడు శ్రీనివాస శర్మ. కూతురి కర్మకి ఎంతో వాపోయింది అచ్చమాంబ. పదేళ్ల పిల్లకు మొగుడు పొతే గుండు గీయించి కాపురానికి పంపేదే తెలుసు కానీ అమ్మాయి జీవితం ఎడారిలా వుండాల్సిన్దేనా ? అని ఆలోచించలేదు ఎవరూ.. వయసులోని కోరికలకు అతీతంగా అమ్మాయి వుండాలనే కోరుకున్నారు కానీ తనకీ ఒక మనసు వుంటుందనీ అందరిలా తనలోనూ కోరిక లు పుడతాయనేదే విస్మరించారు. నిజానికి పార్వతీ కూడా అర్థం కాని వయసులో జరిగిన వైధవ్యాన్ని అంగీకరించింది. జుట్ట్ట్టు పెంచుకోకూడదు, గాజులు తొడుక్కో కూడదు, బొట్టు పెట్టుకో కూడదు అన్న నియమాలన్నీ పాటించింది. సహజంగా తను ఇంతే అన్న పరిస్థితి. పూజకు పనికి రావు , తద్దినాలకు పనికి రావు ...ఎదురు పడితే మంచిది కాదు ఇవి కూడా సహజమే నని తనే అన్నిటి నుండి తప్పుకునేది. ఎప్పుడైనా సరదాగా మాట్లాడ్డాలన్నా తన యీడు వాళ్ళు లేక పోవడంతో పెద్దవాళ్ళు చెప్పినట్టు వినడమే అలవాటు చేసుకుంది. కానీ ముట్టు మూడు రొజులూ ఒక మూలన వున్న కొట్టం లో వుండాల్సి వచ్చినప్పుడు, దూరంగా తన యీడు పిల్లలు తొక్కుడు బిళ్ళ ఆడుతుంటే చూసి తనకీ ఆడాలని మక్కువ కలిగేది కానీ ఆ మూడు రోజుల తరువాత అవి జ్ఞాపకం వచ్చినా అలాటివి తను చెయ్యకూడదు అన్న ఆంక్షలు వుండడం తో వంటింట్లో సహాయం చెయ్యడం, ఇంటి పనులు చక్కబెట్టడం నేర్చుకుంది. క్రమంగా సుందరమ్మ అనారోగ్యం ఎక్కువ అవడం తో పార్వతే అన్ని పనులూచెయ్యాల్సి వచ్చేది . అందుకే పదిహేనేళ్ళకే పార్వతి కోరికలకి కాక పనికి బానిస అయ్యింది . సుందరమ్మ కు అనారోగ్యం ఎక్కువై మంచానికే పరిమిత మైనా అన్ని పనులూ ఆవిడ ఆజ్ఞ ప్రకారమే చేసేది. ఒక రోజు గంగాధర శర్మ “ అమ్మా పార్వతీ, రేపు పని మీద డిప్యూటి కలెక్టరు దొర ఈ వూరికి వస్తున్నారు, మన ఇంటికి రమ్మని , భోజనం పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. మీ అత్తగారేమో చేయలేదు కదా..నీవు పోళీలు[బొబ్బట్లు] చెయ్యగలవా?“ అన్నారు అలా కోడలిని అడగటం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది . “చేస్తాను మామయ్యా“ బ్రిటీష్ పాలనలో అధికారులుగా వచ్చే వారిని దొరలనే వారు. వారికి భారతీయ వంటకాలు బాగా నచ్చేవి కూడా. అలా వచ్చాడు దొర జాన్ ఆఇంటికి. బోజనానికి టేబులు తాయారు చెయ్య బోతుంటే వద్దని గంగాధర శర్మ సరసన పీటమీద కూర్చున్నాడు జాన్. గుండు కొట్టిన తలమీద కొంగు లాక్కుంటూ వడ్డిస్తూ౦ది పార్వతి. తలయెత్తి “ హలో“ అన్నాడు జాన్. ఒక్కసారి బిత్తర పోయి మామగారిని చూసింది పార్వతీ. ఇక్కడి ఆడవాళ్ళకు హలో అనడం తెలీదని చెప్పాడు శర్మ. పోళి చాలా ఇష్టం గా తిన్నాడు జాన్. భోజనం తరువాత పార్వతి అలా ఎందుకు వున్నదని అడిగాడు జాన్. భర్త చని పొతే గుండు గీయించడం ఆనవాయితీ అని, తనకొడుకు చని పోయిన తరువాత కోడలు పార్వతీ అలా వుండాల్సి వచ్చిందనీ చెప్పాడు. తరువాత జాన్ ని తమ వూరి గుడి కి తీసుకెళ్ళాడు. అది తన తాత కట్టించినదనీ, ప్రతి సంవత్చరం దేవుడి కళ్యాణం తిరు నాళ్ళు జరుపుతామనీ చెప్పాడు. కళ్యాణం జరుపుకున్న ఉత్చవ విగ్రహాలు తేరు [రథం ] మీద వూరేగుతాడని , అక్కడే వున్న రథాన్ని చూపించాడు. రథం చెక్కలతో చెయ్యబడ్డా చక్రాలు మాత్రం రాతివి. ఎంతో బాగుంది అనిపించి జాన్ ఆ రథం ఫోటోలు తీసుకున్నాడు. చక్రాలు తీస్తుంటే వాటిమీద చెక్కబడి వున్న అక్షరాలను గురించి ఆసక్తిగా అడిగాడు జాన్. అవి పేర్లు అనీ,ముందు చక్రాలపైన వున్న తాత పేరు చదివాడు శర్మ. వెనక చక్రాలమీద రాత వేరుగా వుండటం తో మీ నాన్నమ్మ పేరు చెక్కినారా అని అడి గాడు జాన్. సమాదానం చెప్పక ఇబ్బందిగా మొహం పెట్టాడు శర్మ. “ఏమైంది ?” మళ్ళీ అడిగాడు జాన్. “మాతాత ఒక ఆవిడను వుంచుకున్నాడు ఈవూరి లోనే. ఆవిడ పేరు వెనక చక్రాల పైన వుంది“ చెప్పక తప్పలేదు శర్మకి. జాన్ ఆశ్చర్యంగా చూసాడు. ఆతరువాత అతను ఏదో ఆలోచిస్తున్నట్టు వుండి పోయి ఎక్కువ మాట్లాడ లేదు . ఇంటికి వచ్చాక పార్వతీ కాఫీ ఇచ్చింది. అది తాగుతూ జాన్ “శర్మ గారు మీరేమీ అనుకోనంటే, ఒక మాట అడగవచ్చా“ అన్నాడు. “అడగండి“ “ఇందాక గుడి దగ్గర దేవుడు వూరేగే రథాన్ని చూపారు. మీ తాత ఎవరినో వుంచుకోవడానికి ఇష్టం వున్నప్పుడు, ఆ ఉంచుకున్న ఆవిడ పేరే ఆ పవిత్ర చక్రాల పైన రాయించడాని అభ్యంతరం లేనప్పుడు.. చిన్నపిల్ల మీకోడలికి మరో పెళ్లి చెయ్యడానికి ఎందుకు ఆలోచించలేదు?..సారీ...నాకు అనవసరమే అనుకోండి...” అన్నాడు జాన్ . నిజంగా ఎప్పుడు ఆలోచించలేదు కదా అనిపించింది శర్మకు...అతను తన ప్రశ్నకు జవాబు చెబుతాడని అనుకోలేదు జాన్ కూడా. అందుకే మరీ ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఆరాత్రి నిద్ర పట్టలేదు గంగాధరశర్మ కు. జాన్ అడిగిన ప్రశ్న అతన్ని ఆలోచింపచేసింది. పదహారేళ్ళ పార్వతిని సాంప్రదాయం పేరిట తనే కాదు, తన పుట్టింటి వాళ్ళు కూడా ఆలోచించినట్టు లేదు. తెల్లారేసరికి ఒక నిర్ణయానికి వచ్చాడు “ఒకసారి నా స్నేహితుడి దగ్గరికి వెళ్లి సాయంకాలం వస్తానమ్మా“ అని పార్వతీ కి, భార్యకు చెప్పి వూరికి బయలు దేరాడు. సాయంకాలం రాగానే గంగాధర శర్మ సంతోషంగా ఇంటికి వచ్చాడు. భార్య పడుకున్న గది లోకి వెళ్ళాడు. చాలాసేపు మాట్లాడాడు. తరువాత పార్వతిని పిలిచి మాట్లాడాడు. అతను చెప్పినది విని మామ గారి కాళ్ళకు నమస్కరించింది పార్వతి. శ్రీని వాస శర్మకు కబురు పంపాడు వెంటనే రమ్మని. వాళ్ళు గాబరా పడ్డారు ఎప్పుడులేనిది వియ్యంకుడు ఇంత అర్జెంటు గా రమ్మనడం ఏమిటా అని. వెంటనే బయలు దేరి వాళ్ళ వూరు చేరేసరికి శర్మ ఇంటి ముందు పందిరి ..పచ్చని మామిడి తోరణాలు..ఏమిటో అనుకుంటూ లోపలకు వెడితే గంగాధర శర్మ సంతోషంగా లోపలి ఆహ్వానిస్తూ “రండి బావ గారూ. ఈరోజు దత్తత కార్యక్రమం వుంది. శంకర్ అన్న అనాధ కుర్రాణ్ణి దత్తత తీసు కుంటున్నా. అతను నా స్నేహితుడి దగ్గర వారాలు చేసుకునే అబ్బాయే. దత్తత కార్యక్రమం ముగిసి పోయాక రేపు తెల్లవారి ఐదు గంటల ముహూర్తానికి పార్వతికి అతని తో పెళ్లి ... అంటే పార్వతీ మళ్ళీ నా కోడలే!” అతని మాటలు పూర్తీ కాకనే అచ్చమాంబ అతని కాళ్ళకి దండం పెట్టు కుంటూ వుంది. శ్రీనివాస శర్మ అతని చేతులు కళ్ళ కద్దుకున్నాడు. వారి ఆనందం చెప్పడాని కి వీలు లేనంతగా వుంది. అచ్చమాంబ లోపలి వెళ్లి కూతుర్ని వాటేసుకుని ఏడ్చింది. గంగాధర శర్మ ఎంత పెద్ద మనసు చేసాడో అని అందరూ అంటుంటే తనలో ఈ ఆలోచన కలుగ చేసిన జాన్ కు ధన్యవాదాలుతెలుపుకున్నాడు గంగాధర శర్మ మనసులోనే. ********************************************
No comments:
Post a Comment