ఆత్మహంస - పెయ్యేటి రంగారావు - అచ్చంగా తెలుగు

ఆత్మహంస - పెయ్యేటి రంగారావు

Share This
ఆత్మహంస 
- పెయ్యేటి రంగారావు

ఎగురుకుంటూ పోతున్నాయి విహంగాలు గగనంలో
ఏలా ఈ ఆత్మహంస ఎగురకుంది తనువొదిలి?  ||
1. పక్షములొదవిన తక్షణమే ఇక
పక్షులెగురునే వియత్తలమ్మున
పక్షములెన్నో వయసుకు చేరెను
కమలాక్షా, నీ కక్ష ఏటికో
పరమాత్మా, ఈ ఆత్మను చేదుకో ||
2. ఘడియ ఘడియకు బోయలారుగురు
శరములనెన్నో దూస్తూ వుంటే
తడవ తడవకు తాపము పెరిగెను
తనువు పైననే తామసమాయెను
పరమాత్మా, ఈ ఆత్మను పిలుచుకో ||
3. పురుషార్థమ్ముల అర్థ కామముల
ధ్యాసయెగాని ఇతరము లేదు
జీవితమనగా ముగియని కథగా
వెతలను పెంచెను, వేధను గూర్చెను
పరమాత్మా, ఈ ఆత్మను కలుపుకో ||
(పక్షములు = రెక్కలు.  పక్షములు = కృష్ణపక్షము, శుక్లపక్షము.  బోయలారుగురు = అరిషడ్వర్గములు.  పురుషార్థములు - ధర్మార్థ కామ మోక్షములు.  అర్థము   = కోరిక, ధనము.)
 

No comments:

Post a Comment

Pages