అన్నమయ్య పొడుపు కథల కీర్తన- అప్పడుండే కొండలోన వివరణ- 11వ భాగం (27-02-2014)
డా. తాడేపల్లి పతంజలి
11. ముందు కూతురాలు ఆమె ముందు ఆలుకూతురాయె - పొందుగా పెండ్లాము తానాయె ఓ వేంకటేశ దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
తాత్పర్యము
విష్ణువుకు ముందు అవతారంలో కూతురు భార్య అయింది.
తర్వాత అవతారంలో భార్య కూతురయింది.
ఇంకొక అవతారంలో చక్కగా భార్య అయింది
******&*********
భూదేవి వరాహవతారంలో విష్ణువు భార్య. భూదేవికి పుట్టిన కూతురు సీత (లక్ష్మీదేవి అవతారం) భార్య అయింది.
గంగ (లక్ష్మీదేవి అవతారం) వామనావతారంలో విష్ణువుకు కూతురయింది.
కృష్ణావతారంలో రుక్మిణి (లక్ష్మీదేవి అవతారం) అనే పేరుతో చక్కగా భార్య అయింది.
భూదేవి, సీత, గంగ- వీరందరూ లక్ష్మీ స్వరూపలు. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క దేవ కార్య ప్రయోజనార్థం విష్ణువుకు ఒక్కొక్క రకంగా దగ్గరయ్యారు.
విశేషాలు
1.లక్ష్మీ దేవి, భూదేవి అని రెండు రూపాలలో మనం పూజిస్తున్నాం. నిజానికి అమ్మవారు ఒక్కరే. అమ్మవారు మూడు స్థానాల్లో లయార్చ, భోగార్చ మరియూ ఆధికారార్చ అనే రూపాల్లో దర్శనమిస్తుందని పెద్దలు చెబుతారు. లయార్చ అంటే భగవంతుని యొక్క వక్షస్థలంపై ఉన్న రూపం. భోగార్చ అంటే భగవంతునికి ప్రక్కగా ఉండే రూపం. ఒంటరిగా భగవంతుడు ప్రక్కన లేని రూపంలో దర్శనమిచ్చే రూపం అధికారార్చ.
మన మానవ సంబంధాలు దేవునికి అంటగడితే కొన్ని ప్రశ్నలకు జవాబులు తెగవు. ఉదాహరణకి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలో వేంకటేశుడు భూదేవి పుత్రి సీతకు భర్తగా చెబుతారు. అదే సుప్రభాతంలో భూదేవి భర్తగా చెబుతారు. రెండింటికి సమన్వయం కష్టం. నారాయణుడు భూదేవికి భర్త. శ్రీ రాముడు సీతకు భర్త. మన వావి వరుసలు సర్వము తానైన భగవంతునికి అంటకట్టకూడదు.
ఒకటికి రెండుసార్లు లేదా వేయిసార్లు దేవుని పొగడటం మనకు అలవాటు. లేకపోతే మనకు తృప్తి ఉండదు. అందుకే దేవుని ఇద్దరు భార్యలతో కలిపి పూజిస్తున్నాం. తత్వం ఒకటే అనే జ్ఞానం వచ్చేంతవరకు వేంకటేశుని ఇద్దరు భార్యలతో కలిసి పూజించే అలవాటు పెద్దలు చేసారు. అన్నమయ్య కూడా అందుకే ‘పన్నిన లక్ష్మి భూమి పతి వి నీవు’ అన్నాడు.(నీకే నే శరణు అను నాగీత వ్యాఖ్య)
2. విష్ణువును మామకు మామగా ఒక చాటు పద్యంలో కవి ఇలా వర్ణించాడు.
మామను సంహరించి యొక మామకు గర్వమడంచి యన్నిశా
మామను రాజుజేసి యొక మామ తనూజున కాత్మబంధువై
మామకు గన్నులిచ్చి సుతు మన్మథు పత్నికి దానె మామయై
మామకు మామయైన పరమాత్ముడు మాకు బ్రసన్నుడయ్యెడిన్.
తన కృష్ణావతారంలో మామ అయిన కంసుని సంహరించాడు.
రామావతారంలో వారధి కట్టడానికి ముందు తన మామ అయినసముద్రుని గర్వాన్ని అణచాడు.
రాత్రికి మామ అయిన చంద్రునికి `రాజు` అనే పేరు ఇచ్చాడు.
తనకు మామ అయిన పాండురాజు కొడుకైన అర్జునునకు ఆత్మ బంధువుడయ్యాడు.
విశ్వరూప సందర్శన సందర్భంలో మామ అయినధృతరాష్ట్రునికి కన్నులిఛ్చాడు.
తన కుమారుడైన మన్మథుని భార్య రతీదేవికి తాను మామ అయ్యాడు.
క్షీర సాగర మథన సందర్భంలో తనకు తన కూతురు లక్ష్మిని ఇచ్చి పెండ్లి చేసిన మామ సముద్రునికి , తన పాదములనుంచి పుట్టి తనకు కూతురైన గంగనిచ్చి మామకి మామ అయిన విష్ణుదేవుడు మనకు ప్రసన్నుడవుగాక!
ఇందులోని మామ శబ్దముతో కవి చమత్కారంగా ఆడుకొన్నాడు.
3. విష్ణువు భూదేవికి భర్త అని చెబుతూ వారి దాంపత్యాన్ని దేవీభాగవతం వర్ణించింది. (తొమ్మిదవ అధ్యాయము)
4.నీసతి పెక్కు కల్ములిడ నేర్పరి,లోకమకల్మషంబుగా
నీ సుత సేయుబావనము,నిర్మిత కార్యధురీణ దక్షుఁడై
నీ సుతుఁ డిచ్చు నాయువును,నిన్ను భజించిన గల్గకుండునే
దాసుల కీప్సితార్థములు దాశరథీ!కరుణాపయోనిధీ!
దయాసముద్రుడవైన రామా !
(నీ భార్య లక్ష్మి అనేక సంపదలు ఇవ్వటంలో నేర్పుకలిగినది.
నీ కూతురు గంగ లోకాన్ని పాపం లేకుండా చేస్తుంది.
నీ కుమారుడు బ్రహ్మ ఆయువు ఇస్తాడు.
నిన్ను సేవించిన భక్తులకు కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయి. )
ఈ ప్రసిద్ధమైన దాశరథి శతక పద్యంలో గంగను, లక్ష్మిని భార్యగా, గంగగా విడివిడిగా ప్రస్తుతించాడు.
5.శంకర భగవత్పాదులవారు గంగను మకరందంగా తన షట్పదీ స్తోత్రంలో చెప్పారు.
దివ్యధునీమకరందే పరిమలపరిభోగసచ్చిదానందే
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే
శ్రీ మహా విష్ణువు పాదాలలో
1. దేవలోక నది మందాకిని అనే మకరందము ఉంటుంది.
2.ఎంత అనుభవించినా తృప్తి తీరని పరిమళము ఉంటుంది.
3. సంసార భయాన్ని , విచారాన్ని పోగొట్టే శక్తి ఉంటుంది.
అటువంటి విష్ణు పాదారవిందములకు వందనము . ఈ విధంగా పొడుపు కథ ద్వారా గంగాది నామాలను , విశేషాలను స్మరింప చేసిన అన్నమయ్యకు అభివందనం.
అన్నమయ్య పొడుపు కథల కీర్తన- అప్పడుండే కొండలోన వివరణ- 12వ భాగం (28-02-2014) 12. ఆకులేని అడవి లోన మూడుతోకల పెద్దపులిని - మేక యొకటి యెత్తి మింగేరా ఓ వేంకటేశా దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
ఈ పొడుపు కథను నేను ఇలా విభజించి రెండు పరిష్కారాలు చూపుతున్నాను.
మొదటి పరిష్కారం
ఆకులేనిఅడవిలోన/
మూడుతోకల పెద్దపులిని /
మేక యొకటి/
యెత్తి మింగేరా /
ఆకులేని అడవి అంటే జుట్టు.
ఆకులేని అడవిలో జీవం లేని జంతువు/జీవమున్న జంతువులను వేటాడుతుంది. ఏమిటది? అనే ప్రసిద్ధమైన పొడుపు కథకు జవాబు : దువ్వెన.
భస్మాసురుని కథలో ప్రథానమైన పదం తల.తను ఎవరి తలమీద చేయి పెడితే , వాళ్లు భస్మం కావాలని అతని వరం. కథకు మూల కారణమైన ఆ తలనే అన్నమయ్య ఇక్కడ’ ఆకులేని అడవి’ అన్నాడు.
ముక్కంటిని అన్నమయ్య ఈ పొడుపు కథలో మూడు తోకల పెద్దపులిగా ప్రతీకాత్మకంగా చెప్పాడు. ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్లు భస్మం కావాలనే వరం సంపాదించుకొని, ఆవరాన్ని మేక వంటి భస్మాసురుడు శివుడనే పెద్దపులి తల మీదనే(ఆకులేని అడవిలోన) ప్రయోగించాలనుకొన్నాడు. అప్పుడు మోహినీ అవతారంలో విష్ణువు తన అంద చందాలను ప్రయోగించాడు. విలాసాలను ఎత్తి చూపాడు. అతడి సంహారానికి కారకుడయ్యాడు. అతనిని మింగాడు.
రెండవ పరిష్కారం
జగద్గురు బోధలలో(01 వ సంపుటి) భస్మాసుర వృత్తాంతంలో కంచి స్వామి ఇలా అన్నారు. 'ఒకే వస్తువు విష్ణువుగానూ ఈశ్వరుడుగానూ అంబికగానూ ఆవిర్భవించి ఉన్నది. ఈ రూపాలతో లోకాలను అనుగ్రహించడానికి ఆ పరమాత్మ వేరువేరు అవసరాలలో వెలిశారని ఈ గాథలు చెపుతున్నై. పెద్దలు రత్నత్రయం అని చెపుతారు. మనం పూజించే యీ మూడు రత్నాలూ వేదమధ్యంలో ఉన్నవి. అంబిక విష్ణువు, ఈశ్వరుడు అనే ఈ మూడు రత్నాలూ మనకు పూజనీయాలు.
ఈ రకంగా అయితే పారిపోతున్న శివుడు , మోహినీ రూపంలో అతని చితా భస్మానికి కారకుడయ్యాడని చెప్పుకోవచ్చు.
అన్నమయ్య పొడుపు కథల కీర్తన- అప్పడుండే కొండలోన వివరణ- 13వ భాగం (01-03-2014)
పున్నమ వెన్నెలలోన వన్నెలాడితోను గూడి
కిన్నెర మీటుచు పొయ్యేవు ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
పున్నమి వెన్నెలలో శ్రీ కృష్ణుడు కిన్నెర మీటుచూ వన్నెలాడితో కలిసి రాస కేళి ఆడుతూ "చాలా దూరం “పోయాడని భావం.
విశేషాలు
1.పోతన పున్నమి వెన్నెలలో కృష్ణుడుశరదాగమారంభసంపూర్ణపూర్ణిమాచంద్రసాంద్రతపోజ్జ్వలితమగుచు’(3-118) గానం చేసాడని వ్రాసారు. మురళీ గానముతో పాటు కిన్నెర వీణా గానాన్ని అన్నమయ్య ఈ పొడుపు కథలో దర్శించాడు. ఆ వన్నెలాడి గోపిక కావచ్చు. రాధ కావచ్చు. ఇది మనోసందర్శనా చిత్రం.
2..కిన్నెర అంటే ఒకరకమైన వీణ. వీణావిశేషము.
3. ఈ వీణ ని కృష్ణుడు కలభాషిణికి నేర్పించినట్లు కళాపూర్ణోదయం కావ్యంలో మనకు కనబడుతుంది.
4.విశ్వనాథ సత్యనారాయణగారు అనుభూతి ప్రధానమైన 'శ్రీ కృష్ణ సంగీతము ' రచించారు. ఇందులో వినగలిగిన చెవులుంటే మురళీ గానలతో పాటు కిన్నెర వీణా నాదాలు వినబడతాయి.
5. శ్రీ కృష్ణుడు కిన్నెర లాంటి వాయిద్యాన్ని ధరించి పున్నమవెన్నెలలో నృత్యం చేస్తున్న వసంత రాగిణి చిత్రం ప్రసిద్ధమైనది.
5. స్త్రీ మోమును చంద్రబింబంతో, జుట్టును రాహువుతో పోల్చడం కవిసమయం.
పొలతి వదనమను పున్నమ చంద్రుడు
బలిమి నెగయునని భయమునను
మెలుత చికుర ధమ్మిల్లపు రాహువు
తల జెదరగ నిదె దైవమె సేసె (417)
అను కీర్తనలో ఈ చంద్ర రాహువులను అద్భుతంగా జతచేసాడు.
నాయిక ముఖమనే పూర్ణచంద్రుడు ఆకాశం పైకి రాహువు కొప్పు రూపం లో కబళించడానికి సిద్ధంగా ఉన్నాట్ట. (నాయిక మోముపై పడిన జుట్టు రాహువుతో ఉపమానం)
6. అన్నమయ్య ఒక వర్ణనలో తన శరీరాన్ని వీణగా ఇలా మార్చాడు.
పాడేము నేము పరమాత్మ నిన్నును
వేడుక ముప్పది రెండు వేళల రాగాలను
తనువే వొళవు తలయే దండెకాయ
ఘనమైన వూర్పులు రెండు కట్టిన తాళ్ళు
మనసే నీ బద్దితాడు మరి గుణాలే జీవాళి
మొనసిన పుట్టుగే మూలకరడి
7. కిన్నెరను అన్నమయ్య తన కీర్తనల్లో రకరకాలుగా వర్ణించాడు. ఒక మధుర వర్ణన.
పలుకు తేనెల కొసరి పసిడి కిన్నెర మీటి
పలుచనెలుగున నిన్ను పాడి పాడి
కలికి కన్నీరు బంగారు పయ్యెద నొలుక
తలయూచి తనలోనె తలవంచు చెలియ||
8. తన వేంకటేశ్వర శతకంలో అన్నమయ్య నాయిక కిన్నెర మీటిన సందర్భాన్ని ఇలా అందంగా వర్ణించాడు.
కిన్నెర మీటి పులకించి తలంచి మనోజలీలఁ దా
నున్న తెఱంగు నెచ్చెలుల కొయ్యనజెప్పగబూనుజెప్పరా
కన్నువ సిగ్గుతో నలరు నల్లన శ్రీయలమేలుమంగ నీ
వన్నెలసేత లెట్టివొ సువాళము లెట్టివో వేంకటేశ్వరా!
9. తేటి వేరు, తుమ్మెద వేరు.
తేటి అంటే తేనెటీగ. తుమ్మెద అంటే ఝుమ్మని ఎగిరే ఒక పురుగు. ఈ రెండు ఒకటి కాకపోయినా కవుల దృష్టిలో ఒకటే.
పువ్వుల మీద ఆడతేటి వాలుతుంది. మగతేటి కాదు.కాని కవులు తేటిని పురుషునితో పోలుస్తారు. పువ్వుని స్త్రీగా వర్ణిస్తారు.
నాట్యం చేసేది మగ నెమలి. (మయూరము) ఆడనెమలిని ఆకర్షించే ప్రయత్నము లో మగ నెమలి పించం విప్పి నాట్యం చేస్తుంది.కాని మనం బాగా నాట్యం చేసిన వారిని నాట్య మయూరి అంటాము. మయూరము అని చెప్పం.
చక్కగా కూసేది మగ కోయిల . ఆడు కోయిల కాదు. కాని ఆడవాళ్లని గాన కోకిల అంటాం.
ఇంతకీ ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే కొన్ని అబద్ధాలు(కవి సమయాలు) సాహిత్యంలో నిజాలుగా చెలామణి అవుతుంటాయి.(అవి అబద్ధాలని చెప్పినా నమ్మలేనంతగా) అన్నమయ్యే కాదు- ఏ కవి వర్ణన అయినా భౌతిక నేత్రంతో కాదు. హృదయ నేత్రంతో చూడాలి. అప్పుడే ఆనంద పడగలం.
అన్నమయ్య పొడుపు కథల కీర్తన- అప్పడుండే కొండలోన వివరణ- 14వ భాగం
(02-03-2014)
14. అర్థరాత్రి వేళలోని రుద్రవీణ నెత్తుకొని - నిద్రించిన నిన్ను పాడగ - ఓ వేంకటేశా
దీని భావము నీకే తెలుసురా ఓ వేంకటేశా
రాయల వారి అముక్త మాల్యద లోని మాలదాసరి వృత్తాంతం ఈ పొడుపు కథకు విడుపు.
మాలదాసరి -అర్థరాత్రి సమయంలోనే తెల్లవారిందని భ్రమపడి - నిద్రించిన విష్ణు మూర్తి కి మేలు కొలుపు పాడాలని దారి తప్పి ఒక బ్రహ్మ రాక్షసుని చేతిలోకి చిక్కాడు.
విశేషాలు
1.గండా భోగముల న్ముదశ్రులహరుల్గల్ప న్నుతుల్పాడి యా
దండ న్వ్రేగులు డించి భక్తిజనితోద్యత్తాండవం బాడు నా
చండాలేతర శీలుడుత్పులకియై చాండాలికన్మీటుచున్
గుండుల్నీరుగనెండ గాలి పసి తాకుం జూడ కాప్రాహ్ణమున్.(ఆరవ అశ్వాసము)
పై పద్యంలో రాయలవారు చాండలికను(వీణ) మాలదాసరి ధరించాడని వ్రాసారు.
2. నిజంగా ఆలోచిస్తే సుప్రభాతం దేవునికి కాదు. దేవుని పేరు మీద జీవునికి.
దేవుడు నిద్ర పోడు. నిద్రపోతున్న మన సుగుణాలను మేల్కొలుపటానికి సుప్రభాతం దేవుని పేరు మీద పాడుతాం.
రాక్షస , దైవీ సంపదల సమ్మేళనమయిన జీవునిలో రాక్షస గుణాలను తగ్గించి, దైవీ సంపదను పెంచేది సుప్రభాతం. తెల్లవారు జామున లేచి స్వామి సుప్ర భాతం కొన్ని రోజులు పాడి చూడండి. అత్యధ్భుతంగా మనలో ప్రశాంతత మొదలైన సుగుణాలు ఏర్పడుతాయి.
( అన్నమయ్య పొడుపు కథల కీర్తన వివరణ పూర్తయింది. అన్నమయ్య వేంకటేశుని దయతో నేను చేసిన విడుపులను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు)
No comments:
Post a Comment