బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ : సత్యం ఓరుగంటి - అచ్చంగా తెలుగు

బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ : సత్యం ఓరుగంటి

Share This
బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్
సత్యం ఓరుగంటి


అది జూన్ నెల 1972  సం...
 పిల్లలందరికీ బడులు  తెరిచారు, రామం 8 వ తరగతి కి వచ్చాడు,   సత్యం  5 వ తరగతి పాస్ అయ్యి 6 వ తరగతి కి వచ్చాడు. సత్యానికి అరటిచెట్ల బడి నుండి కస్పా హై స్కూల్ లో జాయిన్ అయినందుకు చాల సంతోషంగా వుంది. హై స్కూల్ కి రాగానే హీరో లాగ ఫీల్ అవుతున్నాడు . రామానికి ఇవేమి పట్టవు, బాగా చదువుకోవాలి క్లాసు లో అందరికంటే ఫస్ట్ గా వుండాలి అన్న ఆలోచన తప్పితే వేరొకటి తెలియదు.  ఆగి ఆగి పడే వర్షానికి  వీధులన్ని చిత్తడి చిత్తడి గా మారాయి. రామం సత్యం ఇద్దరు వీధి అరుగుమీద కూర్చొని పుస్తకాల లిస్టు తయారు చేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనాలంటే సీనియర్స్ ని కలిసి ఎవరి దగ్గర నీట్ గా వుండే బుక్స్ సెట్ వుంటుందో ప్లాన్ చేసుకొంటున్నారు. అమ్మని అడిగితే అన్నయ్య విశాఖపట్నం నుంచి వచ్చినప్పుడు కొంటాడులే  అంటుంది. రామనికి అన్నయ్య ఎప్పుడు వస్తాడో? ఎప్పుడు బుక్స్ కొంటాడో ? ఈలోగా క్లాసెస్ మొదలైతే పాఠాలలో వెనుకపడి పోతామో ఏమిటో ? టీచర్లు తిడతారేమో ? అన్నీ ప్రశ్నలే. సత్యం మాత్రం అన్నయ్య వచ్చి బుక్స్ కొంటే బాగుంటుంది లేకపోతే జరగాల్సింది జరుగుతుంది అని ప్రశాంతంగా వున్నాడు .
వంటింట్లో వున్నా సుభద్రమ్మ గారు ఆలోచనలో పడ్డారు, ఆయన హెడ్ మాస్టర్ గా వుండే రోజులలో చదువులకి పుస్తకాలకి లొటుండేదికాదు ఇప్పడు ఆ పరిస్థితి లేదు, ఇల్లు గడవటం ఎల్లావున్నా పిల్లల భవిష్యత్ తో రాజి పడటానికి   సుభద్రమ్మ గారు రెడీ గాలేరు, ఎలాగైనా చదివించాలి అనుకొంటూ,    కూరలమ్మా అన్న చంద్రమ్మ కేకతో ఇహలోకంలో వచ్చిపడ్డారు. స్టవ్ తగ్గించి వీదిలోకి వచ్చారు కూరలన్నీ నవనవ లాడుతున్నాయి ఒక్కొక్క కేజీ తూచమంటార ? అడిగింది చంద్రమ్మ,  వోద్దులేవే పాత బాకియే ఇంకావుంది, అబ్బాయి దగ్గరనుండి మనీ ఆర్డర్ ఇంకారాలేదు అన్నారు.  మీదగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయమ్మా, వచ్చినప్పుడే ఇయ్యండి అంది చంద్రమ్మ. సంభాషణ విన్నరామానికి  మళ్ళీ  అనుమానం, అమ్మా అన్నయ్య నిజంగా వచ్చి కొంటాడ ? అని  సందేహం వెలిబుచ్చాడు, లేదు నాన్న అన్నయ్య వచ్చినప్పుడు బుక్స్ కొనమని అడిగితే తప్పకుండా కొంటాడు అని వోదర్చారు. అన్నయ్య రాగానే ముందుగా తాను డబ్బులు అడిగి బుక్స్ కొనుక్కోవాలి సత్యం కుడా అడిగితే అన్నయ్య దగ్గర డబ్బులు సరిపోతాయో లేదో  అని రామం ప్లాన్ చేసుకొంటున్నాడు. అన్నయ్యని  అడిగితే ఏమనుకుంటాడో అమ్మే అడిగి కొనచ్చు కదా అన్నది సత్యం ఆలోచన.
హై స్కూల్ బెల్ వినిపించగానే ఇద్దరూ స్కూల్ కి బయలుదేరారు, ఇంటికి ఎదురుగా వున్న మునిసిపల్ కమీషనర్ బంగాళా నుండీ కారు బయటికి వెళ్ళింది, ఆవెంటనే పక్కింటి సామంచి వారి(విజయామెడికల్ సిండికేట్) తౌడు  సైకిల్ మీద కటింగులు కొడుతూ బయలు దేరాడు, మెడలో పులిగోరు పతకం, చేతికి బ్రాస్లెట్, కర్లింగ్ హెయిర్ తో డ్రీంబాయ్ లాగ ఉంటాడు, ఇద్దరూ  నడుస్తున్నారు వీధి కి ఎదురుగా పెంటయ్య...
టైలరింగ్ షాప్- రాణిపేట, మహారాణిపేట,ఇస్మాయిల్ కాలనీ, గడ్డవీది, సుబ్రహమణ్యంపేట అందరికి లేటేస్ట్ టైలర్ పెంటయ్య.
పెంటయ్య షాప్ నుంచి ఎడమ చేతివేపుగా తిరిగితే అలంకార్ టాకీస్, ఇద్దరూ నడుస్తునారు సత్యానికి సినిమా పైకి దృష్టి పోయింది, స్పీడుగా నడవరా లాస్ట్ బెల్ కొట్టేస్తారు అంటూ చేయ్యిలగాడు రామం. మళ్ళి నడక మొదలైంది కుడిచేతి వేపుగా గౌడు వీధి లోనుండి గేదెలు వస్తున్నాయి పక్కగా నడుచుకుంటూ వెళుతున్నారు ఇద్దరూ. కొంచెం ముదుకు వెళ్ళగానే ఎడమ చేతివేపు చిన్నిపిల్లి బడి (రాధా స్వామి స్కూల్) వచ్చింది ఇక్కడే అక్కయ్య కొడుకు శేఖర్ చదువుతున్నాడు వాడు మహా అల్లరి, వాడు ఒకటో క్లాస్ చాదువుతున్నపుడే 4 వ 5 వ క్లాస్ వాళ్ళణి గిల్లి పారిపోయేవాడు అందుకే వాడికి ఎర్ర తేలు అని పేరు పెట్టారు ఆ పక్కనే సినిమా సింగర్ పి . సుశీల గారి ఇల్లు అంటారు. మళ్లీ రామం చెయ్యిలగాడంతో స్పీడుగా నడవటం మొదలుపెట్టాడు సత్యం. ఇంకొంచెం ముందుకి నడిచి సందులోకి నడుస్తున్నారు ఇక్కడనుంచి ఎదమచేతివేపుకి వెళితే కొట్లమాదప్ప వీధి వస్తుంది అక్కడే సత్యం  ఫ్రెండ్ విజయకుమార్ ఉంటాడు, వాళ్ళింటిలో గులాబీ పూల మొక్కలు వుంటాయి, ఇళ్ళలో గులబిచెట్లు వుందటమేమిటో సత్యానికి విచిత్రంగా వుంటుంది, సంతోషంగా కూడా వుంటుంది. సందులోనించి తిన్నగా నడుస్తున్నారు హైస్కూల్ గోడ కనిపిస్తుంది, ఆగోడకి ఆనుకోని ఒక లైట్ స్థంబం వుంది స్థంబానికి ఇరువైపులా హైస్కూల్ గోడకి కన్నాలు పెట్టి వున్నాయి, పరీక్షలప్పుడు స్లిప్పులు అందిన్చడానికి అపోల్ని పట్టుకొని  తాటిచెట్టు ఎక్కినంట్లుగా ఎక్కి, స్లిప్పులు  రూంలోకి విసిరి పోలీస్ వచ్చేలోగా కిందకు దిగి పారిపోయేవాళ్ళు, సత్యానికి ఇల్లాన్టివాటిపై  చాలా ఉత్సాహం, హై స్కూల్ లాస్ట్ బెల్ కొట్టారు ఇద్దరు పరిగెత్తు కొంటూ మెయిన్ గేటు లోకి ఎంటర్  అయ్యారు ప్రేయర్ స్టార్ట్ అయింది.
హెడ్ మాష్టారు గొంప అప్పలస్వామి గారు తన రూమ్ లోనుంచి వచ్చి  ఫ్లాగ్ పోస్ట్ దగ్గర నిలబడ్డారు పిల్లలందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు ఆయన అంటే హడల్, ఆరోజుల్లోనే కోటు, సూటు, బూటు టై తో వున్న ఏకైక టీచర్ / హెడ్ మాస్టర్ అంటే అతిశయోక్తి కాదు.
స్కూల్  ఎటేన్షణ్                 స్టాండ్ ఎటీస్ 
            ఎటేన్షణ్                 స్టాండ్ ఎటీస్ 
            ఎటేన్షణ్                 స్టాండ్ ఎటీస్ 
ప్రేయర్ స్టార్ట్ అయింది.
వందే మాతరం వందే మాతరం
సుజలాం సుఫలాం మలయజ  శీతలాం
సస్యసామలాం మాతరం వందే మాతరం......
ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా మా ఐక్య జెండా
మూడు వన్నెల జెండా ముచ్చటైనా జెండా
మూడు లోకాలలో మురిసి వెలసే జెండ.
అన్ని రకాల దేశభక్తి గీతాలు ప్రారంభించారు, డి జె ఆర్ (డిల్లీ జగన్నాధ రావు ) మాస్టారు చూపులతోనే పిల్లలని కంట్రోల్ చేస్తున్నారు, ఈయన దీపావళి నాడు రాత్రి మా వెనుక వీధిలో జువ్వలతో, వెలక్కాయలతో వీధి రెండు చివరలా నిలబడి చేసే ఫైటింగ్ లో ఉంటాడని అంటారు, "స్కూల్  ఎటేన్షణ్ " స్టాండ్ ఎటీస్  అనే అరుపుతో  ఇహలోకంలోకి వచ్చి పడ్డాడు సత్యం.
ప్రేయర్ అయిపోగానే అందరు వరుసగా క్లాస్ రూమ్స్ కి వెళ్లారు, సత్యం క్లాస్ లో కూర్చున్నాడు మనసంత ప్లే గ్రౌండ్ పైనే వుంది, ఖో ఖో  ఆడాలి, కబడ్డీ ఆడాలి కస్పా హై స్కూల్ కే పెద్ద హీరో అవ్వాలి. అన్ని క్లాసెస్ అయిపోయాయి ఇద్దరు బయలుదేరారు, గ్రౌండ్ లో భగవాన్ దాస్ మాష్టారు పిల్లలతో ఖో ఖో ప్రాక్టీసు  చేయిస్తున్నారు, కెప్టన్ జి . ఎం. పి  రన్ చేస్తున్నాడు, భగవాన్ దాస్ మాష్టారు అంటే ఎ. పి స్టేట్ కే మంచి కోచ్ అంటారు. ఇద్దరూ నడుస్తున్నారు వాళ్ళకు  తోడు చిట్టిళ్ళ రాంబాబు  కూడా కలిసేడు, రాంబాబు సత్యానికి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ  వెనక వీధిలోనే ఉంటాడు. రామానికి చాల సంతోషంగా వుంది వొరే
సత్యం ఇవ్వాళా ఏమైంది తెలుసా ? అన్నాడు, ఏమైంది ? అన్నాడు సత్యం. మా క్లాసు లో లెక్కల మాస్టారు  బి. ఎన్  . ఆర్ (బి. నరసింగరావు )  3 లోంచి 5 తీస్తే ఎంతరా ? అని పిల్లల్ని అడిగేరు 3 లోంచి 5  ఎలాగా తీస్తారు అని ఎవ్వరు చెప్పలేదు, నేను  మైనస్ - 2 సార్అని చెప్పేను. మాష్టారు చాల సంతోషపడి నన్ను తీసుకొని అన్ని సెక్షన్ లకి తిప్పి వీడు చాలా ఇంటెలిజెంట్ సార్ 3 లోంచి 5 తీస్తే మైనస్  - 2 అని చెప్పేడు అని అందరి మాస్టర్లకి చెప్పేరు మాస్టారులందరూ బుజం తట్టేరు, మనం చాల బాగా చదివి గొప్ప పేరు తెచ్చుకోవాలి అన్నాడు. ఇద్దరం కలిసి ఇంటికి వచ్చాం ఇంటికిరాగానే అమ్మకి, పెద్దకి (అన్న ఎస్ ఎస్ ఎల్ సి ) స్కూల్ లో జరిగిందంతా పూసగుచ్చి నట్లుగా చెప్పేడు రామం, అవునురా  బి. ఎన్ . ఆర్   మాస్టారు దృష్టి  పడితే లెక్కలికి తిరుగులేదు అన్నాడు పెద్ద.
స్కూల్ నుండి వచ్చిన పిల్లలికి మజ్జిగాన్నం పెట్టి తిననడం అవగానే వీధి పిల్లలతో ఆడుకోకుండా అరుగు మీద కూర్చొని చదువుకొమన్నారు సుభద్రమ్మ గారు. మరల ఆలోచనలో పడ్డారు ఎనమండుగురు పిల్లలలో పెద్దవాడికి  మాత్రమే రైల్వే లో గార్డ్ వుద్యోగం, తక్కిన వాళ్ళందరూ ఇంకా చదువులే. అబ్బాయి తన జీతం లో తన కుటుంబం, కాకినాడ ఇంజనీరింగ్ చదువుతున్న తమ్ముడు మణి కి నెల నెల డబ్బులు పంపడమే కాకుండా విజయనగరం లో వున్న అమ్మా తమ్ముళ్ళకు కూడా పంపుతూ ఒక్కడే సమర్దిన్చుకుంటూ వస్తున్నాడు. పాపం వాడికెంత ఇబ్బందిగా వుంటుందో, ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ పక్కింటి అరుసోళ్ళ(ఆర్య సోమయాజుల) సత్యనారాయణ పిలుపు, అత్తయ్య  గారు రేపు సాయత్రం సోమయాజులు గారు వైజాగ్ నుండి వస్తానని చెప్పమన్నారు అని చెప్పి వెళ్లిపోయాడు. సమయానికి అబ్బాయి కూడా వస్తున్నాడు ఇంక వీళ్ళ పుస్తకాల చింత తీరిపోయింది. అమ్మా అన్నయ్య వస్తున్నాడుగా పుస్తకాలు రేపు రాత్రే కొనుకుంటాను అన్నాడు రామం. ఎల్లుండి కొనవచ్చులేరా అన్నారు, సెకండ్ హ్యాండ్ బుక్స్ కాదమ్మా షాపుకి వెళ్లక్కరలేదు, రాత్రే అ పిల్లాడి ఇంటికివెళ్ళి తెచ్చుకుంటాను లేట్ అయితే అతను ఇంకెవరికైనా ఇచ్చేస్తాడెమో అన్నాడు. అలాగేలేరా అన్నారు సుభద్రమ్మ గారు, వాడి శ్రద్ధ చూసి ముచ్చటపడుతూ. ఈ సత్యం గాడికి చదువుమీద శ్రద్దలేదు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు అనుకున్నారు.
అనుకున్నట్టు గానే అబ్బాయి సాయత్రం వచ్చాడు, అమ్మా ఆరోగ్యం ఎలాగుంది ? అన్నాడు, బాగానే వుందిరా మణి ఎలాగా చదువుకుంటున్నాడు ఉత్తరాలు రాస్తున్నాడా? అని అడిగేరు, వాడు నాన్నగారి లాగ బాగా తెలివైనవాడమ్మా బాగానే చదువుతున్నాడు మనం సమయానికి డబ్బులు సర్దగలిగితే చాలు అన్నాడు. ఈ డబ్బులు తీసుకో ఎలాగా వస్తున్నాను కదా అని మనీ ఆర్డర్ చెయ్యలేదు అన్నాడు.
ఈలోగా రామం సత్యం తలుపు చాటునుంచి అమ్మ సంజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు, అన్నయ్య చూడనే చూసాడు, ఎంరా? ఎలా చదువుతున్నారు ?  అన్నాడు, రామం చాల సంతోషంగా ముందుకు వచ్చి బాగా చదువుతున్నాం మా క్లాస్ లో నేనే ఫస్ట్, కొత్త క్లాస్ లో  పాఠాలు మొదలు పెట్టారు పుస్తకాలు కొనాలి అన్నాడు. నీసంగతి ఏమిటి ? అన్నాడు అన్నయ్య సత్యాన్ని చూస్తూ, సత్యం మాట్లాడలేదు సరేలే అంటూ అన్నయ్య పుస్తకాల డబ్బులు అమ్మకి ఇచ్చి ఇంక వస్తానమ్మా, రైలుకి టైం అయింది అంటూ బయలు దేరాడు. మరునాడు ఉదయాన్నే ఇద్దరూ పుస్తకాలు కొనుక్కొని స్కూల్ కి బయలు దేరారు.
చూస్తుండగానే నెల గిర గిరా తిరిగింది మళ్ళి నెల వచ్చింది, ఇంటిలో సరుకులు అయిపోయాయి, అబ్బాయి దగ్గరనుండి మనీ ఆర్డర్ రాలేదు పోస్ట్ మాన్ వచ్చి వెళ్ళిపోయాడు మద్య్హాన్నం వంట వండలేదు
పిల్లలికి పరిస్థితి అర్ధం అయ్యింది, అన్నం గురించి అడగకుండా బిక్క మొహం వేసుకొని ఒక ములకూర్చున్నారు. గత్యంతరం లేక సుభద్రమ్మ గారు పెదబాబు ని పిలిచి ఇంట్లో ఇత్తడి బిందె తీసి ఇచ్చారు, ఎస్ ఎస్ ఎల్ సి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి పై చదువులకి వెళ్ళలేక ఉద్యోగ వేటలో ఉన్న పెదబాబుకి ఇది మొదటిసారి కాదు, ఆపద్ధర్మంగా ఇలా చాలా అమ్మేడు, జీవితాన్ని తెలుసుకొనే అవకాశాన్ని అంత చిన్న వయసులోనే భగవంతుడు అతనికి ఇచ్చాడు. బిందె అమ్మగా వచ్చిన డబ్బుతో వారానికి సరిపడా సరుకులు తెచ్చి, సాయంత్రం వంటవండి, పిల్లలికి భోజనం పెట్టేరు సుభద్రమ్మ గారు. రెండో రోజు అబ్బాయి దగ్గర నుండి కబురొచ్చింది ఇంజనీరింగ్ చదువుతున్న తమ్ముడికి అర్జెంటు గా డబ్బు పంపవలసి వచ్చింది పంపేను, ఒక వారం లో మీకు పంపుతాను అందాక సర్దుకోండి అని.
కష్టం వున్నా దైర్యం కోల్పోలేదు సుభద్రమ్మ గారు. ఒక వారం గడిచింది అబ్బాయి దగ్గరనుండి మనీ ఆర్డర్ ఇంకా రాలేదు ఉదయాన్నే స్కూల్ కి వెళ్ళిన రామం సత్యం గోడకి కొట్టిన బంతుల్లా ఇంటికి తిరిగి వచ్చారు. ఏమైంది ? అమ్మ ప్రశ్న, రామం కళ్ళలో నీళ్ళు, సత్యం ప్రశాంతంగా వున్నాడు,   అమ్మా బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ 2 రూపాయలు, అందరు పిల్లలు కట్టాలిట లేకపోతే క్లాసు కి రానివ్వరట అని ఏడుస్తూ చెప్పేడు, డబ్బులు ఎక్కడివిరా స్కూల్ పోతే పాయిందిలే అమ్మని కష్టపెట్టడం ఎందుకు అన్నాడు సత్యం, నా పాఠాలు పోతాయి ఏడుపు ఎత్తుకున్నాడు రామం, ఊరుకోరా రేపు చూద్దాం ఇంకొక కొత్తసమస్య పరిష్కారం దొరుకుతుందిలే అన్నారు సుభద్రమ్మ గారు.
బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ అంటే ఏమిటమ్మ మనం ఎందుకు కట్టాలి అన్నాడు రామం అమాయకంగా, సుభద్రమ్మ గారికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు బంగ్లాదేశ్ లో యుద్ధం జరిగిన తరువాత తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేవు, మన ఇందిరాగాంధి వారికి సహాయం చేస్తానని మాట ఇచ్చేరు అందుకు కట్టాలి అన్నారు సుభద్రమ్మ గారు. మరి మనకి తినడానికి తిండి, పుస్తకాలు   కొనుక్కోవడానికి డబ్బులు లేవు కదా, మనం ఈదేశం వాళ్ళమే కదా మనకెందుకు ఇవ్వరు రిలీఫ్ ఫండ్ అన్నాడు, వాడి ప్రశ్నలో న్యాయం వుంది కాని సుభద్రమ్మ గారికి ఎం చెప్పాలో అర్ధం కాలేదు. భోజనం చేసి పడుకోండి రేపు చూద్దాంలే డబ్బులు అన్నారు, చూడ్డం కాదు కట్టాలి అన్నాడు రామం, ఆరోజు రామం అన్నం సరిగ్గా తినలేదు, కలతగానే పడుకున్నాడు. డబ్బులు ఎలాతేవాలి ఇంట్లో ఇత్తడి బిందెలు కూడా లేవు సుభద్రమ్మ గారు ఆలోచనలో పడిపోయారు.
ఇంకా రాత్రి  ఎనిమిదే అయ్యింది, వీధి లో ఎవరివో   మాటలు వినబడి గుమ్మం లోనికి వచ్చారు, ఓటర్ లిస్ట్లు రాయలిట రోజుకి పది రూపాయలు ఇస్తారు అనుకుంటున్నారు. సుభద్రమ్మ గారు  దైర్యంగా అడిగేరు ఎక్కడ రాయాలి  ఓటర్ లిస్ట్లు అని, మూడు లాంతర్లు దగ్గర మునిసిపల్ ఆఫీస్ లో, ఉదయం 10 గం నుంచి సాయత్రం 5 గం వరకు  రోజంతా రాస్తే ఎ రోజు కా రోజు  పది రూపాయలు అప్పుడే ఇస్తారు అన్నారు వాళ్ళు. సుభద్రమ్మ గారు  స్థిర నిర్ణయానికి వచ్చేరు.
మరునాడు  ఉదయాన్నే పిల్లలికి 9.30 గం ల కే భోజనాలు పెట్టి జాగ్రతగా చదువుకుంటూ వుండండి అని చెప్పి బయటికి వెళ్ళేరు. సాయంత్రం 6 గం అయ్యింది రామం సత్యం వీధి గుమ్మం లో కూర్చొని ఎదురు చూస్తున్నారు. డబ్బులు ఆడక పోయినా బాగుండేది అమ్మ ఎక్కడికి వెళ్లిందో ఏమో ఇద్దరు బాధగా వున్నారు. వీధి చివరలో అమ్మ వస్తూ కనబడింది, ఆ నడకలో దైర్యం సాధించనన్న గర్వం కనబడుతున్నాయి, ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మని చుట్టుకుపోయారు, ఇంతసేపు ఎక్కడికి  
వెళ్లేవమ్మ  అన్నారు ఏడుస్తూ. సుభద్రమ్మ గారు  పిల్లలికి దైర్యం చెప్పేరు, పరిస్థితులకు భయపడకండి, ఏడవకండి  దైర్యం గా వుండాలి అంటూ ఇదిగో నీకొక రెండు రూపాయలు తమ్ముడికొక రెండురుపాయలు రేపు స్కూల్ కి వెళ్ళండి బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ కట్టి చదువుకోండి అన్నారు.
రామనికి ఆరోజు అమ్మ మనసులో బాధ కంటే, అమ్మలో పరిస్థితులను ఎదుర్కొని, లక్ష్య సాధన దిశగా పోయే వ్యక్తిత్వం స్ఫూర్తి గా నిలిచింది. అక్కడినుండి రామం జీవితం లో వెనుదిరిగి చూడలేదు, మంచి మార్కులతో అన్ని పరిక్షలు పాస్ అయ్యాడు, స్టాఫ్  సెలక్షన్  కమిషన్  ద్వారా దూరదర్శన్ లో జాబ్ కి సెలెక్ట్ అయ్యాడు, దూరదర్శన్ లో  అటెండర్ నుండి డైరెక్టర్ గారి వరకు అందరికి తలలో నాల్క అయ్యాడు. పిల్లల చదువులకోసం ఓ.టి లు చేసేవాడు అందరూ ఓ.వి రామారావు ను అభిమానంగా ఓ.టి రామారావు అనేవారు. ఓ.టి రామారావు తన  కొడుకును కూడా అదే స్పూర్తితో కష్ట నష్టాలకోర్చి చదువుకి వెనుకాడకుండా ఐ ఐ టి  మరియు ఐ ఐ ఎం ల స్థాయికి తెచ్చాడు, ఇది ఓక రామం కధ మాత్రమే కాదు చాల మంది మధ్య తరగతి ఔత్సాహికుల  కధ.
****

No comments:

Post a Comment

Pages