ప్రతీ జన్మా ఒక వరం
రచన: మల్లాది శ్రీ (సూర్య కిరణ్ మల్లాది )
ఆ జన్మ కర్మ ఫలమన్నా అది నిజం
జన్మకు వరం ఆ ప్రాణి పొందిన జీవం
అది నడిచే ప్రాణైనా నడవని మానైనా
ప్రాణి పొందిన జీవానికి కొలమానం మన మనసు
మానుకి లేనిది మనిషికి ఉన్నది...
ఆలోచన
ఆ ఆలోచనకు మూలం మనసు
ఆ మూలానికి బీజమూ మనసే
మనసు నడిపిస్తే మనిషి నడుస్తాడు
కాని
ఆ మనసును తెలుసుకొంటే అది ఘనత అంటాడు
మనసులో ఆలోచన మనుషికి ప్రతిరూపం
ఎప్పుడూ ఆనందంగా ఉండడమే మనసుకు తెలుసు
అందరినీ ఆనందంగా ఉంచడమే మనసుకు తెలుసు
భావోద్వేగానికి...మనిషి ఉల్లాసానికి
మనవాడి బాధకి... పక్క వాడి సంతోషానికి
ఎక్కడ ఏం జరిగినా
ఎవ్వరు ఏం చేసినా
అది సరైనా పొరపాటైనా
తొలిగా ప్రభావితం అయ్యేది
వింజామరలా మారేది మనసు
తను బాధ పడి పక్క వాడిని సంతోషపెట్టినా మనసే
తన సంతోషంతో పది మందిని నడిపినా మనసే
ఆర్ద్రత ఆ మనసుకు కొలమానం
బాధ్యత ఆ మనసుకి బహుమానం
అంతటి మనసుని తన భావంతో కలుషితం
చేయడం ఎంత వరకు భావ్యం
ఆనందం సన్నిధిలో సంతోషం పొదరిల్లు నల్లి
సుఖంగా ఉంచుకోవాల్సిన మన జీవనం
ఎవ్వరు చేశారు.. దు:ఖ భరితం
మండిటెండలో చెట్టు నీడలా
అందోళనలో వెంట నేనుంటి అను మన మనసుని
అందీళనల బాటలో నడపి
లేని శైలిని ఆపాదించి
మనిషి తన తృప్తిని మరచి
తన వైపుకు తప్ప అన్ని వైపుల తిరిగి చూసి
చూసేదంతా నాదే అనుకొని
ఆశను మరచి అత్యాశను చేరి
ప్రక్క వాళ్ళది తన సొంతం అని ఊహించి
స్థలాలను కబ్జా చేసి..అంతటితో ఆగక
దురాశతో అడుగేసి మనుషుల్నీ ముంచేసి
దు:ఖానికి గురి చేసి
అర్రులు చాచిన అత్యాశలతో
కబంధ హస్తాలను చాచుతుంటే
అంతెరుగని అత్యాశ
విలువ మరచిన పేరాశ
మనసు నెత్తిన పిశాచ నాట్య మాడుతుంటే
సంస్కారం యే మూలనో దాగి దోబూచులాడుతుంటే
జీవించే సమాజం
అనాగరిక ఆటవిక సమూహం
ప్రక్కవారి దెల్ల మనదెన్నటికీ కాదని
కష్టపడితేనే వచ్చేది చివరి దాకా మిగులునని
పెద్దలు చెప్పిన నీతి మాట
సమయం దాటాక మన సమయం నేర్పినపుడు
నేర్చినా నీతి కున్న విలువేది
చదువుల మూటలు ఎన్ని కట్టినా
డిగ్రీల దొంతరలెన్ని చుట్టినా
విలువెరుగని జీవన ప్రమాణం
మనసు తో మాట్లాడుకోలేని అనురాగ బంధం
నమ్మకమనే పునాది వెయ్యలేని జీవన విధానం
తాళి బొట్ల సంఖ్య కన్నా
ఎగతాళి చేసే వారు ఎక్కువైతే
ఏ మనసు గురించి మాట్లాడాలి ?
ఏ మనసుని అర్ధం చేసుకోవాలి ?
No comments:
Post a Comment