ఉపోద్ఘాతం
ఆంధ్రనాయక శతకం తెలియని ఆంధ్రులుండరంటే బహుశా అతిశయోక్తి కాదేమో. అనేక మందికి ఈశతకంలోని పద్యరత్నాలు కంఠతా వచ్చుననేదికూడా పచ్చినిజం. ఆరోజుల్లో ఈ శతకం అంత ప్రసిద్ధి చెందింది. కాలక్రమేణా మన పాఠ్యపుస్తకాలలో ఇటువంటి అద్భుతమైన సాహిత్య పరిచయం తగ్గటం వలన ఈతరంవారికి ఈ శతకాన్ని తిరిగి పరిచయం చేయటమే ఈ వ్యాస ముఖ్య ఉద్దేశ్యం
కవి పరిచయం
ఆంధ్రనాయక శతకకర్త శ్రీకాసుల పురుషోత్తమ కవి. కాసుల అప్పలరాజు, రమణాంబ ల పుత్రుడు. కాశ్యపగోత్రుడు. కృష్ణాజిల్లా లోని దివిసీమ ప్రాంతమువాడు. పెద్దప్రోలు గ్రామమునకు చెందినవాడు.18వ శతాబ్ధపు ఈ కవి చల్లపల్లి జమీదారు ఆస్థానంలో భట్రాజుగా దేవరకోట రాజాస్థాన కవిగా ఉండేవారు. బందరుతాలూకా అవనిగడ్డకు దగ్గరలోని చలపల్లి జమిందారీలో ఉన్న శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువుపై ఈ కవి "ఆంధ్రనాయక శతకము" రచించారు. ఈఆంధ్రమహావిష్ణువుకే ఆంధ్రనాయకుడని, తెలుగు వల్లభుడని, తెలుగు రాయడని నామాంతరాలున్నవని ప్రతీతి. శ్రీకృష్ణదేవరాయలు తనను ఆముక్తమాల్యద గ్రంథరచన ప్రేరేపించినది ఈ ఆంధ్రవిష్ణువే.
ఈ శ్రీకాకుళాంధ్రదేవుని ఆలయ ప్రశస్థి బ్రహ్మాండపురాణంలో ప్రస్తావించబడింది. దీనినిబట్టి ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైనదని తెలుస్తుంది. అంతేకాక ఈ దేవాలయంలో జరిగే తిరునాళ్ల గురించి శ్రీనాథకవి తన రచనలలో, వినుకొండవల్లభరాయని రచనల్లో ప్రస్తావించారు. ఆకాలంలో ఈ ఆలయం లో అత్యంత వైభవమైనదిగా పేర్కొనబడింది. కాని కాసుల పురుషోత్తమకవి కాలానికి ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకొని దైవారాధన, ఉత్సవాలు తగ్గిపోయాయి. అందుకు వగచిన కవి ఈస్వామిని నిందాస్తుతితో "చిత్రచిత్రప్రభావ! దాక్షిణ్యభావ! హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!" అనే మకుటంతో ఈసీసపద్య శతకం రచించారని ప్రతీతి.
ఈ కవి మొత్తం నాలుగు శతకాల రచన కావించారు. 1. ఆంధ్రనాయక శతకము, 2. హంసలదీవి గోపాలశతకము, 3. మానసబోధశతకము, 4. భక్తకల్పద్రుమశాతకము
ఇవకాక ఈకవి మరే గ్రంధరచన కావించలేదు. కేవల శతకరచనతోనే ఆంధ్రసాహిత్యరంగంలో పేరు సాధించుకున్నది ఈకవిమాత్రమే.
చివరగా కవిసామ్రాట్ శ్రీవిశ్వనాథ సత్యనారాయణగారు తనప్రసంగాలలో, ఉపన్యాసాలలో ఎక్కువగా ఆంధ్రనాయక శతకంలోని పద్యాలనే ఉదాహరించేవారుట. ఒకసారి వారి శిష్యులలో ఒకరు "ఆంధ్రభారతం నన్నయ్యగారు వ్రాయకపోతే ఎవరు వ్రాసేవారు?" అని అడిగితే కాసుల పురుషోత్తమ కవి అని సమాధానం ఇచ్చారుట. ఆమహాకవిపై కవిసామ్రాట్టుకు ఉన్న గౌరవం అటువంటిది.
శతక పరిచయం
ఈశతకము నిందాగర్భస్తుతి భరితము. 108 సీసపద్యాలలో "చిత్రచిత్రప్రభావ! దాక్షిణ్యభావ! హతవిమతజీవ! శ్రీకాకులాంధ్రదేవ" అనేమకుటంతో వ్రాసిన ఈశతకం ఆంధ్రమహావిష్ణువు ఆలయంలోనీ పూజ, ఉత్సవకార్యక్రమాలలు పునరుద్ధరించిందని ప్రతితి.
ఈశతకములో మొదటి తొమ్మిది పధ్యములు స్తుతిమాత్రములు. పదవపద్యమునుండి శ్రీహరిదేవాలయమునందు ఉత్సవాదులు లేవని, 16 వపద్యము వరకు చెప్పెను. 17 వపద్యము నుండి నిందాస్తుతి ఆరంభము. 16వపద్యములో చెప్పినట్లు "కీర్తి నిందగ వర్ణించి గేలిపరతు" అన్నమాటను ఈకవి అత్యంత నిపుణతతో నెగ్గించుకున్నాడు. భాగవతలీలలను, పారిజాతాపహరణ కధలను, ఇతరపురాణకథలను తన శతకంలో పొందుపరచి ఈకవి తన పాండిత్యాన్ని నిరూపించుకున్నాడు.
తిట్టులాగున కనపడి తిట్టుకాకపోవుట, అవతారచర్యల భూషింపతగినవి దూషించినట్లు కనపడచేయటంలో ఈ కవి తన పూర్తి ప్రతిభను చూపించాడు అని చెప్పాలి.
ఉదాహరణకి
భిల్లాంగనాదంతపీడిత ఫలభుక్తి, హేయంబు దోఁచలే దింతనీకు
సంక్రదనాత్మజస్యందన సారధ్య, మెరుసుగాఁ దోఁచలే దింత నీకు
గోపాలకానేక గోవత్సపాలనం, ఈగ్గుగాఁ దోఁచలే దింత నీకు
వ్రజబాలికా ముక్తవస్త్రాపహరణము, హీనమై తోఁచలే దింత నీకు
ఉచ్చనీచంబు లెఱుఁగక యిచ్చఁజేయు
చేష్టలివి భక్తహితమతిఁ జేసితండ్రు
చిత్రచిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
హతవిమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!
(శబరి ఎంగిలిపండ్లు తినుట నీకు హేయంబుగా అనిపించలేదు, అర్జునుని రధసారధ్యము నీకు చిన్నతనము అనిపించలేదు. గోపాలకులను గోవులను కాచుట నీకు అవమానమని తోచలేదు. గోపకన్యలు వదలిన వస్త్రములను దొంగిలించుట హీనమనీ తోచలేదు. మంచిచెడు తెలియక ఇష్టంవచ్చినట్లు చేసిన ఈపనులను కొందరు భక్తులపై ప్రేమతో చేసినవని కొందరు అంటారు.)
ఎంత అందంగా తిట్టినట్లు ఉంది ఈ పద్యం. కాస్త ఆలోచిస్తే ఇందులోని అంతరార్థం తేటతెల్లమవుతుంది.
ఆలు నిర్వాహకురాలు భూదేవియై, యఖిలభారకుఁ డనునాఖ్యఁ దెచ్చె
నిష్టసంపన్నురా లిందిర భార్యయై, కామితార్ధదుఁ డన్న ఘనతఁ దెచ్చెఁ
గమలగర్భుండు సృష్టికర్త తనూజుఁడై, బహుకుటుంబకుఁ డన్న బలిమిఁ దెచ్చె
గలుషవిధ్వంసిని గంగ కుమారియై, బతిత పావనుఁ డన్న ప్రతిభఁ దెచ్చె
నాండ్రు బిడ్డలు దెచ్చుప్రఖ్యాతి గాని
మొదటినుండియు నీవు దామోదరుఁడవె
చిత్రచిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ!
హతవిమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!
( సర్వాన్ని మోసే భూదేవి అనేభార్య వల్ల అఖిల భారకుడనీ, గొప్ప సంపద కలిగిన లక్ష్మీదేవి అనే భార్యవలన కామితార్ధ ప్రదాయకుడవని, సృష్టికర్త అయిన బ్రహ్మ అనృ కొడుకువలన పెద్ద సంసారియనీ, పతితపావని అయిన గంగనది అనే కూఉరివలన పతితపావనుడవని, ఇలా భార్య పిల్లలవలన నీకుప్రఖ్యాతి కలిగినది కానీ నీవు మొదటినుండీ దామోదరుడవే. 9దామోదరుడు అనే పదానికి ఉదరంపై వనమాల కలవాడు అని ఒక అర్థం ఐతే, దరిద్రుడని, నిష్ప్రయోజకుడని మరో అర్థంకూడా. ఇలాంటి ప్రయోగాలు ఈశతకం లో ఎన్నో ఎన్నెన్నో!!
తెలియ నవ్యక్తుఁడవుగావు తెలిసికొన్న, నిట్టివాఁడని తెలియలే దెవ్వరికిని .... ఎంతో సత్యమైన వేదాంతవాక్యం (27 వ పద్యం).
ఒకరికంటె గుణాధికు లొకరుమీరు ఇంతచక్కన దెలిసె మీ యింటి వరుస (28వ పద్యము)
పరువుగలవాఁడవేని ప్రాఁబల్కులందుఁ, దెలియ వరిముక్కు ముల్లంత గలవొ లేవొ (29వ పద్యం).
ఈశతకంలో 26వ పద్యం నారాయణాశతకములోని "ధరసింహాసనమై అనే పద్యచాయలు, 37 వ పద్యం మానసబోధ పద్యానికి అనుకరణముగా కనిపిస్తాయి.
30 వ పద్యం దశావతారవర్ణనము
65 వ పద్యము నుండి రామావతారవర్ణనముతో ఆరభించి 87 వ పద్యంతో ముగుస్తుంది. 83 వపద్యము బలరామావతారము 84 త్రిపురసమ్హారము, 85 కల్క్యావతారము, 91 లొ మరిన్ని అవతారములు కనిపిస్తాయి. 96 పద్యమునుండి మరల స్తుతి పద్యములు ప్రారంభము. 96 వపద్యం పోతనగారి భాగతంలో "అలవైకుంఠపురంబుళొ నగరిలో" అనే పద్యానికి అనుకరణము. 107 వపద్యము " అరయన్ శంతనుపుత్రుపై" అనే దేవకీనందనశతక పద్యమును పోలిఉంటుంది. 108వపద్యంలో కవినామము, ఇతర రచనలు కనిపిస్తాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే శతకంలోని ప్రతి పద్యమూ ఉదాహరించవలసినదే. గుణమునే దోషముగా చూపిస్తూ, పరమవేదాంత రహస్యములను పరిహాసం చేస్తూ, మన బుఱ్ఱలకు పనికల్పించే మాటలతో హృదయాలను ఉప్పొంగచేసే పద్యాలు ప్రతివొక్కరు చదివి ఇతరులతో చదివించాలినవి.
No comments:
Post a Comment