కర్ణాటక సంగీతం విశ్వవ్యాప్తం కావడానికి మూల పురుషులు త్యాగరాజస్వామి. “సంగీతజ్ఞానమను బ్రహ్మానంద సాగర మీదని దేహము భూభారము” అంటారు త్యాగయ్య గారు. ఆ మాటల్లోని నిజం ఆ కళతో పరిచయం ఏర్పరుచుకుంటే తెలుస్తుంది. పోతన అన్నట్టు “పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట”, త్యాగరాజు పలికింది రామ నామం. ఆయనది నాదయోగం. ఆయన ఉచ్ఛ్వాస, నిశ్వాసాల్లో ఒకటి రామ నామం పలికింది, ఇంకోటి నాదోపాసన చేసింది. ఆ రెండూ కలిసి సంగీత సాహిత్యాలు వచ్చాయి. ఆయన ఒక అవతారం, కారణజన్ముడు.
దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్న కాలంలో తంజావూరు మహారాజులు సంగీతసాహిత్యాలని విశేషంగా ఆదరించేవారు. అలా మన తెలుగుదేశం నుంచి రాజాశ్రయం కోసం తంజావూరుకి వలస వెళ్ళిన కవుల్లో త్యాగరాజస్వామి తాతగారు గిరిరాజకవిగారొకరు. ఆయన కుమారుడు రామబ్రహ్మం. ఆయన కుమారుడు త్యాగరాజు. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి వీరు ముగ్గురూ సంగీత త్రిమూర్తులు. ఒకే కాలంలో 18వ శతాబ్దంలో తిరువయ్యూరు గ్రామంలో జన్మించారు. అది మొదలు సంగీత సరస్వతి ఆ ప్రాంతంలో మహోజ్వలంగా ప్రకాశించింది.
కళ ఎక్కడ పోషింపబడితే అక్కడే నిక్షిప్తమై, విస్తారమౌతుంది. శిష్య పరంపర, రాజాశ్రయం, ప్రజాదరణ ఇవి ఏ కళకైనా ప్రధానం. ఈ విధంగా ఆంధ్ర దేశంలో మూలాలు కల సంగీత విద్య రాజాశ్రయం కోరి తమిళనాడుకు వలస వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన సంగీతాన్ని తిరిగి ఆంధ్ర దేశానికి తెచ్చిన ఘనత ‘సంగీత కళానిధి’ నేదునూరి కృష్ణమూర్తిగారికే దక్కుతుంది.
శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు 10 అక్టోబరు1927 సం||న తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం మండలమైన కొత్తపల్లి గ్రామములో శ్రీరామమూర్తి, విజయలక్ష్మి దంపతులకు ఎనిమిదవ సంతానంగా జన్మించారు. తండ్రి పిఠాపురం రాజావారి ఎస్టేటులో చిరు ఉద్యోగి. వంశ పారంపర్యంగా వచ్చిన సంగీత జ్ఞానముతో తల్లి పాడిన అష్టపదులు, తరంగాలు, ఆధ్యాత్మిక రామాయణం ఆయనను ఎంతగానో ప్రభావితం చేశాయి. సంగీతం నేర్చుకోవాలన్న అభిలాష ఏర్పడింది. ఆయన హిందీ, సంస్కృత భాషలందు తర్ఫీదు పొంది ఉత్తీర్ణులయ్యారు.
చిన్నతనంలో నేదునూరి గ్రామంలో పెరిగేరు. ఒక్కసారి ఏది విన్నా పాడేసేవారు. గాత్ర సౌలభ్యం తనకు పుట్టుకతోనే అలవడిందని అంటారు నేదునూరి. విద్వాన్ అప్పారావు వద్ద వర్ణాలు నేర్చుకున్నారు. అష్టపదులు, తరంగాలు కల్లూరి వేణుగోపాల రావు గారి వద్ద నేర్చుకున్నారు.నేదునూరి 1940లో విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో వయొలిన్ లోనూ, గాత్రంలోను ప్రాధమిక శిక్షణ పొందారు. ఐదేళ్ళు గడిచే సరికి నేదునూరి ప్రతిభ ద్విగుణితం, బహుళం అయ్యింది. కీర్తిశేషులు ద్వారం నరసింగరావు నాయుడు శిష్యుడిగా ఉన్నారు. 1945 నుంచి వినాయక చవితి రోజున సొంత ఊరు కొత్తపల్లిలో సంగీత ప్రస్తానం ప్రారంభించి, మర్నాడు కాకినాడ లో కచేరి చేసి, అనేక సభలలో పాడుతూ వచ్చారు.
ఒకసారి కాకినాడలోని సరస్వతీ గాన సభలో జనం మాలి గారి వేణు గానం కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. రైలు బండి ఆలస్యమయ్యింది. మాలి వచ్చేదాక నేదునూరి చేత పాడించకూడదూ అని జనంలో ఎవరో సూచించారట. వెంటనే నేదునూరి కచేరి ప్రారంభించి, జన రంజక సంగీతాన్ని అందించి అలరించారు.
అలా నాలుగు సంవత్సరాలు గడిచేసారికి, శ్రీపాద పినాకపాణి గారి సంగీతాన్ని విని, ప్రభావితులయ్యి, వారి వద్ద సంగీతం నేర్చుకోవాలని సంకల్పించారు నేదునూరి గారు.
“సంగీతవిద్యలో శాస్త్రమూ, కళ కలిసివుంటయ్. ఇదొక మహావిద్య. ! శాస్త్రీయసంగీతం అఖండమైన శాస్త్రమూ అనంతమైన కళ సమన్వితమైన నాదవిద్య. ఇది సద్గురువు దగ్గర సన్మార్గంలో నేర్చుకుని కొన్ని సంవత్సరాల పాటు కృషిచేసి సంగీతానుభవం, నాదానుభవం పొందితే ఆ ఘనమనే మాటకి అర్థం తెలుస్తుంది. “ అంటారు నేదునూరి. తన గురువు ‘సద్గురువు’ అంటూ వారి గురించి ఆయన చెప్పిన మాటలు...
మా గురువుగారు సంగీత కళానిధి, పద్మభూషణ్, డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన “సద్గురువు”. ఆయన మేధస్సు సంగీతవిజ్ఞానసర్వస్వం. నేనున్న ప్రస్తుతస్థితికి వారి సహృదయత, సద్బోధన, ఆశీస్సులే కారణం. వారిలాంటి గురువు దొరకటం మహద్భాగ్యం. ఆయన సంగీతవిజ్ఞానాన్ని పుస్తకరూపంలో లోకానికి అందించారు. ఆయన సంగీతసౌరభంలో వెయ్యి రచనలున్నయ్. మనోధర్మసంగీతం, పల్లవిగానసుధ ఈ గ్రంథాలు చాలా విలువైనవి. ఆయన కృతుల్లోని నొటేషన్ విద్యార్థులకీ విద్వాంసులకీ ఎంతో విలువైంది. త్రిమూర్తుల సంగీతసంప్రదాయాన్ని తాను అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చి మాబోటి వాళ్ళకి అందించిన కల్పతరువు ఆయన.”
ప్రతిష్టాత్మకమైన కృష్ణగాన సభలో ఆయన 1970 లో కచేరీ చేస్తూ కాఫీ రాగం ఆలపించసాగారు. ఆ రాగాన్ని అంత విస్తారంగా సాధారణంగా ఎవరూ పాడరట! అలా పాడుతూ, ప్రక్కన వయోలిన్ వాయిస్తున్న సంగీత దిగ్గజం లాల్గూడి జయరామన్ గారికి కచేరి మధ్యలో అవకాశం ఇచ్చేందుకు ఆపారట. కాని ఆయన, వాయించాను అని సూచించి, నేదునూరిని పాట కొనసాగించమని చెప్పారట ! ‘ఇంత విస్తారంగా నువ్వు పాడాకా, ఇక నాకు వాయించడానికి ఏమీ మిగలలేదు,’ అని నేదునూరితో చెప్పి, ఆ కచేరీ నిర్వాహకుల వద్ద ‘ఈయన చాలా గొప్ప కళాకారుడు’ అని మెచ్చుకుని వెళ్లిపోయారట.
మరోసారి నేదునూరి కచేరికి వచ్చిన సుబ్బడు(సంగీత లోకానికి ఈయన మాటే వేదం) అనే సంగీత విమర్శకుడు, ‘సంగీతం ఆంధ్రప్రదేశ్ కు వలస వెళ్ళిపోయింది’ అనే శీర్షికతో పత్రికలో వ్రాయగా, ఆ వార్త పెద్ద సంచలనమే రేపిందట. ‘అంత గొప్పగా పాడతాడతను’ అంటూ ఆయన అభినందన ఎప్పటికీ మరువలేనంటారు నేదునూరి.
నేదునూరి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ ఇత్యాది దేశాలు పర్యటించి అనేక ప్రదర్శనలు ఇచ్చారు.సంగీతంలో తన ప్రతిభ కనపరుస్తూ అన్నమాచార్య సంకీర్తనలు కూర్చి సంగీత ప్రియులకు అందించారు. విశేష ఖ్యాతిని ఆర్జించారు. సంగీత లోకంలో ప్రముఖ స్థానం సంపాదించు కున్నారు.
తను అన్నమాచార్య కీర్తనలకు బాణీ కట్టడం ఎలా మొదలుపెట్టారో, ఆయన మాటల్లోనే...
“నేను సికిందరాబాద్‌లో గవర్న్‌మెంట్ మ్యూజిక్ కాలేజి ప్రిన్సిపాల్‌గా ఉండగా 1973లో తిరుపతి దేవస్థానం వారు నన్ను డెప్యుటేషన్ మీద తీసుకెళ్ళారు. అక్కడ నాలుగు సంవత్సరాలు పనిచేసాను. ఆ సమయంలో ఒకనాడు నా మిత్రుడు శ్రీ కామిశెట్టి శ్రీనివాసులుశెట్టి గారు వచ్చి అన్నమయ్య సంకీర్తన ఒకటి నాకిచ్చి దానికి మ్యూజిక్ కంపోజ్ చేసి పాడమని అడిగారు. కొన్నాళ్ళు అశ్రద్ధ చేసాను. ఒకరోజు ఆయన వచ్చి ఆ సాహిత్యం చాలా విశేషమైంది, మీరు తప్పకుండా స్వరరచన చెయ్యాలంటే దాన్ని తీసి చూసాను. “ఏమొకొ చిగురుటధరమున ఎడనెడ కస్తురి నిండెను...” ఈ పాట సాహిత్యం నిజంగా అద్భుతమైనది. ఇది శృంగార సంకీర్తన. ఏపాటి సాహిత్యజ్ఞానమూ, రసజ్ఞతా ఉన్నా విని ముగ్ధులవని వాళ్ళుండరు.వెంటనే తిలంగ్ రాగం మనసుకి వచ్చి పాడి చూసాను. బాగుందనిపించింది. ఆయనకి వినిపించాను. అద్భుతంగా ఉంది మాస్టారూ, అన్నాడు. అది మొదలు, అన్నమయ్య సారస్వతం మీద ఎంతో మమకారం ఏర్పడింది. ఆ పాట విన్న ప్రతి ఒక్కరు చాలా మెచ్చుకున్నారు. అది మొదలు ఇప్పటికి 108 సంకీర్తనలకి స్వరరచన చేసాను.
అన్నమయ్య పాటలు మన జాతిసంస్కృతికి ప్రతిబింబాలు. వాటిల్లో శృంగారభావాలూ, వేదాంతసారం, అలమేల్మంగా శ్రీనివాసుల లీలావినోదాలూ చదివి అర్థం చేసుకుంటూ ఆ పాటల్లోని సంగీతమాధుర్యం అనుభవించగలగటం వారి వారి అదృష్టమే! ఆ పాటలకి స్వరరచన చెయ్యగలగటం స్వామివారి అనుగ్రహం. నా పూర్వజన్మ సుకృతం. ఇవేకాక రామదాసు కీర్తనలు కొన్నిటికి బాణీలు చేసాను.”హరిహర రామా..” అన్న కీర్తన కానడలోనూ, “రావయ్య భద్రాచల రామా..”, “ఏమిటి రామా..” అన్నవి ట్యూన్ చేసాను . నారాయణ తీర్థులు రాసిన తరంగాలు మాత్రం 15, 16 చేసాను.”
తన జీవితంలో మరొక మరపురాని సంఘటన మద్రాస్ మ్యూజిక్ అకాడమీ కి ప్రెసిడెంట్ గా పదవి నిర్వహించడం అంటారు నేదునూరి. ఇందుకోసం తన పేరును శమ్మంగూడి శ్రీనివాస అయ్యర్ గారు సిఫార్సు చెయ్యగా, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారు దానికి మద్దతు ఇచ్చారట. ఇరువురు గొప్ప కళాకారులు ఇలా తన పేరును ప్రెసిడెంట్ పదవికి సిఫార్సు చెయ్యడం తన అదృష్టమని చెప్తారు నేదునూరి. ఏ తెలుగువారికీ దక్కని అరుదైన గౌరవం ఇది.
నేదునూరి విభిన్న పదవులు నిర్వర్తించారు. వాటిలో విజయవాడ జీ వీ ఆర్ ప్రభుత్వ సంగీత, నాట్య కళాశాల, ప్రధాన అద్యాపకుడిగా, సికింద్రాబాద్, విజయనగరం, తిరుపతి సంగీత కళాశాలలో పనిచేసారు. శ్రీ వేంకటేశ్వర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో ఆర్ట్స్ విభాగ డీన్ , బోర్డ్ ఆఫ్ స్టడీస్ చెైర్మన్ గా, ఆల్ ఇండియా రేడియో, సంగీత విభాగ ఆడిషన్ (ఆడిషన్) బోర్డ్ సభ్యుడిగా పనిచేసారు. 1985 లో ప్రభుత్వ కొలువు నుంచి రెటైర్ అయ్యి ఉపకార వేతనం తీసుకుంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ అచార్యుడిగా ఉన్నారు.
సంగీత అకాడమీలో యాబై యేళ్ళకు పైగా పాడారు. తన సుదీర్ఘ సంగీత యాత్రలో అనేక సంగీత కోవిదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ద్వారం వెంకట స్వామి నాయుడు దగ్గరనుంచి, డాక్టర్ శ్రీపాద పినాకపాణి, లాల్గుడి జయరామన్, ఎం ఎస్ సుబ్బులక్ష్మి, పేరి శ్రీరామమూర్తి (వయొలిన్), వెంకటరమణ (మృదంగం), నేమాని సోమయాజులు (ఘటం) ఇత్యాదులు నేదునూరి ప్రతిభను కొనియాడేవారు. నేదునూరి అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు పొందారు.
‘సంగీత కళానిధి ‘ అనే బిరుదు సంగీతకారులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం. 1991 లో మ్యూజిక్ అకాడమీ నుంచి తనకు దక్కిన ఆ అరుదైన గౌరవం తన గురువుగారి శుశ్రూష వల్లనే కలిగిందని వినయంగా చెప్తారు నేదునూరి.
నేదునూరి కృష్ణమూర్తి టీ టీడీ ఆస్థాన విద్వాన్‌గా అన్నమాచార్య కృతులని కూర్చి సంగీత లోకానికి అందించారు. మద్రాసు సంగీత అకాడమీ నుండి సంగీత కళానిధి గౌరవం అందుకున్నారు. నేషనల్ ఎమినెన్స్ అవార్డు (2006),ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి కళానీరాజనం పురస్కారం (1995) అందుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖచే హంసా అవార్డు (1999) అందుకున్నారు. భారత ప్రభుత్వ ప్రసార భారతి నేషనల్ ఆర్టిస్ట్ అవార్డు పొందారు.
గత 68 ఏళ్ళుగా కచేరీలు చేస్తూ వస్తున్న నేదునూరి మన సంగీత ప్రాముఖ్యతను గురించి, సంగీత సాధన గురించి ఇచ్చిన అమూల్యమైన సందేశం....
“శాస్త్రీయ సంగీతం వినాలి అంటే, దానితో పరిచయం ఏర్పరచుకోవాలి. అందులోని మాధుర్యం తెలుసుకునేందుకు , సంగీతంలో ప్రవేశం కలిగించుకుని, అభిరుచి పెంచుకోవాలి. ‘తెలుగు దక్షిణాది సంగీతానికి మాతృభాష’ అన్నారు. అటువంటి మన గొప్ప సంగీతాన్ని మనం ముందు తరాలకు అందించాలి. శ్రావ్యత, భాష, సమ పాళ్ళలో పాడే నేర్పు, సంగీతజ్ఞుడు తెలుసుకుని, నూతనత్వాన్ని పెంపొందించుకోవాలి. మనం పాడే సంగీతం ఎలా ఉంది, ఇతరులు పాడేది ఎలా ఉంది... వారి వద్ద నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా, అని ఆలోచించడం నిజమైన జ్ఞానం. సంగీతానికి అది చాలా ముఖ్యం. ‘ముఖే ముఖే సరస్వతి ...’ అన్నారు. ఇలా నిరంతర సాధన ద్వారా మన సంగీతాన్ని అజరామరం చెయ్యాలి.
సంగీతం కలిగించే ఆనందానుభూతి వర్ణనాతీతంగా ఉంటుంది. మన మహావాగ్గేయ కారులు భాగవత్కటాక్షం పొందే సులభ మార్గాన్ని చెప్పారు. సంగీతం ఆత్మానందాన్ని ఇస్తే, సాహిత్యం ఆత్మ జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ రెంటినీ ఆకళింపు చేసుకుని, ఆచరిస్తూ సంగీతం ఇచ్చే సత్ఫలితాన్ని వారు చూపారు. సంగీతం యొక్క ప్రయోజనం ప్రజల్లో నైతిక విలువల్నీ విశాలదృక్పథాన్ని పెంచి జీవితగమనానికి దారి చూపటమేసంగీతం నాదోపాసన, భగవత్ సేవ అని భావించి రసభావంతో పాడాలి. సంగీత భావన మనసు నుంచి రావాలి. బుద్ధి, మనసు భగవదర్పితం చేస్తేనే ఆత్మానందం కలుగుతుంది.”
శాస్త్రీయ సంగీతానికి మకుటం లేని మహారాజుగా నిలిచి, తెలుగువారి కీర్తిని దేశ దేశాలకు వ్యాపింపచేసిన ‘సంగీత కళానిధి’ నేదునూరి సందేశం తెలుగు వారికి, ఔత్సాహిక సంగీతజ్ఞులకు ఆచరణీయం.
http://www.youtube.com/watch?v=e45wCz8mb6k&index=5&list=PLSaObZlZeVs902aD1lmvZQi0MpS5F5WnK
http://www.youtube.com/watch?v=7B718LBuKZg&list=PLSaObZlZeVs902aD1lmvZQi0MpS5F5WnK&index=3
http://www.youtube.com/watch?v=_6u6N3086-M&list=PLSaObZlZeVs902aD1lmvZQi0MpS5F5WnK&index=7
No comments:
Post a Comment