అచ్చంగా తెలుగు సిరివెన్నెల - పరవస్తు నాగసాయి సూరి - అచ్చంగా తెలుగు

అచ్చంగా తెలుగు సిరివెన్నెల - పరవస్తు నాగసాయి సూరి

Share This

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం....

ఇక్కడా విలువలూ తక్కువే.... వలువలూ తక్కువే....

చుట్టూ రంగుల చీకటి.... ఎంతటి వెలుగైనా ఆ చీకట్లో కలిసి పోవాల్సిందే....

అలాంటిది అనుకోకుండా ఓ రోజు...

ఓ మహర్షి... శాపవశాత్తూ... తెలుగు వారి అదృష్టవశాత్తు... భూమి మీద పడ్డాడు. వైద్యుడు కావాలనుకున్నాడు... కుదరలేదు. ఏదో చిన్న గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోగలిగాడు. పాపం పీజీ చేద్దామనే ప్రయత్నాల్లో ఉన్నాడు. సరిగ్గా అప్పుడే కళాతపస్వి సినిమాలో అవకాశం. ఇంకేముంది కామా డాక్టరు ( కామా-కాబోయి మానేసిన ) కాస్త కామా పీజీ కూడా అయ్యాడు. తెలుగు వారి అదృష్టం వల్ల సినిమాల్లో పాటలు రాసేందుకు కుదురుకున్నాడు. ఆ శాపగ్రస్త మహర్షి చేంబోలు సీతారామశాస్త్రి. ఆ సినిమా సిరివెన్నెల. తొలిసినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని సిరివెన్నెల సీతారామశాస్త్రి అయ్యారు. ఆ మహర్షి పుట్టినరోజు మే 20న....

ఏ ముహూర్తాన విధాత తలపున ప్రభవించినది అంటూ సినిమా పాటల సాగరాన్ని మధించడం మొదలు పెట్టారో కానీ... విలువలున్న పాటలకు సిరివెన్నెల కలం చిరునామాగా మారింది. ఏవో నాలుగు బూతులు రాసేసి ఇది నా వృత్తి... తప్పదు మరి అని సరిపెట్టుకోకుండా... విలువల వలువలు ఒంటి నిండా కప్పుకుని కూర్చున్నారు. ఇది అది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేకుండా... తెలుగు సాహిత్యంలోని ఎన్నో ప్రక్రియల్ని తన పాటల్లో కూర్చారాయన.

తొలి సినిమా సిరివెన్నెలతో మొదలు పెడితే అందులో ప్రతి పాటా ఆణిముత్యమే. ముఖ్యంగా ఆది భిక్షువు వాడినేది కోరేది.. బూడిదిచ్చే వాడినేది అడిగేది అంటూ... నిందాస్తుతిని పాటల్లో పేర్చిన ఘనత సిరివెన్నెలకు దక్కింది. బహుశా అందుకేనేమో ఆ సినిమా పేరు ఆయన ఇంటి పేరు అయ్యింది. రుద్రవీణ సినిమాలోని పాటలు తీసుకుంటే... జానపది బాణీలో నమ్మకు నమ్మకు ఈ రేయిని అన్న ఆయనే.... లలిత ప్రియకమలం విరిసినది... అంటూ జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక నృత్య ప్రధానంగా సాగిన స్వర్ణకమంలో అందెల రవమిది పదములదా... అంబరమంటిన హృదయముదా... అంటూ నాట్యం చేసే వారి మనసును ఆవిష్కరించారు. అంతేనా అన్నమయ్య పాటల బాణీలో.... ఆయనే రాశాడేమో అన్నట్టుండే.... తెలవారదేమో స్వామి పాటను శృతిలయలు సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారే రాశారు మరి.

ఇదేంటి అన్నీ ఇలాంటి పాటలే అనుకుంటున్నారా. వస్తున్నా అక్కడకే వస్తున్నా. బోటనీ పాఠముంది.. మేటనీ ఆట ఉంది... అంటూ సగటు కాలేజీ కుర్రాడి అంతరంగాన్ని ఆవిష్కరించడం సిరివెన్నెల గారికి తప్పితే ఎవరికైనా సాధ్యమైందా. కో అంటే కోటి.... అంటూ డబ్బు జబ్బు చేసిన వాడి మనసును ఆవిష్కరించిన క్షణక్షణం సినిమాలోనే... జామురాతిరి జాబిలమ్మా అనే మనసున్న పాటను కూడా ఆయనే రాశారు మరి. గాయం సినిమాలో అలుపన్నది ఉందా ఎగిరే అలకు... అని రాసిన కలంతోనే సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని అంటూ ప్రశ్నించారు. అదే సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అంటూ... సమాజం మీదకు దండయాత్ర చేసే విధంగా మనల్ని పురికొల్పుతారు.

సున్నితమైన హాస్యాన్ని సైతం తన పాటల్లో రంగరించి... ఏదో ఒక సందేశాన్ని అందిచడం సిరివెన్నెల గారికి మాత్రమే తెలిసిన విద్య. క్లాసు రూములో తపస్సు చేయుట వేస్టురా గురూ అంటూ చెబుతూనే ఎందుకో... ఏమిటో అన్న విషయాన్ని కూడా ఇట్టే వివరిస్తారు. ఇక మనీ సినిమాలో ఆయన రాసిన చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకి పాట... డబ్బు లౌకిక తత్వాన్ని ఇట్టే వివరిస్తుంది. అదే సినిమాలో భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ... భర్తగ మారకు బ్యాచిలరు అంటూ... పెళ్ళిలో ఉండే గమ్మత్తుని మన కళ్లకు కట్టేస్తారు. మరో చోట బోడి చదువులు వేస్టు... నీ బుర్రంతా భోంచేస్తూ... ఆడి చూడు క్రికెట్టు టెండుల్కర్ అయ్యేట్టు అంటూ.. ఓ పక్క చదువు వేస్టు అంటూనే.... క్రికెట్ ఆడితే మాత్రం టెండూల్కర్ అవ్వాలి... అంటే శ్రద్ధ పెట్టాలి అని చెబుతున్నారాయన.

ప్రేమ పాటలు రాయడంలో కూడా సిరివెన్నెల ఆయనకు ఆయనే సాటి. ఖడ్గం సినిమాలో... నువ్వు నువ్వు పాట ఒక్కటి చాలదా... కన్నె పిల్ల మనసులోకి ఆయన ఎలా పరకాయ ప్రవేశం చేశాడో తెలుసుకోవడానికి. నువ్వు వస్తావని సినిమాలో పాటల పల్లకిలో గీతంలో... విరహంలోని వైరాగ్యాన్ని చక్కగా కళ్ళకు కట్టారు. ఇక నువ్వే కావాలి సినిమాలో ఎక్కడ ఉన్నా... పక్కన నువ్వే గీతం సిరివెన్నెలలోని టీనేజ్ కుర్రాడికి ఉదాహరణ అయితే.... కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు పాట... ఆయనలోని కన్నెపిల్లకు చక్కని ఉదాహరణ. చెప్పుకుంటూ పోతే ఇలాంటి పాటలు ఎన్నో. అసలు వీటన్నింటి కంటే ముందే... అచ్చ తెలుగు శృంగారాన్ని రంగరిస్తూ... బలపం పట్టి భామ బళ్ళో... గీతం రాసేశారు ఆయన. ఆ పాటలోని ప్రతి పదం తెలుగు దనాన్ని రంగరించిన శృంగార రసమే.

సిరివెన్నెల సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పడం బహుశా మన వల్ల కాదేమో. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటూ... మనల్ని ముందుకు కదలమంటాడు. అర్ధదశాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా అంటూ... స్వతంత్రానికి నువ్వు ఇచ్చిన విలువేంటని ప్రశ్నిస్తారు. ప్రశ్నలతోనే ఆపేస్తే ఆయన సిరివెన్నెల ఎందుకౌతారు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ... కోలుపోవద్దురా ఓరిమి అంటూ... ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు. మనసు కాస్త కలతపడితె మందు ఇమ్మని మరణాన్ని కోరకు అంటూ... మనల్ని వెనక్కు లాక్కొచ్చేస్తారు. ఎంత వరకూ ఎందు కొరకూ అని అడక్కు... గమనమే నీ గమ్యమైతే అంటూ... మన గమ్యాన్ని గుర్తు చేస్తారు. విత్తనం మొలకెత్తడం దగ్గర్నుంచి... జగాన్ని మొత్తం కుటుంబ చేసి మన చేతుల్లో పెట్టే వరకూ ఊరుకోరాయన.

సినిమా పాటలతో తెలుగును బతికిస్తున్న సిరివెన్నెల ఓ సారి... “తెలుగు మిగతా అందరికీ మాతృభాష మాత్రమే కావచ్చు. కానీ నాకు అన్నం పెట్టిన భాష. ఏమీ లేని నన్ను నిలబెట్టిన భాష. ఆ భాషే పాటల రూపంలో నా పిల్లలకు ఇంత తిండి పెట్టింది. నా పిల్లలకు మంచి చదువు చెప్పింది. నన్ను ఇంత వాణ్ని చేసింది”... అంటూ తెలుగు భాషతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అంతే కాదు... భాషాభిమానం ఉండాలి కానీ... భాషా దురాభిమానం తగదని హితవు చెబుతారు. కొందరికి కోపం తెప్పించినా.... తెలుగుతనాన్ని, తెలుగు భాషను గౌరవించండి... శాసించకండి.. అంటుంటారాయన.

త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు... అర్థరాత్రి అక్షరాల్ని పట్టుకుని వేటకు బయలుదేరతారు సిరివెన్నెల. మన మనసుల్లోకి ప్రవేశించి.... నాకు సమాధానం చెప్పమంటూ ప్రశ్నిస్తారు. జగమంత కుటుంబ నాది అంటూనే... ఏకాకి జీవితం నాది అనేస్తారు. ఆయన వయసెంత అని అడగకండి... ఎందుకంటే... ఏ వయసులోకైనా సులభంగా పరకాయ ప్రవేశం చేసేస్తారు. నిన్ను ఆవహిస్తారు... శాసిస్తారు... చేయిస్తారు... అందుకే మరో సారి చెబుతున్నాను.... ఆయన సినిమా రచయిత కావడం తెలుగు సినిమా అదృష్టం... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి దురదృష్టం. పాటల్లో అచ్చంగా తెలుగు సిరివెన్నెలలు కురిపిస్తున్న ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.....

చివరగా... ఆయన రాసి, పాడిన కళ్లు సినిమాలోని తెల్లారింది లెగండోయ్... పాట వెనుక సంగతులతో కూడిన వీడియో.....

http://www.youtube.com/watch?v=I7ECV6dC-_o&hd=1

No comments:

Post a Comment

Pages