కొరివి దయ్యం - రచన : భవానీ ఫణి - అచ్చంగా తెలుగు

కొరివి దయ్యం - రచన : భవానీ ఫణి

Share This
కొరివి దయ్యం 
భవానీ ఫణి

చిన్నా కళ్ళు నలుపుకుంటూ పెరట్లోకి వచ్చాడు . వాడికి దూరంగా పిల్లల అరుపులు  వినిపిస్తున్నాయి . ఆ రోజు ఆదివారం . ఆవేళ  పొద్దున్నుంచి  వాడు ఐస్ ప్రెస్, కోతి కొమ్మచ్చి ఆడి , ఆడి అలిసి పోయాడు. మద్యాహ్నం ఇంటికి వచ్చి అన్నం తిని పడక వేసాడు . ఇప్పుడే అమ్మ కుదిపి కుదిపి లేపేసింది . "లేవరా చిన్నా, ఇంత సేపు నిద్రపోతే ఇంక రాత్రి ఏం పడుకుంటావ్ " అని .
వాడికి లేవాలని లేదు . కానీ తప్పనిసరై లేచి వాళ్ళమ్మ ఇచ్చిన పాలు తాగేసి ఇలా పెరట్లోకి వచ్చాడు . ఇంకా చీకటి పడలేదు గానీ ఇప్పుడిప్పుడే పడుతోంది కొంచెం కొంచెం.
ఆ టైం కి వాడి అన్నయ్యలు , వాళ్ళ నేస్తాలు అక్కడ క్రికెట్ ఆడతారు . వాళ్ళ పెరడు చాలా పెద్దది . అంత స్థలం మాటి మాటికీ బాగుచేయించలేక కొంత మేర శుభ్రం చేయించి మిగతాది అలా వదిలేస్తుంది  వాళ్ళమ్మ.
అందుకే కొంచెం ముందుకి వెళ్తే ఎత్తుగా పెరిగిన గడ్డి ఉంటుంది . అక్కడక్కడా ముళ్ళపొదలు కూడా ఉంటాయి . చుట్టూ దెయ్యాలా కొబ్బరి చెట్లు కూడానూ. ఇంతకుముందు చిన్నా ధైర్యం గానే పెరడంతా తిరిగేవాడు . కానీ మొన్నామధ్య  అక్కడ ఓ పెద్ద పాముని చంపారు . అప్పటినించీ చిన్నా కి కొంచెం భయంగా ఉంది . అది పొడ పాముట . అది కరిస్తే ఒళ్ళంతా పొడలు పొడలు గా రాలిపోయి చచ్చిపోతారట . సత్యం పెదనాన్న చెబుతుంటే విన్నాడు .
వాడికి ఆడుకునే పిల్లలు సరిగ్గా కనిపించడం లేదు అక్కడ్నించి . ముందుకి వెళ్ళాలి అంటే భయం . వాడికి పాములంటేనే భయం .  గుర్రాలంటే అస్సలు భయం లేదు . పోయిన్నెల కొమ్మ దాసరాళ్ళు  గుర్రాలు తమ పెరట్లో కట్టుకున్నారు. వాళ్ళు ఆ గుర్రాల మీద  సామాను వేసుకుని ఊరూరా  తిరుగుతూ దేవుడి కథలుచెప్పి పాటలు  పాడుతూ
ఉంటారుట.  చిన్నాకీ, రఘూకీ అవి ఎక్కి స్వారీ చెయ్యాలని సరదా .కానీ  వాళ్ళు చిన్నపిల్లలని ఎవరూ వాళ్ళని ఎక్కనివ్వరు . అందుకే వాళ్ళిద్దరూ ఒక ఆలోచన చేసారు .
మద్యాహ్నం వేళ ఎవరూ లేకుండా చూసి , పిట్టగోడ ఎక్కి గోడవారగా కట్టి ఉన్న గుర్రం పైన దూకాలని వాళ్ళ ప్లాన్ . ముందు మెల్లగా గుర్రాన్ని విప్పేసారు . కానీ గోడ ఎక్కాకా రఘు గాడికి భయమేసినట్టుంది . కదల్లేదు . చిన్నా మాత్రం దూకేసాడు . అంతే అది బెదిరి పరుగందుకుంది . వాడు దాన్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు . అది పదినిమిషాల పాటు అలా ముళ్ళ పొదల మధ్యలోంచి పరుగులు పెడుతూనే ఉంది  దాని యజమాని వచ్చి ఆపేదాకా . అప్పటికి చిన్నా ఒళ్లంతా శుభ్రంగా గీరుకుపోయింది . తర్వాత  వాళ్ళ అమ్మ చేత ,అన్నయ్యల చేత గట్టిగానే చీవాట్లు తిన్నాడు కూడా.
ప్రస్తుతం లోకి వస్తే వాడి  అన్నయ్యలు  ఆడుతున్న చోటుకి ఎలా వెళ్ళాలో వాడికి అర్ధం కావట్లేదు . వాళ్ళంతా క్రికెట్ ఆడతారు . చిన్నాని ఎలాగూ ఆడనివ్వరు . కానీ చూడాలని ఉంది వాడికి . పాముల భయం ఒక్కటే కాదు . వాడికి ఇంకో భయం కూడా ఉంది . దెయ్యాల భయం . అందులోనూ నిన్న రాత్రి జరిగిన విషయం వల్ల వాడికి ఇంకా కాస్త భయం  ఎక్కువైంది .
ముందు రోజు సాయంత్రం  రామం బాబాయి, "సినిమా కి వస్తారా"  అని నాగరాజు మావయ్యనీ, సూర్యం అన్నయ్యనీ అడుగుతుంటే విన్నాడు . వాళ్ళు రామన్నారు . చిన్నా వస్తానని చెప్పాడు వాడ్ని అడగకపోయినా. రామం  బాబాయి ఎప్పటిలాగే వద్దన్నాడు . పైగా "నువ్వు చిన్న పిల్లాడివి రా, అలాంటి సినిమాలు చూడకూడదు"  అన్నాడు కూడా . చిన్నా కి కోపం వచ్చింది తనని చిన్న పిల్లాడు అన్నందుకు .
 అందుకే మొదటి ఆట సినిమా మొదలయ్యే టైం కి సినిమా హాలు దగ్గర కాపు కాసాడు . అక్కడికి వచ్చిన బాబాయి ని పట్టుకుని వదల్లేదు లోపలికి తీసుకెళ్ళే వరకు . సినిమా మొదలయ్యాక బాధపడ్డాడు చిన్నా తను చేసిన సాహసానికి . అది దెయ్యాల సినిమా . అసలే వాడికి దెయ్యాలంటే భయం . ఇప్పుడు ఇంటికి వెళ్దామంటే బాబాయ్ తంతాడు . అందుకే ప్రాణాలు ఉగ్గబట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నాడు సినిమా అయ్యేవరకు .
అందుకే  ఇంత ఆలోచన చిన్నాకి. అసలే చీకటి పడుతోంది . పాములు , దెయ్యాలు కలిసి తిరుగుతూ ఉంటాయో  ఏమో . ఏం చెయ్యాలా  అని ఆలోచిస్తూ నిలబడిపోయాడు  పెరటి గుమ్మం దగ్గర. అప్పుడు వాడికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది .
*****************************************
దీపాలు పెట్టి చాలా సేపయింది . చిన్నా వాళ్ళ అమ్మకి ఆందోళనగా ఉంది. స్నానాలు చేసి భోజనానికి వచ్చిన చిన్నా అన్నయ్యల్ని అడిగింది వాడి  గురించి . వాళ్ళు తెలీదన్నారు .
" అదేంటిరా , పడుకుని లేచి వాడు మీ దగ్గరికేగా వచ్చాడు " అందామె మరింత కంగారుగా .
" ఎక్కిడికి పోతాడమ్మా , రఘు గాడి ఇంట్లోనో, బాబి గాడి ఇంట్లోనో ఉండి ఉంటాడు , భోంచేసి తీసుకొస్తాలే "అన్నాడు చిన్నా పెద్దన్నయ్య .
కానీ వాళ్ళ ఇంట్లో లేడు చిన్నా . ఎంత వెతికినా కనిపించలేదు . ఊర్లో సగం మంది పైగా వాళ్ళ ఇంటి దగ్గర పోగయ్యారు .పొలాల్లోనూ తోటల్లోనూ వెతికారు . సినిమా హాల్లో రెండు సార్లు చూసి వచ్చారు . ఇక ఆఖరికి  పొరపాట్న పడ్డాడేమో అని నూతులన్నీ వెతికారు . చిన్నాజాడ లేదు .
ఓ పక్క వాళ్ళమ్మని పట్టుకోలేక పోతున్నారు.  తండ్రి లేని పిల్లాడు , అందర్లోకీ చిన్నవాడని  వాడంటే ప్రాణం ఆవిడకి .
"వాడు పెరట్లో కే వెళ్ళా డన్నయ్యా , సరిగ్గా చూసారా " బేలగా అడిగిందామె విశ్వాన్ని .
"నేనే  స్వయంగా అంతా చూసానమ్మా , లేడక్కడ " అన్నాడాయన బాధగా .
" ఆ లాంతరు నాకివ్వన్నయ్యా , ఒక్కసారి నేను చూసొస్తాను అంది  ఆశ చావక. మెల్లగా లేచి లాంతరు పట్టుకుని పెరట్లోకి వచ్చింది .
చిన్నా చిన్నా అని గట్టిగా పిలుస్తూ ఓ పది నిముషాలు వెతికింది .ఎక్కడా అలికిడి వినిపించక  నిరాశగా  వెను తిరిగింది . అప్పుడు ఎక్కడి నించి వచ్చాడో వచ్చి ఆమె కాళ్ళకి చుట్టుకున్నాడు చిన్నా . వెంటనే వాడ్ని ఎత్తుకుని మొఖమంతా ముద్దులతో నింపేసింది . "ఎక్కడి కెళ్ళావు రా నాయనా " అంటూ.
అప్పుడు మెల్లగా చెప్పాడు చిన్నా అసలు సంగతి
వాడికి పిల్లలు ఆడుకునే చోటుకి వెళ్ళడానికి భయం వేసింది . అందుకే పక్కనే ఉన్న కొబ్బరి మొక్క ఎక్కి చూసాడు . అక్కడ్నించి ఆట బాగానే కనిపించింది . కొంత సేపు చూసాకా అసలే బద్ధకంగా  ఉండటం వల్ల వాడికి మళ్ళీ నిద్రొచ్చింది . మెల్లగా ఆ మొక్కని కావలించుకుని నిద్రలోకి జారిపోయాడు . మళ్ళీ మెలకువ వచ్చి చూసేసరికి అంతా చీకటి . ఎవరూ కనిపించలేదు . క్రిందకి దిగుదామంటే పాములుంటాయేమోనని  భయం చీకట్లో .
***************************************************
క్షేమంగా వాళ్ళమ్మ చంకలో ఉన్న చిన్నాని  చూసి అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకుని  కొందరు చాటుగానూ , కొందరు గట్టిగానూ నవ్వడం మొదలు పెట్టారు .
"పిన్నీ,మీ ఇంట్లో మంచాలు మాకిచ్చేయ్ , ఎలాగు చిన్నాగాడు కొబ్బరి చెట్టు మీదే గా పడుకుంటాడు " అన్నాడు రాజా
చిన్నా ముఖం కోపం తో ఎర్రబడింది . ఎప్పుడూ వెటకారమే వీడికి .
" ఒరేయ్, చిన్నా దొరికాడు , వెతకడం ఆపమనండి " అని ఓ అరుపు అరిచాడు విశ్వం మావయ్య .
"ఏరా ! నే ఇందాకా వచ్చి పెరడంతా వెతికాను కదరా , నువ్వు చూడలేదా నన్ను  " అన్నాడు ఆయన చిన్నాని ప్రేమగా చూస్తూ .
అప్పటివరకు కోపంగా ఉన్న చిన్నా ముసి ముసి నవ్వులు నవ్వడం మొదలు పెట్టాడు . ఎందుకో అర్ధం కాక అందరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు .
"అది నువ్వేనా మావయ్యా, చీకట్లో నువ్వు కనిపించలేదు . లాంతరు గాల్లో ఎగురుతోందని కొరివి దెయ్యం అనుకున్నాను "
ఆ మాటలకి అందరూ ఘొల్లున  నవ్వారు .
ఆ విధంగా చిన్నా చిన్నప్పటి చిన్ని కథ సుఖాంతం అయింది .
**************************************

No comments:

Post a Comment

Pages