స్త్రీహృదయం
- పెయ్యేటి రంగారావు
ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుంది.
ఊ అనలేదు, ఊహూ అనీ అనలేదు!
ఉండబట్టలేక నేనే రెట్టించి అడిగాను. పార్కులో, కూర్చున్న పచ్చగడ్డిమీంచి లేస్తూ, ' చీకటి పడుతోంది. ఇంక వెళ్దామా?' అంది. నాకు చాలా కోపం వచ్చింది. నా అంతటివాడిని నేను కోరి ప్రపోజ్ చేస్తే, సమాధానం చెప్పకుండా ఇంక వెళ్దామా అంటుందా అని చిర్రెత్తుకొచ్చింది. గాడిదగుడ్డు! ఈ బెట్టు ఎన్ని క్షణాల్లే? రేపీపాటికి ముంచుకొస్తున్న సిగ్గుతో, తల వక్షోజాలకి తగిలేలా దించేసుకుని, ' నిన్న రాత్రంతా చాలా ఆలోచించాను రాజూ! అసలు రాత్రి కంటిమీద కునుకే రాలేదు. నిన్న నువ్వు ప్రపోజ్ చెయ్యడమే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చింది. వెంటనే ఊ అనడానికి అహం అడ్డు వచ్చి వాయిదా వేసాను. కాని ఇప్పుడు నిజం ఒప్పేసుకుంటున్నాను. నీ గుండెల్లో నాకు చోటు దొరకడం నేను ఎన్ని జన్మలలోనో చేసుకున్న పుణ్యం! నోచిన నోముల ఫలం! నీ జీవితంలోకి సహధర్మచారిణిగా ప్రవేశించడం కన్న నాకు మహద్భాగ్యం మరేముంటుంది?' అని తీరదూ? నేను, సుజాత, తోసిరాజు భానుమూర్తి ఎలిమెంటరీ స్కూలు నించి కాలేజి దాకా ఒకే చోట చదువుకున్నాం. భానుమూర్తిగాడిని నేను వెటకారంగా, వాడింటి పేరు తోసిరాజు కదా, ' ఒరేయి టి.బి.మూర్తీ, ఒరేయి టి.బీ, ఒరేయి క్షయరోగీ! అని ఎద్దేవాగా పిలిచేవాడిని. వాడు ఏమీ అవమానంగా భావించకుండా, ' ఒరేయి రాజూ, ఒరేయి రారాజూ, ఒరేయి జమీందారూ!' అని పిలిచేవాడు. అవును మరి! నేను కోటీశ్వరుడి ఏకైక సంతానాన్ని. వాడు తన పేద తలిదండ్రులకి కలిగిన ఏడుగురు సంతానంలో చిట్టచివరి వాడు. ఒకసారైతే నేను వెటకారంగా, ' ఒరేయి! మీ బాబుకి పిల్లల్ని కనడం కాకుండా ఇంకేమైనా హాబీలున్నాయిరా?' అని కూడా అనేసాను. అప్పుడు కూడా వాడు బదులు చెప్పకుండా నవ్వేసి ఊరుకున్నాడు. ఇంటర్మీడియేట్ లో వాడు కాలేజి ఫస్టు, సుజాత కాలేజి సెకండ్ వచ్చారు. నేను అత్తెసరు మార్కులతో పేసయ్యాను. ఎం.సెట్ కి వాడు ఆర్థిక ఇబ్బందుల వలన అప్పియర్ అవకుండా, బి.ఏ.లో చేరి, తరవాత బి.ఇడి. చేసి బతకలేక బడిపంతులన్నట్టు ఎలిమెంటరీ స్కూల్లో మేష్టరుగా చేరాడు. సుజాత ఎంసెట్లో రేంకు తెచ్చుకుని ఎం.బి.బి.ఎస్. చేసి, తర్వాత పి.జి. చేసి, సైకియాట్రిస్టుగా కార్పొరేట్ హాస్పటల్ లో ఉద్యోగం చేస్తోంది. నాకు ఎంసెట్లో రేంకు రాలేదు. కాని మా నాన్న కోటీశ్వరుడు కదా! అందువల్ల కర్నాటకలో డొనేషను కట్టి ఎం.బి.బి.ఎస్.లో చేర్చాడు. ఆ తర్వాత నాకూ కొంచెం చదువు మీద శ్రధ్ధ కలిగి, ఇ.ఎన్.టి.లో స్పెషలైజ్ చేసాను. మా నాన్నగారు తన పలుకుబడి నుపయోగించి, సుజాత పనిచేస్తున్న కార్పొరేట్ హాస్పటల్ లోనే నాకూ ఇ.ఎన్.టి. స్పెషలిస్ట్ గా ఉద్యోగం వేయించారు. ఇంక నా జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలు అంటే రోజుకు ఇబ్బడి కేసులు, ముబ్బడి రాబడిగా సాగిపోతోంది. మన భారతదేశంలో ఎంత చిన్న రోగానికైనా పెద్ద డాక్టరు దగ్గిరకే పరిగెడతారు. అల్లా ఏ అమాయకుడు ఏ చిన్న చెవినెప్పితోనో, గొంతు నెప్పితోనో నా దగ్గిరకి వచ్చినా, అడ్డమైన టెస్టులూ రాసేసి, అవన్నీ చేయించేసి, ఆనక ముఫ్ఫై రకాల మందులు రాసేస్తుంటాను. ఏం చెయ్యను మరి? నాకూ డబ్బు కావాలి, మా ఆస్పత్రి వాళ్ళకీ రాబడి రావాలి. సుజాత, నేనూ ఒకే చోట ఉద్యోగం చేస్తూండటంతో ఇద్దరం దాదాపు రోజూ కలుసుకుంటూంటాం. సుజాతకి సైకియాట్రిస్టుగా పట్నంలోనే పెద్ద పేరుంది. ఆమె ఎటువంటి జటిలమైన కేసునైనా ఎంతో నేర్పుగా వైద్యం చేసి, అద్భుతమైన ఫలితాలని సాధిస్తుంది. దాంతో ఆమె రాబడి కూడా బాగా పెరిగిపోయి, చూస్తూండగానే బేంకు బేలన్సు పెంచేసుకుని, ఉన్నత స్థాయికి ఎదిగిపోయింది. అందుకే నాకో ఆలోచన వచ్చింది. ఆమెని నేను పెళ్ళి చేసుకుంటే, మా ఇద్దరి సంపాదనతో నగరంలోని సగభాగాన్ని సొంతం చేసేసుకోవచ్చని ఆశ పుట్టింది. డబ్బు సంపాదన అన్నది ఒక వ్యసనం! ఒక జబ్బు! ఆ డబ్బు జబ్బు వచ్చిందంటే, ఇంక అది ఇన్ కొరీజిబుల్! తగ్గదు గాక తగ్గదు, సరికదా, ఇంకా ముదిరిపోతుంది! అందులో తప్పేముంది? మన రాజకీయ నాయకులు సంపాదించటల్లేదూ? ఆ మధ్య పేపర్లో చదివాను. కిళ్ళీకొట్టు నడిపే ఆసామి రాజకీయాల్లో చేరి అనతికాలంలోనే ముఫ్ఫైయ్యారు కోట్లు సంపాదించాడట! ఈ ప్రపంచంలో అన్నింటికన్న డబ్బే ముఖ్యం. మానవత్వపు విలువ అంటే అది కుందేటి కొమ్ముతో సమానం! అందుకే నేను సుజాతకి ప్రపోజ్ చేసాను. ఇద్దరం ఒకే ఫీల్డులో వున్నాం. పైగా ఎక్కడ చూసినా ఒక డాక్టరు మరొక డాక్టర్నే పెళ్ళాడతాడు. అల్లా చూసినా మా ఇద్దరిదీ ఆదర్శవంతమైన జోడీ. అన్నట్లు చెప్పడం మరిచిపోయాను. టి.బి.గాడు కూడా సుజాతని ప్రేమిస్తున్నాడని నా అనుమానం. అనుమానమేమిటి? అది నిజమే. చిన్నప్పట్నించీ వాడు సుజాతంటే అపరిమితమైన అభిమానాన్ని ప్రదర్శించేవాడు. ఆమె పుట్టిన రోజున నేను వజ్రపుటుంగరం బహుమతిగా ఇస్తే, ఆ బోడిగాడు పబ్లిక్ పార్కులో పూసిన గులాబిపువ్వుని దొంగతనంగా కోసి తీసుకొచ్చి ప్రజంటు చేసాడు. అప్పటి సంఘటన నాకింకా గుర్తుంది. నేనిచ్చిన వజ్రపుటుంగరాన్ని సుజాత అపురూపంగా అందుకుంది. అల్లాగే వాడిచ్చిన గులాబీకేసి అదోరకంగా చూసి, ఏమనలేక తన జడలో తురుముకుంది. పూర్ టి.బి.! ఈ మధ్యన ఇంకో గమ్మత్తు జరిగింది. టి.బి.గాడికి గొంతులో చేపముల్లు దిగింది. వాడు లబోదిబోమంటూ నా దగ్గిరకి పరిగెత్తుకు వచ్చాడు. మామూలుగా ఐతే అటువంటి పేషెంటునించి కనీసం పదివేలు గుంజుతాను నేను. కాని నా హిపోక్రసీ వేరు. వీడిమీద ఔదార్యం చూపించానంటే, నా కాళ్ళ దగ్గిర కృతజ్ఞతాభావంతో కుక్కలా పడివుంటాడు. అందుకే నేను చాలా హుందాగా వాడికి కన్సల్టేషను ఫీజు కాని, వైద్యం ఖర్చు గాని లేకుండా, ఆస్పత్రివాళ్ళతో వీడు నావాడని చెప్పి ఉచితంగా వైద్యం చేసి పడేసాను. అప్పుడే వాడిని హేళనగా అడిగాను, ' ఏరా, నువ్వు సుజాతని ప్రేమిస్తున్నావా?' వాడు విషాదంగా నవ్వి అన్నాడు, ' అవున్రా రారాజూ, నా ప్రియమైన జమీందారూ! నేను సుజాతకి ప్రేమని ఇస్తూనే వుంటాను. కాని ఇవ్వడమే కాని తీసుకోవడం తెలీని చవటనిరా నేను. అందుకే ఇంతవరకూ నేను ఆమె మీద వున్న ప్రేమని వ్యక్తం చెయ్యలేదు. చెయ్యను కూడా. నా ఉద్దేశ్యంలో అమ్మడానికి గాని, ఎక్స్ ఛేంజ్ చేసుకోడానికి గాని ప్రేమ అనేది కమ్మోడిటీ కాదురా. పైగా ఆవిడ అంతస్తుకి, నా అంతస్తుకి మైసూరు మహరాజా పేలస్ కి, తిండి లేని పేదవాడి పూరి గుడిసెకి వున్నంత అంతరం వుంది. అందువల్ల నేను ఆమెకి ప్రేమని ఇస్తూనే వుంటాను. కాని ఆమె ప్రేమని తీసుకునే అర్హత గాని, తాహతు గాని నాకు లేవురా.' నేను పగలబడి నవ్వేసి, ' వెరీగుడ్! విచక్షణాజ్ఞానం వున్న బడుధ్ధాయివిరా నువ్వు. డబ్బు డబ్బుని కోరుతుంది. హోదా హోదాని వరిస్తుంది. అందుకని నువ్వేం బాధ పడకు. గంతకి తగ్గ బొంత అన్నట్టుగా నువ్వు కూడా ఏ పంతులమ్మ మెడలోనో తాళి కట్టేసి హాయిగా బతికెయ్యి.' అన్నాను. ఇలా మాట్లాడుకుంటూండగా సుజాత నా రూములోకొచ్చింది. జాలిగా టి.బి.గాడికేసి చూసి, ' ఏం భానూ! ఇప్పుడెలా వుంది?' అని అడిగింది. వాడు, ' ఇదిగో, ఈ రారాజు దయ వల్ల తగ్గిపోయింది సుజాతా.' అన్నాడు. అప్పుడు సుజాత అంది, ' అవును భానూ! రాజు చాలా కంపీటెంట్ డాక్టర్. నువ్వు రాజు దగ్గిరకి వచ్చి చాలా మంచి పని చేసావు.' టి.బి.గాడు తడిబారిన కళ్ళతో, ' ఔను సుజాతా! రాజు నా బాల్యమిత్రుడనిపించుకున్నాడు. పైసా ఖర్చు పెట్టనివ్వకుండా నాకు వైద్యం చేసాడు.' అన్నాడు. సరి! ఇదంతా అప్రస్తుతం. మర్నాడు సుజాత నా ప్రపోజల్ కి తన అంగీకారాన్ని తెలియజేస్తుందన్న నమ్మకంతో ఆస్పత్రికి వెళ్ళాను. కాని సుజాత పిచ్చి..........! క్షమించండి. ఇంకా నీచంగా తిట్టచ్చు దాన్ని. నాకు ఆవేశం ఆగటల్లేదు. అందుకే తమాయించుకుంటున్నాను. ' అది ' నాదగ్గరికి వచ్చి అంది, ' రాజూ, నాలుగు రోజుల క్రితం భాను ఇక్కడికి వచ్చినప్పుడు, నీ రూములో మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు నేను వినడం జరిగింది. అది నా అదృష్టం! అందుకే నువ్వు నన్ను క్షమించు. నువ్వు కోరుకుంటే, కో అంటే కోటిమంది కోట్లరూపాయలు గుమ్మరించి నిన్ను స్వంతం చేసుకుంటారు. కాని నేను పిచ్చిదాన్ని. ప్రేమించడం కన్నా, ప్రేమించబడటం అదృష్టం అని మనసా, వాచా, కర్మణా నమ్మేదాన్ని. అందుకే నేను భానుమూర్తిని, నీ దృష్టిలో టి.బి.గాడిని ఇష్టపడుతున్నాను. ఇవాల పొద్దున్నే ఆయన దగ్గరకి వెళ్ళి నా అభిప్రాయాన్ని తెలియజేసాను. భాను అమాయకంగా, అమందానంద కందళిత హృదయారవిందంతో, తన చేతుల్లోకి నా చేతులని తీసుకుని భక్తిగా ముద్దాడాడు. నువ్వు మనసు కష్టపెట్టుకోకుండా మా పెళ్ళికి వచ్చి మా ఇద్దరినీ నిండుమనసుతో ఆశీర్వదించమని అభ్యర్థిస్తున్నాను. ఆడదంటే నీకు చులకన భావం. అలాగే నీ హోదా కలిగించిన మత్తులో నువ్వు చాలా అహంకారంగా ప్రవర్తిస్తావు. అప్పుడు నీకు స్నేహితులు కూడా పురుగులుగా కనిపిస్తారు. అందుకే నువ్వు భానుని టి.బి.గాడు అంటూంటావు. అంతేకాదు, నువ్వు మాట్లాడే ప్రతిమాటలోను నీ ఓటితనం కనిపిస్తూనే వుంటుంది. నీకు భార్య అంటే ఒక డబ్బు సంపాదించి పెట్టే ఒక యంత్రం. నీ హోదాని పెంచే నీ యింటి షోకేసులోని ఒక బొమ్మ. అంతేగాని, స్త్రీ అంటే ఒక ప్రాణి అని గాని, ఆమెకూ ప్రేమించే ఒక హృదయం ఉంటుందని గాని నువ్వు అర్థం చేసుకోలేవు. ఉంటాను.' సుజాత నాచేతుల్లో శుభలేఖ వుంచి వెళ్ళిపోయింది. మూర్ఖురాలు! దాని ఖర్మ! ఇంతకన్న ఏం అనను? కాని ఒక్కటి మాత్రం నిజం. సుజాత నా అహం మీద తిరుగులేని దెబ్బ కొట్టింది. నా అంతస్తు, నా హోదా, నా బేంకు బేలన్సు - వీటన్నిటికీ ఏ ఆడదైనా దాసోహం అనాల్సిందేనని గాఢంగా విశ్వసించిన నాకు సుజాత తీసుకున్న నిర్ణయం కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది.! ******************
No comments:
Post a Comment