తెరమరుగైన తెలుగు మగువ తెగువ
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
మాంచాల, ఝన్సీలక్ష్మీ, సరోజినీ దేవి, విజయలక్ష్మిపండిట్ వంటి దేశ సేవికులైన అనేక మంది మహిళమతల్లుల పేర్లు మనకు కరతలామలకం.. కానీ 'అలిమేలు మంగ తాయారమ్మ ' మీ కెవరికైనా తెలుసా.. అంటే..ఇప్పటి తరం ఎవరైనా 'కిం ' అనక మానరు.
స్వాతంత్ర్య సంగ్రామంలో పాలుపంచుకున్న ఆది,అంతిమ మహిళల గురించి చరిత్రకారులు కాస్తో కూస్తో వివరాలు అందించారు. కానీ బ్రిటీష్ వారిని ఎదిరించి నిలిచిన తెలుగు మహిళ సాహసం, మాటకు కట్టుబడి జైలు ఊచలు లెక్కించిన తెలుగు స్త్రీ పౌరుషం... గురించి తదుపరి తరాలకందించడంలో ఒకరిద్దరు మినహా మన చరిత్రకారులు ఖచ్చితంగా విఫలమయ్యారనేది.. అలిమేలు మంగతయారమ్మ విషయంలో సుస్పష్టమౌతుంది. అలాంటి తెలుగు ధీరవనిత గురించి కొద్దిగైనా 'అచ్చంగా తెలుగు ' ప్రజలకు తెలియజేయాలన్నదే ఈ ప్రయత్నం.
ఇంతకీ ఏవరీ అలిమేలు మంగతాయారమ్మ..?..బ్రిటీష్ దొరల పీచమణచడంలో ఈమె పాత్ర ఏపాటిది..చరిత్రకారులూ మరచిన ఈమె ఘనకీర్తి ఎట్టిది అన్న కుతూహలం కలుగుతోంది కదూ..!
బ్రిటీష్ వారిని ఎదిరించి సహాయనిరాకరణ సల్పి దేశంలోనే మొట్టమొదట జైలు శిక్ష అనుభవించిన 'మొట్టమొదటి రాజకీయ మహిళా ఖైదీ ' ఈ వీరనారి అలిమేలు మంగతాయారమ్మ. గాంధీమహాత్మునిచే ప్రశంసలందుకున్న చేనేత కుటుంబానికి చెందిన యాబై ఏళ్ళ వితంతువైన ఈమెది అంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీరాల.
తే.గీ. ప్రభుత నెదిరించి నాడు నిర్భందమునకు
నిచ్చగించిన వారిలో నేబదేండ్ల
యవ్వ కల ' దలమేలమ్మ ' యామె తెలుగు
నారి కొసగిన కీర్తికి మేరకలదె
- తుమ్మల సీతారామమూర్తి (మహత్మకథ)
చీరాల - పేరాల ఉద్యమ సెగలు బ్రిటిష్ పార్లమెంట్ ను అట్టుడికించేలా చేసిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సారధ్యంలో దేశంలోనే తొలిసారి సహాయనిరాకరణోద్యమ సెగ బ్రిటిషర్లకు చూపిన నేల చీరాల.. సారాయికి స్వస్తి చెప్పినది చీరాల అంతటి ఘనకీర్తి ఉన్న చీరాల అలిమేలమ్మ స్వగ్రామం అని చెప్పుకోవడానికి ఇక్కడి మహిళలు గర్వించాల్సిందే..!
సీ. అందరికన్న ముందర చెరసాలలో
గాలుపెట్టినది చీరాల వారు
అందరికన్న ముందాంధ్ర దేశమున సా
రాయి మానినది చీరాల వారు
అందరికన్న ముందాత్మజీవవ మవ
లీల బాసినది చీరాల వారు
అందరికన్న ముందటి ధైర్యశాలులన్
ప్రతిభ కాంచినది చీరాల వారు
పన్నుగట్టంగ వలదను భారమున బు
రంబు బాసిన వారు చీరాల వారు
వారి బొగడంగ నెరనెవ్వారలైన
ధీమతులార!యో భారతీయులార..!
- మదాల వీరభధ్రరావు(గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం ఉజ్వలఘట్టాలు)
అంతటి చీరాల ఖ్యాతిలో అలిమేలు మంగతాయారమ్మ పాత్ర హిమాచలమంతటిదని నిస్సందేహంగా చెప్పవచ్చు.
అలిమేలమ్మ జైలుకేగిన విధంబెట్టిదనిన.....
1921 ఫిబ్రవరిలో చీరాల - పేరాల ఉద్యమం ఎగసి పడుతున్న రోజులవి .(బ్రిటిష్ ప్రభుత్వం చీరాల- పేరాలను మున్సిపాలిటి చేయడంతో ఉద్యమం రేగింది. గ్రామం మొత్తం ఖాళీచేసి ఊరి బయట పాకలు వేసుకుని జీవనం కొనసాగించారు.) ఉద్యమస్థితి గతులు తెలుసుకునేందుకు అప్పటి మద్రాసు రాష్ట్ర ప్రధానమంత్రి పానగల్ రాజారామరాయణిం చీరాల వచ్చారు. ఆయన రాక తో చీరాల అంతా పోలీసు మూకలతో, వారి అనుచరులతో నిండిపోయింది. అంత దూరం నుంచి వచ్చిన రాజావారు తమ విన్నపాలు వింటారనుకున్న ప్రజల కోరిక నెరవేరలేదు సరికదా.. ప్రజల విన్నపాలు ఆయన తిరస్కరించారు. రాజా వారు కొలువై ఉన్నందున ఉద్యమం అణచేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విషయం తెలుసుకున్న ఉద్యమకారులు రెచ్చిపోయారు. ప్రశాంతంగా ఉన్న చీరాల-పేరాల భగ్గుమంది. రైళ్ళు అడ్డుకున్నారు. టోల్ గేట్ ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా.. అప్పటి చైర్మన్ రుస్తుంసింగ్ పన్నుల వసూళ్ళకై పోలీసుల సహకారంతో రంగంలోకి దిగారు.
దివ్వెల నాగభూషణం,మద్దాల శ్రీరాములు,దాసరి కృష్ణయ్య,మద్ది వెంకట సుబ్బయ్య, తేలప్రోలు అంజనేయులు,శిఖాకొల్లి వెంకట సుబ్బయ్య,కాలువ సుబ్బయ్య, గొడవర్తి వెంకటేశ్వర్లు,గొడవర్తి లక్ష్మయ్య, చేబ్రోలు వెంకట సుబ్బయ్య, మద్దాల సుబ్రహ్మణ్యం, తో పాటూ మన తెగువ గల మహిళమతల్లి అలిమేలు మంగతాయారమ్మ కూడా పన్ను కట్టేది లేదని వారికి ఎదురు తిరిగారు. రుస్తుంసింగ్ వీరిపై కేసులు బనాయించారు. అప్పట్లో చీరాలలో కోర్టు లేదు. పన్నుకట్టడానికి నిరాకరించిన అలిమేలమ్మ తో సహా 12 మంది పై బాపట్ల కోర్టుకు లో కేసులు నమోదయ్యాయి. విచారణ కు బయలు దేరిన వీరందరినీ మేళతాళాలతో భారీ జనన సమూహంతో ఊరేగించారు. దారిలోని ఈపురుపాలెం ,వెదుళ్ళపల్లి ప్రజలు హారతులద్దారు. బాపట్ల ప్రజానీకం వీరి రాకకై ఎదురు చూస్తూ..రావటంతో జయజయధ్వానాల మధ్య అతిథి మర్యాదలు చేశారు. వీరి కోసం తరలి వచ్చిన వారితో కోర్టు కిక్కిరిసిపోయింది. పన్నులు కట్టాల్సిందే నన్న మెజిస్ట్రేట్ హుంకరింపును ససేమిరా అన్నారు పన్నెండు మంది.అగ్రహించిన మెజిస్ట్రేట్ వీరనారి అలిమేలమ్మతో సహా వీరందరికీ వారం రోజులు జైలు శిక్షను ఖరారు చేశారు. పదకొండు మంది పురుషులతో పాటూ అలిమేలు మంగతాయారమ్మ కూడా కారాగారవాసం అనుభవించారు.
1921 ఏప్రియల్ 6 న గాంధీజీ చీరాలకు వచ్చారు. సహాయనిరాకరాణ చేసి కారాగారవాసం అనుభవించిన పదకొండు మంది యోధులతో పాటూ .. స్వాతంత్ర్య పోరాటంలో తొలి మహిళా రాజకీయ ఖైదీ అయిన అలిమేలు మంగతాయారమ్మను పీఠమెక్కించి సత్కరించారు గాంధీజీ.దేశం కోసం జైలుకు వెళ్ళగలిగిన ఒక్క స్త్రీ నైనా తయారు చేయగలిగనందుకు తెలుగు మహిళలు అందునా చీరాల మహిళలు ధన్యురాండ్రని గాంధీజీ కొనియాడారు.
ఆ.అఖిల భారతోర్వి నాంగ్లేయశాసన
మతకరించి కార కరిగినట్టి
మొదటి మగువ యీమె , మదియున్న హృదియున్న
మరువగాని వీరమహిళ యీమె
-తుమ్మల సీతారామ మూర్తి (మహాత్మ కథ)
అంతటి తెలుగు తేజోమణిని, వీరనారిని గురించి మన పాఠ్యాంశాల్లో లేకపోవటం వల్లే మనకు అమె గురించి తెలియలేదనడంలో సందేహం లేదు. ఎవ్వరికీ తీసిపోని స్థాయిలో బ్రిటీష్ కింకరులపై పోరు సల్పిన భారతదేశ తొలి రాజకీయ ఖైదీ అయిన తెలుగు మహిళకు నివాళులర్పిద్దాం. (సమాచారసేకరణకు ఉపకరించిన మరికొన్ని గ్రంధాలు: మా తండ్రిగారైన కరణం సుబ్బారావు గారు వ్రాసిన 'మన ఆంధ్రరత్న ' డా. భద్రరాజు శేషగిరిరావు గారు రచించిన గుంటూరు జిల్లాలో స్వాతంత్ర్యోద్యమం , అచ్యుతుని బాలకృష్ణ మూర్తి గారి చీరాల చరిత్ర తదితరాలు.)
జోహారులందుకొనుమా.. అలిమేల్ మంగమ్మ
నీ కీర్తి గాంచలేదని చిన్నబుచ్చుకోకమ్మ
నీ ధైర్యం,నీతెగువ.. తరంతరం..తెలియాలమ్మా
సహాయ నిరాకరణలో నీ అడుగే తొలి అడుగని
తెలిసిన డెందము ఏదేనీ పొంగునమ్మా..
తెలుగు మగువ తెగువను తొలుత చూపిన
ధీశాలీ.. మంగతాయారమ్మా..!
గాంధీ దేవుని రాకతో తెలుగు నేల పులకించగా..
నీదు ధైర్యం తెలిసి దాసోహమనెగా అంతటి జాతిపిత.
తెలుగు కీర్తి పతాకా..!
'అచ్చంగా తెలుగు' జాతి అంజలి అందుకొనుమా..!
నీ సంగతులు మాకందించిన మానాన్నతో సహా
ముందు వ్రాసిన వారికి వందల వందనాలమ్మా..!
నీచరితను కొంతైనా మనవాళికందించ
అదృష్టమని తలచి మది ఆనందించె ||
No comments:
Post a Comment