భైరవ కోన (జానపద నవల 3 వ భాగం) - భావరాజు పద్మిని - అచ్చంగా తెలుగు

భైరవ కోన (జానపద నవల 3 వ భాగం) - భావరాజు పద్మిని

Share This
(జరిగిన కధ : సదానందమహర్షి గురుకులంలో శిక్షణ పూర్తి చేస్తాడు భైరవపురం రాకుమారుడు విజయుడు. గుహ్యమైన గుహలోని భైరవ –భైరవి దేవతల అనుగ్రహం పొందమని చెప్తూ, విజయుడి కోరికపై భైరవారాధన విశిష్టతను గురించి తెలియచేస్తారు మహర్షి. భైరవ కృపకై బయలుదేరిన గురుశిష్యులను అడ్డగించ బోతాడు కరాళ మాంత్రికుడు. నృసింహ మహా మంత్రంతో కరాళుడి దుష్టశక్తిని పారద్రోలి, విజయుడికి శక్తి భైరవ మంత్రం ఉపదేశించి, గుహలోనికి పంపుతారు మహర్షి. త్రికరణ శుద్ధిగా భైరవ మంత్రాన్ని పఠిస్తూ, ధ్యానంలో  మమేకమైపోతాడు విజయుడు. అతని తపస్సు తీవ్రతకు గుహ కంపిస్తుంది. అప్పుడు జరుగుతుంది ఓ అద్భుతం...)
కోటి దీపాల కాంతి గుహలోనికి ప్రవేశించింది. గుహలోని జేగంటలు వాటంతటవే మ్రోగసాగాయి. మధురమైన పరిమళం వ్యాపించింది. అమర గంధర్వ గానం వినిపించసాగింది. విజయుడిపై పూల వాన కురిసింది. మనసంతా చల్లని వెన్నెల పరుచుకున్న మధురానుభూతి... అప్పుడు మెల్లిగా కనులు తెరచి చూసాడు విజయుడు....
ఉజ్వల కాంతి వలయంలో, సుందర దరహాసంతో, కోటి తల్లుల మమతను కళ్ళలో చిందిస్తూ ప్రత్యక్షం అయ్యారు శివ-శక్తులైన, భైరవ-భైరవీ మూర్తులు. ఆ తేజస్సు, దివ్యత్వం, వారి కళ్ళలోని కరుణ చూసి అప్రతిభుడయ్యాడు విజయుడు. తామే సృష్టి, స్థితి, లయ కారకులైనా, ఆదిదంపతులు జీవుల పట్ల చూపే వాత్సల్యం అనిర్వచనీయం ! మధురాతిమధురం ! దైవానుగ్రహం, దైవం మనపట్ల చూపే దయ ఎంత గొప్పవో కదా!
అప్పటివరకూ అదృశ్య రూపంతో ఉండి, ఆ గుహలోనే వారిని కొలుస్తున్న యక్ష, కిన్నెర, నాగ, గంధర్వ, కింపురుషులు, యోగులూ అంతా ప్రత్యక్షమై, ముక్త కంఠంతో తన్మయత్వంతో, భైరవుడిని ఇలా స్తుతించారు. ఆ దివ్యానుభూతికి ఆత్మ ఆనందతాండవం చేస్తుండగా, వారితో శృతి కలిపాడు విజయుడు.
“రక్తజ్వాలా జడధరం శశిధరం రక్తంగ తేజోమయం
హస్తేశూల కపాల పాశ డమరుం లోకస్య రక్షాకరం |
నిర్వాణం శూన వాహనం త్రినయనం ఆనంద కోలాహలం
వందే భూత పిశాచనాధ వటుకం శ్రీ క్షేత్రస్య బాలం శివం || “
కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వర్షిస్తుండగా, అలౌకికమైన ఆనందంలో తెలిపోసాగాడు విజయుడు.
శక్తిభైరవుడు అభయహస్తంతో విజయుడిని దీవించి “రాకుమారా విజయా ! నీ అచంచల భక్తి మమ్మల్ని కరిగించివేసింది. నీ కోరిక ఏమిటో చెప్పు, తప్పక తీరుస్తాము ”, అన్నాడు.
‘స్వామీ ! సర్వంతార్యాములు మీరు. అయినా, నా కోరిక నా నోటి వెంట వినాలని అడుగుతున్నారు. కొండంత దేవుడైన మీరు ఈ దీనుడి పట్ల కరుణ చూపి, మీ దర్శన భాగ్యం కలిగించారు. మీ దర్శనంతో నా జన్మ ధన్యమయ్యింది. దుష్టశక్తులను సంహరించి సమస్త మానవ శ్రేయస్సును, లోకకల్యాణాన్ని కలిగించాలనే సత్సంకల్పంతో మీ గురించి తపస్సు చేసాను. దయ ఉంచి, ఎంతటి దుష్టశక్తులనైనా , అరాచాకాలనైనా  ఎదుర్కొనే శక్తిని నాకు అనుగ్రహించండి.  భైరవపురం ప్రజలు సుభిక్షంతో, సుఖశాంతులతో రామరాజ్యం లాగా వర్ధిల్లే అవకాశం కల్పించండి,’ వినయంగా మోకరిల్లి అడిగాడు విజయుడు.
‘తధాస్తు ! విజయా నీ సంకల్పం హర్షనీయం. మంచి పనులకు దైవ రక్ష, సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. నీకు తక్షణమే అష్టసిద్దులను, నవనిధులను అనుగ్రహిస్తున్నాను. అంతేకాదు, వశీకరణ శక్తిని, ఈ దివ్య ఖడ్గాన్ని కూడా ప్రసాదిస్తున్నాను. ఈ శక్తులను నీవు ఇతరుల మేలు కొరకే వాడాలి సుమా ! ఈ ఖడ్గం అత్యంత శక్తివంతమైనది. ఊహకు అందని దుష్టశక్తుల్ని సైతం సమూలంగా నాశనం చేస్తుంది. వీటితో మీ భైరవపురం నిత్యకళ్యాణం –పచ్చతోరణంగా పది కాలాల పాటు భాసిస్తుంది. ధర్మబద్ధంగా పరిపాలన చేసి, అంత్య కాలంలో నాలో లయం అయ్యే వరాన్ని కూడా నీకు కటాక్షిస్తున్నాను. సుఖీభవ !’ అంటూ దీవించాడు భైరవుడు.
తక్షణమే ఒక దివ్య శక్తి భైరవ- భైరవి మూర్తుల నుంచి విజయునిలోకి ప్రవేశించింది. ఆ శక్తి తరంగాల తాకిడికి మరింతగా ప్రకాశించాడు విజయుడు. అతని ఆహార్యం మారిపోయి సిసలైన రాకుమారుడి రాజసం ఉట్టి పడసాగింది. మణిరత్న ఖచితమైన ఒక దివ్య ఖడ్గాన్ని విజయుడికి అందించి, తన దేవేరితో సహా అదృశ్యమయ్యాడు భైరవుడు. గుహ మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది.
పరమానందంతో ఈ శుభవార్త గురువుగారికి చెప్పాలని ఉత్సాహంగా బయలుదేరాడు విజయుడు. తను, తన వంశం తరించింది, తన ఆశయం నెరవేరబోతోంది. తన రాజ్యం రామరాజ్యంలా పేరొందడం తధ్యం ! మనోవేగంతో పరుగులు తీస్తున్నాడు విజయుడు. జలపాతం దాటి అడవిలో నడక సాగించాసాగాడు. ఇంతలో ఒక అనుకోని సంఘటన జరిగింది...
మెరుపు వేగంతో పరుగులు తీస్తూ వచ్చి, విజయుడిని గుద్దుకుని, అతని చేతుల్లో సొమ్మసిల్లిపోయింది ఓ లతాంగి. ఆమె వెనుక ఒక భయంకరమైన చిరుతపులి వేటాడుతూ వచ్చింది. వారిరువురి మీదకు దూకేందుకు సిద్ధంగా ఉన్న,ఆ క్రూర మృగంతో పోరాడే సమయం లేదు. ఆపద సమయాల్లో ఏ విధంగానైనా  ప్రాణ రక్షణ రాజధర్మం. తక్షణమే తన వశీకరణ శక్తిని దానిపై ప్రయోగించాడు విజయుడు. విజయుడి కళ్ళలోని తీక్షణతకు చప్పబడి, తోక ఊపుతూ వెనుదిరిగి వెళ్ళిపోయింది చిరుత.
తన చేతుల్లో ఉన్న కోమలిని, నెమ్మదిగా పొదువుకుని, ఒక పొగడ చెట్టు క్రిందకు చేర్చాడు విజయుడు. భయం వల్ల ఆమె నుదిటికి పట్టిన చెమటను తన ఉత్తరీయంతో తుడుస్తూ, ఒక్క క్షణం విస్మయానికి గురయ్యాడు.
అద్భుతమైన అందం ! ఆమె దారి తప్పిన వనదేవత లాగా ఉంది. కవుల వర్ణనల్లోని  కావ్యకన్యక లాగా ఉంది. విశాలనేత్రాలు,తీర్చిదిద్దినట్లున్న కనుముక్కు తీరు, కళ్ళుతిప్పుకోలేని అవయవ సౌష్టవం, ఆమె ఆహార్యం ఆమె రాజకన్య అని చెప్పకనే చెబుతోంది. ఆమె పూల రెక్కలు అద్దిన వెన్నెల శిల్పంలా, రాసి పోసిన సౌందర్యంలా ఉంది. పిల్లగాలికి ఆమె నీలాల కురులు ఎగురుతుంటే సర్దుతూ, “ఆహా, నీలి మబ్బుల్లో దోబూచులాడే చందమామ లాగా యెంత చక్కటి మోము !” అనుకున్నాడు విజయుడు. అతనికి తెలియకుండానే ఆమె పట్ల ఒక అవ్యక్తమైన అనురాగభావన కలిగింది. ఆమె తన కోసమే పుట్టిందని అతని మనసుకి అనిపించింది. రెప్ప వాల్చకుండా తన చేతుల్లో ఉన్న ఆమెను చూస్తూ, ఒక అపురూపమైన నిధి తనకు దొరికినట్లు పొంగిపోసాగాడు విజయుడు.
మరుక్షణమే తమాయించుకుని, ఇలా ఆలోచించసాగాడు... “ ఇంతటి సుమసుకుమారికి ఈ కీకారణ్యంలో ఏమి పని ? ఎందుకింత సాహసం చేసి, ఆపదలు కొని తెచ్చుకుంది ? ఈమె ఎవరో కనుక్కుని, తన వారి వద్దకు చేర్చాలి... ”అనుకున్నాడు. విజయుడి మనసులో ఎన్నో ప్రశ్నలు. ముందు ఆమెకు స్పృహ తెప్పించి, తరువాత వివరాలు రాబట్టాలి, అనుకున్నాడు . ఒక ఆకును దొన్నెగా చేసి, దగ్గరలో ఉన్న తటాకం నుంచి నీరు తెచ్చి ఆమె మోముపై చిలకరించాడు. నెమ్మదిగా కనులు తెరిచింది ఆమె....
(సశేషం...)

No comments:

Post a Comment

Pages