ఆనంద్ క్యాంటిష్ కుమారస్వామి
కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
ఆంగికం భువనం యస్య
వాచికం సర్వ వాజ్మయం
ఆహార్యం చంద్రతారాది
తం వందే సాత్వకం శివం..!
ఈ శ్లోకం తెలియని తెలుగు వారు బహు అరుదు. ప్రతి సాంఘిక నాటకంలో చేసే ఈ ప్రార్ధనా శ్లోకం వాసిందెవరు?
నందికేశుడు.
ఈ శ్లోకం ఏ కవనం లో వ్రాయబడింది..
అభినయ దర్పణం..
అలాంటి అభినయ దర్పణం ను మిర్రర్ ఆఫ్ గెస్ట్యుర్స్ (MIRROR OF GEAUSTURES) గా ఆంగ్లంలో తర్జుమా చేసి భారతీయ తత్వాన్ని దేశదేశాలలో ప్రాచుర్యం కల్పించిన ఘనాపాటి ఆనంద్ కాంటీష్ కుమారస్వామి.
ఆనంద్ కాంటిష్ కుమార స్వామి అనే భారతీయ మూలాలున్న విదేశీయుడు.
ఏమిటితని ప్రత్యేకత..??
అంతగా చెప్పుకోవాల్సిన విషయం ఏముంది..?
ఆనంద్ క్యాంటిష్ కుమార స్వామి ఓ విదేశీ హిందువు. హిందువుల సాహిత్యాన్ని అవపోసన పట్టిన బ్రహ్మర్షి.
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వంటి మేధావికి గురువు. తెలుగుభాష పై మక్కువతో పట్టుబట్టి గోపాలకృష్ణయ్య ద్వారా తెలుగు నేర్చుకున్న అచ్చంగా తెలుగు విదేశీ.
ప్రపంచంలోని విశేషాలన్నింటిని సేకరించి ప్రచురించిన ఘనత 'ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా ' ది.అట్లాంటి విశ్వవిఖ్యాత నిఘంటువులలో 13 వ ఎడిషన్ వరకు భారతీయ కళాసంస్కృతుల గురించి అక్షరం ముక్క లేదు. డా" ఆనంద్.క్.కుమారస్వామి భారతీయ కళలు-సంస్కృతుల మీద వ్రాసిన వ్యాసాలు చూసిన తర్వాత ఎన్ సైక్లోపీడియా పెద్దలకు జ్ఞానోదయమై ఇండియన్ ఆర్ట్స్ గురించి వ్యాసాలు వ్రాయవలసిందిగా డా"స్వామి గారిని కోరారు.
డా"స్వామి గారు వౄత్తి చేత జియాలజిస్ట్ (భూగర్భశాస్త్రవేత్త),
ప్రవృత్తి చేత ఇండోలజిస్ట్(భారత దేశ చరిత్ర-సంస్కృతి-కళలలో పండితుడు).
.పుట్టిపెరిగినది భారత దేశాం కాకపొయినా అతని నరనరాన భారతీయ రక్తమే ప్రవహించింది. భారతీయ సంస్కృతికి వారసుడైన ఈ పరదేశి 'కట్టు-జుట్టు-బొట్టు 'వంటి హైందవ ఆచారాలను పాటించడమేకాకుండా భార్యా బిడ్డలను కూడా హైందవ సాంప్రదాయాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు.అతనిలో అంత తీవ్రంగా భారతీయత జీర్ణించుకోవడానికి మూలం అతని తల్లి. ఆమె ఆంగ్లేయ వనిత . అయినా పుట్టి పెరిగింది భారతదేశం కావటాన, బాల్యం నుండి పట్టుబట్టిన భారతీయ సంప్రదాయాన్ని జీవితాంతం పాటించారు.
డా"స్వామి గారి పూర్తిపేరు ఆనంద్ క్యాంటిష్ కుమారస్వామి. ఆనంద్ అనే పదం, కుమారస్వామి అనే పదం భారతీయులకు, అందునా దక్షిణాది వారికి సుపరిచితాలు.ఎటొచ్చి ఈ రెండు పదాల మధ్య ఇరుక్కున్న క్యాంటిష్ అనే పదం సింహళ నామం. తండ్రి పేరు ముత్తుస్వామి మొదలియార్ గారు.ఈ తమిళ సోదరుడు. చదువుకున్న న్యాయశాస్త్రాన్ని నమ్ముకుని సింహళం వెళ్ళారు.అక్కడ పేరు ప్రఖ్యాతలు గడించి, పౌరసత్వాన్ని పొందారు. శాసన సభ్యునిగా ఎన్నికై సింహళ దేశానికి సేవ చేశారు .అతని ప్రజా సేవకు గుర్తింపుగా బ్రిటీష్ ప్రభుత్వం 'నైట్ హుడ్ 'గౌరవాని ప్రదానం చేసింది.అరుదుగా లభించే ఈ గౌరవానికి ఎంపికైన సింహళంలో మొదటి వ్యక్తి ముత్తుస్వామి మొదలియార్ .
నైట్ హుడ్ గౌరవాన్ని పొందినవారే తమపేరుకు ముందు 'సర్ ' అనే అక్షర ద్వయాన్ని చేర్చుకుంటారు.
'ఎలిజెబెత్ క్లే బివి 'అనే ఆంగ్లేయ యువతి ముత్తుస్వామిని ప్రేమించి పెండ్లి చేసుకుంది. వీరిద్దరికి 1877 ఆగష్టు 22 వ తేదీన ఆనంద్ క్యాంటిష్ కుమారస్వామి పుట్టారు.అల్లారుముద్దుగా ఐశ్వర్యపు హద్దులలో ఆనంద్ పెరుగుతున్నారు. రెండేళ్ళు గడిచాయి.అనుకోకుండా ఆ కుటుంబాన్ని అంధకారం ఆవరించింది.గుండెపోటొచ్చి,హఠాత్తుగా ముత్తుస్వామి గారు మరణించారు.రెండేళ్ళ బిడ్డను చంకనేసుకుని, ఎలిజెబెత్ ఇంగ్లాండుకు స్టీమరు ఎక్కింది.
'భర్తే ప్రత్యక్ష దైవం 'అనే భారతీయ భావనను ఆమె మనసా,వాచా,కర్మణా జీవితాంతమాచరించింది. నిత్యం షణ్ముఖ స్వామిని పూజించేది. భారతీయ ఇతిహాస గాధలు బిడ్డకు నేర్పేది. భర్త లేనిలోటు దిగమింగుకుంటూ బాధ్యతతో, పట్టుదలతో భర్తంతటి వాణ్ణి చేయాలనే ఏకైక ధ్యేయంతో బిడ్డను పెంచింది. బిడ్డకు భారతీయతను ఉగ్గుపాలతో రంగరించి పోసిన ఆ తల్లికి భారతజాతి ఏంతగానో ఋణపడి ఉంది.ఆనంద్ గారు పన్నెండు సంవత్సరములకు ప్రైమరీ చదువు పూర్తి చేసి 1889 లో ఇంగ్లాండులోని విక్లీఫీ కాలేజీలో చేరారు. పెరుగుతున్నది బ్రిటిష్ గడ్డపైనే అయినా నుదుట గుండ్రంగా గంధాన్ని దిద్ది దాని మీద కుంకుమ పెట్టుకుని 'ఇండియన్ బ్రాండ్ 'గా గుర్తించబడ్డారు.ఉదయాన్నే పూజ,గీతాపారాయణ కుమారస్వామి గారికి నిత్యకృత్యాలు.తీరిక సమయాల్లో భారతీయ గ్రంధాలు చదవడం అతని హాబీ.కావల్సిన పుస్తకాలు ఇంగ్లాండులో లభించకపొతే ఇండియా,సింహళ దేశాలకు ఉత్తరాలు రాసి తెప్పించుకునేవారు. కుర్రతనపు 'వెర్రులు ' అతనికి ఆమడ దూరంలో ఉండేవి.
1909 లోఆనంద్ గారు లండన్ విశ్వవిద్యాలయంలో చేరారు. నేచురల్ సైన్స్,జియాలజీ తీసుకుని ఉన్నత విద్యను ప్రారంభించారు. తండ్రి లాగ ఆనంద్ గారు స్ఫురద్రూపి. మితభాషణం, అపరిమిత అధ్యయనం, ఆదర్శప్రవర్తనం అతని అందానికి ఆభరణాలుగా తోడయ్యాయి .అదే యూనివర్శిటీ లో 'ఈధల్ మేరీ 'అనే యువతి కూడా చదువుతుండేది. ఈ బుద్దిమంతుడి మీద ఆమె మనసు పడింది. అతన్ని ఆకట్టుకోవటానికి.. ఈమె కూడా భారతీయ గ్రంధాలు ఏరుకుని అతనికి దగ్గరలో కూర్చుని పేజీలు త్రిప్పుతుండేది. పుస్తకంలో తలదూరిస్తే ఆనంద్ కు బాహ్యప్రపంచం పట్టేది కాదు.ఇది గమనించిన ఈధెల్ ఒకరోజు అతని వద్దకు వచ్చి పరిచయం చేసుకుంది. తను కూడా భారతీయ సంస్కృతి అంటే పడి చస్తానంది. లైబ్రరీలో మాట్లాడుకోవడం మంచిది కాదు అని ఆమెను లాన్స్ లోకి తీసుకువెళ్ళారు ఆనంద్ గారు.అలా వారి మధ్య అనురాగం అంకురించింది. యూనివర్శిటీ లో అభిమానించేఅందమైన స్నేహితురాలు దొరికినందుకు ఆనంద్ గారి లోని ఆదర్శహృదయం స్పందించింది. 24 వసంతాలు నిండిన ఆనంద్ గారు ప్రేమించిన యువతిని పెళ్ళిచేసుకోవడం అదృష్టం గా భావించారు.తన అభిప్రాయాన్ని తల్లికి కుడా తెలిపారు ఆనంద్ గారు. భారతీయ సంస్కృతిని గౌరవిస్తుందని తెలిసి అంతకంటే కావల్సింది ఏముందని అతని అమ్మ కూడా సమ్మతించింది. వెంటనే 1901 లో ఆనంద్,ఈధెల్ కు వివాహమైంది.ఆనంద్ కు లండన్ యూనివర్శ్టీ లో డాక్టరేటు లభించింది.వెంటనే అతనికి సింహళందేశం లో మైన్స్ ఆఫీసరు గా ఉద్యోగం వచ్చింది.ఒక ప్రక్క ఉద్యోగం చూస్తూనే తీరిక సమయాల్లో వేదాలో,ఉపనిషత్తులో,ఇతిహాసాలో,పురాణాలో చదువుతుండేవాడు.
రెండు విభిన్నవిజ్ఞానసంపదలకు వారధిగా నిలిచిన మేధావి డా" ఆనంద్ క్యాంటిష్ కుమారస్వామి గారు.
కుమారస్వామి గారికి వయసుతో పాటు పుస్తకాల పిచ్చి కూడా పెరిగింది.సాధారణ జీవనం, అసాధారణా భావనం(సింపుల్ లివింగ్-హై థింకింగ్) అతని జీవన విధానం అయింది. ఈ విధమైన సన్యాసి పోకడ ఈధెల్ కి నచ్చలేదు. ఆమె భర్త కి "గుడ్ బై "చెప్పింది.అప్పటికే వేదాంత ధోరణకి అలవాటు పడ్డ ఆయనకి భార్య దూరమైనా మనసు మాత్రం ఏ దుమారానికి గురికాలేదు. ఇంకా సీరియస్ గా తన అధ్యయనాన్ని కొనసాగించారు. ఫ్రెంచ్, ఇటాలియన్, డచ్, పర్షియన్, స్పానిష్, గ్రీక్, లాటిన్, పాళీ, సంస్కృతం, హిందీ, సింహళీస్ వంటి 12 భాషలను నేర్చుకోవడమే కాకుండా వాటిలో ప్రావీణ్యతను కూడా సంపాదించారు. ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలక్రిష్ణయ్య గారి ద్వారా తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని కూడా చవి చూశారు.
( రెండవ భాగం వచ్చే సంచికలో...)
No comments:
Post a Comment