అంతర్యామి(నవలిక)
పెయ్యేటి రంగారావు
అంతా విపరీతమైన కోలాహలం!
ఎవరికి వారే హడావిడిగా తిరుగుతున్నారు. ఎవరికి వారే పక్కవాళ్ళకి ఏవో పురమాయింపులు చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఆ చిన్న ఇంట్లోకి ' అంతర్యామి ' గారు విచ్చేయబోతున్నారు.
అహం బ్రహ్మోస్మి అని సాధికారికంగా ప్రకటించుకో గలిగిన తపస్సంపన్నుడాయన. ఆయన జీవితమే ఒక అద్భుతం!ఒక అతి సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి, సామాన్యమైన చదువు చదువుకుని, సాధారణమైన ఉద్యోగంతో ఇహలోకంలో జీవనయాత్ర మొదలుపెట్టిన ఆయనకు----------ఉన్నట్లుండి పరమాత్మ సాక్షాత్కారం లభించింది! అదిన్నీ------------ ఊరికి దూరంగా బీడుప్రదేశాలలో, గజం ఏభయి రూపాయలకి దొరుకుతూంటే, చవకగా వుంది కదా అని రెండు వందల గజాల స్థలం కొని అందులో పాక వేసుకున్నారు. అప్పుడే జరిగింది అద్భుతం!!
*********************
రామదాసుగారు దైవాధీనం బస్సు ఎక్కి ఐహికాముష్మికాలను సాధించడానికి బయలుదేరిన వ్యక్తి.రెండు విపరీతాలు కలవడంలో హేతువాదముందో, ఆధ్యాత్మిక తత్వముందో తెలియదు కాని, రామదాసు గారికి, వెంకట నాగ మల్లేశ్వర సత్యసాయీ త్రినాథ వరప్రసాద లక్ష్మీనరసింహ మూర్తి అనబడే, ' లావా ' అనబడే హేతువాదికి స్నేహం కలిసింది. కొద్దికాలంలోనే వాళ్ళిద్దరూ చాలా ఆప్తమిత్రులయ్యారు.ముక్కోటి దేవతల వరప్రసాదం వలన పుట్టిన బిడ్డడికి అందరు దేవతల పేర్లు తెలియని అతడి తలిదండ్రులు వెంకట నాగమల్లేశ్వర సత్యసాయీ త్రినాథ వరప్రసాద లక్ష్మీనరసింహ మూర్తి అని నామకరణం జరిపించగా, వ్యక్తావ్యక్తతలు తెలిసే వయసు వచ్చాక ఆ బిడ్డడు తన పేరును లావా గా మార్చుకున్నాడు. రామదాసుగారు నరసాపురం వై.ఎన్.కాలేజిలో లెక్చరరుగా పని చేస్తున్నారు. లావాగారు స్థానికి హేతువాద సంఘానికి అద్యక్షులు. రామదాసుగారికి దైవభక్తి చాలా ఎక్కువ. నిరంతరం భగవధ్ధ్యానంలో బ్రతుకు వెళ్ళదీస్తుంటారాయన. సర్వ కర్మలను భగవదర్పణం చేసి, తామరాకు మీద నీటిబిందువు లాగ జీవిస్తుంటారాయన. ఆయన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. మంచి జరుగుతే భగవంతుడి అనుగ్రహమని, చెడు జరుగుతే అది తన పూర్వజన్మ తాలూకు సంచిత పాప ఫలమని భావిస్తుంటారాయన. సుఖ దుఖాలని సమదృష్టితో అనుభవించే వీతరాగి ఆయన. లావా ఆయనకు పూర్తిగా వ్యతిరేకం. దేవుడు, పునర్జన్మలు, అతీంద్రియ శక్తులు - ఇవన్నీ ఉత్తి దగా - ' ట్రాష్ ' అని గట్టిగా వాదించే వ్యక్తి లావా. అతడికి మంచి జరుగుతే అదంతా తన స్వశక్తి వల్లనేనని, చెడు జరుగుతే, ఈ దుష్ట సమాజం, ఈ అస్తవ్యస్త వ్యవస్థ వల్లనేనని భావిస్తూ, సుఖాలకి బాగా పొంగిపోతూ, కష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వంతో సహా యావత్తు సమాజాన్ని వాటికి బాధ్యులుగా చేసి, ఉద్రేకంతో శాపనార్థాలు పెడుతూంటాడు. వారి భావాలలో వైరుధ్యమున్నప్పటికీ, వారి మైత్రికి ఏవిధమైన అవరోధమూ కలగలేదు.
*************************
' ఏమండీ! అన్ని నదుల జలాలు ఉన్న కలశం ఇక్కడే పెట్టాను. కనిపించి చావదేం?'' అయ్యా! ఆ కలశం ఇక్కడ పెడితే ఎల్లాగండీ? పురోహితులవారు తమతో తీసికెళ్ళారు.'' ఎక్కడికండీ?' ' ఎక్కదికేమిటండీ, నా శ్రాధ్ధం! ఊరు మొదట్లోనే అంతర్యామిగారికి పూర్ణకుంభంతో స్వాగతం పలకద్దూ?' ' అయ్యా! మంగళవాయిద్యాలు వచ్చాయి. వాళ్ళు తమతో మనవి చేసి కాఫీలు పోయించమని అడుగుతున్నారు.' ' వాళ్ళ శ్రాధ్ధమండీ! ఇప్పుడా తగలడ్డం? అవతల అంతర్యామిగారు ఇప్పుడో, మరుక్షణాన్నో అవతరించబోతుంటేనూ? కాఫీ లేదు, నా పిండాకూడూ లేదు గాని, ముందు వాళ్ళని ఊరు మొదట్లోకి తగలడమనండి. స్వామివారు రాగానే మంగళ వాయిద్యాలు మోగద్దూ? లేకపోతే ఇంక వీళ్ళు వచ్చిన ఉపయోగమేముంటుందండీ?' ' అవునండీ. బాగా శలవిచ్చారు. ముందు వాళ్ళని అక్కడికి తోల్తాను. కావాలంటే తిరిగి వచ్చాక కుడితిలా కాఫీ తాగమని చెబుతాను.' మంగళవాయిద్యాల వాళ్ళు తిట్టుకుంటూ ఊరు మొదట్లోకి పరిగెట్టారు. ' ఏమైనా భగవంతుడి లీలలు అతివిచిత్రమైనవండీ. కాకపోతే ఊళ్ళో ఇందరు ధనికులుండగా, అందరినీ కాదని కేవలం ఒక బడిపంతులు ఐన రామదాసుగారింట్లోనే బస చెయ్యాలని అంతర్యామిగారు నిశ్చయించుకున్నారంటే, వారిదెంత ఉదాత్తమైన స్వభావమండీ?' ' కాదుటండీ మరీ? భగవంతుడి దృష్టిలో అందరూ సమానమని చెప్పడమే వారి ముఖ్యోద్ద్యేశ్యమై వుంటుంది.' ' సరి, సరి! మనం ఇక్కడ ఇలా తాపీగా ముచ్చట్లాడుకుంటూ కూర్చుంటే, అవతల అంతర్యామిగారు రావడం, వారికి హారతివ్వడం లాంటి కార్యక్రమాలన్నీ పూర్తయిపోతాయి. పదండి, పదండి. వారి దర్శనం చేసుకుని పాదాభివందనాలు చేసుకుందాం.' ' అయ్యా రామదాసుగారూ! మీరేమిటి, ఇంకా ఇలాగే బైఠాయించారూ? అంతర్యామిగారికి ఆహ్వానం పలకవలసిన ముఖ్యవ్యక్తి మీరే కదా?' ' సర్లేవయ్యా, ఆయన కూడా మనతో వస్తే ఇక్కడ ఏర్పాట్లెవరు చూస్తారూ? ఇప్పటికే వారిని రిసీవ్ చేసుకోడానికి ఊరిపెద్దలంతా అక్కడకెళ్ళారు. అయ్యా రామదాసుగారూ! మీరింటిదగ్గరే వుండండి. మేమక్కడికి తగలడి నిర్వాకం చేసుకొస్తాం.'
************************
ఈ రోజుకి రెండు రోజులు వెనక్కి వెళ్తే........లావాకి, రామదాసుకీ మధ్య మళ్ళీ వాగ్యుధ్ధం మొదలైంది.' ఒరేయ్ దాసూ! అన్నీ తెలిసినవాడివి. స్వశక్తిమీద పైకి వచ్చినవాడివి. ఎంతో చదువుకున్న వాడివి. నువ్వు కూడా దేవుళ్ళని, దయ్యాలని, స్వాములని, బాబాలని, మంత్రాలని, మహిమలని నమ్ముకుంటూ బ్రతకడం, అల్లా వ్యర్థంగా బ్రతుకుతూ నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవడం--ఛ, ఛ, నాకిదేం నచ్చలేదురా.' ' ఒరేయ్ లావా! నీ నమ్మకాలు నీవి. వాటిని నేనేం ఖండించడానికి ప్రయత్నం చెయ్యటల్లేదే? నీ స్వేఛ్ఛ నీది. దానికి నేనేం భంగం కలిగించటం లేదే? మరి నా దారి మళ్ళించడానికి నువ్వెందుకురా ఇంత తాపత్రయపడతావు?' లావా ఉద్రేకంగా అన్నాడు, ' పడతాను. నీ దారే కాదు. ఈ సకల చరాచర జగత్తులోని మూర్ఖమానవులందరినీ మార్చడం కోసం ఎంతన్నా కృషి చేస్తాను. వాళ్ళ మూఢనమ్మకాలని పటాపంచలు చేయడం కోసం నన్ను నేను నాశనం చేసుకోమన్నా చేసుకుంటాను. నా జీవితానికి ఒక్కటే ధ్యేయం! హేతువాదం, తార్కిక శక్తి మనిషి మనిషికి అలవాటు చెయ్యడం. ఇది మహాయజ్ఞంరా. ఈ మహాయజ్ఞంలో నేను సమిధనై పోయినా సరే, నేననుకున్నది సాధించి తీరతాను.' ' ఏమిటో పడికట్టు మాటలు విసురుతున్నావు!' ' పడికట్టు మాటలు కాదురా. ఇవి నా హృదయపు అట్టడుగు పొరల్లోంచి ఉబికి వస్తున్న, ఆవేదనతో కూడిన పదాలు!' ' నీ ఉద్రేకం బాగుందిరా లావా! కాని దాన్ని సరైన దారిలోకి మళ్ళిస్తే ఈ సమాజానికి ఏ కొంచెమైనా ప్రయోజనం కలుగుతుందేమో సీరియస్ గా ఆలోచించు.' ' లేదు. నాకు మరే ధ్యేయమూ లేదు. నా ఆశ, ఆశయం సమస్త మానవాళిని సక్రమమైన మార్గంలోకి మళ్ళించడమే.' రామదాసు నిశ్చలంగా అన్నాడు, ' నీ అనుభవాలు నీకు నేర్పిన పాఠాల్ని బట్టి దేవుడు లేడంటావు నువ్వు. కాని నా అనుభవాలు నాకు ప్రత్యక్షంగా దేవుడున్నాడని నిరూపించాయిరా.' ' ఓ.కె. ఎన్ని సార్లడిగినా తప్పించుకుంటున్నావు. పోనీ ఇవాళైనా నీ అనుభవాలు చెప్పిన పాఠాలు నాక్కూడా నేర్పకూడదా? ఒకవేళ అవి హేతుబధ్ధంగా వుంటే నేనూ నీ దారిలోకి రావచ్చేమో కదా?' ' భగవంతుడున్నాడని నమ్మేవాడికి ఏ నిదర్శనమూ అవసరం లేదు. లేడనేవాడిని ఏ నిదర్శనమూ మార్చలేదు.' ' అల్లా అనకు. మహా మహిమాన్వితుడని ప్రపంచమంతా పాదాభివందనాలు చేస్తున్న అంతర్యామి గారు రెండు రోజుల్లో నీ ఇంటికి కావాలని వస్తున్నాడు. అందులో వున్న రహస్యం తెలుసుకోడానికి, ఆయన బండారం బట్టబయలు చెయ్యడానికి, నేను నీ ఇంట్లోనే తిష్ట వెయ్యబోతున్నాను. ఈ సమయంలో నీ వాదన నాకు నచ్చిందనుకో, నేను కూడా ఆయన తలమీద ఒక కొబ్బరికాయ కొడతాను.' ' అదుగో, ఆ హేళన చేసే మనస్తత్వం నీకున్నంతవరకు నేను చెప్పేది నీ తలకెక్కదు.' ' కాదురా, ప్లీజ్!' ' ఐతే చెబుతా విను. ఆరుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన నన్ను అతి కష్టం మీద మా నాన్నగారు సెకండరీ గ్రేడు దాకా చదివించారు. ఆ తర్వాత ఉద్యోగం కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు. చివరికి నాకు ఉద్యోగం ఖచ్చితంగా రాదని అర్థమైపోయింది. ఐనా వసుదేవుణ్నయ్యాను. ఒకసారి కాదు, వందల కొద్దీసార్లు అడ్డమైన వాళ్ళ కాళ్ళూ పట్టుకున్నాను. ఐనా ఫలితం లేకపోయింది. ఇల్లు చూస్తే నరకం! నా బతుకు చూస్తే వ్యర్థం! ఆ దరిద్రం, ఆ నరకం అనుభవించిన వాళ్ళకే గాని, బైటివారికి అర్థం కాదు. ఆకలి బాధతో ఇంటిల్లిపాదీ రోజులు రోజులు మంచినీళ్ళు తాగి గడిపేవాళ్ళం. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ నా గుండె తరుక్కుపోతూ వుంటుంది. నా ఓపిక పూర్తిగా చచ్చిపోయేదాకా అల్లాగే ఉద్యోగం కోసం నిరీక్షించాను. కాని నాకు ఉద్యోగం రాలేదు. మా కుటుంబానికి నేనొక అదనపు భారాన్ని మాత్రమే అని నిక్కచ్చిగా ఋజువైపోయాక--ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక మనసులో ఏమూలో ఉద్భవించి, నా అంతరాత్మను పీడించడం మొదలుపెట్టింది. ఆ కోరిక దినదినానికీ మరీ బలపడసాగింది. ఒక రాత్రి ఊరికి దూరంగా పోయి ఎత్తుగా వున్న రైలు పట్టాల దాకా వెళ్ళాను. నన్ను అర్థరహితంగా పుట్టించినందుకు, ఇంతవరకు వ్యర్థంగా బతికించినందుకు భగవంతుడిని తిట్టుకున్నాను. మరుజన్మలోనైనా పదిమందికీ ఉపయోగపడే బతుకునిమ్మని మనసారా ప్రార్థించుకుని రైలు పట్టాలమీద తల పెట్టుకుని పడుకున్నాను. దూరాన్నుంచి రైలుకూత వినిపించింది. రాను రాను రైలు దగ్గరవుతున్న చప్పుడు! నేను నిశ్చలంగా అలాగే పడుకున్నాను. మరికొద్ది క్షణాల్లో నా జీవితం అంతం కాబోతోంది. కాని----- ఉన్నట్లుండి నా కాళ్ళమీద నుంచి ఒక పాము జర జరా పాకుతోందని గమనించాను. చచ్చిపోవాలనుకుంటున్నప్పటికీ, అసంకల్పితంగా కలిగిన ఉద్వేగంలో కాళ్ళు విదిలించి దిగ్గున లేవబోయాను. కాని కాలు జారి నేను దొర్లుకుంటూ పట్టాల మీదనుండి ముళ్ళకంపల్లోకి వెళ్ళి పడిపోయాను. నా ఒళ్ళు చీరుకుపోయింది. భరించలేని బాధతో కాలు మెదపలేక పోతున్నాను. చావు రాలేదు సరికదా, అవిటివాడినైపోయానని దుఖం ముంచుకొచ్చింది. జీవితమంతా అవిటివాడిగా బతకాలేమో అని ఏడిచేసాను. ఎంత ప్రయత్నం చేసినా లేవలేకపోయాను. కాలు అస్సలు స్వాధీనంలో లేదు. భరించలేని నరకయాతన! ఆ బాధలో నాకు స్పృహ తప్పింది. మళ్ళీ నాకు తెలివి వచ్చేసరికి, నా ఇంట్లో మంచం మీద నేనున్నాను. చుట్టూ నా తల్లి, తండ్రి, అక్కయ్యలు ఆదుర్దాగా నా మొహంలోకి చూస్తున్నారు. నేను చెయ్యబోయిన అఘాయిత్యం తలుచుకునేసరికి సిగ్గేసింది. వెక్కి వెక్కి ఏడుస్తూండగానే నాకు మళ్ళీ స్పృహ తప్పింది. కాని ఆరోజు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర్ఫస్వామే నన్ను చావునించి తప్పించాడు!' లావా పక్కున నవ్వాడు. రామదాసు వారించాడు. ' అల్లా నవ్వకు. నా కాలు పోయిందనీ, అవిటివాడినైపోయాననీ ఆ రోజున ఏడిచాను. కాని నా కాలు మడతపడడమే గాని, ఏ ప్రమాదమూ జరగలేదు. రెండు రోజుల్లో మామూలుగా లేచి తిరిగేసాను. మూడవరోజున నాకు టీచరు ఉద్యోగం వచ్చినట్లుగా పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి! తలుచుకుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నాలుగురోజుల వ్యవధిలో నా జీవితంలో ఎన్ని మార్పులు! ఇదంతా నా ప్రయత్నం వల్లే జరిగిందని ఎల్లా అనుకోను? చచ్చిపోవలసిన వాడిని, గమ్మత్తుగా బతికి బట్ట కట్టడం, ఎన్నేళ్ళుగానో ఎదురు చూసినా రాని ఉద్యోగం అకస్మాత్తుగా రావడం--ఇదంతా భగవంతుడి అనుగ్రహం కాక మరేమిటి? ఆ తర్వాత బి.ఏ. ప్రైవేటుగా చేసాను. తర్వాత ఎమ్.ఏ. పాసయ్యాను. తర్వాత డబుల్ ఎమ్.ఏ. కూడా చేసాను. ఈ రోజున ఈ నరసాపురంలో లెక్చరరుగా స్థిరపడ్డాను. ఇదంతా నా మానవ ప్రయత్నం అంటే ఒప్పుకుంటాను. కాని ఆరోజున రావలసిన మరణం రాకపోవడంలో నా ప్రయత్నం ఏముంది? ఇప్పటికైనా నువ్వు భగవంతుడు వున్నాడని నమ్మి తీరాలిరా లావా1' లావా గంభీరంగా అన్నాడు, ' దాసూ! అల్లాగే నేను కూడా ఒక కథ చెబుతాను విను.' రామదాసు లోపలికి వెళ్ళి పొయ్యి మీద కాగుతున్న పాలు రెండు గ్లాసులలో పోసి, కాఫీ తయారు చేసి, ఒక గ్లాసు లావాకిచ్చి, మరో గ్లాసులోని కాఫీ తను తాగుతూ లావా చెప్పేది వినసాగాడు. లావా కాఫీ తాగుతూ కొనసాగించాడు. ' నా స్నేహితుడొకడున్నాడు. లుఛ్ఛా డాక్టరు! డబ్బు సంపాదనే వాడి ధ్యేయం. అందుకోసం ఎంత నైచ్యానికైనా ఒడిగడతాడు. ఒక కుర్రవాడికి మలేరియా వస్తే వాడి నర్సింగ్ హోమ్ లో చేర్చారు. వాడు వారం రోజుల పాటు ఆ కుర్రాడికి ఇంజక్షన్లు పొడిచాడు. వాడికి తగ్గలేదు సరికదా, మరింత ఎక్కువైంది. ఆ డాక్టరు కూడా పెదవి విరిచేసాడు. ఆ కుర్రాడి తలిదండ్రులు ఏడుస్తూ శివాలయానికి వెళ్ళి, మహామృత్యుంజయ జపం చేయించి, ఆ విభూతి తీసుకు వచ్చి వాడి ఒంటినిండా పులిమారు. రెండోరోజు నించే వాడి జ్వరం తగ్గుముఖం పట్టింది! మరో ఐదురోజులలో వాడికి పూర్తిగా నయమైపోయింది. ఈరోజుకీ వాళ్ళు ప్రతి సోమవారం విధిగా శివాలయానికి వెళ్ళి, శివుడికి అభిషేకం, అమ్మవారికి అర్చన చేయించి వస్తూ వుంటారు.' రామదాసు ఆనందంగా అన్నాడు, ' చూసావా మరి?' లావా అన్నాడు, ' ఆగు, నేను చెప్పేది పూర్తిగా విను. అసలు జరిగిందేమిటో తెలుసా? ఆ డాక్టరు వాడికి నాలుగు రోజులు ఉత్తుత్తి ఇంజక్షన్లిచ్చాడు. కావాలనే ఆ కుర్రాడింక బతకడని గాబరా పెట్టేసాడు. ఐదోరోజున క్వినైను మాత్రలు మింగించాడు. పదిరోజులు ఆస్పత్రిలో ఉన్నందుకు గది అద్దె ఐదువేలు, రకరకాల పరీక్షలకైన ఖర్చు నాలుగు వేలు, మందుల ఖర్చు మూడు వేలు, వాడి ఫీజు కింద కేవలం ఐదువందలు, వెరసి మొత్తం పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి బిల్లు చేసాడు. ఆ కుర్రాడి తలిదండ్రులు మృత్యుముఖం లోంచి తమ కొడుకుని బలవంతంగా లాక్కు వచ్చినందుకు, ఆ ఫీజుతో బాటు మరో ఐదువేల నూట పదహార్లు, బట్టలు చదివించుకుని, ఆ డాక్టరుకి పాదాభివందనం చేసుకుని ఇంటికి పోయారు.' ' ఒరేయి లావా! నా అనుభవాలకి, ఆ డాక్టరు డబ్బు వ్యామోహంలో పడి చేసిన పనికి ఏ విధమైన సంబంధం లేదు. నాది అలౌకికమైన అనుభవం. నువ్వు చెప్పినది ఇహలోకంలో జరుగుతున్న మోసాలలో ఒకటి. సమాజంలో జరిగే మోసాలకి, అన్యాయాలకి భగవంతుడ్ని బాధ్యుడిగా చేయడం సబబు కాదు కదా?' ' దాసూ! నేను చెప్పినది నువ్వు సరిగ్గా అనలైజ్ చెయ్యలేదు. నేను మాట్లాడేది ఆ డాక్టరు చేసిన మోసం గురించి కాదు. కేవలం శివాలయంలో అర్చన చేయించి, ఆ విభూతి తీసుకువచ్చి తమ కుర్రాడికి పులమగానే అతడి రోగం నయమైపోయిందని నమ్మిన ఆ అమాయకపు తలిదండ్రుల గురించి. హోరుగాలిలో దీపం పెట్టి, ' దేముడా! నీ మహత్యం చూపించు.' అన్నంత మాత్రాన ఆ దీపం ఆరిపోకుండా వుండదు. అలాగే రోగం వస్తే గుళ్ళచుట్టూ ప్రదక్షిణలు చేసినంత మాత్రాన ఆ రోగం నయమైపోదు. వైద్యపరమైన చికిత్సతో మాత్రమే రోగాలు నయమవుతాయి.' ' నువ్వు చెప్పేది నిజమే. మన ప్రయత్నాలు మనం చేస్తూ, ఆ పైన భగవంతుడి మీద భారం వేయాలి. అంతేగాని, చేతులు ముడుచుకు కూర్చుని, భగవంతుడే అన్నీ చూసుకుంటాడు అనుకోవడం సరికాదు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అదే శలవిచ్చాడు.' ' ఆయనేం చెప్పాడో నువ్వు పక్కన పెట్టు. మన ప్రయత్నం మనం సవ్యంగా చేసినప్పుడు ఫలితాలు వాటంతటవే వస్తాయిగా? ఇంక దేముళ్ళని, బాబాలని, స్వాములని నమ్ముకోవడం ఎందుకు, మూర్ఖత్వం కాకపోతే?' ' ఒరేయ్ లావా! ఎడ్డెమంటే తెడ్డెమనకురా.' ' కాదు దాసూ! నన్ను సరిగ్గా అర్థం చేసుకో. కాకతాళీయంగా జరిగిన వాటిని భగవంతుడి లీలలుగా భావించి మూర్ఖంగా ప్రవర్తించకు. ఇంకోటడుగుతాను. ఏమనుకోకు. నీమీద ఆ భగవంతుడికి అంత అనుగ్రహమే వుంటే, పెళ్ళై రెండేళ్ళు కూడా తిరగకుండానే నీ భార్య ఎందుకు చచ్చిపోయింది? కనీసం నీకంటూ ఒక్క సుపుత్రుడినైనా ఆ దేముడు ప్రసాదించలేదేం? దీనికి ఆ భగవంతుడిని తప్పు పట్టాలని నీకనిపించలేదా?' రామదాసుకి ఒక్కసారిగా ఆ సంఘటన గుర్తుకు వచ్చింది. సంప్రదాయమైన కుటుంబంలోంచి అపరంజి బొమ్మలాంటి అందమైన యువతి తనకి భార్యగా వచ్చింది. అంతా తన అదృష్టమని, ఆ భగవంతుడి అనుగ్రహమని తనెంతో మురిసిపోయాడు. పెళ్ళయి ఏడాది కూడా తిరగకుండానే తన భార్య గర్భం ధరించింది. తనంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ వుండరని తనెంతో ఆనందపడ్డాడు. కాని, తన దురదృష్టం! పూర్వజన్మలో తను తెలియక చేసిన పాపఫలితం ఐవుండవచ్చు. తన భార్య పురిటిలో బిడ్డను ప్రసవించలేక తనువు చాలించింది. కనీసం తనకి బిడ్డ కూడా దక్కలేదు. రామదాసు గట్టిగా నిట్టూర్చి అన్నాడు, ' లావా1 ఎప్పుడో నేను విన్న గేయం నీకు కొద్దిగా వినిపిస్తాను, వింటావా?' ' ఏమిటది?'
'అహరహం ఇహంలో హాలాహలం! హరా! హరా! అనుకొంటే పీయూషం!ఇహం పైన వ్యామోహం వదులుకుంటే, అహం వీడి నిను నీవు తెలుసుకుంటే, అనుక్షణం ఉల్లాసం! ఇహమందే కైలాసం!!'మూడు పుండ్రములు ధరియించు మూడు తాపములు హరియించు భుజగభూషణుని నుతియించు ఆరు వైరులను వధియించు నగజాధీశుని శరణుగొను సంచిత పాపం హరణమను శివా శివా అని స్మరియించు హృదయం పావనమొనరించు నీలకంఠుని ధ్యానించు లీలగ మోక్షం లభియించు భూతంలో నీవేమి చేసినా భూతనాథుడే భావి కాచెను లావా నవ్వాడు. ' హ..హ..హ... బాగుందిరా. నీకు ఇహలోకం మీద వ్యామోహం వుండకూడదని అమాయకురాలైన నీ భార్యని ఆ శివుడు బలి తీసుకున్నాడు. నీలోని అహాన్ని చంపేసి, నిన్నిల్లా జీవఛ్ఛవంగా మార్చేసాడు.'
రామదాసు విరక్తిగా అన్నాడు, ' వాసాంసి జీర్ణాని యథా విహాయ...'లావాకి ఒళ్ళు మండింది. ఇంత చెప్పినా అర్థం చేసుకోలేని మూర్ఖుణ్ణి ఏమనాలి? కోపంగా రామదాసుకి అడ్డు తగులుతూ అరిచాడు. ' ఆపు, ఆపు! ఒరేయ్ దాసూ! అసలు ' భగవంతుడు ' అంటే అర్థం ఏమిటిరా?'' సర్వాంతర్యామి! ఇందు గలడందు లేడని సందేహము వలదు....' ' ఔనౌను. చక్రి సర్వోపగతుండు. నేను చిన్నప్పుడు చదువుకున్న పద్యమేలే. మళ్ళీ నువ్వు అరమోడ్పు కళ్ళతో అదంతా చదవక్కర్లేదు. నేను అడిగింది, ' భగవంతుడు ' అన్న పదానికి వ్యుత్పత్యర్థం ఏమిటని.' రామదాసు బాధగా అన్నాడు, ' లావా!' లావా పరిహాసంగా అన్నాడు, ' భగవంతుడు అంటే భగము కలవాడు అనేగా అర్థం? ఒరేయ్ దాసూ! భగము అంటే ఏమిటిరా? అసలు భగవంతుడు ఆడదా లేక మగవాడా?' రామదాసు మ్లానంగా అన్నాడు, ' నీ ఆలోచనలు ఆ క్షుద్రమైన పరిధి దాటి ఎదరకు వెళ్ళవురా.
ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసశ్శ్రియ: జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం వర్గో భగస్మృత:
అన్నారు. అంటే ఐశ్వర్యము, వీరత్వము, యశస్సు మొదలైన పైన చెప్పిన ఆరు గుణాలని కలిపి ' భగము ' అన్నారు. ఆ ఆరు గుణాలని కలిగి వున్నవాడు కనుకనే పరమాత్మను ' భగవంతుడు ' అన్నారు.లావా కంగు తిన్నాడు. ' ఓహో! భగము అన్నదానికి ఇంత అర్థం వుందా!' అనుకుని అప్పటికి మౌనంగా వుండిపోయాడు.
**********************
(తరువాయి వచ్చే సంచికలో)
No comments:
Post a Comment