// అవాంఛితం //
రచన : కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
కాళ్ళు సన్నగిల్లుతుండాయ్.. ఈ చిన్నదాన్ని ఏడకని దిప్పాలి చెప్పూ..! ఏ డాట్టరమ్మ దగ్గరికెళ్ళినా ఏ డాక్టరయ్య దగ్గరికెళ్ళినా బయటకి బొమ్మంటుండ్రు.. ఊళ్ళోకెళ్లేదెట్టా??"
కొంగుతో చెమట తుడుచుకుంటున్నట్టుగా నటిస్తూ, పొంగి పొరలుతున్న కన్నీళ్ళను అద్దుకుంది మంగి..
"దీనెమ్మ ఇది ఇట్ట సేసి నా ఫరువు దారినేసి నాదిగదే..! " అంటూ ప్రక్కనే ఉన్న కూతురు సునందను కొట్టేటందుకు మీదకురికాడు సామి.
"అయ్యో అయ్యో ఏందయ్యా అట్ట సిన్నదాన్ని జేసి, కొట్టిచంపుతావా ఏందీ.. కాస్తట్టుండు.. చిన్నదైనే దానికేందెల్సు ఆ.. ల..కొడుక్కి తెలియాల.. ముక్కుపచ్చలారని బిడ్డే అని ఆడికుండాలే..! ముందు దాన్ని కొట్టడం ఆపి ఏంజేయాలో ఆలోసించు.. బిడ్డ నిన్నటాలిమించి ఏం తిన్లే..! పొద్దెక్కుతాంది.. ఎండసూడు ఎట్టా కొరకొరా సూత్తాందో నీలాగ. " సర్ధిచెప్పేందుకు ప్రయత్నించింది మంగి.
అమ్మ, అయ్య కూతురు ఆ ఊర్లోని మాతా శిశుపోషణాలయం బయటున్న చెట్టుక్రిందసొమ్మసిల్లినట్లు పడి ఉన్నారు.... ఊర్లో వున్న అందరు గైనిక్ డాక్టర్లను కలిసి చివరకు ఇక్కడ తేలారు. ఇంత జరుగుతున్నా... చున్నీ చివర నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ అటు ఇటూ వెళ్తున్న గర్భిణీలను చిత్రంగా దుర్భిణీ వేస్తోంది సునంద.. సునంద వయసు పదమూడేళ్ళు. అంతలో ఒకామె అక్కడికి వచ్చి మంగిని పిలిచి ఏదో చెబుతోంది...
********
పాలంకి అనే ఊరు లో నివాసం ఉంటున్నారు సామి, మంగి. రిక్షా తొక్కుతూ సంపాదించే సామికి, కోతలకెళ్తూ పదోపరకో తెచ్చే మంగమ్మ తల్లో నాలుక. ఇంటి పనంతా చేసి మళ్ళా తన పెనివిటి సామి వచ్చేటప్పటికి గుడిసంతా శుభ్రం చేసి ఎంచక్క ముగ్గులేసి.. మంచమేసి మల్లెచుండు తలకు చుట్టూకుని ఎదురుచూసేది మంగమ్మ.. "మంగీ" అని ప్రేమగా ఇంటిదాన్ని పిలుచుకుంటుంటాడు సామి.. దీంతో మంగమ్మని, "నీపేరేందక్క" అని ఎవరైనా కొత్తోళ్ళడిగినా "మంగి" అని చెప్పేసేది.. ఎప్పుడూ హుషారుగా.. ఉండే మంగికి, సామి అంటే వల్లమాలిన ప్రేమ.. సామికి కూడా మంగి అంటే మాంచి ఇష్టం. పరాయోళ్ల ఇంటమ్మాయి.. పెళ్ళిచేసుకున్న పాపానికే తన కష్టాలన్నీ ఆనందంగా పంచుకుండే మంగిని చూస్తే..! రాములోరి సీతమ్మ ను చూసినట్లుంటుంది సామికి.
తొలిగా కాస్త పొలం పుట్ర ఉన్న సామి కి ఓగ్ని తుఫాను సమయంలో పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం, అందిన సాయంకు.. నష్టాలకు కనీసం పొంతనలేకపోవడంతో ఉన్నదంతా అమ్మి వడ్డీ వ్యాపారి సుధాకర్ చేతిలో పెట్టి, కట్టుబట్టలతో పాలంకి కి వచ్చి.. చెరో పని చేసుకుంటూ గడిపేస్తున్నారు.. "అంతంత వడ్డీలు కట్తేదేంది.. వడ్డీ వ్యాపారికి..? వాడు రాక్షసుడు కలెక్టరుకు చెబుదాం పొలం ఇమ్మాక" అని తోటి వాళ్ళంటుంటే.. "తీసుకున్నప్పుడే ఆ బుద్ధి మనకుండాలన్నా" అని వడ్డీ వ్యాపారికి ఉన్నదంతా రాసిచ్చేశాడు సామి. వీరికి లేకలేక పుట్టింది సునంద.. ఆడపిల్ల అని ముందే తెలిసినా,.. సహనం ఉండేది, లచ్చిమికేనే అంటూ మంగిని బుజ్జగించేవాడు సామి.. అందుకే సునంద వారిద్దరి కన్నులపంట. 'ఆడపిల్ల అని కాని, లేని వాళ్ళం' అనే భావన చిన్నారికి కలగకుండా నెట్టుకొస్తున్నారిద్దరూ..
అంతలో పిల్ల పెద్దమనిషైందన్న సంతోషాన్ని, పాలంకిలో ఎంచక్కా ఉన్నదాంట్లో వేడుకచేశారు. చుట్టుపక్కల వాళ్ళకి భోజనాలు పెట్టి సునందకు పట్టు పరికిణీ కుట్టించి, చిన్న ఉంగరం చేయించారు. అందాల భామలా వున్న సునందను.. దగ్గరలోని ఫొటో స్టూడియోకి తీసుకెళ్ళి పూలజడ ఫొటో కూడా తీయించారు.. వాళ్ళ గుడిసెలో ఉన్న పెద్దోళ్ల ఫొటోల తో పాటు ఈ ఫొటో కూడా వుంచేరు. కష్టం అనే మాట మరచి స్తోమతకు మించి సామి,మంగి ఇద్దరు ఒకపుట తిన్నా తినకున్నా పేరున్న ఓ ప్రైవేట్ స్కూల్ లో సునందను చేర్పించి, మంచి స్థానం లో చూడాలన్న ఆశలో బ్రతుకుతున్నారు.
అంతలో అంతటి ఆనందాల నిలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది.. వారెవ్వరూ ఊహించని పరిణామానికి, ఎవ్వరికి ఏమి చెప్పుకోవాలో అర్ధంకాని పరిస్థితి...ఏర్పడింది.
స్కూల్ లో సునందంటే ఇష్టపడని వారుండరు.. తుళ్ళుతూ.. తిరుగుతూ.. ఆటలు పాటలు.. , చదువు లలో అందరికన్న ముందుండేది సునంద. చక్కని మోము, చూడగానే పసితనం ఉట్టిపడే మెరుపు చాయ సునంద సొంతం. అందరిలోకీ ఏదో తెలియని ప్రత్యేకత సునందది.
ఒకరోజు భారీ వర్షం పడుతోంది. కొద్దిగా వర్షం తెరిపివ్వడంతో అందరూ వెళ్ళిపోయారు... చివరకు టీచర్లుకూడా వెళ్ళిపోవడంతో తండ్రి సామి కోసం ఎదురు చూస్తున్న సునంద స్కూల్ బయటే ఉండి పోయింది. అంతలో " ఏంటి సునంద వర్షంలో బైటున్నావ్.. మీ నాన్న రాలేదా..? లోపలకూర్చో వస్తారులే" అన్న గొంతుతో ఒక్కసారి భయపడ్డ సునంద వెనక్కితిరిగి చూసింది. అక్కడ నవ్వుతూ నిలబడి వున్నారు స్కూల్ హెడ్మాస్టర్..ముఖేష్. ఎప్పుడూ టైం కన్నా పదినిమిషాలు ముందు వచ్చే నాన్న ఇంకా రాలేదు.. పైగా వర్షం పెరిగిపోతోంది.. ఏంచేయాలో తెలియని సునంద హెడ్మాస్టర్ చెప్పినట్లు లోపలికెళ్ళి కూర్చుంది.. సునందను అనుసరించాడు ఆ గోముఖ వ్యాఘ్రం.
వర్షం తగ్గిన కొద్ది సేపటికి వచ్చాడు సామి.. రిక్షా గంట కొట్టడంతో ఒణికి పోతూ వచ్చి రిక్షా లో కూర్చుంది . చలికి అంతగా తడిస్తే ఎలాగమ్మా..? లోపల కూర్చో వచ్చుగా తల్లీ,..అంటూ తడవకుండా తన టవల్ సునందకి కప్పి నేరుగా ఇంటికి తీసుకెళ్ళాడు .
ప్రొద్దుటే లేచే సరికి సునంద ఒళ్ళు సలసల కాగి పోతోంది. "ఏమైందమ్మా.. అలా వున్నావ్" అని అడిగిన అమ్మని కౌగిలించుకుని కన్నీరు పెట్టుకుంది.. ఒళ్ళు వేడి వల్ల వచ్చిన కన్నీరనుకుని తుడిచింది.. "పడుకోమ్మా నాయనొచ్చి మందులు దెత్తాడు... నేను కోతకెళ్ళొస్తా..! పండుకో.. రేపు వెళ్దూవు లే స్కూలికి సరేనా.. !" అని వెళ్ళిపోయింది మంగి.
రెండు రోజుల తీవ్రజ్వరం తగ్గుముఖం పట్టిన అనంతరం స్కూల్ బాట పట్టింది సునంద.. నాన్న రిక్షాలో.. కానీ సునంద ఇదివరకంత హుషారు లేదు,.. లేదు అనడం కన్న .. భయం సునంద హుషారుని చంపేసింది... స్కూల్ దగ్గర సునందను వదిలిపెట్టిన సామి, బయటే ఉన్న హెడ్మాష్టర్ కు ఒక దండం పెట్టాడు.. నాన్న ఎవరికి దండం పెట్టాడా అని చూసిన సునందకు ఎదురుగా హెడ్మాష్టర్,.. చూసి ఒణికిపోయింది... పరుగులాంటి నడకతో గబగబ నడుస్తూ.. ప్రక్క నుంచి క్లాస్ లోకి ఉరికింది సునంద...
" సామి గారూ మీ అమ్మాయి కాస్త చదువులో వెనుకబడ్డది. రేపటి నుంచి కాస్త ఆలస్యంగా పంపిస్తాం వెనుకబడ్డోళ్ళకి ప్రత్యేక క్లాసులుంటాయ్ నేనే చెబుతా" అని నమ్మబలికాడు హెడ్మాష్టర్ ముఖేష్.
" అలాగేనండయ్యా.. నీకూతురులాంటిది.. నీ చేతిలో బెట్టినా.. నా కూతురు కలెక్టరవ్వాలె సారూ.. నీ పేరు జన్మజన్మలా ..ఊరు వాడా డప్పుకొట్టి మరీ సెబుతా దొరా..!" నువ్వెప్పుడొచ్చి పట్టకెళ్ళమంటే అప్పుడే పట్టకెళ్తా.. ఎన్నిగంట్లకు రమ్మంటా సారూ" అమాయకంగా అడిగిన సామికి గంట ఆలస్యంగా రమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ముఖేష్. ..వెనక్కు తిరిగి ఏదో సాధించానని అదోరకంగా ముఖ కవళికలు మార్చుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
ముఖేష్ మాటల వెనుక ఘోరం దాగున్నదని తెలియని, అమాయకపు సామి తన కుతురు బంగారు తల్లి.. యింటి మాలచ్చి..ఎంచక్కా కలెక్టరై పోతుంది.. "కలెక్టరు అయ్యోర"ని, అంతా తనని పిలుస్తుంటే వింటూ మురిసిపోతున్నట్లు కలలు కంటూ , లీలగా తనకు గుర్తొచ్చిన పాట "రిం జిం రిం జిం " అని పాడుకుంటూ హుషారుగా రిక్షా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు.
స్కూల్ లో ముభావంగా వున్న సునంద ను పిల్లలు కాసేపు ఆటపట్టించినా... పట్టించుకోలేదు.. ఏంజరిగిందో తెలీదు కానీ ఏదో జరిగింది.. హెడ్మాస్టర్ ను చూస్తే.. ఇదివరకు నవ్వుతూ "గుడ్మానింగ్ సార్" అంటూ చెప్పే తనకి , అతని ముఖం వైపు చూడగానే ఏదో తెలియని భయం.. ఒళ్ళంతా ఒక్కసారి ఒణుకు ప్రారంభమై.. పైన పడి రక్కేయాలన్నంత కసి పుట్టింది.. కానీ ఎందుకలా..?? తెలియనితనం సునందని ప్రశ్నించింది. సమాధానం కూడా తెలియక అంతలోనే మరిచిపోయింది. "టీచర్, సునంద ఎవ్వరితో మాట్లాడటం లేదు " అని తోటి పిల్లలు టీచర్ కి సునంద పై కంప్లైంట్ చేస్తే.. "పాపం దానికి జ్వరం లే వదిలేయండి నీరసంగా ఉండి ఉంటుంది.." అని అంది టీచర్ .
సాయంత్రం అందరూ స్కూల్ విడిచి పెట్టడంతోనే ఇంటికి వెళ్ళిపోయారు.. ఒక్కొక్కరుగా టీచర్లు ఇంటి బాట పట్టారు.. సునంద ఒక్కతే స్కూల్ లో మిగిలిపోయింది.. ఎంతసేపు చూసినా నాన్న రాలేదు... అంతలో " ఏమ్మా మీ డాడీ రాలేదా...? " ఆయా ఆరా తీస్తుండగా అక్కడికి చేరుకున్న ముఖేష్, " ఆయమ్మా నువ్వు బజార్ వెళ్ళి టీ తే..తల నొప్పిగా ఉంది" అని ఆయాను గదిమినట్లు చెప్పాడు. సునందను ఆరా తీస్తున్న ఆయా ముఖేష్ చెప్పడంతో సునందను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది.. ఆయా వెళ్ళిన వెంటనే.. రా..లోపలికి సునందా అని ఒక రకమైన ధీమాతో దబాయించినట్లు పిలిచాడు హెడ్మాస్టర్... ఏంచేయాలో తెలియక భయంతో ఆఫీస్ రూం వైపు అడుగులేసింది..
"ఏం జ్వరమొచ్చిందట.. మీ ఇంట్లో చెప్పావా..? నీ ఇష్టం తాట తీస్తా..! బీకేర్ ఫుల్" అంటునే ముకేష్ చేతులు సునందను ఎక్కడెక్కడో తాకడం మొదలెట్టాయి.
ఏం జరుగుతుందో తెలుసుకోలేని వెర్రితనం సునందని ఏకాకిని చేసి గద్దకు ఆహారం చేసింది.
"ఇదిగో నువ్వు ఎంతందంగా వున్నావో మొత్తం తనివితీరా చూసుకో "అంటూ అప్పటిదాకా తీసిన వీడియోని గట్టిగా ఒడిసి పట్టుకున్న సునందకు చూపుతుండగా ఆయా రావడంతో సర్ధుకున్నాడు ముఖేష్.
అంతలో సామి రిక్షా శబ్దం వినబడటంతో సునంద ఒక్క పరుగున వచ్చి ఎక్కి కూర్చుంది. ఇంతసేపూ "ఎక్కడికెళ్లావ్ నాన్న.. నువ్ తొందరగా రాకుంటే భయం వేస్తోంది. నాన్న ఆలస్యం చేయమాకీసారి" అని నాన్నకు హితబోధ చేసిందే కానీ కళ్ళ ముందు పిశాచంలా పైన బడుతున్న ముకేష్ ముఖమే కనబడుతోంది సునందకి. భయంతో కన్నీళ్ళు ధారాపాతం అయ్యాయి.
తర్వాత రోజు ఎంతో ధైర్యం తెచ్చుకున్న సునంద తనకిష్టమైన సుష్మ టీచర్ కి, హెడ్మాష్టర్ విషయం చెబుదామనుకుని సుష్మ టీచర్ కోసం ఆరా తీసింది రీసిస్ లో.
"పైన క్లాసుల్లేవ్ కదా అక్కడికెళ్లారు సుష్మ టీచర్.." ఆయా ఎవరో చెప్పింది. వెంటనే పరుగు పరుగున పైకి వెళ్ళిన సునంద ఒక్కసారిగా అవాక్కయి వెనుదిరిగింది.. సుష్మ టీచర్ నిలబడి ఉంటే ఎంతో దగ్గిరగా కూర్చుని ముఖేష్ మాట్లాడుతున్నాడు.
దీంతో మౌనం ఆశ్రయించక తప్పలేదు చిన్నారి సునందకు. అలా రోజులు గడిచి పోతున్నాయ్..
ఒకరోజు కడుపులో నొప్పి అని స్కూల్ కి వెళ్లని సునంద, ఇంటి వెనుక వాంతులు చేసుకుంటు మంగి కంటబడింది. గత వారం, పది రోజులుగా రోజూ ఏదో ఒక సమస్య చెప్పి స్కూల్ ఎగ్గొట్టి ఇంటి పట్టునే ఉంటున్న సునంద పరిస్థితి పై అనుమానం కలిగించింది మంగికి. ఏదో అనుమానం తొలుస్తుండగా కూతురిని దగ్గరకు తీసుకుని బుజ్జగించి అడిగింది.. తెలీదని తొలుత అబద్దం ఆడినా.. గద్దించే సరికి చివరకు జరిగిన దారుణాన్ని పూసగుచ్చినట్లు చెప్పింది.. మంగికి నోట మాటరాలేదు..కళ్ళు తిరిగాయ్.."ఎక్కడికీ ఎళ్లమాక " అని కూతురుకు చెప్పి ... సామి ని వెతుక్కుంటూ వెళ్ళింది..
ఇద్దరూ చిట్టితల్లి సునందను తీసుకుని, ముఖేష్ ఎదుటే నిజం తేల్చుకుందామని స్కూల్ కి బయలుదేరారు. ముఖేష్ ని చూడగానే ఆగ్రహంతో చొక్క పట్టుకుని "ఎంతపని చేశావ్ రా..!" అంటూ పైన పడ్డాడు సామి .. పెనుగులాట అనంతరం ముఖేష్, సామిని బయటకు నెట్టేశాడు. చివరకు పెద్దమనుష్యులు ప్రవేశించి రాజీబాట పట్టించారు. వీడియో బయటపెడతాడన్న భయం ఒక వైపు , పెద్దల ప్రశ్నల వేధింపు ఒకవైపు ఎక్కువై "మీ తృణాలు పణాలు మాకొద్దు.. మా పిల్లకి నాయం గావాల. ఏమైనా సరే..!. నాయం జరిగేంతవరకూ ఊరుకునేది లేదు.. ట్యూషన్ పేరుజెప్పి.. బిడ్డకు అన్నాయం జేసినావు గదరా..! గురువంటే దేవుడురా.. నువ్వో దయ్యానివి . ఎంతమంది నీ పాలబడ్దార్రా ముదనష్టపోడా..! మాకు పైసలిప్పిత్తారా.. మీరు పెద్దమనుషులా.. థూ.. " అని " పదవే మంగి విడంతు సూడంది నే నిద్రబోను" అంటూ పిల్లను తీసుకుని విసురుగా వెళ్ళిపోయారు.
*******
" ఇగో నిన్నే అట్టా కూకుంటే ఎట్టా? , వాడికి ఆ దేవుడే బుద్ధి సెబుతాడ్లే.. ముందర పిల్ల కడుపు నొప్పంటూ ఓ ఇదై పోతోంది. ఏదైనా డాట్టర్ దగ్గరబోయి పిండం తీసేయిద్దాం.. ముందు అది మరింత ఇబ్బందైద్దయ్యా దాని జీవితానికి.." ఏదో ఒప్పించే ప్రయత్నం చేసింది.. వెంటనే కండవ భుజం పై వేసుకుని రిక్షా తీశాడు. ముగ్గురూ దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళి చూపించారు.. నాలుగో నెలగా చెప్పారు పరీక్ష చేసిన వైద్యులు.
" అమ్మా.. సిన్న బిడ్డ.. ఓ రాక్షసుడు చేసిన పాపం, తీసేయండమ్మా,,...!" వైద్యురాలిని కోరింది మంగి. " ఓయ్ ఏం మాట్లాడుతున్నావ్.. కడుపు తీసేయమనగానే తీసేయరు.. గవర్నమెంట్ ఒపుకోదు.. నీకంతగా కావాలంతే పెద్దూర్లో పెద్దాసుపత్రులకి తీసుకెళ్ళు ఓ పాతిక వేలు తీసుకుని శుద్ధి చేశ్తారు.. పోవమ్మా.. జైల్లో పెట్టించాలని కోరికగా ఉందా.." గడగడ మాట్లాడుతూ విసురుగా వెళ్ళిపోయింది డాక్టర్. " ఓ పదైదు వేలుంటే చుడండి డాట్రమ్మతో నేను మాట్లాడతా.. " అని ఓ నర్సమ్మ సలహా పారేసింది.. సామి దంపతుల దగ్గర మెత్తం పోగేసినా ఐదోవంతు లేదు.
అక్కడ నుండి మొదలై ఆ చిన్న పట్టణం లో ఉన్న అన్నీ ఆసుపత్రులకూ తిరిగి, ఏ డాక్టరూ అబార్షన్ చెయ్యమని ఖరాఖండిగా చెప్పడం తో తిరిగి తిరిగి మాతా శిశుపోషణాలయం ప్రక్కన చెట్టు క్రింద కూలబడ్డారు.. అంతలో అటుగా వచ్చిన ఒకామె "అమ్మా ఇటూరా అని మంగిని పిలిచి " మీరు ఇందాక డాక్టర్ తో మాట్లాడుతుంటే విన్నానమ్మా.". అంటూ దగ్గరలోని నాటు వైద్యం చేసే ఆమె గురించి చెప్పి వెళ్ళి పోయింది. వెంటనే .. ఆ నాటు వైద్యం చేసే మహిళ ఇంటి ముఖం వైపు అడుగులేశారు.
" ఎన్నోనెల, పిల్ల మరీ సిన్న పిల్ల కదా.. బాగా రేటౌద్ది... నోట్లో కారా కీళ్ళీ పక్కనే ఉమ్మేస్తూ నిర్లక్ష్యంగా చెప్పింది నాటు వైద్యం చేసే సోంబాయమ్మ. ఎంతైనా ఫర్లేదమ్మా.. తలెత్తుకోలేకున్నాం.." అన్న మంగి మాటలు పూర్తికాక ముందే "మూడేలు" అంది తోడేలు మొఖం పెట్టి. సరే అన్నారిద్దరు. ఒకళ్ళ మొఖం ఒకళ్ళు చూసుకుని వారిద్దరి దగ్గరా ఉన్న డబ్బులు తీసి సోంబాయమ్మ చేతిలో పోశారు. మీరీడ్నే ఉండండి అని పెద్దోళ్ళిద్దరిని వారించి,
"ఓయ్ పిల్ల ఏం సదువుతుండా.. దా.." అని రెక్కపట్టుకుని చకచక లోపలికి తీసుకెళ్ళింది సునందను.. కాదు ఈడ్చుకెళ్ళింది.
ఏదో పసరిచ్చి "తాగమ్మ చేదుగుందనమాక, తర్వాత ఇబ్బందవుతుళ్ళా.. తాగు" అని కాస్తంత బలవంతంగా తాగించేసింది.
బయట మంగి సామి ఒకళ్ళనొకళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చేశారు.. తమ చిన్నారి సునందకు ఏమీ కాకూడదని దేవుడికి మొక్కుకున్నారు.. చిట్టితల్లి సునందకు జరిగిన ఘోరం గుర్తొచ్చి సామి ఆగ్రహం పట్టలేక పోతున్నాడు. "ఎలాగైనా ముఖేష్ గాడికి గట్టి బుద్ధి చెబుతా" అన్న సామిని నచ్చ జెబుతూ..
"అయ్య ఆళ్ళు పెద్దోళ్ళు ఆళ్ళతో ఢీ కొని మనమీడుండలేమయ్యా..! నువ్ కాస్త కుదుటపడు.. తర్వాత సూద్దూలే బిడ్డ ఆరోగ్యం అసలే బాలేదు" అని మాట్లాడుకుంటుండగా లోపలి నుంచి పెద్ద కేక వినపడింది.. ఇద్దరు ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు గట్టిగా పట్టుకున్నారు. చేతికి ఉన్న రక్తంతో పరిగెట్టినట్లు హడావుడిగా బయటకు వచ్చేసి ముందుకెళ్ళిపోయింది సోంబాయమ్మ. ఎంతసేపైనా తిరిగి రాలే.. ! అంతలో అనుమానం పెరిగిన సామి , మంగి లోపలికి పరిగెట్టారు.. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న సునందను చూసి ఇద్దరికీ గుండె ఆగినంత పనైంది.. హడవుడిగా ఏదైనా డాక్టర్ కి చూపించాలని చేతుల్లో కి ఎత్తుకుని బయటకు పరిగెడుతుండగా చేతుల్లోనే తలవాల్చేసింది..
అంతలో ఆ దారుణాన్ని చూచి తట్టుకోలేక పోయిన ఆకాశం ..ఇద్దరి కన్నీళ్లను తుడిచేందుకు మేఘం ని పంపింది.. తన్నుకొస్తున్న దుఖాన్ని , ఏడుపును వర్షం కబళించింది.. మిన్నంటే వారిద్దరి రోదనలూ ఉరుము శబ్దం మింగేసింది...
*******
ఆకాశం భళ్ళున తెల్లారింది.. సామి మంగిలతో పాటూ వెక్కి వెక్కి ఏడ్చిందేమో ఉబ్బినట్లుగా ఉంది ఆకాశం.
" ఒరేయ్ కారాపు..కారాపు.." అక్కడేదో జరిగినట్లుంది అంతా గుమిగూడిన వైపు చూపించి కారాపించి, దగ్గరకెళ్ళి ఏ యాక్సిడెంటో అన్న ఉత్సుకతతో వెళ్ళిన ఫైనాన్సర్ సుధాకర్ ఒక్క సారి షాక్ కు గురియ్యాడు.
" ఒరేయ్ ఇట్టారా.. ఈళ్ళు మన ఊరి శ్రీరామస్వామి రా.., ఇక్కడున్నారేంది.. అయ్యో ఏమైందమ్మ.. ! ఈళ్లకీ ...? ఒకవైపు అక్కడున్నోళ్లని ఆరా తీస్తూనే, "ఒరేయ్ రారా నీబండబడ..." అంటూ డైవర్ ని కేకేసి, వెంటనే సెల్ తీసి టపటప ఏవేవో నెంబర్లు కొట్టాడు. "మగాయన బ్రతికున్నట్లుంది, ఆయన సేతుల్లో ఏదో కాగితం వున్నట్లుంది.. " ఎవరో అన్న మాటలు సుధాకర్ చెవికి సోకాయి. వెంటనే కారు డైవర్, అక్కడున్న వాళ్ల సహకారంతో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న సామిని కారెక్కించి "నేను ఫోన్ చేశా , డాక్టర్ శుభకిరణ్ దగ్గరికి తీసుకెళ్ళు "అని డ్రైవర్ కు చెప్పి ,మృతిచెందిన మంగిని, ప్రక్కనే రక్తంలో పడి ఉన్న సునందను చూసుకునేందుకు అక్కడే తనకు తెలిసిన వాణ్ని పిలిపించి, "పోలీసులొస్తే నాకు ఫోన్ చెయ్యమని చెప్పు " అని హాస్పటల్ కి వెళ్ళిన సామి ని చూసేందుకు హడావుడిగా ఆటో పిలిచి ఎక్కి కూర్చున్నాడు.. సామి రాసుకున్న కాగితం చూద్దామనుకున్నాడు సుధాకర్, కానీ వర్షానికి తడిసిపోయి ముద్దయ్యింది. అందులో 'అయ్య మంత్రిగోరూ' అని, 'ముఖేష్' అనే రెండు పదాలు మాత్రమే అస్పష్టంగా కనిపిస్తున్నాయి.. కానీ అదేవిటో సుధాకర్ కి అర్ధం కాలేదు. అంత హడావుడిలోనూ ఫోన్ నెంబర్లు చకచక టైప్ చేసి ఏదో మాట్లాడేస్తున్నాడు.. జెమిని హాస్పటల్స్ కి తీసుకెళ్ళు.. "అది అవతల ఊరు కదయ్యా.. ! "
"అవును అక్కడకే..! "
హాస్పటల్ కి చేరుకునే సరికి సుధాకర్ మనుష్యులు అక్కడికి చేరిపోయారు. ఐసియులో ఉన్న సామి దగ్గరకెళ్ళి చూసి డాక్టర్ తో మాట్లాడాడు.. పరిస్థితి తీవ్రంగా వుంది.. పురుగుల మందు త్రాగారు.. బాగా ఆలస్యం అయ్యింది.. బ్రతికే అవకాశం తక్కువ, కానీ ఏదో చెప్పాలంటున్నాడు.. ఏదో మంత్రితో మాట్లాడాలంటున్నాడు చెప్పాడు డాక్టర్ శుభకిరణ్. శుభకిరణ్ సుధాకర్ ఫైనాన్స్ చేస్తే పైకొచ్చిన చైనా ప్రాడక్ట్. వెంటనే సామి దగ్గరకెళ్ళిన సుధాకర్.. "అయ్యా.. శ్రీరామసామి.. ఏమైందయ్యా... ఏందిదంతా.. నాకు డబ్బులీనీకి ఉన్నదంతా అమ్ముకొని, అప్పు తీర్చి ఎళ్ళి పోయావ్. ఇన్నాళ్లకిట్ట కనబడ్డవ్ ఏమైనాది.. సెప్పు." అడిగిన సుధాకర్ కు.. సామి, ఓపిక చేసుకుని ఒక్కొక్క ముక్క చెబుతుంటే.. సుధాకర్ రక్తం మరిగి పోయింది.. ప్రక్కనున్న డాక్టర్ పరిస్థితీ దాదాపూ అంతే.. ! సునందకు జరిగిన కష్టం చెప్పిన సామిని .. "మంత్రితో ఏదో సెప్పలన్నావుట, ఏందది శ్రీరామసామి చెప్పు ..నేను జెబుతా " అని అడిగిన సుధాకర్ కు,
"బిడ్డసంగతి మంత్రికి సెప్పల ఒక్క మాట.. ఆయనకే జెబుతా.. !" అని సామి సమాధానం.
ఉబికి వస్తున్న కన్నీటిని ఆగ్రహాన తొక్కిపట్టి .. వెంటనే మంత్రి దగ్గరకు తీసుకెళ్దాం అని అంబులెన్స్ ఏర్పాటు చేయమని కోరాడు. అంబులెన్స్ ఎక్కించి ఎక్కికూర్చున్నాడు సుధాకర్, సుధాకర్ తో పాటు శుభకిరణ్ .. "ఎక్కడున్నవేంది..? సరే.. ఎక్కడకుపోబాక" అని మంత్రికి ఫోన్ చేసి, మంత్రి ఇంటికి పోనీమన్నాడు డ్రైవర్ ని. మధ్యలో మరో కాల్ చేశాడు... అంతలో మంత్రిగారింటి ఆవరణ లోకి వెళ్ళింది అంబులెన్స్..
దిగి లోపలికెళ్ళి హడావుడిగా లోపలికెళ్ళి "ఏందయ్య.. ముంగలే జెప్పగందా.. ఈడ్నేకూకున్నవేంది.. ఎలచ్చన్లలో మాత్రం సందాలంటూ ఓ ఎగేసుకొత్తారు.. రా.. బయటికి రా.. తొందరగా" అని పరుగుపరుగున అంబులెన్స్ దగ్గరకి చేరారిద్దరూ.. లోపలికెక్కి తలుపేసుకున్నారు.
" అయ్యా " అంటూ ఓపిక లేకున్న నమస్కారం పెట్టి " అన్యాయమైన సిన్న పిల్లలకు అబార్షన్ లు చేసేందుకు చట్టం తేండయ్యా..! ఒక రాచ్చసుడు నాపిల్లని చెరిచి మానసికంగా సంపేత్తే.. గర్భం తీసేందుకు అవకాశం లేక, చట్టం ఒప్పుకోదంటూ డాక్టర్లు నాబిడ్డను మనిషిగా సంపేశారయ్యా..! అంటే, మీ చట్టం మేము బ్రతికేందుకు ఒప్పుకోదా దొరా..! పద్దెనిమిదేళ్లలో పెళ్ళి తప్పు అయినప్పుడు.. పెళ్ళికాని పిల్లలు పిల్లల్ని కనాలా?? అదనంగా ఒక్క గడ్డపు పోగొత్తేనే ఆడాల్ళు తట్టూకోలేరయ్యా..! అలాంటిది ఎవడో పాపం మోయాలంటే ఆళ్ల వల్ల కాదయ్యా.. కొత్త చట్టం తీసుకురండయ్యా.. ! అంతే నేను మిమ్మల్ని ప్రార్దించేది.! " అని సామి చెప్పిన మాటల ముక్కలు, మంత్రి కోదండంకి సూదుల్లా గుచ్చుకున్నాయ్.. ఒక్కొక్కటి బాణాలై గుండె కోసేస్తున్నాయ్ . "తాను అది చెప్ఫేందుకే బ్రతికున్నా" అన్నట్లు మాట్లాడుతూనే తల వాల్చేశాడు..సామి.! అంతా నిశ్శబ్దం ఆవరించింది. మంత్రి తేరుకోవడానికి చాలా సేపే పట్టింది..
"చట్టాలు ఉన్నాయ్ సుధాకరు.. కానీ..,వాటికి మరో చట్టాలు కాపుకాస్తున్నాయ్ .అందుకే అందరూ అశక్తులయ్యారీ విషయంలో. ఆడపిల్లని కనాలంటేనే భయపడే రోజులు వస్తున్నాయి. సామి చెప్పిన ప్రతి ముక్కా ఖచ్చితంగా చర్చించాల్సిందే.. ఆలోచించాల్సిందే. ప్రజల్లో నానాల్సిందే , అన్ సేఫ్ అబార్షన్లకు అడ్డుకట్ట పడాల్సిందే..!!" అంటూ ఆవేదనకు- ఆగ్రహానికి మధ్య ఉన్న సుధాకర్ భుజం తట్టి వెళ్ళి న కోదండం ఈ విషయాన్ని అన్ని పత్రికలలో, మీడియాలో వచ్చేలా చర్యలు తీసుకున్నాడు ,.. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.
*******
సామి..., శ్రీరామసామి గా బ్రతికిన కసాగి పట్టణంలోని అతని సొంత పొలంలోనే ముడు సమాధులు ఏర్పాటు చేశాడు సుధాకర్. ఒక్కసారి సమాధుల దగ్గరికి వచ్చిన సుధాకర్ కన్నీళ్ళు పొంగుతుండగా ఒక ఫొటో కాపీలను మూడు సమాధుల చెంత నుంచాడు...
లారీ యాక్సిడంట్ లో నుజ్జు నుజ్జై చనిపోయి కారులో వేలాడుతున్న ముకేష్ మృతదేహం ఫొటో అది.. ఆఫొటో ఆ సమాధుల దగ్గరుంచి, చీకటి వైపు నిర్లిప్తంగానడుచుకుంటూ వెళ్ళిపోయాడు..
****
No comments:
Post a Comment