అది వాడ్ని కోరి చేసుకుంది.
వాడంటే పడి చస్తుంది. విడవకుండా వాడ్ని అంటిపెట్టుకుంటుంది.
వాళ్ళకున్నదల్లా ఓ చిన్న నావ.
అదే వాళ్ళకు నీడ నిచ్చే గూడు.
వాళ్ళకి తెలుసున్న దైవం తల్లి గోదారి. ఆ తల్లి వాళ్ళకి కూడు పెడుతుంది. కూటికి కావలసిన చేపలనిస్తుంది,
ఎప్పుడూ ఆ తల్లినే తలుచుకుంటారు.
రోజు గడిచేందుకు పట్టెడు చేపలు చిక్కితే చాలు. చేపలకొద్దీ డబ్బులు, డబ్బులకొద్దీ నూకలు, అందులోనే చీకిపోయిన వలకూ, చిల్లడుతున్న నావకీ చూసుకోవాలి.
ఆకాశమంత పందిరి వాడు.
భూదేవంత అరుగు అది.
వయసు, నావ, ఏకాంతం వాళ్ళకి ఖర్చు లేని విలాసాలు.
పేలు కుక్కించుకోడం దానిక్కావాలి. వీపు గోకించుకోడం వాడిక్కావాలి.
పగలు గోదావరి, రాత్రి చీకటి వాళ్ళను కప్పుకుంది. అంచేత వాడికో గోళీ, దానికో రెండు చారల చీరా మినహా మరో నూలుపోగుతో పనిలేదు.
రోజులా పొద్దుపోకముందే చేప యిగురు, చిమిడిన అన్నం తిని, వార్చిన గంజిలో ఉల్లిపాయ నంజుకొని జుర్రేశాడు వాడు.
గిన్నెలు కడిగి జల్లి గంప సర్దడంలో పడింది అది.
కట్టుతాడు విప్పి, నావను వడిలోకి తోసి, చంకలో చుక్కాని బిగించి ఆవాం తట్టుమీద చతికిల పడ్డాడు వాడు.
పొట్టికొంగును బిర్రుగా లాగి, రొమ్ములు వీలైనంత మేరకు కప్పుకొని, వాడిప్రక్కన చతికిలబడింది అది.
పాలరాయిమీద పాదరసంలా దూసుకుపోతోందా నావ.
వాడు చుక్కాని కాస్తేనే అంత.
తెడ్డు నొక పద్ధతిలో కోలకర్రకు తాడేసి బిగించి విలాసంగా కూర్చున్నాడు. నావ వడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతోంది.
ఇంకా చీకటి పడలేదు.
రివాజుగా దాన్నివాడు ఒళ్ళోకి తీసుకుని పేలు కుక్కడం మొదలెట్టాడు. దాని తలలో పేలున్నాయో లేవో వాడికి తెలియదు. అయినా దాని తృప్తి కోసం వుత్తుత్తినే అప్పుడప్పుడు గోరుమీద గోరుంచి కిటుక్కు కిటుక్కు మనిపిస్తుంటాడు.
అలా కాసిని కిటుకులు వినడంతో తల భారం దిగినట్టయి మనసు కుదుటపడుతుంది దానికి.
చలిగాలి వేస్తున్నా వాడి ఒళ్ళో దానికి శమనగా ఉండటంతో-
“మావా! శివరేతిరికి ముంగటేళ్ళా పట్టిసీను సంబరానికెళ్దాం” అని మొదలెట్టింది.
ఆలోచనలో పడ్డాడు వాడు.
అసలే గోదావరికి తీతకాలం. చేపలన్నీ వరదకాలంలో వడికి ఎదురీది ఎగువకు వెళ్ళిపోతాయి. ఈ శీతకట్టులో వేట సాగాలంటే గోదావరికి ఎగువకైనా వెళ్ళాలి. లేక సముద్రంలోకైనా వెళ్ళాలి. ఈ చిన్ననావ ఆ రెంటికీ పనికి రాదు. కనుక ఆటుపోటులుండే ఏటి మొగల్లోనే చేపలు పట్టాలి. శీతకట్టులో వేటంటే కూటిగింజలు మినహా పెద్ద సంపాదనుండదు. ఈ పరిస్థితిలో దాని కోరిక తీర్చడం కష్టం అని వాడికి తెలుసు.
వాడినెలా ఒప్పించాలో దానికి తెలుసు. చటుక్కున లేచి వాడ్ని తన ఒళ్ళోకి తీసుకుని వాడి వీపు గోకడం మొదలెట్టింది. మత్తులో పడిపోయాడు వాడు.
“శివరాతిరికి నాలుగురోజులు కూడా లేదు. మన సేతిలో పైసా లేదు. పట్టిసీమంటే మాటల టేస్.”
“కష్టపడి యేటాడదాం. బుట్టెడు సేపలుండే సాలు, సొమ్ము సేసుకుపోవచ్చు. నువ్వు ఊ అను మావ” అంటూ ముక్కుతో వాడి చెంప రాసింది లాలనగా.
“అబ్బా! ఉండవే. నీ పూసల పుడక నా సెంప గీరేస్తోంది. ఆ! అవునొసే! నీ ముక్కు నున్న పూసలతీగ అమ్మేద్దాం. చిన్నమెత్తు బంగారం కదా! బోల్డు రూపాయలొస్తాయి” అంటూ దానికేసి చూశాడు.
అది ఆలోచనలో పడింది.
దానిచేత సై అనిపించడం ఎలాగో వాడికి తెలుసు.
చటుక్కున లేచి దాన్ని తన ఒళ్ళోకి తీసుకుని కిటుక్కు కిటుక్కుమంటూ పేలు కుక్కడం మళ్ళీ మొదలుపెట్టాడు.
అది యింకా ఆలోచిస్తూనే ఉంది.
“అవునొసే! నిన్ను ముద్దెట్టుకున్నప్పుడల్లా అది నా మూతిని గీరేస్తోంది. ఈ తీగపుడక నొగ్గెయ్యి. వరదలొచ్చాక పులసచేప పడితే కడ్డీపుడక తగిలించుకోవచ్చు.”
అది చటుక్కున లేచి వాడ్ని తన ఒళ్ళోకి తీసుకుని వెపు నిమరసాగింది.
“అయితే మావ, కడ్డీ పుడకకి రాళ్ళుండాల మరి?”
“సింగారెట్టుకుంటుంది. అలాంటిది కొందాంలే” అన్నాడు వాడు. నాజూకైన సింగారి సోకులు నెమరేసుకుంటూ,
“స్సీ ఆ గుడిసేటిదాని ఊసెత్తమాక నాకాడ” అంటూ వాడ్ని ఓ తోపు తోసింది.
ధబుక్కుని వెల్లకితలా తొట్టిలో పడ్డాడు వాడు,
నావ తుళ్ళిపడింది.
కోపం ఇంకా చల్లారక చుక్కాని అందుకుని ఊపుగా తెగ్గేయడం మొదలెట్టింది.
నావ అదిరిపోయింది.
అది యెప్పుడు తెడ్డేసినా అంతే. పంగులన్నీ పదులయినట్లు నావ ఊగిసలాడిపోతుంది.
“సింగారంటే ఎందుకే నీకంత కోపం” మళ్ళీ ఆపరం తట్టుమీదకెక్కుతూ అడిగాడు వాడు.
“అయ్యేల మన వల్లో పడ్డ పులసచేపని దాని సేతిలో పెడితే తప్పా తియ్యా! ముఫ్ఫయి రూపాయల చేపని మాయచేసి రెండొందల కమ్మింది. గదేస్! దాని తెలివి మనకేడొస్తాది.”
“సేపని సూసి కొన్నారా! ఆ యెర్రినాయాళ్ళు, దాన్ని సూసి కొన్నారు, ‘నేనొట్టి గుడీసేటిదాన్ని’ అని దాని ముకం మీద రాసుంది. అందుకే దాని సుట్టూ సేరతారు నాయాళ్ళు.”
వాడికా మాటలు వినబడ్డం లేదు. వాడి మనసులో ఇంకా సోకుబొమ్మ సింగారే మెదులుతోంది.
“ఏం మావా! బండరాయయిపోయినావు” అంటూ వాడి ఛాతీ మీద వాలి వాడి జుట్టు నిమిరింది.
“స్స్! నీ దగ్గర తుప్పట్టిన ఇనపకడ్డీ వాసనొస్తుంది. సింగారి దగ్గర ఎప్పుడూ సెంటునూనె వాసనే” అనుకున్నాడు వాడు.
“మావా! నువ్వన్నట్టే కానీ. ఈ ముక్కుపుడక నమ్మేద్దాం” వాడి చెంపను చరిచింది వగలు పోతూ.
తెలివొచ్చినట్టయింది వాడికి. “సరే! ఇయ్యి! సావుకారుకాడకెళ్ళి అమ్మేసొత్తాను రేపు.”
“మావా! నాకెప్పటినుంచో ఓ బొట్టుపెట్టి మీద ఉంది. సంబరంలో మంచిపెట్టెలు సవకగా వస్తాయటగా. కొనివ్వవా!”
“సరేలే కొందారి!” అన్నాడు వాడు- సన్నాసి కోరిక కోరుకుందన్న చిరాకుతో.
“మిగిలిన డబ్బులెట్టి నాకో సీర. రైక, నీకో సెడ్డీ, బనీను కొనుక్కోవచ్చు.”
“సరే సూద్దాం” అంటూ చుక్కాని లాక్కుని కోలకర్రకు వాటంగా బిగించాడు.
“సిలకాకు పచ్చ సీర, సింధూరం రయిక కొనాలి నాకు” అంది విరబోసిన జుట్టు పిడికిలిలోకి బిగించి కొప్పు చుట్టుకుంటూ.
“కొప్పెట్టుకుంటే సింగారికన్న ఇదే బావుంటుంది” అనిపించింది వాడికి.
వలల్ని తొట్టిలో పరిచి, తను వాటిమీద కూర్చుని దాని చెయ్యట్టుకుని తనమీదకు లాక్కున్నాడు వాడు.
“సుట్టూ పడవలున్నాయి. ఇంకా చీకటి పడలేదన్న గేనం కూడ లేదు నీకు” అంటూ మీదికి వస్తున్న వాడి ఛాతీని అరచేత్తో ఆపి వాడిప్రక్కన తనూ చతికిలబడింది.
“మావా! పోయిన శివరేతిరికి సంబరంలో గడిగకి కోసెడు దూరం నడిపించి రెల్లుమబ్బులు కాడికి తీసుకుపోనావు. ఈసారట్టాసేస్తే సూడూ మరి! నే పడవలోనే కూకుండిపోతా!”
వాడేదో ఆలోచిస్తున్నాడు.
“ఏటాలోసిస్తున్నావు” … … తన మీదకు లాక్కుంది వాడ్ని, చీకటప్పుడప్పుడే కప్పుతోంది.
2
గోదావరి నడుమ రాతికోటలాంటి ఓ దిబ్బా, దాని మీద ఎన్నో ఆలయశిఖరాలు, చుట్టూ ఎడారిలాంటి ఇసుకతిప్ప, ఆ తిప్పంతా కప్పేస్తూ తీర్థం,
చెప్పుకోదగ్గ తీర్థం అది.
పట్టిసీమ తీర్థం.
వరుసగా అంగళ్ళు, నేలపై పరిచిన పాత్ర సామానులు, మంచం మిఠాయి దుకాణాలు అడుగడుగునా టీకొట్లు, మరెన్నో వింతలూ, విడ్డూరాలు యాత్రికులకు ఆకర్షణ.
చెక్కభజన పార్టీలు, కోలాటం జట్లు, డప్పుల వరుసలు, ఆంబోతుల ఊరేగింపులు వగైరాలతో తిప్పంతా గగ్గోలుగాఉంది.
జనాన్ని చేరవేసే పడవలు, లాంచీలతోనూ సంబరం చూడ్డానికి వచ్చిన నావలతోనూ రేవు అంతా కోలాహలంగా ఉంది.
దైవదర్శనానికి కాకపోయినా చాలామంది సంబరం చూసేందుకు వస్తారు.
“మావా! ఈ చింకిచీరతో నేను రాను. నావలో కూకుని అంబలి దింపుతా. నువ్వు బేగెల్లి ఓ చీర కొనుక్కురా. సిలకాకు పచ్చది” అంది. అలా చుట్టూ కలయచూసి కొంగుతో ఒళ్ళంతా కప్పుకుంటూ.
నావను తిప్పమీద కెక్కించి డబ్బుచ్చుకొని రివ్వుమంటూ గుంపులో కలిసిపోయాడు వాడు.
కాచిన అంబలి దింపి సరంజామా సర్ది పడిచెక్కమీద కూర్చుంది అని. అప్పటికే చాల పొద్దెక్కడంతో ఎండ చురకలేస్తోంది.
“యీడొచ్చేలోగా సంబరం అంతా అయిపోయేలా ఉంది.” అనుకొని క్షణం ఒక యుగంగా వాడికోసం ఎదురుచూస్తోంది అది.
గంట గడిచినా వాడి జాడలేదు. “యాడ తిరుగుతున్నాడో ఈ సచ్చినోడు” అని విసుక్కుంది.
“ఓసోసి! ఆడ కూకున్నావేటే! సంబరం సూడకుండా” దూరాన్నుండి ఒక పొలికేక వినబడింది. అది సొట్ట మావది.
సొట్టమావది కూడా వేటపాలెమే. చిన్నప్పుడు దీన్ని వాడికిచ్చి కట్టబెట్టాలని చూశారు. వయసొచ్చాక ఈ సొట్టాడు నాకొద్దని వీడ్ని కట్టుకుంది.
“ఓరి మావా! ఆ సచ్చినోడు నన్నొగ్గేసి పోయినాడు. సీరలకొట్టు కాడుంటాడు. నువ్వెళ్ళి సూసిరా. ఏ రంగేనా సరేనని సెప్పి కొనేసి బేగీ రమ్మను, పొద్దుకూకిపోనాది” అని కేకెట్టింది సొట్టమావకేసి.
“సరే! నువ్వాడే కూకో” అని గుంపులో మాయమయ్యాడు సొట్టమావ.
“పొద్దునెత్తికెక్కింది. వాడి జాడలేదు. ఆరాటం పెరిగింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. చీర తడిసి ఒంటికి అంటుకుపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళు తనకేసి అదోలా చూస్తున్నారు. బిక్కచచ్చి గోళ్ళు కొరుక్కుంటూ కూర్చుంది.
అంబలి తాగుదామని గిన్నెలో పోసుకుంది. హితవు కాలేదు. గిన్నెని గోదాట్లో ఒంపేసింది.
నావ తట్టుమీద నిలబడి పాదాలెత్తి తీర్థం అంతా కలియజూసింది.
దూరంగా ఉన్న రంగులరాట్నంలో గుర్రానెక్కిన ఓ దున్నపోతు, హంసనెక్కిన పడుచుదాన్ని కొంగట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ దున్నపోతు వెనకే గిరగిర తిరుగుతున్న ఉయ్యాలలో బడితెలాంటి గోచీరాయుడొకడు నల్ల కళ్ళజోడు తగిలించుకొని ప్రక్కనున్న పచ్చచీరతో సరసాలాడుతునాడు. వాడే తన మొగుడేమో అనిపించినా ‘ఛా! కాదులేనని’ ఊరుకొంది.
పొద్దు పడమటికి వాలింది. దానికి సహనం చచ్చిపోయింది. వాడ్ని వదిలేసి నావట్టుకు చక్కా పోదామనుకుంది. తిప్పను తప్పిస్తుంటే సొట్టమావ వగురుస్తూ వచ్చాడు.
“ఓలోసి! నీ మొగుడు సింగారి కొంగట్టుకు ఏలాడుతున్నాడు.”
కొయ్యబారిపోయి గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది అది.
“అవును అమ్మతోడు! నువ్వు సెప్పావని సీరల కొట్టుకాడికెళ్ళినా, ఆడక్కడ నేడు. ఓలంత దూరంలో మిసను గానుగకాడ సెరుకురసం తాగుతున్నారు సింగారీ, ఆడూనూ, ఆళ్ళక్కడ్నించి గాజులకొట్టుకెళ్ళారు. అది గాజులు ఏసుకుంటుంటే ఈడు కొట్లో నల్ల కళ్ళద్దాలు ఎట్టేసుకొని సూసుకొన్నాడు. అది బాలేదని లాగేసి ఇంకో కళ్ళజోడు తగిలించిందాడికి ఆడే రెంటికీ డబ్బులిచ్చాడు. ఎంతిచ్చాడో నాకెరికనేదు.”
“దాని గుడిసేటి కాపురం బుగ్గయిపోను” అంటూ గొల్లుమని కూలబడింది అది. కాసేపటికి తేరుకొని, “అది నీ సీర కట్టుకొంది” అని అడిగింది వెక్కుతూ.
“పచ్చరంగు”
“ఓరినాయనో, ఓలమ్మోయ్! అందరి మొగుళ్ళు ఈ లంజకే కావాలి. ఇంకెవర్నీ తిన్నగా కాపురం సేయనీయలాగుంది. బాబోయ్ దాని గైపు మాడ… దాని కళ్ళు కాకులు పొడవా… దాని ఒళ్ళు దున్నపోతు కుమ్మా” అంటూ శాపనార్థాలు పెడుతూ మెలితిరిగిపోయింది. చేతివేళ్ళతో ఇసుక దున్నేస్తూ.
సొట్టమావ ఇంకా చెప్పుకుపోతున్నాడు. “ఆడనుంచి చెరుగ్గడ తింటూ లబ్బరుసెప్పులేసుకుని అల్లంత దూరంలో రెల్లుదుబ్బులు కాడికి పోతుంటే సూసా, తిరిగొత్తారు కదా అని సూసి సూసి నీకు చెప్పాలి కదా అని లగెత్తుకొచ్చేశా.”
దానికి సివాలెత్తేసింది.
“ఓరి మావా! ఈ ఏల నుండి ఆడికి నాకు సెల్లిపోనాది. ఆడి తాలి ఆడిమొగాన కొట్టేసి రేపు ఈ ఏలకి నీ చేత కట్టించుకొంటా. ఛా! నావెక్కు” అంటూ వాడి చెయ్యట్టుకుని బరబరా లాక్కెళ్ళి తొట్టిలో కుదేసి కట్టుతాడు వదిలేసింది. నావ రేవులోని పడవలను రాసుకుంటూ ప్రవాహంలోకి పడింది.
(మిగతా భాగం వచ్చే వారం )
No comments:
Post a Comment