భాగవతుల సదాశివ శంకరశాస్త్రి.... ఈ పేరు చాలా మందికి తెలియక పోవచ్చు. అంత్యప్రాసలు అని అక్షరాల్లో చెబితే... పోనీ కూనలమ్మఅని నాలుగు అక్షరాల్లో చెబితే.... ఇవన్నీ కాదు... ఆరుద్ర అని మూడు అక్షరాలు చాలు. తెలుగు వారందరికీ ఓ సాహితీ మూర్తి మనసులో మెదులుతారు. ఎప్పణ్నుంచో పరిచయం ఉన్నట్టు ఆయన గురించి చెప్పడం ప్రారంభిస్తారు. తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితోపాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం అయితే... ఆ ప్రక్రియలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకరు. తనవైన అంత్యప్రాసల ముద్రతో సంతకం అవసరం లేని రచయితగా ప్రతి ఒక్కరూ తలుచుకునే వ్యక్తి. సాహితీ సృజన మాత్రమే కాదు.... చీకటి కోణాల్లో చిక్కుకున్న సాహితీ చరిత్రను ముందు తరాలకు అందించిన నిత్య పరిశోధనా వ్యసనుడు ఆరుద్ర. వేల అకాడమీలు కూడా చెయ్యలేని పని ఒంటరిగా చేసి చూపించిన అక్షరశరీరుడు ఆరుద్ర.. శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ప్రభావం చూపిన అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు.
తెలుగు సాహిత్య రంగంలో... సినిమా రంగంలో తనదైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఆరుద్ర... 1925 ఆగష్టు 31న విశాఖపట్టణంలో భాగవతుల ఇంట జన్మించారు. ఆయన అసలు పేరు భాగవతుల సదాశివ శంకరశాస్త్రి. పసి వయసు నుంచే గేయాలు, పద్యాలు రాస్తూ... కావ్యాలు, గ్రంధాలు కంఠస్తం చేసి... నిఘుంటువుల పైనా పట్టు సంపాదించారు. విశాఖపట్నం ఎ.వి.ఎన్. కాలేజీలో హైస్కూల్, తర్వాత విజయనగరం యం.ఆర్.కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. విజయనగరంలో డిగ్రి చదువును మధ్యలోనే వదిలేసి క్విట్ ఇండియా ఉద్యమంలో యుద్ధంలో చేరారు. ఆ సమయంలోనే ఎన్నో కవితలు రాశారు. యుద్ధంలో ఉంటూ సొంత పేరుతో కవిత్వం రాయడం కుదరదు గనుక... అరుద్ర అనే జన్మనక్షత్రాన్ని కలం పేరుగా స్వీకరించారు. ఆ కలాన్నే బలంగా కసితో కృషి చేసి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. అభ్యుదయ రచయితల సంఘం ( అరసం ) వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆరుద్ర... ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. శ్రీశ్రీకి దగ్గరి బంధువైన ఆరుద్రపై.... ఆ మహాకవి ప్రభావం ఉందన్నది సాహితీ విమర్శకుల అభిప్రాయం. 1949లో బీదల పాట్లు అనే చిత్రం ద్వారా ఆరుద్ర సినీ రంగంలోకి ప్రవేశించారు. గమ్మతుల్ని, గారడీల్ని, తళుకు బెళుకుల్ని కట్టబెట్టి... తెలుగు సినీ గీతాన్ని అచ్చమైన తెలుగు పడుచులా నిలబెట్టిన ఘనత సైతం ఆయనకే దక్కింది. తెలుగు సాహిత్యంలో ఆరుద్ర స్పృశించిన అంశమేమీ లేదంటే అతిశయోక్తి కాదు. సినిమా పాటలతో పాటు... కథలు, రేడియో నాటికలు, వందకు పైగా డిటెక్టివ్ నవలలు, ఇంద్రజాలం, చదరంగంపై పుస్తకాలు వెలువరించారు. పిల్లల కోసం కూనలమ్మ పదాలు రాసిన ఆరుద్ర... కె.వి.రెడ్డి కోరిక మేరకు సమంగ్రాంధ్ర సాహిత్య రచనకు శ్రీకారం చుట్టారు. ఆరుద్ర చేసిన అవిశ్రాంత సాహితీ సేవకు... కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించాయి. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందివ్వగా... ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది. 1955లో రామలక్ష్మిని తన జీవితంలోకి ఆహ్వానించిన ఆరుద్... కీరాలక్మి అనే మకుటంతో శతకం కూడా రాశారు. ఆమె కూడా గొప్పరచయిత్రి. సమగ్రాంధ్ర రచన పూర్తయ్యాక... ఇక తన పని పూర్తైంది అనుకున్నారో ఏమో... 1998 జూన్ 4న అశేష అభిమానులకు టాటా వీడుకోలు అంటూ... తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళారు. ఆరుద్ర సాహితీ సౌరభాల గురించి చెప్పాలంటే... ముందుగా శ్రీశ్రీ దగ్గర్నుంచే మొదలు పెట్టాలి. ఎప్పుడో... ఎవరో... శ్రీశ్రీకి ఓ ఉత్తరం రాస్తూ... తమ శిష్యరత్నం అని ఆరుద్రను సంబోధించారట. దానికి శ్రీశ్రీ... శిష్యుడంటే ఆయన ఒప్పుకోడు... రత్నం అంటే నేను ఒప్పుకోను అని చమత్కరించారట. నిజమే... చిన్నతనం నుంచి... తెలుగు సాహిత్యం పై మక్కువ పెంచుకున్న ఆరుద్ర తనకంటూ ప్రత్యేక శైలిని సృష్టించుకున్నారు.1946 లో చెన్నై వచ్చిన ఆరుద్ర కొంతకాలం పాటు చాలా కష్టాలు అనుభవించాడు. తినడానికి తిండిలేక పానగల్ పార్కులొ నీళ్ళు త్రాగి కడుపు నింపుకోవల్సి వచ్చిన సందర్భాలున్నాయని ఆరుద్ర చెప్పుకున్నాడు. అయితే ఈ ఇక్కట్లు ఏవీ సాహితీ సేవకు అడ్డురాలేదని ఆయన చెప్పడం విశేషం.1947-48 లోమద్రాసు నుండి వెలువడే వారపత్రిక ఆనందవాణికి సంపాదకుడిగా ఉన్నారు. ఇందులో శ్రీశ్రీ, ఆరుద్ర రాసన కవితలు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి.నెలకొకటి చొప్పున వ్రాస్తానని ప్రతిజ్ఞ చేసి డిటెక్టివ్ నవలల నుంచి మళ్ళీ అదే ప్రతిజ్ఞతో సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలవరకు ఆరుద్ర స్పృశించని సాహితీ అంశం లేదు. త్వమేవాహంతో మొదలుపెట్టి వందలాదిగా గేయాలు , గేయ నాటికలు , కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు ఇవన్నీ కాక తన అసలు వృత్తి సినీ గీత రచన..... ఇంత వైవిధ్యంగల సాహిత్యోత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనబడడు.
తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితోపాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం . అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకరు. వివిధ రంగాల్లోనే కాక వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆరుద్ర. త్వమేవాహం, సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు వంటి అనేక కావ్యాలతో పాటు.... వెన్నెల వేసవి, దక్షిణ వేదం, జైలుగీతాలు వంటి అనువాద కావ్యాలు రచించారు. సమగ్ర ఆంధ్రసాహిత్యం ఆరుద్ర పరిశోధనా దృష్టికి నిలువెత్తు దర్పణం. దీని కోసం మేధస్సునే కాదు... ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు. వేమన వేదం, మన వేమన, వ్యాసపీఠం, గురజాడ గురుపీఠం, ప్రజాకళలో ప్రగతి వాదులు లాంటి గ్రంథాలు ఆరుద్ర విమర్శనా దృష్టికి సంకేతం. గురజాడ గురుపీఠం వ్యాసాలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. రాముడికి సీత ఏమౌతుంది, గుడిలో సెక్స్ వంటి రచనలు ఆరుద్ర పరిశీలనా దృష్టికి అద్దం పడతాయి. సంగీతం, నాట్యం పైనా ఆయన అనేక వ్యాసాలు రాశారు. ఇవి ఆరుద్ర అభినివేశాన్ని పట్టి చూపిస్తాయి. చదరంగంపైనా కొన్ని దశాబ్దాలకు పూర్వమే ఓ గ్రంథాన్ని వెలువరించడం... ఆరుద్రలోని క్రాంత దర్శికి నిదర్శనం. పలు రచనా ప్రక్రియలు చేపట్టి, కవిత్వం- పరిశోధనా రెంటినీ వినియోగిస్తూ కవి పరిశోధకుడిగా నవ్యత కోసం పరితపించిన నిత్య శోధకుడు, హేతువాది ఆరుద్ర.
ముఖ్యంగా త్వమేవాహం తెలుగు అభ్యుదయ కవిత్వంలో ప్రత్యేక స్థానం ఆక్రమించింది. తెలంగాణ పోరాటం గురించి రాసిన ఈ అత్యాధునిక కావ్యం వైచిత్రికి పరాకాష్ట అని చెప్పుకోవాలి. ప్రతీకల ద్వారా అర్థానికి దొరక్కుండా... చమత్కారాన్ని సాధించారు. కాలాన్ని ప్రధాన వస్తువుగా ఎంచుకుని, గడియారాన్ని ప్రతీకగా తీసుకున్నారు. ఇసుక, నీటి గడియారాలు గతం. చిన్న ముల్లు పెట్టుబడి దారీ మనస్తత్వం. పెద్దముల్లు మధ్య తరగతి మనస్తత్వం. సెకండ్లు శ్రామిక జనానికి, కీ.. విప్లవ ప్రేరక హేతువుకీ... అలారం వర్తమాన పరిస్థితులకు నిదర్శనం. ఇలా సమాజంలోని వ్యతిరేక భావాలున్న ప్రతి రెండు వస్తువుల మధ్య అబేధాన్ని చూపిస్తూ... నవీన అద్వైతాన్ని ప్రకటించిన ఆరుద్ర రచనే త్వమేవాహం అని చెప్పుకోవచ్చు.
ఇక ఆరుద్ర కూనలమ్మ పదాల గురించి మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిన్న పిల్లల దగ్గర్నుంచి ప్రతి వయసూ వారినీ తన సొంత చేసుకునే సాహిత్యమిది. ఇరుకు కార్యపు గదులు... ఇరకు గోడల బడులు మేలు వెన్నెల పొదలు ఓ కూనలమ్మ లాంటి జీవిత సత్యాల్ని తెలిపే అంశాలతో పాటు... కొంటెబొమ్మల బాపు... కొన్ని తరముల సేపు... గుండె ఊయలలూపు... ఓ కూనలమ్మ వంటి కళాకారుల విలువల్ని తెలిపే పదాలు కూడా... ఆరుద్ర కూనలమ్మకు సొంతం. ఇందులో ఉండే అంత్యప్రాసలే ప్రతి ఒక్కరి మదిలోకి వీటిని తీసుకెళ్ళాయి. కూనలమ్మ పదాలు... కోరుకున్న వరాలు... ఆరుద్ర సరదాలు అంటూ... మహాకవి శ్రీశ్రీ... కూనలమ్మ పదాల గురించి చెప్పడం విశేషం. ఆరుద్ర సాహిత్యం మొత్తం ఓ ఎత్తైతే... ఆయన తన జీవితాన్ని ధారపోసి... పరిశోధించి... అందించిన సమగ్ర ఆంధ్ర సాహిత్యం మరో ఎత్తు. 11 యుగాలను 12 సంపుటాలుగా... సుమారు 400 మంది కవులను 3 వేలకు పైగా పుటల్లో ఆవిష్కరించి.. వెయ్యేండ్ర సాహిత్య చరిత్రను ఒక్క చేతి మీదుగా రచించిన అద్భుతమైన కృషి ఆరుద్రది. 10 శతాబ్దాల చరిత్రను మనకు అందించి... తెలుగు వాళ్ళందర్నీ రుణగ్రస్తుల్ని చేశారు అని ఎందరో రచయితలు ప్రశంసించారు. తనకు పూర్వం సాహిత్య పరిశోధకులు చేసిన కృషినంతా ఉపయోగించుకోవడమే కాకుండా... దాన్నో క్రమపద్ధతిలో పెట్టి... విషయ వివేచన చేసి... సముచిత నిర్ణయాలు చేసి... సాటిలేని సాహిత్య చరిత్ర కారునిగా... నిలిచిపోయారు. ఎన్నో పుస్తకాల సారాంశాన్ని కొద్ది పేజీలలో చెప్పేయగలిగిన ఆరుద్ర నేర్పును కొనియాడకుండా ఉండలేము. ఎన్నో విశ్వవిద్యాలయాలు, అకాడమీలు చేయలేని మహత్కార్యాన్ని ఒంటి చేతి మీదుగా పూర్తి చేసి... ఏక వ్యక్తి సేన అనే పదానికి నిదర్శనంగా నిలిచారు.
సమగ్రాంధ్ర సాహిత్య రచన చేసే సమయంలో ఆరుద్ర ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 1965లోనే సాహిత్య చరిత్ర సంపుటాల రచనకు పూనుకున్నా... వాటి ప్రణాళికా రచనలో ఎన్నో సార్లు మార్పులు, చేర్పులు జరిగాయి. పరిశోధనల్లో టెన్షన్ వల్ల చక్కెర వ్యాధి ఎక్కువై.. కిడ్నీలు పని చేయడం మొరాయించాయి. ఓ దశలో ఈ సాహితీ యాత్ర పూర్తవుతుందో లేదోనని ఆరుద్ర చాలా ఆందోళన చెందారు. కళ్ళ సమస్యలు మొదలయ్యాయి. పుస్తకాలు చదువుదామంటే కనపడదు. ఆపరేషన్ తో దాన్ని జయించగలిగారు. మొత్తానికి ఎన్నో కష్టాలకు ఓర్చి... ఎంతో ఓర్పుతో... సమగ్ర సాహిత్య చరిత్రను మనకు అందించారు.
సినిమా రంగంలోనూ ఆరుద్ర ముద్ర స్పష్టమైనది. అందుకోగలిగినది. ఆస్వాదించ గలిగినది. నీవెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అంటూ ఆరుద్ర చెప్పిన మాట... ఇప్పటికీ ప్రతినోటా వినిపిస్తూనే ఉంటుంది. మానవుడే మహనీయుడు అనే పాటలో... ప్రేరణ దైవానిదైన సాధించాల్సింది నరుడే అనే కర్తవ్యబోధను ఎలా మరచిపోగలం. ముత్యాలముగ్గు సినిమాలో ఆయన రాసిన ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ అనే పాట... ఇప్పటికీ తెలుగు ఇళ్ళలో వినిపిస్తూనే ఉంటుంది. ఉయ్యాల జంపాల సినిమాలోని కొండ గాలి తిరిగింది... గుండె ఊసులాడింది... పాటతో పాటు... గుడిగంటలు సినిమాలోని దూరాన నీలి మేఘాలు గీతం... ఆరుద్రలోని మరో పార్శ్వాన్ని మన ముందు నిలబెడతాయి. తెలుగు సినిమా పాటల్లోనూ చిత్ర కవిత్వాన్ని ప్రవేశ పెట్టి ఆరుద్ర ఎన్నో ప్రయోగాలు చేశారు. బుద్ధిమంతుడు సినిమాలోని భూమ్మీద సుఖ పడితే తప్పులేదురా... అనే పాటలో... ఓష్ఠ్యాలతో ఓ గమ్మత్తుని సృష్టించారు. ఈ పాటలోని పదాలు పలుకుతుంటే... పెదాలు చుంబించినట్టు ముందుకు వస్తుంటాయి. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రంలో రాజమండ్రి మీద రాసిన వేదంలా ఘోషించే గోదావరి గీతం... బాలరాజు కథలో మహాబలిపురం పైన రాసిన పాట... వివిధ ప్రాంతాలపై ఆరుద్ర అవగాహనకు... వాటిని ముందు తరాలకు అందించే నిబద్ధతకు నిదర్శనంగా నిలిచాయి. పెళ్ళి పాటల విషయంలోనూ ఆరుద్ర శైలి ప్రత్యేకమైందే. రక్తసంబంధం సినిమాలోని బంగారుబొమ్మ రావేమే గీతం... పెళ్ళి పుస్తకం సినిమాలోని శ్రీరస్తు శుభమస్తు పాటలు... ఆరుద్రలోని సంప్రదాయ అవగాహనను ఆవిష్కరిస్తాయి. స్వతహాగా నాస్తికుడైన ఆరుద్ర... అచంచల భక్తిభావాన్ని ప్రదర్శించే గీతాలు రాశారంటే... ఆయనలోని కవికి నీరాజనాలు అర్పించాల్సిందే. మీనాలోని శ్రీరామ నామాలు శతకోటి... మంచి కుటుంబం సినిమాలోని మనసే అందాల బృందావనం... శ్రీరామాంజనేయ యుద్ధంలోని శ్రీకరమౌ శ్రీరామనామం... గోరంత దీపంలోని రాయినైనా కాకపోతిని... ఇలా ఎన్నో పాటలు... ఆరుద్రను ప్రత్యేకంగా నిలబెడతాయి.
తన జీవితంలో దాదాపు 500 సినిమాలకు కథ, మాటలు, పాటలు అందించారు ఆరుద్ర. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు చేపట్టి... ప్రతి ప్రక్రియలోనూ నైపుణ్యం సంపాదించి తనదైన ముద్ర వేశారు ఆరుద్ర. తెలుగు సాహిత్యాన్ని సామాన్య పాఠకులు సైతం అర్థం చేసుకునే విధంగా రచించడం ఓ ఎత్తైతే... చెప్పిన విధానం మరింత స్పష్టంగా... గొప్పగా ఉండడం మరో విశేషం. సమగ్రాంధ్ర సాహిత్య రచన పూర్తయ్యాక... ఇక తన అవసరం లేదనుకున్నారో ఏమో.... మనందర్నీ వదలి పెట్టి వెళ్ళిపోయారు. భౌతికంగా ఆరుద్ర ఇప్పుడు మన ముందు లేకపోయినా.. తెలుగు సాహితీ ప్రపంచంలో ఆయన పరిశోధనా ముద్ర ఉంది... సినిమా ప్రపంచంలో ఆయన పద ముద్ర ఉంది... శ్రీరామ మందిరాల్లో ఆయన భక్తి ముద్ర ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే... అంత్య ప్రాసల రూపంలో ఆరుద్ర వేసిన వ్రాలు ముద్ర ఎప్పటికీ నిలిచే ఉంటుంది.
No comments:
Post a Comment