కవి పరిచయం
భర్గశతకము రచించినది కవిసార్వభౌమ బిరుదాంకితుండైన కూచిమంచి తిమ్మకవి. శ్రీనాథకవి తరువాత అనేక గ్రంధరచనలు చేసి కవిసార్వభౌమ బిరుదు పొంది తెలుగుసాహిత్యంలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న కూచిమంచి తిమ్మకవి పిఠాపురపరిసరాలలో ఉన్నకందరాడ గ్రామకరణము. ఈమహాకవి జీవితకాలము క్రీ.శ. 1690 నుండి 1760 సాహిత్య చరిత్రకారుల నిర్ణయం. తిమ్మకవి తన కులగోత్రాదికములను తనకృతులలో వివరంగా వ్రాసినదానినిబట్టి ఈయన ఆఱువేలనియోగి బ్రాహ్మణుడు. కౌండిన్యసగోత్రుడు. ఆపస్థంబసూత్రుడు. లచ్చమ గంగనల జ్యేష్ఠపుత్రుడు. లింగధారి. మహాశివభక్తుడు. వీరివంశములోని వారందరూ కవులే అని తెలుస్తున్నది. ఈతని ముత్త్తాత బయ్యన, తాత, తిమ్మన, జగ్గన, సింగన్న, నరసన్నలు ఇతని పినతండ్రులు. వీరమ్మ, పాపమ్మలు మేనత్తలు. సింగన్న, జగ్గన్న (జగ్గకవి) సూరన్నలు తమ్ములు. ఈతని భార్య గొట్టుముక్కల రామయ్యమంత్రి కుమార్తె ఐన బుచ్చమాంబ. ఈతనికి కుమారులు లేరని, తమ్ముడైన జగ్గకవి కుమారులైన తిమ్మనయు, సింగనయు ఈతని రచనలకు లేఖకులుగా ఉండేవారని తెలుస్తున్నది. ఈతనిగురువు దెందులూరి లింగనారాధ్యులు.
ఈకవి తన రచనలను అన్నిటిని వరుసగా పేర్కొనటమే కాక ఎప్పుడూ రచించినది కూడా వ్రాసిపెట్టటంతో కాలనిర్ణయంలో సందేహాలు లేకుండాపోయాయి. తన చివరికావ్యమైన శివలీలావిలాసంలో:
"ప్రొఢిమై రుక్మిణీ పరిణయంబును, సింహశైలమాహాత్మ్యంబు, నీలపెండ్లి
కథయును, రాజశేఖర విలాసంబును, నచ్చ తెనుంగు రామాయణంబు,
సారంగధర నరేశ్వర చరిత్రంబు, సప్తార్ణవసంగ మాహాత్మ్యకంబు,
రసికజనమనోభిరామంబు, లక్షణసారసంగ్రహమును, సర్పపుర స
మంచితక్షేత్రకథనంబు, మరియుఁ బెక్కు శతక దండకసత్కృతుల ప్రతిభగూర్చి"
అని చెప్పుకొన్నాడు. శతకదండకసత్కృతుల అన్నాడుకాని వాని పేరులు చెప్పలేదు. ఈమహాకవి రచించిన "కుక్కుటేశ్వర శతకము" అనే మరొక్క శతకము మాత్రం దొరుకుతున్నది. ఐతే ఈ శతకము అసంపూర్ణం. కేవలం 92 పద్యములుమాత్రం దొరుకుతున్నవి. అనేకరాజాశ్రయాలనుపొంది వారిచే సత్కార సన్మానములను పొందినా ఈ కవి తన రచనలన్నీ పిఠాపురమునందు వెలసిన శ్రీకుక్కుటేశ్వరస్వామికే అంకితం చేసాడు.
భర్గశాతకము
"భర్గా! పార్వతీవల్లభా!" అన్నమకుటంగల ఈశతకము తిమ్మకవి ప్రొఢవయస్సులో (క్రీ.శ.1729) వ్రాసినట్లుగా ఈ క్రింది పద్యంలో చెప్పుకొన్నాడు.
"మ. ధరలో నెన్నఁగ శాలివాహన శకాబ్దంబుల్దగ న్యామినీ
కరబాణాంకశశాంకసంఖ్యఁజెలువై కన్పట్టు (సౌమ్యా) హ్వ
య స్ఫురదబ్దంబున నిమ్మహాశతక మేఁ బూర్ణంబుగావించి శ్రీ
కరలీల న్బుధు లెన్న నీకిడితి భర్గా! పార్వతీవల్లభా!"
సంస్కృతాంధ్రపండితుడైన ఈ మహాకవి పద్యాలు శబ్దాలంకారములతో సుశోభితమై ఒక మహాప్రవాహంలో సాగిపోతుంది. యమకాంత్యప్రాసాదిశబ్ధాలంకారములు ఈతని కవిత్వంలో సునాయాసంగా దొర్లుకుపోతుంటాయి. క్రిందిపద్యాలను గమనించండి.
కోటిరాంగద మేఖలాఘనతులా కోటికవాటీ నట
ద్ఘోటీ హాటక పేటికా భటవధూకోటీ నటాందోళికా
వీటీ నాటక చేటికాంబరతతుల్ వే చేకూఱు న్నిన్నిరా
ఘాటపొరుఢి భజించు ధన్యులకు భర్గా! పార్వతీవల్లభా!
సతతానందితసర్గ! సర్వసుమనస్సంతుత్యసన్మార్గ! యూ
ర్జిత కారుణ్యనిసర్గ! రాజతధరిత్రీ భృన్మహాదుర్గ! హృ
త్కతుకాలింగిత దుర్గ! సంహృత సమిద్ఘోరద్విషడ్వర్గ! సం
యుత నీరంధ్ర సుఖాపవర్గ! జయ! భర్గా! పార్వతీవల్లభా!
సరసమైన శబ్దాలాతో కూర్చిన సమాసాలకి ఈశతకం పెన్నిధివంటిది అని చెప్పవచ్చును. క్రింది సమాసాలను గమనించండి
1. భవదీయ పావనకల్యాణవిఖ్యాత కావ్యక్రియా సామీచీన్య హృదంతరాళ కవిరాత్సక్రందనశ్రేణికిన్ (6వ పద్యము) 2. మిహిరప్రోద్భవ ఘోరకింకర సమున్మేషోరగశ్రేణివిహగోత్తంసము (13వ పద్యము). ఇలా చెప్పుకుంటే ఇటువంటివి ఈశతకంలో అనేకం. కొన్ని పద్యాలు ఇతరకవులపద్యాలకు, సంస్కృతపద్యాలకు అనుకాణములుగా, కొన్ని అనువాదములుగా కనిపిస్తాయి.
అనుకరణలు1 1. శివోహమస్మి, 2. శివతత్పరతరంనాస్తి, 3. రాజ్యంతేనరకంవ్రజేత్, 4. విద్వద్దండ మగౌరవం, 5. సుకవితా యద్యస్తి రాజ్యేనకిం? వంటివి.
అనువాదములలో భతృహరి సుభాషితములనుండి, సౌందర్యలహరినుండి, కొన్ని భావానువాదాలను చూడవచ్చు. అంతేకాక కొన్ని తెలుగు పద్యాలను పూర్వకవులనుండి అనుకరించినట్లు తోస్తుంది.
ఉదాహరణకి:
"తినదే చెట్టున నాకు మేకఁ, గుహ గొందిం బాము నిద్రింపదే,
వనవాసంబునఁ బక్షులున్ మృగములున్ వర్తింపవె నీటిలో
మునుకలు వేయవె మత్స్యకఛ్చపములున్"
అన్న సర్వేశ్వరశతకపద్యానికి
" ఆకుల్ మెక్కదెమేఁక? చెట్టుకొననొయ్యన్ వ్రేలదేపక్షి? పె
న్గాకుల్ గ్రుంకవెనీట? గాలిఁగొనదే నాగంబు? బల్గొందులన్
ఘూకంబుండదె? కోనలం దిరుగదే క్రోడంబు? నిన్గాంచినన్
గా కిన్నింటను ముక్తిచేకుఱునె? భర్గా! పార్వతీవల్లభా!"
అనుకరణగా కనిపిస్తుంది. అదేవిధంగా పోతనామాత్యుని పద్యం "చెలియై మేనమఱిందియై సచివుఁడై చిత్తప్రియుండై" అనే పద్యానికి
" తనరన్నిన్మది నెంతు నెప్పుడును నా దైవంబుగా దాతఁగా
జనకుంగాఁ జెలికానిగా గురువుఁగా సద్భందుగా నన్నఁగా
ఘన నిక్షేపముగా మహాప్రభునిగాఁగల్యాణ సంధాయిగా
గనకోర్వీధరకార్ముకోల్లాసిత భర్గా! పార్వతీవల్లభా!"
అనుకరణగా కనిపిస్తుంది. ఈశతకంలో దాదాపు 20 పద్యములవరకు దుష్ప్రభువులను దూషించునవి ఉన్నాయి. అదేవిధంగా కుపండితులను, సంఘదూరాచారాలను ఖండించటంలో ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ఈపద్యం చూడండి:
డాయన్ రాదఁట యండ్రు మాదృశులు చండాలాదులన్, డాసినన్
బాయున్ బుణ్యచయంబులంచుఁ జదువుల్పల్కంగనీవయ్యయో
బోయం డెంగిలిమాంసమిచ్చుటకులో బుల్పూనిచేకొంటి వే
ప్రాయాశ్చిత్తము కద్దుదీని కిఁక? భర్గా! పార్వతీవల్లభా!
ధర మృద్దారుశిలామయప్రతిమలన్ దైవంబు లంచుం బర
స్పరవాదంబులఁ బోరుచున్ నిబిడసంసారాంధులై మేలు చే
కుఱకే మగ్గములోని కండెలగతిన్ ఘోరార్తులై ప్రాకృతుల్
కరముం జచ్చుచుఁబుట్టుచుంద్రుగద! భర్గా! పార్వతీవల్లభా!
ఈశతకంలో కవి 22 వపద్యము మొదలుగా 40 వరకు శివలీలలను వర్ణించాడు. అక్కడక్కడా జాతీయములు, నానుడులు పొదిగి తెలుగుకి వన్నె కూర్చాడు.
కొన్ని సామెతలు ఉపమానాలు:
1. పూసలలోని దారముపోల్కి, 2. తిలజాలకాంతర మహాతైలంబు, 3. కవితల్ కాసుకు గంపెడయ్యె, 4. మగ్గములోని కండెల గతిన్, 5. కాకుల్వేములఁ జేరుచందమున, 6. కరికి ముక్తాకాయమానంబు, సొంపగుఁగా కొప్పునే యూరఁబందులకు, 7. నిల్పుకోఁగలదె ధాత్రిన్ గొంతసేపైన మర్కటపోతం బురురత్నహారముల, 8. కంటకావరణీజ్జృంభిత కేతకీవని కళుల్ వాలెంబుగా జేరవే, 9. సువర్ణకమలస్తోమాసవాలంపట భ్రమరం బేఁగునే తుమ్మకొమ్మలకు.
ఇలాచెప్పుకుంటుపోతే ఈశతకంమొత్తం ఒక అపూర్వమైన కావ్యఖండం. ప్రతిపద్యం ఒక ఆణిముత్యం. తన సమకాలీనుడైన ఏనుగులక్ష్మణకవి చెప్పిన మాటలు
"హాటకగర్భవధూ లీలాటన చలితాంఘ్రి నూపురారవ శ్రీ
పాటచ్చరములు, తేనియతేటలు మా కూచిమంచితిమ్మయ మాటల్"
కూచిమంచి తిమ్మకవి అక్షరాలనిజం అనిపించాడు. తిమ్మకవి భర్గశతకమే కాక మిగిలిన అన్నికావ్యములు వాటికి అవేసాటి. ప్రతిఒక్క కావ్యం చదవలసిందే చదివించవలసిందే.
No comments:
Post a Comment