నన్ను అందరూ అడుగుతూ వుంటారు "ప్రభూ మీరెందుకు విష్ణు దేవునివలె అవతారములు ధరించరు ?" అని, నేను అందరికీ ఆయనొకటీ, నేనోకటా ..? ఇద్దరం ఒక్కటే .కాస్తంత స్థిమితంగా త్రితత్వంలోకి తర్కం చేసి చూడండి.అసలు ఈ అండపిండ బ్రహ్మాండాలు ,జీవరాశులు ,చలన వస్తువులు, అన్నీ నేనే. నేనే అన్నిటికీ ఆధారం .విష్ణు దేవుడు సైతం నా నుండి ఉద్భవించిన పదార్దమే ! ఆయన పుట్టుకకు నేనే కారకుడను .ఎవరికీ తెలియని,చెప్పని, సత్యం మీకు చెప్పగోరుతున్నాను.విష్ణు దేవుడు నానుండి పుట్టాడు కావున ,ఆయనకు పుట్టుక వున్నది.కానీ నేను ఆదిని ,జన్మ రహితుడను, అన్నీ నాలోనే లయం అయిపోతాయి .జన్మలేని నేను జన్మ ఎలా ఎత్తేది ? అందుకే ఆయన అవతారాలు దాల్చినప్పుడు , ఆయన పొందుతున్న మాతృ పితృ కుటుంబ ప్రేమ ఆయనలో వున్న నేను పొందుతుంటాను.ఆయన అవతారాలన్నిటికి సరైన ఏర్పాట్లు చేస్తాను. అందుకే పరశురాముణ్ణి ,శిష్యునిగా స్వీకరించి ,సకల విద్యలూ నేర్పాను . నేను అవతారాలు ధరించకపోయినా ,నా అంశలను సృజింప చేస్తాను.అందుకు ఉదాహరణ హనుమంతుడు , వీరభద్రుడు .తనే తానుగా రూపాంతరం చెంది ,పుట్టడం అవతారం.నారాయణుడు అవతారాలుగా తనలోంచి శక్తిని ఉద్భవింప చేయడం ,అంశ అంటారు.అందుకే ఆంజనేయుడు 'రుద్రాంశ 'గా కీర్తింప బడ్డాడు.నారాయణుడు, హనుమంతుడు,అంటే స్ఫురించేది ,అసలు శ్రీహరి పరిపూర్ణ అవతారమైన శ్రీ కృష్ణుడిగా జన్మించడానికి , దుష్ట శిక్షణ చేయుటకు ,ప్రోత్సహించింది నేనే. ఆయన గోకులంలో ఉద్భావిస్తాడని వరమిచ్చింది అభయ ఆంజనేయుడే . ఆ కథ చెబుతా వినండి.
నా పార్షాదులలో ప్రధానమైన వాడు మణిభద్రుడు.అతని దగ్గర చింతామణి అను వింత మణి ఒకటి వున్నది.అది కౌస్తుభ శోభతో ,సూర్యునితో సమానముగా,వెలుగు ప్రసాదించగల శక్తి వున్నది.దానిని చూచినా ,తలచినా, ధ్యానించినా శుభము . మణిభద్రుడు తనకి ఎంతో సన్నిహితుడైన ఉజ్జయిని మహారాజు చంద్రసేనుడికి, ఆ రాజు యొక్క శివభక్తికి మెచ్చి , ప్రసన్నుడై ఆ మణి ని బహూకరించాడు.చంద్రసేనుడు నా భక్తుడు,సకల తత్వాలూ ఎరిగినవాడు ,నాయందు భక్తి ,విశ్వాసాలు ,నమ్మకం ఉంచి ,ప్రజారంజక పాలన చేయువాడు .అతని రాజ్యంలో నాధర్మం పాటించమని ప్రోత్సహించువాడు. ఒకానొకనాడు ,చంద్రసేనుడు ఒక మహా యజ్ఞం చేయదలచి ,పొరుగు రాజ్యాల మైత్రి కాంక్షించి , అందరినీ తన ఆ స్థానంలో సమావేశపరిచినాడు. అతడు చింతామణి ని కంఠమున అలంకరించుకొని, సూర్యునివలే మెరుస్తూ సింహాసనమున కూర్చున్నాడు.సమావేశానికి వచ్చిన రాజులందరూ , చింతామణి మీద దృష్టి పెట్టి ,రాజు యొక్క శోభకు అసూయ పడ్డారు. ఎంతైనా మానవులు అరిషడ్వర్గాలకి చిక్కుకొని ,కొట్టు మిట్టాడుతూ వుంటారు. సమావేశం అయిన పిమ్మట ,ఎలాగైనా చంద్రసేనుడిని జయించి ,ఆ మణి సాధించాలని కుతంత్రం పన్నారు. ఆయనను ఎన్నోరకాలుగా ప్రలోభ పెట్టారు. కానీ చంద్రసేనుడు ,అది శివ భక్తికి ఇచ్చిన బహుమతి అని, వారి ప్రలోభాలను, తృణప్రాయంగా త్యజించాడు.ఆ రాజులందరూ తమ తమ రాజ్యాలకేగి ,అందరూ కలసి కట్టుగా ,చంద్రసేనుడిని ఓడిద్దామని నిర్ణయించుకొన్నారు. వారి అత్యాశ ఫలితము ఏమిటో చూడండి. అందరూ ఉజ్జయిని ని ,బహువిధాల సైనిక శక్తితో,నాలుగు వైపులా చుట్టుముట్టారు. వారు దాడి చేసిననూ, కోటలోకి ప్రవేశించలేకపోయారు.ఇది తెలిసిన చంద్రసేనుడు,తాను తన సైనిక బలముతో ,వారితో పోరాడలేనని తలచి,ఆ రాజ్యం లో 'మహాకాళేశ్వరుడు' గా వున్న నా ఆలయానికి వచ్చి ,నన్ను శరణు జొచ్చి, 'నా ప్రజలను కాపాడు ' అని నన్ను,సందేహరహితంగా, రాత్రింబవళ్ళు , అనన్య దీక్ష తో ప్రార్ధింపసాగాడు. అదే నగరంలో ,ఒకానొక గొల్ల స్త్రీ మరియు ఆమె బిడ్డ 5 సం. శ్రీకరుడు ఉన్నారు. ఆ తల్లి ,తన కుమారుణ్ణి తీసుకొని నా మందిరానికి వచ్చింది. శ్రీకరుడు ,మహారాజు నాకు చేస్తున్న పూజలపట్ల ,ఎంతో అనురక్తుడై , తీవ్రమైన భక్తి పారవశ్యతనొ౦ది, గమనించసాగాడు. తరువాత వారు వారి ఇంటికి వెళ్ళారు. శ్రీకరుడు ఇంటి దగ్గ్గర శివపూజ చేయ భావించి, ఒకానొక రాయిని తెచ్చి,శివలింగము వలే భావించి ,తాను ఇంటినుండి పోగు చేసుకున్న గంధం, వస్త్రం, ధూప దీపాలు, పూజా ద్రవ్యాలు ఆ లింగమునకు,అనగా నాకు సమర్పించాడు. ఆ భక్తి తీవ్రత నన్ను కట్టి పడేసినది. ఇంకనూ రాజువలె పూజ చేద్దామని,ఆయనలాగే తనూ చేసినట్లు మనసునందు భావించాడు. మనో నైవేద్యము సైతము , అతని వ్యాకులత చూసి స్వీకరించాను. తనకు చేతనైన ఆటలు నాతో ఆడాడు. పాటలు పాడాడు. నృత్యము చేసాడు. వాటన్నింటినీ పరమానందముగా స్వీకరించాను .శ్రీకరుడు నృత్యముతో అలసిపోయి ,నా ముందు కూర్చుని,భక్తితో లయించి పోయాడు. అతని తల్లి భోజనానికి పిలవడానికి వచ్చి ,వాని వింత చేష్టలూ, పిల్ల చేష్టలుగా భావించి ,ద్రవ్యములు వృధా చేసినాడని భావించి, అవి శుభ్రం చేసి , ఆ శివలింగమును పారవేసినది. నా భక్తితో లయించిన శ్రీకరుడు ,ధ్యాన నిమగ్నుడై వున్నాడు.ధ్యానంలోనుండి లేచిన బాలుడు,తల్లిని పట్టించుకోకుండా, ఆమె విసిరేసిన రాయి దగ్గరకు వెళ్లి ,చేతిలోకి తీసుకొని "రామయ్యా, దెబ్బతగిలిందా , మందు రాయమంటావా, మా అమ్మ నాకు దెబ్బ తగిలితే అంతే చేస్తుంది. ఎక్కడ దెబ్బ తగిలిందయ్యా .." అని రోదించ సాగాడు. నాకు తెలియకుండానే నా కంటి నుండి అశ్రువులు వచ్చాయి . ఆ బాలుడు శివలింగం నుండి నీరు రావడం చూసి ," శివయ్యా, ఏడవకు ,మా అమ్మ ను కొడదాం లే ..,నీ దెబ్బ తగ్గిపోతుందిలే , బాధపడవద్దు .." అనెను. నేను వెంటనే నా నిజరూపంలో ప్రత్యక్షమయ్యాను. అతను నాకు దెబ్బ తగిలిందని భావించాడు కాబట్టి ,అతనికి దెబ్బ ఉన్నట్లే అగుపించాను. శ్రీకరుడు నేను కనపడుటచేత ,మిక్కిలి ఆనందం పొంది ,నాకు మందు వ్రాసి,నాతో ఆటలు ఆడుకొన్నాడు. " నొప్పి తగ్గిందా శివయ్యా." అన్నాడు. "తగ్గింది శ్రీకరా,నీవు మందు రాసిన తరవాత ఇక దెబ్బ వుండదు ,నొప్పివుండదు " అని పరిహసించినాను.
"ఆం తిన్నావా రామయ్యా.. కాదు, కాదు శివయ్యా..? "అన్నాడు."తినలేదు " అన్నాను. వాళ్ళ అమ్మకు చెప్పకుండా ,ఇంటిలోపల వున్న వెన్నను తీసుకొచ్చి నాకు తినిపించాడు."తిను శివయ్యా.,మళ్ళీ మా అమ్మ వస్తే అంతా నాకే పెడుతుంది." అన్నాడు. నేను శ్రీకరుని ప్రేమ ,వాత్సల్యానికి పొంగి, వెన్న తిన్నాను. " నేనంటే చిన్న వాణ్ణి కదా, నాకు కొంచం చాలు ,కానీ నీవు పెద్దవాడివి కదా .." అని మళ్ళీ చద్ది అన్నం తీసుకువచ్చాడు. అది కూడా పెట్టాడు. మొత్తం తిన్న తరవాత ,నేను శ్రీకరుడిని "నీకు ఆకలి లేదా..?" అని అడిగాను. శ్రీకరుడు "నువ్వు తింటే నేను తిన్నట్ట్లే " అన్నాడు. అంత దాకా నాచుట్టూ తిరిగి నృత్యం చేశాడు. అలసి పోయి నా ఒళ్లో కూర్చుని నిద్రపోయాడు. ఆ బాలుని మునుపటి శివలింగం ఉన్నచోటుకి చేర్చి ,నేను అంతర్దానమయ్యాను.తరువాత జరిగిన వింతకు అందరూ ఆశ్చర్య చకితులయ్యారు.
శ్రీకరుడు మెలకువ రాగానే ,"రామయ్య ఏడీ..? ఎక్కడ శివయ్యా.."అని అరుస్తున్నాడు . శ్రీకరుడు ఒక కొత్తవెలుగును గమనించాడు. తాను చూసిన శివలింగం ఇప్పుడు రత్నంగా మారింది . తాను ఇందాక పూజించిన శివలింగం ,ఇప్పుడు రత్నమయ లింగం అయింది. తన తల్లి శుభ్రం చేసిన సామాగ్రి ,మళ్ళీ తాను పూజించినట్లే ,ఆ రత్నమయ లింగం మీద ఉన్నాయి. ఒకసారి చుట్టూ పరికించి చూసాడు.అక్కడ ఒక మహా భవనం వెలిసింది. రత్న ఖచిత స్తంభాలు చూసి నివ్వెరపోయాడు.అక్కడ భూమి స్ఫటిక నేలగా మారింది. ఆ మహాభవనం పరమ శివుని మహా మందిరం గా మారింది. విశాల ద్వారాలు ,కవాటాలు ,ప్రధాన ద్వారం ,గోపురం అన్నీ నేల మీద సూర్యుని వలే ప్రకాశించాయి. కానీ శ్రీకరునికి అవేవీ గొప్పగా తోచలేదు .నేను మళ్ళీ వస్తానేమో అని , ఆ రత్నమయ లింగమునకు మళ్ళీ పూజలు చేసాడు. నాతో ఆడినట్లు ఆటలు ఆడి, పాటలు పాడాడు.కానీ నేను యదార్ధ రూపంలో కనపడక పోయేసరికి ఏడుస్తూ ,కొద్ది దూరంలో వున్న తన ఇంటికి గాబరాగా వెళ్లి , వాళ్ళ అమ్మను నిదురలేపాడు. శ్రీకరుని తల్లి ,నిదురలేచి ,ఆశ్చర్యపడింది .తాము వున్న ఇల్లు కూడా ఆ మందిరము వలె ,రత్నమయ మణి మాణిక్య , సువర్ణ చంద్రకాంతి తో ,దేదీప్యమానం గా వెలిగి పోతున్నది . ఆమె ఇదంతా చూసి పరమ ఆశ్చర్యం పొందింది. "ఏమైంది నాయనా ?" అని బాలుడిని ప్రశ్నించింది. శ్రీకరుడు రోదిస్తూ ' అమ్మా నువ్వు చెప్పావుగా రామయ్య అన్నా, శివయ్య అన్నా ఒకరే అని., నేను ఇందాక శివలింగానికి గుడిలో రాజుగారిలాగా పూజ చేసాను..నువ్వు దాన్ని విసిరేశావు. నేను మందు రాశాను. " అని మెల్లగా , వచ్చీ రాని మాటలతో ,జరిగిందంతా చెప్పాడు. దాంతో శ్రీకరుని తల్లి ,'రత్న లింగం ' వద్దకు వచ్చి మోకరిల్లి ," ప్రభూ తెలియక చేసిన తప్పుకు క్షమించు " అని ప్రార్ధించింది. ఆమెను కరుణించాను. ఆమె కూడా ఆ భవంతికి వలె ,సమస్త శోభలతో ,అలరారింది. తన మునుపటి వేషధారణ పోయి , మహారాణి గా మారిపోయింది. కానీ శ్రీకరుడు నన్ను చూడాలని ఏడుస్తూనే ఉన్నాడు. బాలుడిని ,తల్లి తన హృదయానికి హత్తుకొని ,వానియొక్క అదృష్టానికి , నా ఒడిలో పడుకున్న అతని భాగ్యాన్ని కొనియాడింది. "అందర్నీ తరింపజేసావు నాయనా " అని ముద్దాడింది.
ప్రజలు ముట్టడి భయంతో వున్నారు. అయినను వారు , ఆరత్న మందిరాన్ని ,భవనాన్ని చూసి ఆశ్చర్య పోయారు. ఇది ఎక్కడనుండి వచ్చిందని అందరూ నివ్వెరపోయారు. చిన్నగా ఈ వార్త రాజు చంద్రసేనుడి దగ్గరికి పోయినది. చంద్రసేనుడు ఈ సంఘటన వినగానే ,'శివానందం 'తో మనసు నిండిపొయినది. తాను పొరుగు రాజ్యాల దాడినుండి కాపాడుకొనుటకు శివపూజలో వున్నానని చెప్పి , ఆ బాలుని ,వాని తల్లిని తనవద్దకు తోడ్కొని రమ్మని చెప్పాడు.అది తనయొక్క విజ్ఞాప్తిగా చెప్పమని కూడా అన్నాడు. రాజ్యం నలువైపులా వున్న ,శత్రు సేనలకి ఈ విషయం ,గూఢచారుల ద్వారా తెలిసింది. వారు రాజ్యంలోని చిన్న బాలునికే అంత శక్తి వుంటే , మహా శివ భక్తుడైన చంద్రసేనుడిని జయింపలేమని గ్రహించి , వారిని మన్నింపమన్న అభ్యర్ధనను రాజు వద్దకు పంపారు .చంద్రసేనుడు ఆ అభ్యర్ధనను మన్నించి ,అందరికీ మహాశివ మందిరమును దర్శింపజేయ అభయమిచ్చాడు.
చంద్రసేనుడు "నీ భక్తితో కూర్చున్న నన్ను, నా రాజ్యాన్ని ఏమాత్రం రక్తపాతం లేకుండా ,ఒక బాలుని ఆసరా చేసుకొని, నీ లీల చూపించావా తండ్రీ .." అని నాకు కృతజ్ఞతలు తెలిపాడు. మిగిలిన రాజులందరూ క్షమా పూర్వకంగా చంద్రసేనుడిని వేడుకొన్నారు.అందరూ కలిసి నా పూజను , నా నామాన్ని జపిస్తూ , నా కోసం నృత్యములను చేయసాగారు. ఇంతలో శ్రీకరుడు ,వాని తల్లితో మందిరానికి విచ్చేసి ,దూరంగా కనబడుతున్న రత్నమయ భవనాలను చూపాడు. ఇంకా రోదిస్తూనే జరిగినదంతా రాజుకి చెప్పాడు. రాజు అతడిని ఎత్తుకొని ,కౌగిలించుకొని ,ముద్దాడి , ఆనందపడ్డాడు. రాజు , ప్రజలు , శత్రు రాజులు ఆ రత్నమయ శిఖరాలను చూసి ఆశ్చర్యపోయినారు. అయినను బాలుడు నా దర్శనం కోసం, రోదిస్తూనే వున్నాడు .రాముడు ఎవరో ,శివుడు ఎవరో తెలియని ఆబాలుడు, నన్ను రామయ్య గా భావించి "రామయ్యా ,మళ్ళీ రా ఆడుకొందాం " అని రోదించ సాగాడు. సరిగ్గా అప్పుడు ,ఆ మందిరంలో 'రుద్రాంశ'యగు హనుమ ప్రత్యక్షమయి " ఎవరు 'రామ' అని రోదిస్తుంది..? ఎక్కడ రామనామం వుంటుందో ,అక్కడ ఆనంద భాష్పాశృవులతో ,నేను కూడా వుంటాను.." అని చెప్పాడు. హనుమను చూసిన ప్రజలందరూ ,ఆయనకు మోకరిల్లారు. దివ్యదృష్టితో అంతా చూసిన హనుమ ,ఆబాలుడిని ముద్దాడి ,"రాముడు , శివుడు ఒక్కరే ! మానవులే కాదు దేవతలు ,అన్ని జీవరాశులు సైతం శంకరుని భక్తి కలిగి వుండటం మన అదృష్టం ,అది మన కర్తవ్యంగా అని భావించాలి .." అన్నాడు . సాష్టాంగ పడిన చంద్రసేనుడినే గాక ,అందరినీ హనుమ ఆశీర్వదించాడు.
హనుమ రత్నలింగము ముందు భక్తిగా ప్రమాణాలు చేసి ,"ప్రభువైన శ్రీ రాముడు సైతం శివలింగమును పూజించేవారు. ఏవూరు , ఏపేరు , ఏకాలం అయినా రాముడు ,శివుడు ,నారాయణుడి రాబోవు అవతారమైన కృష్ణుడు ..అంతా ఒక్కటే.." అని శ్లాఘించాడు . రత్నమయ ఆలయంలో ప్రసన్నుడైన హనుమ ,భక్తితత్వంతో ,నా మహిమ , నా ఉపచారాలూ విశదీకరించి,రాజును ,బాలుడిని తనముందు కూర్చోపెట్టుకొని ," శ్రీ కరా , భక్తి మాత్రమే భగవంతుడిని చేరుస్తుంది , అయితే మంత్రం తంత్రం లేకుండా ,ఆర్తితో పిలిచావు కాబట్టే ,నీ శివయ్య నీ కోసం వచ్చాడని ,నువ్వు అనుకొన్న రామయ్య ,కృష్ణుడిగా నీ వంశంలో ,ఎనిమిదవ తరం లో పుట్టనున్నాడని , నారాయణుడు మీ గొల్ల జాతిలో ,గొల్లవానిగా కీర్తింప బడువాడు అని , నువ్వు శివునికి పెట్టిన వెన్న ,చల్దిలతో 'కృష్ణ లీలలు' చేస్తాడని మాట ఇచ్చాడు .అంతే కాక శ్రీకరునికి “భోగ భాగ్యాలను , మోక్షవరాన్ని "ఇచ్చి , అందరినీ ఆశీర్వదించి , అంతర్ధానమయ్యాడు.
పోనీలే , నేను శ్రీకరునికి భోగ మోక్షాలు ఇవ్వదలిచాను .అతను నిద్రపోయాడు.అందుకే నా అంశ అయిన హనుమ చేత ఇప్పించాను , ఎవరు ఇచ్చినా ఒకటే కదా ! హనుమను మీరూ పూజించండి. మీకు ఆ రామ సేవకుడు ,ఇహలోకంలో అన్నీ ప్రసాదిస్తాడు. హనుమ ,నేను రాముడు అంతా ఒక్కటే.! మీరు కూడా శ్రీకరుని వలె , చంద్రసేనుడి వలె నాపై నమ్మకం వుంచి , నిశ్చలంగా వుండండి. అన్నీ నేను చూసుకొంటాను .
No comments:
Post a Comment