‘ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట... నా పలుకులో కులుకుతావట... ఆపదమొక్కుల సామి...’
మధుర మధురతర గానంతో ఆమె పిలచితే, శిలలైనా కరిగి నీరవుతాయేమో అనిపిస్తుంది... శ్రీ వేంకటేశ్వర వైభవం చిత్రంలోని పైపాట వినని తెలుగువారు బహుశా ఉండరేమో. ఉదయాన్నే భక్తి రంజనిలో, లలితగీతాల్లోనో, ఈ గొంతు చాలా మందికి సుపరిచితమే ! నూకల చిన సత్యనారాయణ మాటల్లో చెప్పాలంటే ఆమె 'కర్ణాటక సంగీత కచ్చేరీ చేస్తోంటే శ్రుతిలయలు తల్లిదండ్రులవలె ఈమెను ముద్దుగా బుజ్జగిస్తూ, శ్రోతల్ని నిద్రబుచ్చుతాయి. ఈమె రాగం పాడేతీరు సంక్లిష్టంగాను, మధురంగాను కూడా ఉంటుంది. ఈమె గాత్రం సుకుమారంగా, గంభీరంగా ఉంటుంది. ఈమె రాగలతలు వయ్యారంగా వంపులు తిరుగుతూ చిన్న చిన్న పూవులతో నిండి ఉంటాయి. కీర్తన పాడే ధోరణి నిర్దుష్టంగానూ బింకంగానూ పాండితీ ప్రకర్లను వ్యక్తం చేస్తూ సాగుతుంది. దక్షిణ దేశంలో ముఖ్యంగా చెన్నైలో ఈమెకు మన రాష్ట్రంలో ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మికి ఉన్నంత పేరు ప్రఖ్యాతులున్నాయి''... నిజమే ఆమె పాట వింటున్నప్పుడు శ్రోతలముందు స్వరచిత్రాలు విచ్చుకుంటాయి. ‘ఆంధ్రా ఎం.ఎస్.సుబ్బలక్ష్మి ‘ గా పేరు పొందిన ఆమె ఎవరు ? ఆమె మధురగాయని, గంధర్వ కళానిధి, గానసరస్వతి, సంగీత చూడామణి, కళా సరస్వతి, సంగీత సామ్రాజ్ఞి వంటి బిరుదులను పొందడం కాదు, వాటికి గౌరవం తెచ్చిన విదుషి! ఆమే ‘సంగీతకళానిధి’ శ్రీరంగం గోపాలరత్నం గారు. ఈమె 1939 సంవత్సరంలో విజయనగరం జిల్లా పుష్పగిరిలో వరదాచార్యులు, సుభద్రమ్మ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ సంగీత కళాకారులే ! తల్లికి మేనమామ అయిన అప్పకొండమాచార్యులు రాసిన రెండు హరికథలను పాలకొల్లు సభలో తొమ్మిదేళ్ళ వయసులో గానం చేయడమే వీరి తొలి ప్రదర్శన.
కవిరాయని జోగారావు గారు వీరి ప్రధాన సంగీత గురువు. ద్వారం వెంకటస్వామి నాయుడు, శ్రీపాద పినాకపాణి వద్ద కూడా సంగీతాన్ని అభ్యసించారు. ఇద్దరు గురువులూ నేర్పినవి, నాన్నగారి బాణీ... తన బాణీ... ఇలా వీటన్నిటినీ మేళవించుకొని ఆమె తనకంటూ ఒక ప్రత్యేక బాణీని రూపొందించుకొన్నారు.
1956 లో సంగీతంలో డిప్లొమా తీసుకున్నారు. అదే సమయంలో బాలాంత్రపు రజనీకాంతరావుతో కలసి ఎన్నో సంగీత రూపకాలు సమకూర్చారు. వాటిని రూపొందించారు. పాడారు. సమర్పించారు. ఆమె గాత్రం విని, పాటను ఆలకించి, సంగీత విద్యను ఆస్వాదించి అందరూ ఆశీర్వదించారు. అందుకే 1957 నాటికి ఆమె ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్టాఫ్ ఆర్టిస్టయ్యారు.
తొలిసారిగా విజయవాడ ఆకాశవాణిలో 1957 సంవత్సరం నిలయ విద్వాంసురాలిగా చేరారు. అప్పటినుండి తెండు దశాబ్దాల పాటు శాస్త్రీయ, లలిత సంగీత బాణీలతో శ్రోతలకు విందు చేశారు. ఎందరో ప్రముఖ సంగీత సాహిత్య ప్రముఖులతో కలిసి ఆమె ఎన్నో కార్యక్రమాలను సమర్పించారు. అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజన గీతాలు ఆమె కంఠం నుంచి జాలువారిన మధురరస పారిజాతాలు. భామా కలాపం యక్షగానం, నౌకా చరితం ఆమె ప్రతిభకు గీటురాళ్ళు. ఈమెకు అత్యంత కీర్తిని తెచ్చినది సంగీత ప్రధానమైన రేడియో నాటకం 'మీరాబాయి'. శాస్త్రీయ సంగీతంలో ఆమె ఎంత లోతులకు వెళ్లేవారో లలితసంగీతంలోనూ అంతగా ఆకట్టుకొనేవారు. ఎన్టీరామారావు తెలుగుభాష, సంస్కృతుల పరిరక్షణకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత 1988 ప్రాంతాల్లో ఆమె సంగీతం విభాగంలో ఉపన్యాసకురాలిగా, డీన్‌గా, ప్రొఫెసరుగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని త్యాగరాజ ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాలుగా పనిచేశారు. కళాకారిణిగానే గాక పరిపాలనా దక్షత, కార్యనిర్వహణ సామర్థ్యం ఉన్న కార్యసాధకురాలిగా తనని తాను నిరూపించుకోగలిగారు. అందుకే రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకూ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు, ఆకాశవాణి, దూరదర్శన్‌లకూ సంబంధించిన వివిధ సంఘాల్లో సభ్యురాలిగా ఉన్నారు. అవార్డులు/ బిరుదులు : • 1969లో తిరుమల - తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలిగా సేవలందించారు. • 1977లో హైదరాబాదు లోని తెలుగు విశ్వవిద్యాలయం ఆవిర్బావంతో లలిత కళా పీఠానికి ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. • ఈమెను 'గాన కోకిల'గా, 'సంగీత కళానిధి'గా, 'సంగీత రత్న'గా అభిషేకించాయి. • 1992లో భారత ప్రభుత్వం ఈమెను 'పద్మశ్రీ' గౌరవంతో సత్కరించింది.
అవివాహితగానే మిగిలిపోయిన ఆమె, 1993 లో కన్నుమూసారు. తన వాణితో తెలుగు నేలను పులకింపజేసి ఆకాశవాణిగా, అశరీరవాణిగా, అందని లోకాలలో అమరగాయనిగా మిగిలిపోయిన కుమారి శ్రీరంగం గోపాలరత్నం గారు కథానాయిక ‘అలివేణి’గా అందరి హృదయాలలో నిలిచిపోయారు.
No comments:
Post a Comment