పెద్ద చేయు పనుల దద్దయు గమనించి
చేయుచుందురింట చిన్నవారు
బుద్ధి లేని పనుల పోరాదు పెద్దలు
రామమోహనుక్తి రమ్య సూక్తి
కొన్ని వాస్తవాలను గమనించుదాము. పెళ్ళయిన అనతి కాలములోనే ఒక శిశువు కలిగితే, ఆ శిశువు వయసు 2 సం. లోపు వున్నప్పుడు కొందరు దంపతులు సరసమైన తమ కోరికలనాపుకోలేక అసహ్యముగానో అసభ్యముగానో ప్రవర్తించుచుంటారు.పబ్బుకేగ వలయు పదివేలు నాకివ్వు
"తనయ! డబ్బు గాదు తగినబుద్ధి
నీకు వలయు " నన్న నీవద్ద యది లేదు
కలిగియున్న దడుగ గలుగుదనెను
ఆ స్థితి కలగకుండా చూచుకొనుట మంచిది. కాస్త 7 నుండి 10 సంవత్సరముల లోపువారవుతునే ఆడ మగ తేడా లేకుండా ఆటలు మొదలు పెడతారు. సహవాసము మంచిదయితే పరవాలేదు. కాకుంటే? 'సహవాస దోషయా పుణ్య గుణా భవంతు' సహవాస దోషయా పాప గుణాభవంతు అన్నారు పెద్దలు. మరి ఎంతమంది తల్లిదండ్రులకు ఇవి గమనించే వెసలుబాటు వుంది. అసభ్యమైన అసహ్యమైన మన బుద్ధికి అనూహ్యమైన తిట్లను ఆడ పిల్లలు తమ ఆటలలో వాడుచున్నారు. ఇక ఇంట్లో శుభ్రత. ఇంటి పనులకు పెట్టుకొన్న పనిమనుషులు ఎంత శుభ్రముగా పని చేస్తారు అన్నది మీ ఆలోచనకే వదిలి మీరు చేసే పనుల గూర్చి ఒక మాట చెబుతాను. చాలా మంది ఇళ్ళలో mineral water పేరుతో వచ్చే నీళ్ళు త్రాగడానికి ,పిల్లలకు త్రాపడానికి అలవాటు పడినారు. అసలు అందులో ఏమి minerals కలుస్తున్నాయి ,అవి minerals అని అనవలెనా లేక అవి chemicals అనవలేనా! సాధారణమైన మంచినీరు త్రాపుటలేదే పిల్లలలో రోగ నిరోధక శక్తి పెంపొందగలదా? ఇంట్లో అమ్మ తదితర పెద్దలు చేసే వంట కంటే hotel భోజనాలు అంత ఆరోగ్యకరమా? మీరిట్లు పెంచితే వాళ్ళు వాళ్ళ పిల్లలను ఎట్లు పెంచుతారు అన్నది ఆలోచించుతున్నారా. ఇక ఆటల గురించి ఒక్క మాట . శ్రీ మహావిషునువు చేతిలో శంఖచక్రగాదాఖడ్గములున్నట్లు నేటి పిల్లలచేతిలో శెలవు తోజున తెల్లవారుతూనే బ్యాటు,బాలు,స్టంప్సు,గ్లోవ్సు వుండవలసినదే.బయట ఆడే ఆట అది ఒక్కటే. గోలీలు ,బొంగరాలు,బిళ్ళంగోడు (చిల్ల-కట్టే,గిల్లి-దండ) మొదలగు సూర్యుని వెలుతురులో ఆడే ఆటలు చీకటిలోకి వెళ్ళిపోయినాయి. చీకటి ఆటలు వెలుతురులోనే పిల్లలు ఆడుతూవుంటే చూసే దౌర్భాగ్యస్థితిలోమనమున్నాము. అసలు గోలీలు బొంగరాలు లాంటి ఆటలలో ఏకాగ్రత ,లక్ష్యము, పట్టుదల మొదలుగునవి వ్యక్తిగతముగా పెంపొందించు కొనవచ్చును. మట్టిలో ఆడుటవల్ల పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆట వస్తువుల ఖర్చు ఈ కాలమైతే ఒక 5 రూపాయలు.అదే క్రికెట్ అయితే 2000 రూపాయలకు పై మాటే. వర్షా కాలములో ఇంట్లో బారాకట్ట,పులిజుదము, బేరి ఆట మొదలుగునవి ఆడే వారు. వానికగు ఖర్చు 'శ్యున్యము.' ఇప్పుడు పిల్లల indoor games కు వేల వేల రూపాయలు తగలేస్తున్నారు. పిల్లలలో అతి తక్కువగా, తాము చేసే పని తప్పా ఒప్పా అని తర్కించుకొనే వాళ్ళు కూడా వుంటారు. అప్పుడు వారు మంచి వైపు మొగ్గు చూపే అవకాశముంటుంది. కానీ ఈ విధమైన నిర్ణయాలను తీసుకొనే విధంగా అతి చిన్న వయసునుండి పిల్లలకు చెబుతూ రావలసిన బాధ్యత తల్లి తండ్రులపై వుంటుంది. ఒక చిన్న కథ చెబుతాను. అన్నివ్యసనాలూ కలిగిన ఒక రాజుకు ఇద్దరు కొడుకులుండేవారు. రాజ కుటుంబము కాబట్టి పెద్దవుతూనే ఎవరి భవనాలు వారికుండేవి. కానీ బాల్యములో తల్లిదండ్రుల వద్ద వుండేవారు కావున ఇరువురూ తండ్రిని పరిశీలించేవారు. పెద్దవాడు తల్లికి తెలియకుండా తండ్రిని ఎంతో జాగ్రత్తగా గమనించేవాడు. చిన్నవాడిని మాత్రము తల్లి గమనించి ఎంతో గోముగా తన తండ్రి చేసే పనులన్నీ చేయకూడనివి అని హెచ్చరించింది. బాలుని మనసులో అది బలంగా నాటుకుంది. వారు ఇరువురు పెద్దవారై తమ తమ భవనాలలో ఉండజొచ్చినారు. రాజు తన కాలము ముగియ వచ్చిందని తెలుసుకొని మంత్రితో తన ఇద్దరు కొడుకులలో తగిన వారసుని ఎన్నామని మంత్రి తో చెప్పినాడు. సరేయన్న మంత్రి మొదటి కొడుకు వద్దకు పోయి చూస్థే తండ్రెంతనో తానంతగానే వున్నాడు. మంత్రి 'నీవు వ్యసనాలకు ఇంత బానిసవైపోయినావే రాజ్యము ఎట్లు ఎలగలవు' అన్నాడు. అందుకు అతడు 'వేరే ఏమి నేర్చుకోగలను ఆ తండ్రిని చూసి' అన్నాడు. మంత్రి రెండా రాకుమారుని వద్దకు పోతే ఎంతో కళా కాంతులతో అలరారుచున్నాడు. మంత్రి అతనితో కూడా అదే ప్రశ్న అడిగినాడు. అందుకు ఆ రెండవ అబ్బాయి నేను తండ్రినుండి ఏమేమి నేర్చుకొనకూడదు అన్న విషయాన్ని నేర్చుకొన్నాను. ఇది నా తల్లి పెట్టిన భిక్ష అన్నాడు. తరువాత ఎవరు రాజైవుంటారు అన్న ముగింపు మీకు తెలిసిందే . పిల్లల మానసిక స్థితికి వారి తల్లిదండ్రులే కారణము. మానసిక చికిత్సా నిపుణుడు చేయగలిగినది డబ్బు తీసుకొనుట మాత్రమె.అదే తల్లి దండ్రులు తలచితే తమ సంతును ఉన్నత శిఖరాలనధిరోహింప జేయవచ్చు. ఈనాటి మన మానసిక దుస్థితి ఈ విధముగా లేదేమో యోచించండి.పండు తేనె తెనుంగు ప్రాచి పోవగ జూచు
ప్రతిభ గలిగినట్టి ప్రభుత మనది
నన్నయ తిక్కన్న నాణెంపు కవితల
కాలాన గలిపేటి ఘనత మనది
శాస్త్రీయ సంగీత ఛాయ నాసాంతమ్ము
పడనీక కాపాడు పాట మనది
అలవలాతల కూడ అద్భుతమ్మౌకైత
యనుచు కొండాడేటి యాస్థ మనది
అమెరికా తప్పటడుగుల నడుగు లిడుచు
స్వాభిమానమ్ము నమ్మేటి సరళి మనది
విల్వలకు వల్వలెల్లను విప్పివేసి
గంతులేయించు చున్నట్టి గరిత మనది
మనదు సాస్కృతి నంతయు మరచి పోయి
నాగారీకమ్ము కౌగిట నలిగిపోయి
తాతలను వారి చేతల త్రవ్వి గోయి
పాతి పెట్టితిమన బదుల్ పల్కగలమె
ఈ విషయము గమనించండి. డబ్బు సమయాన్ని హరించుతుంది. మనము డబ్బుకు దాసులము అందుకే కుబేరుని వాహనము మనిషి . ప్రక్కనే వున్నాడు పరమేశ్వరుడు(ఉత్తరము ప్రక్కన ఈశాన్యము) . కానీ దృష్టి ఆవైపు మరలదు . దాసునిగా ఉన్నంతకాలము దండన అనుభవించ వలసినదేకదా. సమయమంతా సంపాదనకే సరిపోతే సంతానముతో సహవాసమెన్నడు.
తెల్లవారినతోడ తేనీరు సేవించి
జాగింగు చేసేసి జంట తోడ
బ్రష్షింగు బేతింగు బహుశీఘ్రముగ చేసి
కనగ నూడిల్సుతో కడుపు నింపి
కం కమ్ము కమ్మంచు కన్నబిడ్డలనంత
స్కూలుకు కారులో చొరగజేసి
అమ్మగారొకచోట అయ్యగారొకచోట
కార్యాలయంముల గడిపి గడిపి
పగటి యాకలి కేంటీను పాలు జేసి
రాత్రి కన్నమ్ము స్టవ్ లోనె రగుల బెట్టి
వీధి వంటలకొట్టుకు విధిగ బోయి
కూరలను తెచ్చి కడుపున కూరుతారు
పిల్లల ప్రేమబోయె కన పెద్దలు చేరగ వృద్ధ వాటికల్
ఇల్లను పేరు నిల్చెనది ఇమ్ముకు మారుగ నివ్వ బాధలన్
ఉల్లము చిల్లులయ్యె గన ఊహలు మొత్తము జారిపోవగన్
చెల్లని కాసుగా మిగిలె జీవిత యంత్రము త్రుప్పు పట్టగన్
'నా' నుండి'మన' చేరవలేనంటే ఎంతో
పెద్దలు లేని ఇల్లు గద్దలు తిరిగే ఆకాశము లాంటిది.
తత్సత్
No comments:
Post a Comment