ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్
“హలో! కృష్ణా వాటే ప్లెజెంట్ సర్ప్రయిజ్… హైదరాబాద్ నుంచేనా? ఏమిటి విశేషం? బెంగుళూరొస్తున్నావా? హార్టీ వెల్‍కం. రేఖకి పెళ్ళి సంబంధమంటున్నావు, వాళ్ళుండేదెక్కడ? శేషాద్రిపురమా! అంటే మేమున్న కాలనీయే.. ఆయనా? అబ్బో కుబేరుడు! మీ డాడీకేం తీసిపోడు… ఎల్లుండి మార్నింగ్ ఫ్లయిట్‍కి నా వేన్ తీసుకుని ఎయిర్‍పోర్టుకొస్తాను. వేన్ సరుకులు మోసేదే అయినా ఫ్రంట్ సీట్లో నువ్వూ, రేఖా దర్జాగా కూర్చోటానికి చోటుంది. నేను డ్రయివ్ చేస్తాను. టేక్సీ ఎందుకురా? నేనెలాగూ వేన్‍లో వస్తానుగా! హోటల్లో దిగుతారా! సిగ్గు లేదురా ఆ మాటనడానికి! ఉండు మా అమ్మని పిలుస్తా… మీ డాడీ నీ మొహం తగలేస్తే ఇక్కడ మంచి ఫ్లాస్టిక్ సర్జరీ చేసే… అదేం కుదరదు. ముందు మా ఇంటికొస్తున్నారు. బైబై”
***
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్
“గుడ్ మార్నింగ్ డాడీ! ఇక్కడికి రాగానే పెళ్ళి వారింటికెళ్ళాను. ఇంకో సంబంధమేదో ఉందని తెలిసి, ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఫ్లయిట్‍లో మద్రాస్ వెళ్ళారు. పెళ్ళికొడుకూ, అతని తల్లీ, తండ్రీ… ఈ సాయంత్రం తిరిగొచ్చేస్తారు. ఈ సాయంత్రం రేపు తిథివారాలు మంచివి కావుట. ఎల్లుండి పొద్దున్నే ఫోన్ చేస్తే పెళ్ళికొడుకు రేఖని ఎప్పుడు చూసేది చెబుతానన్నారు… పెళ్లికొడుకు తాతగారు. రేఖని వాళ్ళింటికే తీసుకురమ్మన్నారు. పిల్ల నచ్చితే వెంటనే నిశ్చితార్థం చేసుకుని వారం రోజుల్లో స్టేట్స్ కి తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ రెండునెలల్లో వచ్చి పెళ్ళీ చేసుకుంటాడుట… మన సంబంధం టాప్ ప్రయార్టీ లిస్ట్ లోనే ఉందని ఆ ముసలాయన చెప్పారు. రేఖ అమ్మకి ఫోన్ చేసిందా! నా క్లాస్‍మేట్ మధు అని.. వీడి తండ్రి హైదరాబాద్‍లోనే కస్టమ్స్ డిపార్ట్‍మెంట్‍లో ఉంటూ పోయారు. వీడి తల్లి పద్మావతిగారు మమ్మీకి బాగా తెలుసు… సారీ డాడీ వాడు ఎయిర్‍పోర్ట్ కొచ్చి బలవంతం చేస్తే… అలాగే, సాయంత్రం ఏదైనా మంచి హోటల్‍కి వెళ్ళిపోయి ఫోన్ చేస్తాను.
***
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్
“హలో మమ్మీ! హోటల్లో దిగకుండా ఓ స్నేహితుడింటికి తీసుకొచ్చినందుకు డాడీ అన్నయ్య మీద మండిపడ్డారుట. ఇక్కడవాళ్ళ గెస్ట్ రూంలో ఉంటున్నాం. చాలా సౌకర్యంగా కాలక్షేపంగా, సరదాగా ఉంది. తల్లీ కొడుకు ఎంతో మర్యాదస్తులు… అవును మీ స్నేహాన్ని గురించి చెప్పింది. నలభై మంది లేడీ వర్కర్స్ ని పెట్టి మధు ఒక ఫుడ్ ప్రోడక్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ… ‘నందినీ ఫాస్ట్ ఫుడ్స్’ అని చాలా బాగా నడుపుతున్నాడు. వెళ్ళి చూసొచ్చాము. మళ్ళీ రేపు కూడా వెళ్ళి స్టడీ చేస్తాను. ఏమిటి మమ్మీ నువ్వు కూడా హోటల్ అంటావు! మేమెక్కడికీ వెళ్ళం. ఇక్కడే ఉంటాం. ఆ పెళ్ళి కొడుకుని మేమెప్పుడు దర్శించుకోవాలో ఎల్లుండి చెబుతారుట. అంతవరకూ ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనో టి.వి చూస్తూ కూర్చోవాలా! పైగా ఈ పెళ్ళి చూపులు తతంగం సుఖాంతం అయ్యేవరకూ గోప్యంగా ఉండాలనీ ఇక్కడున్న బంధుమిత్రుల్నీ కలవొద్దనీ డాడీయే చెప్పారు. ఏ హోటల్లో దిగినా ఎవరో ఒకరు కుశలప్రశ్నలెయ్యడం తథ్యం. ఇదే భద్రమైన అజ్ఞాతవాసం. డాడీకి చెప్పు. అవును, మధుకి పెళ్ళి కాలేదు. ఓ అదా మీ భయం. అయినా ఇంత మంచి అయిడియా నాకెందుకు తట్టలేదా అని ఆలోచిస్తున్నాను. నిజమే మధుకి మంచి చదువు సంస్కారం ఉన్నాయి. స్వయంకృషితో ఇంకా ఇంకా పైకెళ్ళే అవకాశం ఉంది. అబ్బ! నాకు జ్ఞానోదయమై ఇంక ఆ సంబంధం చూడ్డం మానేస్తాననుకుంటున్నావా! ఇక్కడ ఉండటంలో తప్పు లేదంటున్నాను. ఎంత రూపవంతుడైనా, గుణవంతుడైనా, డాడీకి కావాల్సిన కోటీశ్వరుడు కాదు గదా! రేపు ఆ సంబంధం స్థిరపడితే డాడీ అపోహలన్నీ మటుమాయమైపోతాయి. గుడ్‍నైట్.
***
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్
“ఎస్.. కృష్ణా! మీ స్నేహితుడింట్లోనే ఉంటామని రేఖ ఫోన్ చేసిందిట. దానికి బుద్ధిలేకపోతే నీకైనా బుద్ధి లేదూ! నువ్వొక్కడివీ వెడితే ఏ స్లమ్ ఏరియాలో ఉన్నా ఐ డోంట్ కేర్. నాకిక్కడ డైరెక్టర్స్ మీటీంగ్ ఉండటం వల్ల.. మరి చెబితే వినిపించుకోవేమిటి? నీకు వాళ్ళు ఫోన్ చెయ్యాలన్నా, పిల్లని చూడ్డానికి వాళ్ళ బంధువులెవరైనా రావాలనుకున్నా, పిల్లని వెంటబెట్టుకు రమ్మని వాళ్ళెవరైనా కారు పంపుతామన్నా, తిథివార నక్షత్రాలేమిటి పిల్లలని కలవడానికి. నాన్‍సెన్స్. అని పెళ్ళికొడుకు అన్నా.. ఈ అడ్రస్ ఫోన్ నెంబరు ఇస్తావా! నో మోర్ డిల్లీ డాలీయింగ్. వెంటనే ఏదో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో రెండు సూట్లు బుక్ చెయ్యి. ఎక్కడున్నదీ వాళ్ళకి కూడా చెప్పు. రేపు మార్నింగ్ ఫ్లయిట్‍లో నేనూ వసంతా వస్తున్నాం. అప్పటికి పెళ్ళి చూపులైపోయినా అవ్వకపోయినా వాళ్ళని లంచ్‍కి పిలుద్దాం. సరే నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.
***
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్
‘మమ్మీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే అన్నయ్య ఫోన్ చేస్తే వెంటనే ఎనిమిదింటికల్లా రమ్మన్నారు. చాలా గౌరవ మర్యాదలతో నన్నూ అన్నయ్యనూ రిసీవ్ చేసుకున్నారు. నేనూ అతనూ ఓ అరగంట ఏకాంతంగా చాలా విషయాలు మాట్లాడుకున్నాం, మరో ముఖ్యమైన పనేదో ఉన్నట్టుంది. అతను లేచాడు. “మీరు మొన్న మద్రాసులో చూడ్డానికి వెళ్ళిన సంబంధం స్థిరపరచుకొచ్చేరనుకుంటాను… అవునా?” అని అడిగాను. అతను నా సూక్ష్మబుద్ధిని అభినందించి అవునని, ఆ సంబంధం వివరాలు చెప్పాడు. అతన్ని అభినందించి తిరిగొచ్చేశాం. వాళ్ళ తప్పేముంది! అది చాలా మంచి సంబంధం… అవన్నీ చెబుతానుగా! ఇంకా టైముంది కనుక మీ ఫ్లయిట్ టికెట్ కేన్సిల్ చేసుకోండి. మేము సాయంత్రం ఫ్లయిట్ లో తిరిగొస్తున్నాం… బై”
***
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్
“వసంతగారా! నేను పద్మావతిని బెంగుళూరు నుంచి… నమస్కారం.. అయ్యో! ఎంతమాట? కృతజ్ఞతలంటారేమిటి! కృష్ణ రేఖ మా ఇంటికి రావడం మా అదృష్టం… పోనీ ఆవిధంగానైనా వచ్చారు. మా ఇంట్లో దిగినందుకు ఆ సంబంధం కుదిరిపోతే మరింత సంతోషంగా ఉండేది. దైవసంకల్పమే అనుకోండి.. రేఖకేమిటి బంగారుబొమ్మ… అది కాకపోతే దాని తలదన్నే సంబంధమొస్తుంది. అయితే మా ఇండస్ట్రీ తాలూకు కిటుకులన్నీ రేఖ మీకు చెప్పేసిందన్నమాట! తనుకూడా ఏప్రనూ, గ్లవుసూ వేసుకుని కిచెన్‍లోనూ పేకింగ్ లోనూ చొరబడేది. మాకిక్కడో ఫ్లేట్ ఉంది. ఆయన పోయాక ఆ ఉద్యోగమేదో ఇక్కడే వెతుక్కోవచ్చునని వచ్చేశాం. ఓ స్నేహితుడు స్టేట్స్కి వెళ్ళిపోతూ ఈ వ్యాపారాన్ని మధుకి ఇచ్చేశాడు… దానితో మా దశ తిరిగి ఇప్పుడు కాస్త స్థిరపడింది. మధు పెళ్ళిమాటా? ఈ వ్యాపారంలో అభిరుచి ఉండి తనకి సాయంగా ఉండే అమ్మాయి దొరికినప్పుడు పెళ్ళిచేసుకుంటాడుట. తప్పకుండా వస్తాం, రేఖ పెళ్ళికొచ్చి వారంరోజులుంటాం.. శలవు.”
***
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్
“హలో మధూ! రేఖకి పెద్ద డిసప్పాయింట్‍మెంటేమీ లేదు. మొన్న చూసింది నాలుగో సంబంధం. అదేం కాదు. రెండు వాళ్ళకి నచ్చలేదు, రెండు దీనికి నచ్చలేదు. ఇంతకీ అసలు విషయం చెప్పనియ్యి. నువ్వు దానికన్నివిధాలా నచ్చేవుట. నువ్వు ‘ఊఁ’ అంటే మా డాడీతో యుద్ధం చేసైనా నిన్ను పెళ్ళి చేసుకుంటానని నా దగ్గర ఒకటే గొడవ. నీతో చెప్పిందట కదా! ఆ మాటా చెప్పింది.” ‘ఇలాంటి పెళ్లిళ్ళు సినిమాల్లో జరుగుతాయి. బుద్ధిగా ఇంటికెళ్ళి మీ డాడీ చూసే సంబంధాల్లో నచ్చినవాణ్ణి చేసుకో. మన పెళ్లి మాటెత్తావంటే ఇదంతా మీ అన్నయ్యా నేనూ ఆలోచించి ఆడిన నాటకం అనుకుంటారు’ అని గట్టిగా మందలించేవుటగా! అది సరే.. మరో కోటీశ్వరుడి సంబంధం దొరకాలి. దానికి నచ్చాలి. రేఖ చాలా పెంకి ఘటం.. అది ఎంతకైనా తెగిస్తుంది. కొన్నాళ్ళు దాని నోరు మూయిస్తాను. నీకిష్టం లేదని అబద్ధమాడమంటావా! ఏమో నాకు నమ్మకం లేదు. ఏ క్షణాన ఏం చేస్తుందోనని నాకు దినదినగండంలా ఉంది.. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఆంటీకి నా నమస్కారాలు చెప్పుః
***
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్
“నమస్కారం పద్మావతిగారూ! నేను వసంతని. ఈ శుభవార్త వింటే మీరు ఎంతో సంతోషిస్తారని నాకు తెలుసు. రెండు వారాలక్రితం రేఖ మీ ఇంట్లో దిగినప్పుడు ఆ సంబంధం తప్పిపోయినందుకు నిరుత్సాహపడ్డారు. ఇప్పుడంతకంటే మంచిసంబంధమే దొరికింది. పిల్లాపిల్లాడూ చూసుకున్నారు. ఇద్దరూ ఇష్టపడ్డారు. నిశ్చితార్థ తతంగం కూడా అక్కర్లేదు. అరమరికలు లేని సంబంధం. ఇక పెళ్ళి ముహూర్తం పెట్టడమే తరువాయి. పెళ్ళికొడుకు మాజీమంత్రి మాధవరావుగారబ్బాయి. స్టేట్స్ లో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మాటతప్పకుండా వారం రోజులముందరే రావాలి.. థ్యాంక్స్”
No comments:
Post a Comment