రాబోవు ఇంటర్మీడియట్ పరీక్షకు కూర్చుండదలచిన వారు రసాయన శాస్త్రములో నీ దిగువ నుదహరించిన ప్రశ్నలను జాగ్రత్తగా చూసుకుని జవాబు తయారు చేసికొనినచో లాభముండకపోదని ఒక రసాయన శాస్త్రజ్ఞుడు మాకు వ్రాయుచున్నాడు –
1) ఏ రసాయన పద్ధతుల వలన ఈ క్రింది పదార్దములు, దిగువ చెప్పబడిన సంయోగము (compound) లో నుండి విడదీయగలవు ?
ఎ. ‘వంటలక్క ‘ నుండి ‘లక్క’ను విడదీయుము.
బి. ‘కలెక్టర్ మామిడికాయ’ నుంచి కలెక్టర్ గారిని గాని, డిప్యూటి కలెక్టరును గాని విడదీయుము.
సి. ‘ఆవుకాయ’ నుండి ఆవును గాని కనీసం దూడను గాని విడదీయుము.
డి. ‘పెరుగు తోటకూర’ నుంచి పెరుగును కాని, కనీసం మజ్జిగను కాని విడదీయుము.
2) ఈ క్రింది వాటిలో ఏది భౌతిక మార్పో (physical change), ఏది రసాయనిక మార్పో (chemical change) కారణములతో కనబర్చుము.
ఎ. ప్రతిపక్షములో ఉన్న ప్రజాప్రతినిధి హఠాత్తుగా రంగు ఫిరాయించి పాలకవర్గములో క్షీరనీర న్యాయముగ కలిసిపోవుట.
బి. నల్లధనము తెల్లధనమగుట .
3) కాఫీ హోటలులో కాఫీ కొరకై ఉపయోగించెడి పాలున్నూ, భోజనపు హోటలులో మజ్జిగ అనేది పదార్ధమున్నూ, రైలు స్టేషనుల యందలి భోజనశాలల్లో దొరికెడి చారున్నూ, ఈ మూడు పదార్ధములూ వేర్వేరు పదార్దములు కావనియూ, ఒకే పదార్ధమనియూ నిరూపించుము.
4) ఎ ) గవర్నమెంట్ ఉద్యోగము మానుఫాక్చేర్ చేయి సందర్భమున దేని ఉత్ప్రేరిత శక్తి (catalytic agent) గా వాడవలెను ?
బి ) అల్లుడు మామగారి దగ్గర నుండి ధనమును పిండీకృతము (extract)చేయు సందర్భమున దేనిని ఉత్ప్రేరితశక్తి (catalytic agent ) గా వాడవలెను ?
5 ) కోర్టులలో ఇచ్చెడి ‘జడ్జిమెంట్’ అనే సంయోగ ద్రవ్యములో (compound) 1. జడ్జీ 2. ఆయన యొక్క మెంటాలిటీ అనే రెండు పదార్ధములేనా, లేక ఇంకా ఇతరములేవైనా గలవా? ఇతర వస్తువులేవైనా ఉన్న యడల, వాటిని యెట్లు కనిపెట్టగలవు ?
No comments:
Post a Comment