కథ చిన్నదే కాని... (భావం అర్థం చేసుకోండి) : పెయ్యేటి రంగారావు - అచ్చంగా తెలుగు

కథ చిన్నదే కాని... (భావం అర్థం చేసుకోండి) : పెయ్యేటి రంగారావు

Share This
కథ చిన్నదే కాని... (భావం అర్థం చేసుకోండి) 
 పెయ్యేటి రంగారావు

అయ్యన్న కడు పేదవాడు.  అతడికి ధనవంతులని చూస్తే కడుపు రగిలిపోతూ వుండేది.  వాళ్ళు ధనవంతులుగా ఎలా పుట్టారు?  తను పేదవాడిగా ఎందుకు పుట్టాడు?  ప్రపంచం లోని అన్ని సుఖాలు వాళ్ళకు, అన్ని కష్టాలు తనకు ఎవరు రాసిపెట్టారు?  అసలు దేవుడనే వాడున్నాడా?  ఉంటే ప్రపంచంలో ఇన్ని అసమానతలు ఎందుకు కల్పించాడు?  ఇల్లా అతడి ఆలోచనలు పరిపరివిధాల పోతూ వుండేవి.  ఐనా పెద్దలనుంచి అతడికి కాస్త దైవభక్తి అబ్బింది.  అందుకని రోజూ గుడికి వెళ్తూండేవాడు.  అక్కడ దేవుడిని ఇల్లా ప్రార్థించేవాడు , ' స్వామీ!  నన్ను కోటీశ్వరుడిని చెయ్యి.'చాలా సంవత్సరాలు గడిచాయి.కాని అయ్యన్న కోటీశ్వరుడు కాలేదు.  అతడి కష్టాలూ తీరలేదు.  అప్పుడు అయ్యన్న తీవ్రంగా ఆలోచించాడు.  తను చేస్తున్న పని ఏమిటి?  రోజూ గుడికి వెళ్ళి, ' స్వామీ!  నన్ను కోటీశ్వరుడ్ని చెయ్యి.' అని ప్రార్థిస్తూండడమేనా?  అంతకుమించి కోటీశ్వరుడు కావడానికి తనేమన్నా ప్రయత్నాలు చేస్తున్నాడా?  హోరుగాలిలో దీపం పెట్టి, ' భగవంతుడా!  నీదే భారం.' అంటే ఆయన మాత్రం ఏం చెయ్యగలడు?  మానవప్రయత్నం అంటూ లేనప్పుడు, భగవంతుడు వైకుంఠం నించి దిగివచ్చి, ' వత్సా!  నీ భక్తికి మెచ్చితిని.  ఇదుగో, నీ ఇంటినిండా కాసుల వర్షము కురిపించుచున్నాను. సుఖపడుము.' అనడు కదా?
అందుకని తనవంతు ప్రయత్నం తను చేసితీరాలి.  ఐతే ఏం చెయ్యాలి?  పగలంతా రిక్షా తొక్కి కోట్లు సంపాదించగలడా?  అలా కోటీశ్వరుడు కావడానికి ఇదేమన్నా సినేమా  ఏంటి? ఐతే ఏం చెయ్యాలి? ఊహు!  తను ప్లాన్డ్ గా ఆలోచించాలి. ప్రపంచంలో కోట్లు సంపాదించిన వాళ్ళు ఎలా సంపాదించారు?  అకస్మాత్తుగా ధనవంతులు ఎలా కాగలిగారు?  అక్రమంగా సంపాదించి.  భూకబ్జాలు చేసి.  అధికారులకి లంచాలిచ్చి అక్రమంగా కంట్రాక్టులు సంపాదించి.  రాజకీయాల్లోకి ప్రవేశించి, లక్షలు చల్లి, ఓట్ల్లు కొని  కోట్లు సంపాదించి.   ఊహు!  అల్లా చెయ్యాలంటే ముందు తన దగ్గర పెట్టుబడి వుండాలి కదా!  తనసలే పైసకి ఠికానా లేని వాడయ్యె.  మరి తనేం చెయ్యాలి? ఎస్!  ఒక్కటే మార్గం వుంది.  జై వాల్మీకి అనుకుంటూ దారిదోపిడీలో, దొంగతనాలో చెయ్యాలి.  దొంగతనం అంటే అప్పుడైనా ఒక్కసారిగా కోట్లు రావుకదా?  అవును, ఇంక ఏ బ్యాంకునైనా కొల్లగొట్టాలి. ఈ ఆలోచన రాగానే అయ్యన్నకి హుషారొచ్చింది.  దాని గురించి తీవ్రంగా ఆలోచించి ప్లాను వేసుకున్నాడు.  రెక్కీలు నిర్వహించాడు.  దొంగతనానికి ముహూర్తం ఎంచుకున్నాడు. ఆరోజు దేవుడికి మొక్కుకున్నాడు. ' స్వామీ!  ఇవాళ బ్యాంకుకి కన్నం వెయ్యబోతున్నాను.  నేను పోలీసులకి దొరకకుండా కాపాడితే నీ హుండీలో లక్ష రూపాయలు వేసుకుంటాను.' ఆరాత్రి అయ్యన్న బ్యాంకుకి కన్నం వేసి కోటీశ్వరుడయ్యాడు.  అనుకున్న ప్రకారం స్వామివారి హుండీలో లక్షరూపాయలు వేసి మొక్కు తీర్చుకున్నాడు.  అక్కడినించి మకాం మార్చేసి మరో రాష్ట్రానికి చెక్కేసాడు. నెమ్మదిగా ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా పైకి వచ్చినట్లు సంఘంలో కనిపించాడు.  తరవాత దానధర్మాలు, రాజకీయ పార్టీలకి చందాలు ఇస్తూ తన పలుకుబడి క్రమంగా పెంచుకున్నాడు.  ఇలా అనతికాలంలోనే పెద్దమనిషిగా చెలామణీ కాసాగాడు.  ఐతే ఏరోజూ అతడికి కంటిమీద కునుకు లేదు.  ఎప్పుడు ఏం జరుగుతుందో, పోలీసులు ఏ క్షణాన వచ్చి తనని అరెస్ట్ చేస్తారో అన్న భయం ఒక మూల, సంపాదించుకున్న సొమ్ముని ఏ క్షణాన ఏ దొంగ వచ్చి దోచుకుపోతాడో అన్న ఆందోళన ఒక పక్క, ఇలాంటి చింతలు అతడిని నిద్రకు, సుఖానికి, ప్రశాంతతకు దూరం చేసాయి.  అందువల్ల అతడి ఆరోగ్యం కూడా దెబ్బతిని, తిన్నది సరిగా జీర్ణం కాక అనేకరకాలుగా ఇబ్బంది పడేవాడు. అందుకని రోజూ గుడికి వెళ్ళి ఇలా ప్రార్థించేవాడు, ' స్వామీ!  నా అపరాధాల్ని మన్నించు.' చాలా రోజులు గడిచాయి.  ఇంక అయ్యన్నకి ధైర్యం వచ్చేసింది.  ఇంక పోలీసులు కూడా ఆ కేసుని మూసేసి వుంటారు.  ఇంక తన జోలికెవరూ రారు అని స్తిమితపడ్డాడు. కాని ఒక దుర్దినాన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసారు.  అతడు దోచుకున్న డబ్బంతా ఊడలాక్కుని అతడ్ని జైలుకి పంపారు. అయ్యన్న కొన్ని సంవత్సరాల కఠిన కారాగారశిక్ష అనుభవించాడు.  జైలు జీవితం గడుపుతున్నప్పుడు అతడిలో కాస్త తత్వచింతన మొదలైంది.  ఒంటరిగా వుండడం వల్ల ఎక్కువగా దైవధ్యానం చేసుకునే అవకాశమూ కలిగేది.  ఆ విధంగా అతడిలో బాగా మార్పు వచ్చింది.  పైగా జైలులో క్రమబధ్ధమైన జీవితం గడుపుతూండడం వల్ల అతడి ఆరోగ్యం కూడా పూర్తిగా బాగుపడింది. విడుదలై బైటికొచ్చాక తన పరిస్థితి చూసుకుంటే అతడికి నవ్వు వచ్చింది.  వైకుంఠపాళీలో నిచ్చెనలన్నీ ఎక్కి, ఇంక పరమపదాన్ని చేరుకుంటాడనగా అరుకాషుడు కాటేసి అట్టడుక్కి లాగేసాడు. అయ్యన్న కూలిపని చేసుకోసాగాడు.  ఏరోజు వచ్చిన డబ్బులు ఆరోజే ఖర్చు పెట్టుకుని, కడుపుకింత హాయిగా తిని, సుఖంగా నిద్రపోతున్నాడు.  ఈ జీవితమే బాగున్నట్టుందే అని అనిపించసాగింది అతగాడికి.  జై వాల్మీకీ అనుకున్నందుకు ఆ రామాయణ కర్తే తన మనసుని మార్చాడేమో అని సంతోషపడ్డాడు. ఇప్పుడు కూడా అయ్యన్న రోజూ గుడికి వెళ్తున్నాడు.  కాసేపు కళ్ళు మూసుకుని నిశ్చలంగా ధ్యానం చేసుకుంటాడు.  కాని ఏదీ కావాలని దేవుడ్ని అడగడు.  ఇప్పుడతడికి ఏ కోరికలూ లేవు.  నిష్కామంగా ధ్యానం చేసుకుంటాడు.  కోరికలే అన్ని అర్ధాలకి, అనర్థాలకి మూలం అని అతడికి తెలిసివచ్చింది.  అంతేకాదు.  భగవంతుడికి లంచం ఇచ్చి అనుచితమైన కోరికలు తీర్చమనడం సరికాదు అని, క్రితం జన్మలోగాని, ఈ జన్మలో గాని, తను చేసుకున్న పుణ్యాలకి గాని, పాపాలకి గాని ఫలితం తనే అనుభవించి తీరాలని, భగవంతుడు అందరి ఎడల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడని అతడికి తెలిసి వచ్చింది. ఇప్పుడతడు హాయిగా ప్రశాంతంగా వున్నాడు.  సంపాదించుకున్న దాంట్లో కొంత దానధర్మాలు చేస్తాడు.  రేపటి కోసం దాచుకోవాలన్నతాతత్రయం కూడా ఇప్పుడతడిలో ఏ కోశానా లేదు.;  ఉంచవృత్తితో (ఏ రోజు భుక్తి ఆ రోజే సంపాదించుకోవడం - త్యాగరాజు గారిలాగ) ప్రశాంతంగా జీవిస్తున్నాడు.
********** 

No comments:

Post a Comment

Pages