ఒక్కడే..ఒక్కడే 'ఆంధ్రరత్న' ఒక్కడే !! - అచ్చంగా తెలుగు

ఒక్కడే..ఒక్కడే 'ఆంధ్రరత్న' ఒక్కడే !!

Share This
ఒక్కడే..ఒక్కడే 'ఆంధ్రరత్న' ఒక్కడే !!
- కరణం కళ్యాణ్ కృష్ణకుమార్

అవును 'భారతరత్న' లెందరున్నా..! 'ఆంధ్రరత్న' మాత్రం ఒక్కరే..! ఆయనే శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య...
2014 జూన్ రెండున దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి 125 వ జన్మదినం సందర్భంగా వారి గురించి ఒక రెండు మాటాలు గుర్తుచేసుకుందాం.
జాతీయ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉందని కొంతమంది ఆనాటి వారికే తెలుసు.. మరి ఈనాటి వారికెందరికెరుక.?
ఢిల్లి నుంచి విజయవాడకు కాంగ్రెస్ కార్యాలయాన్ని తరలించడం వెనుక అప్పటీ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా అతి పిన్న వయసులోనే ఎదిగిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి ధైర్యం సాహసం, నేర్పు ఉన్నాయని ఎందరు కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు?
ప్రపంచాన్ని అట్టుడికించి, బ్రిటిష్ దొరలను బెంబేలెత్తించిన గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి దానికి తొలి ప్రయోగం చేసి ...బీజం వేసిన ఉద్యమం ' చీరాల -పేరాల ' ఉద్యమం అని దానికి కర్త కర్మ క్రియ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అని తెలుగువారికెందరికి తెలుసు?
దుగ్గిరాల వారి జననం : 1889, జూన్‌ 2
జన్మస్థలం : పెనుగంచిప్రోలు (కృష్ణా జిల్లా)
తల్లిదండ్రులు : సీతమ్మ, కోదండరామస్వామి
భార్య : దుర్గాభవానమ్మ , ఏకైక కుమారుడు కీ.శే శ్రీరామచంద్రమూర్తి
చదువు : ఎం.ఏ
చదివింది : బాపట్ల (గుంటూరు)లో,స్కాట్ ల్యాండ్ లో
ప్రాముఖ్యత : చీరాల-పేరాల ఉద్యమం సారధి , రామదండు నిర్మాత
తెలుగు జానపద కళారీతుల పునరుద్ధరణ,నవ్యబ్రాహ్మణ సిద్ధాంత రూపశిల్పి
మరణం : 1928 జూన్ 10
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జయంతి జూన్ 2 వర్ధంతి జూన్ 10 .. అంటే నవరాత్రులు దుగ్గిరాల వారి ని గుర్తుచేసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. 1889- 1928 మధ్య కాలాన్ని దుగ్గిరాల్ కాలంగా పరిగణించి .. ఇలాంటి మహనీయుల ముందస్తు చర్యలను గమనించి, వారి కోర్కెల ఆవశ్యకతను గుర్తించి. ముందుతరాలకు మహనీయుల సంస్కృతిని అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనేది వాస్తవం.
శ్రీ దుగ్గిరాల వారు ఒక గొప్ప భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. దుగ్గిరాల వారు జూన్ రెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామములో జన్మించారు.దుగ్గిరాల వారిలో ఒక సహజ కవిని,వక్తని,గేయ రచయితని,సిద్ధాంతకర్తని,గాయకుడిని, నటుడిని, రాజకీయ వేత్తను,స్వాతంత్ర్య పిపాసిని, సాహిత్య , సంగీత, జ్ఞాన, భక్తి, ధైర్యం కలబోతను మనం చూడొచ్చు.
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కారణజన్ముడనడం అతిశయోక్తి ఏమాత్రం కాదు.
స్కాట్ లాండ్ నివాసి..ప్రముఖ విదేశీ హిందువైన ఆనంద్ కాంటీష్ కుమార్ స్వామి తో కలిసి సంస్కృత గ్రంధం నండికేశుడు రచించిన అభినయ దర్పణం ను ఆంగ్లంలోకి "మిర్రర్ ఆఫ్ గ్లింసెస్" గా అనువదించిన బహుభాషాకోవిదుడు దుగ్గిరాల.
ఎన్నో విధాలుగా తెలుగు జాతికి, తెలుగు భాషకు ఆయన చేసిన సేవ అనంతమైనా.. కనీస గుర్తింపుకు నోచుకోకపోవడం మాత్రం శోచనీయం.
'చీరాల రామదాసు' (సి.ఆర్.దాస్) గా తనకు తానుగా చెప్పుకునేంతటి రామభక్తుడు గోపాలకృష్ణయ్య.

" శ్రీవిభుడు శ్రీరామచంద్రుడు
భూవిభుడు కోదండరాముడు
భువిని వెలసెను రామనగరిని
కవిజనాశ్రయుడై..
శ్రీ వరౌడు సుగుణాభిరాముడు
భవుడు శ్రీ కోదండరాముడు
ఆదిని భారముబాప మాపురి
బవనసూనుని గూడి వెలసెను
కవనగాన వినోద వాక్సుమ
సవన మర్పింతున్"

అంటూ చీరాల రామనగరులో తన అంతిమ ఘడియలలో ఆశువుగా చెప్పిన పద్యం గోపాలకృష్ణుని రామభక్తికి నిదర్శనం.
అంతటితో ఆగకుండా

సీ. శ్రీగిరిజాపతి.. స్మితముఖాంభోరుహ
సారస్యమధుపాన సమయములను,
బ్రహ్మాది మునిముఖ్య ప్రార్ధిత దానవ
సంతాన సంహార సమయములను
వరకుచేలాది భూసుర భక్త సంత్రాన
సంరంబ సాదృశ్యసమయములను
నవయుగోదయ వేళ భవసమంచితవస్తు
సంతానము సృజించు సమయములను

తే.గీ ప్రళయాతాండవ ముద్దండలీల వెలయ
రాజరాజేశ్వరీ మనోరాజ్యమేలు
సమయముల నాదు బల్కుల జాడవినుము
రామనగరీవరాంగ శ్రీరామలింగ.."

దుగ్గిరాల వారి భాష పట్టు అజరామరం..
" దుగ్గిరాల వారి సంస్కృతాంధ్ర భాషల సంపద... అల్లసాని వారినందుకున్నది. వారి కవిత్వధోరణి తెనాలి వారి సరళిని స్ఫురింప జేస్తుంది. ఆంగ్లభాషలో ఆయన పటిమ జాన్సన్ శైలిని ధిక్కరిస్తోంది." అని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు నడింపల్లి నరసింహారావు ఒకానొక సంధర్భంలో వ్యాఖ్యానించారు.
జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి, శ్రీనివాస అయ్యంగార్ వంటి ప్రముఖుల సహాయంతో 'సాధనా అనే వారపత్రికను బెజవాడ నుంచి ప్రారంభించి, 26.12.1924 న బెల్గాంలో జరిగిన అఖిల భారత సమావేశంలో గాంధీజీ చేత విడుదల చేయించారు.
స్కాట్ లాండ్ లో బార్-ఎట్-లా చేసిన దుగ్గిరాల గురువు ఆనంద్ క్యాంటిష్ కుమార స్వామి తో కలసి నందికేశుని అభినయ దర్పణం ఆంగ్లం లోకి మిర్రర్ ఆఫ్ గ్లెస్చర్స్ 'గా అనువదించిన సమయానికి దుగ్గిరాల వారి వయసు కేవలం 25 సంవత్సరాలే అంటే ఆశ్చర్యం కలగకమానదు.

"ఆంగికం భువనం యస్య
వాచికం సర్వ వాజ్ఞ్మయం
ఆహార్యం చంద్రతారాది
తం వందే సాత్వికం శివం" అంటూ నేటికి కూడా సాంఘిక నాటకాల ప్రారంభోత్సవం లో బృందం చేసే ప్రార్ధనా గీతం మైన ఈ శ్లోకం అభినయదర్పణం లోనిదే.!
స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వారిచే అరెస్తు కాబడి తిరుచునాపల్లి జైలులో కారాగారవాసం పూర్తై 02.10.1922 న విడుదలై కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగనాథ స్వామి దర్శనం చేసుకున్న సమయంలో దుగ్గిరాల వారి ఆశు శ్లోకాలు పండిత రాజకృత గంగాలహరి శ్లోకాల స్థాయిలో ఉన్నాయని సాహితీ వేత్తల అభిప్రాయం.
"ఆంధ్రోహం" అంటూ తెలుగు భాష పై తనకున్న మమకారంతో తమిళదేవుని కోరినదంతా సమకాలీన సమాజ పరిస్థితులలో స్వాతంత్ర్య పోరాటం చేస్తున్న వారి కోసమే.., స్వామి గుణగణాలతో మాత్రమే వారి స్తోత్రం ఉంటుంది తప్ప ఎక్కడా తనకోసం అన్న స్వార్ధం కనబడదు.
హాస్య చలోక్తులు అనేక భాషల పదాలతో చక్కని పద్యబంధనం కావించడంలో ఆంధ్రరత్న తనకు తానే సాటి. "రామనగరీ నరేంద్ర శ్రీరామచంద్ర " అనే మకుటంలో అనేక పద్యాలు వ్రాసిన గుగ్గిరాల పాండిత్యం ఒక ప్రత్యేకమైన శైలిలో సాగిందనే చెప్పాలి. తాను చెప్పదలచుకున్న దానిలో ఎదుటి వారెవరైనా ధిక్కారధోరణి స్పష్టంగా కనపడుతుంది దుగ్గిరాల కవిత్వంలో..

"కరతాల శబ్ధాల దరువు గోరె
దేశబంధుని దశల్దివశాలతో దీర్చె
రాజగోపాలాచారి బూజుపట్టె
కొండెంకటప్పన్న ఉండి లేకుండెను
భాయి పటేళ్ళూ నిర్భాగ్యులైరి
లాలలజపత్రాయి కోలుపోయను శ్రద్ధ
చండి సరోజిని పండిపోయె
ఆలీలు గోలీలు గేళీ సవాల్ మాని
ఖాళీగ థాలీలపాలుపడిరి
జమ్నులాలు శెట్టి తుమ్నవీము బట్టె
ఖద్దరు ఖాన్ సాబు సర్ధు చుండె

తే.గీ మొదటి తాకిడికింతటి మోసమయ్యె
ఖ్యాతికొక్కడు నిల్చె మా మోతీలాలు
ముందుగతులెట్టు లౌనో ఖామందు వీవు
రామనగరి నరేంద్ర శ్రీరామచంద్ర."
అంటూ గాంధీ రాక కూడా సాదా సీదా గా ఉంది.. ఆయన టైం చెల్లిపోయింది.. ఇక దేశానికి మోతిలాలే దిక్కు అంటూ కాంగ్రస్ నాయకులను నాన్ - కో ఆపరేషన్ నాయకులంటూ ఎండగట్టారు దుగ్గిరాల. ఈ పద్యంలో చిత్తరంజన్ దాస్ , మోతీలాల్ నెహ్రూ ఎన్నికలలో పాల్గొనాలంటే.. కాదు కూడదంటూ గాంధీ వర్గీయులు పట్టుబట్టారు.. గాంధీ వర్గీయులైన వల్లభాయ్ పటేల్, విఠల్ భాయి పటేల్ (భాయి పటేళ్ళు), షౌకత్ అలి, మహ్మద్ అలీ(ఆలీలు), జమున్ లాల్ బజాజ్ (జమ్నులాలు), ఖాన్ అబ్ధుల్ గఫార్ ఖాన్ (ఖాన్ సాబ్), లాలాలజపతిరాయ్ ,సరోజిని నాయుడు వంటి వారినందరినీ దూషిస్తూ.. ఖ్యాతికొక్కడు గ నిల్చి మా మోతిలాలు అని గర్వంగా ప్రకటించాడు అంతకు ముందు గాంధీ జీకి పరమ భక్తుడైన దుగ్గిరాల.
ఇక తనకు అభిమాన నేతలపై ఆయన చిన్నెలు అన్నీ ఇన్నీ కావు..
"ఆంధ్ర పత్రిక తోడ అంఋతాంజనంబిచ్చి
తలనొప్పి బాపెడు ధన్యుడెవ్వడు?
లక్షలాది డబ్బు దీక్షతో సమకూర్చి
భిక్షకోటిని గాచు దక్షుడెవ్వడు?
ప్రతి 'కాన్ఫరెన్స్ 'నూ గతి నీవె యని వేడ
'ప్రసిడెంటు ' గా నేలు రసికుడెవ్వాడు
మితవాది హితుడౌచు నతివాద గతుడౌచు
నందు నిందును జేరు..డెవరు?
తే.గీ. అట్టి కాశీనాధుని నాగ యాహ్వయుండు
పుట్టకుండిన నాంధ్రంబు పుట్టీ మునిగి
గిట్టకుండునె యేనాడో యట్టె నీల్గి
రామనగరీ నరేంద్ర శ్రీరామ చంద్ర..!"

ఆంధ్రపత్రిక పెట్టి దానివల్ల వచ్చే తలనొప్పి తగ్గించేందుకు అమృతాంజనం ఇచ్చే గొప్ప వ్యాపారి దేశభక్త కాశీనాథుని నాగేశ్వరరావు అని ఈ దేశోధారకుడైన నాగేశ్వరరావు ప్రతి కార్యక్రమంలో ప్రెసిడెంటుగా ప్రత్యక్షమవుతాడని కవి ఉవాచ.
ఇలాంటి వాటిలో మేటి ఆంధ్రరత్న. అంతే కాక తనతో పాటు తనకు తెలిసిన, వారిని కూడా విమర్శించడం దుగ్గిరాల స్పెషల్.. అలాంటి హాస్యంలో ఓలలాడించే ఈ పద్యం.. గోపాలకృష్ణయ్య హాస్య చతురతను ఇట్టే పరిచయం చేస్తుంది. ఇలాంటి ఎన్నో విలక్షణ కవితలు తన స్నేహితులైన ప్రకాశం పంతులు, రాధాకృష్ణన్, సర్ రామలింగారెడ్డి వంటి వారి మీద ఎన్నో పద్యాలు హాస్య చలోక్తులు ఎలాంటి బెరుకు లేకుండా అలవోకగా సాగేవి.
(బందరులోని జాతీయ కళాశాలలో లెక్చరర్ గా పనిచేయునప్పుడు రాధాకృష్ణన్ తో పరిచయం.ప్రకాశం పంతులుతో నాటకాలాడారు.)

"కొండక్కటప్పన్న గుండు సున్న గదన్న
గోపాలకిట్టాయి కొక్కిరాయి
టంగుటూరి ప్రకాశ మింగిలీసు పిశాచి
నాగేశ్వరుడు వట్టి నాగ జెముడు
పట్టాభి సీతన్న తుట్టె పురుగుగదన్న
ఉన్నవ లచ్చుమన్న దున్నపోతు
గొల్లపూడి సీతన్న కళ్ళులేని కబోది
బులుసు సాంబడు వట్టి పుటుకుంక
అయ్యదేవరవాడు,పెయ్యనాకుడుగాడు
అయ్యంకి రమణయ్య దయ్యమయ్య
డాక్టర్ సుబ్రహ్మణ్యం మాక్టింగ్ ఫులిస్టాపు
దువ్వూరి సుబ్బమ్మ దిష్టి బొమ్మ

తే.గీ. అనుచు బల్కుచు నుండిరీ ఆంధ్రజనము
నాయకత్వంబు నడిచిన నాటనుండి,
తపములేనిది యెన్నరే,నెపమునెల్ల
రామనగరీ నరేంద్ర శ్రీరామచంద్ర

......." అంటూ ఒక పద్యంలో... ఆంంధ్ర జనం నాయకులను తిట్టూకుంటున్నారనుచు.. తోటి నాయకులతో కలిపి తనను తాను కొక్కిరాయి గా వర్ణించుకున్నారు గోపాలకృష్ణయ్య. ఈ పద్యంలో
కొండా వెంకటప్పయ్యను( బట్టతలను గుండుసున్న),పట్టభి సీతారామారావు గారిని (తుట్టెపురుగంటు దూనమాడారు.), ఇంగ్లీషంటే ప్రాధాన్యమిచ్చే స్వరాజ్య ఆంగ్ల పత్రిక స్థాపించిన ప్రకాశం పంతులును ను ఇంగ్లీషు పిచ్చి అంటుంటారు ఆనాటి వారు.. కాశీనాధుని నాగేస్వరరావు ఎక్కడ సభ వుంటే అక్కడ నాగజెముడు మొక్క మొలిచినట్లు కనబడతారని వ్యంగ్యంగా చెప్పారు. లావుగా వుండే ఉన్నవ లక్ష్మినారాయణను, కళ్ళజోడుండే.. గొల్లపుడి సీతారామయ్యనూ ఆయన విడిచిపెట్టకుండా.. సెటైర్ వేశారు.
లావొక్కింతయు లేదు ..ధైర్యము విలోలంబయ్యెన్.. అనే పోతన పద్యాన్ని 'లా'(LAW) ఒక్కింతయు లేదంటూ అప్పటి బ్రిటిష్ పాలకులపై పేరడీలు విసిరారు దుగ్గిరాల.

శిలలజూచి నరులు శివుడని భావింతురు
శిలలు శిలలే గాని శివుడు కాడు
తనదులోని శివుని దానేల తెలియడడో .. అని వేమన పద్యం..
అందుకు ఆంధ్రరత్న

శిలలోన గలుగు జీవుని దెలియక
వాని నిశ్చలతయు వాని పరత
తెలియకిట్ల ప్రేల తెలివియౌనటే నీకు
వినయమెప్పుడు గల్గు వెర్రివేమా...... అని భోధ చేశాడు .

దుగ్గిరాల సంస్కృతి,భాషల సంపద అల్లసాని వారినందుకున్నది.. వారి కవితా ధోరణి తెనాలి వారిని స్ఫురింపజేస్తుందన్నది.. ఆర్ధమౌతోంది కదూ..!
రాజకీయ ఉద్దండుడిగా దుగ్గిరాలను చెప్పుకోవాలి.. విదేశంలో చదువుకుంటున్నప్పుడే గాంధీ
పోరాటానికి ఆకర్షితుడై.. ఏదో ఒకటి దేశమాతకు చేయాలనే ధృడ సంకల్పంతో భారతదేశానికి తిరిగి వచ్చిన దేశభక్తుడు ఆంధ్రరత్న. కాంగ్రెస్ లో కీలక పాత్ర వహిస్తూ.. కాంగ్రెస్ దిశ..దశ కోల్పోయిన సమ్యంలో పగాలు దుగ్గిరాల వారికందించారు .. మొట్టమొదటి దక్షిణ భారతీయుడు.. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం దుగ్గిరాల వారే అంటే ఆశ్చర్యం కలుగక మానదు.. భారత జాతీయ కాంగ్రెస్ కు ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టడమే గాక.. మరో దక్షిణ భారతీయుడు.. దుగ్గిరాల స్నేహితుడైన విశాల భావాలు గల దేశభక్త కొండా వెంకటప్పయ్యను జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రతిపాదించడంలో స్క్సెస్ అయ్యరు దుగ్గిరాల ఈ ఘటన 1923 న నాగపూర్ లో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ సమావేశంలో జరిగింది. డిల్లీలోని జాతీయ కాంగ్రస్ కార్యాలయాన్ని ఆంధ్రకు తరలించాలని దుగ్గిరాల్ ప్రయత్నాని గమనించి గుంటూరు కు తరలించాలని కొండెంకటప్పయ్య చెప్పినా.. విజయవాడలో ప్రాధాన కార్యాలయం ఏర్పాటు చేశారు దుగ్గిరాల. నేటికీ ఆంధ్రరత్న భవనంగా విజయావాడ కాంగ్రెస్ భవనం కొనసాగుతోంది.
చీరాల, పేరాల,వేటపాలెం పంచాయితీను కలిపి 1920 ప్రాంతంలో మున్సిపాలిటీగా చేసి ఎక్కువ పన్నులు వేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర పన్నింది. దీనిని ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకించారు.. అప్ప్టికే చీరాలలో ఉంటున్న దుగ్గిరాల వద్దకు విషయం చేరింది.. గాందీ జీతో విషయమై చర్చించారు దుగ్గిరాల.. అప్పటికే సహాయ నిరాకరణోద్యమానికి పథకరచన చేస్తున్న గాంధీజీకి .. చీరాల పరిస్థితి.. ని పరిశీలించి " పురత్యాగానికి సిద్దంకండి.. కానీ ఒక షరతు.. విజయం సాధిస్తే... కాంగ్రేస్ కి చెందుతుంది.. ఓటమి పాలైతే పూర్తిగా గోపాలకృష్ణయ్యే బాధ్యత వహించాలి" అన్నారు గాంధీజీ.. దానికి వెనువెంటనే అంగీకరించిన గోపాలకృష్ణయ్య రెండు ప్రాంతా వాసులతో స్సమావేశమై దుగ్గిరాల అడుగు జాడల్లో పురత్యాగానికి సై అంటూ చీరాల- పేరాల ఉద్యమానికి ఊపిరులూదారు స్థానికులు. అప్పుడు చీరాల - పేరాల జనభా 15,326 కాగా.. 13,572 మండి స్వంత ఇళ్ళను వదిలి ఊరి బయట పాకలు వేసుకుని.. బావులు త్రవ్వుకుని జీవనం కొనసాగించారు.. దీంతో బ్రిటీష్ మూకలు దడదడ లాడాయి.. పదమూడు నెలలపాటూ జరిగిన ఈ పురత్యాగం అన్న చీరాల- పేరాల ఉద్యమం బ్రిటిష్ పార్లమెంటులో కూడా ఆనాడు పలు సార్లు చర్చకు వచ్చింది.. దీంతో సంతోషించిన గాంధీజీ దేశ వ్యాప్త సహాయ నిరాకరణోద్యమానికి పచ్చ ఝండా ఊపారు.
'రామదండు' అని ఒక సంఘసేవా సంస్థను పెట్టి వేలాది మంది వాలంటీర్లను దేశం కోసం తయారు చేసీన దూరదృష్టి దుగ్గిరాలది.
10.06 1921 న జరిగిన గుంటూరు జిల్లా కాంగ్రస్ మహాసభలో అధ్యక్షుడు శనగపల్లి రామస్వామి గుప్త .. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకు 'ఆంధ్రరత్న ' బిరుదును ప్రదానం చేశారు.
అంతటి మేధో సంపత్తు.. దీక్షా పట్టుదల, సాహసం - ధైర్యం, కవి- నటుడు వున్న గోపాలకృష్ణయ్య జూన్ 10 1928 న క్షయ వ్యాధితో బాధపడుతూ.. తనువు చాలించారు..

ఆయన ఆశయాలలో మచ్చుకు కొన్ని ;
భారతీయ ప్రజలందరినీ బ్రాహ్మణులను చేయాలి
చీరాల లో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి
రామాలయం రామనగరులో నిర్మించాలి..
ఈ కోర్కెలు తీరకుండానే మృత్యువు దుగ్గిరాలను తన్ కౌగిట్లో బంధీ చేయడం.. అందునా కేవలం 39 ఏళ్లకే ఆయన మృత్యువాతపడటం శోచనీయం.

(ఈ వ్యాసానికి ఆధారం.. మా తండ్రి గారైన శ్రీ కరణం సుబ్బారావు గారి ' మన ఆంధ్రరత్న ' అనే పరిశోధాత్మక రచన అని సగర్వంగా తెలియజేస్తున్నాను...)
NOTE : అంతటి గొప్ప వ్యక్తుల, దేశభక్తుల జీవిత చరిత్రలు మనం చదవాల్సిన అవసరం ఎంతైనా వుంది .. మనం చదవడం తో పాటూ మన ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యవంటి వారి జీవితాశాయాలు చిన్నారులకు అందిస్తే.. మంఛిది. సర్వేజనా సుఖినో భవంతు.

No comments:

Post a Comment

Pages