భైరవ కోన (జానపద నవల 4 వ భాగం )
రచన :భావరాజు పద్మిని
(జరిగిన కధ : సదానందమహర్షి గురుకులంలో శిక్షణ పూర్తి చేస్తాడు భైరవపురం రాకుమారుడు విజయుడు. గుహ్యమైన గుహలోని భైరవ –భైరవి దేవతల అనుగ్రహం పొందమని చెప్తూ, విజయుడి కోరికపై భైరవారాధన విశిష్టతను గురించి తెలియచేస్తారు మహర్షి. భైరవ కృపకై బయలుదేరిన గురుశిష్యులను అడ్డగించ బోతాడు కరాళ మాంత్రికుడు. నృసింహ మహా మంత్రంతో కరాళుడి దుష్టశక్తిని పారద్రోలి, విజయుడికి శక్తి భైరవ మంత్రం ఉపదేశించి, తపస్సుకై గుహలోనికి పంపుతారు మహర్షి. భైరవకృప వల్ల విజయుడికి ఒక దివ్య ఖడ్గం, వశీకరణ శక్తి లభిస్తాయి. తన గురువుకు అవి చూపాలని, ఆత్రంగా వెళ్తున్న విజయుడిని ఢీకొని స్పృహ కోల్పోతుంది ఓ రాకుమారి. ఆమెను చిరుతపులి నుంచి రక్షించి, ఆమె అందానికి విస్మయుడై, ఆమెను స్పృహలోకి తెప్పించి, తన వారివద్దకు చేర్చాలనుకుని, ఆమె మోముపై నీరు చిలకరిస్తాడు విజయుడు.) నెమ్మదిగా కనులు తెరిచిన ఆమెకు, మళ్ళీ చిరుత తనను వేటాడడం గుర్తొచ్చింది. ఒక్కసారి భయంతో విజయుడిని హత్తుకుంది. ఆమెకు స్వాంతన చేకూర్చేలా వీపు తట్టి ధైర్యం చెప్పాడు విజయుడు. ఆ స్పర్శలో ఆమెకు ‘నీకు మరేం భయం లేదు, నేనున్నాను...’ అన్న భావన కలిగింది. కాస్తంత తేరుకుంది. హఠాత్తుగా ఆమెకు తాను పరపురుషుడి కౌగిలిలో ఉన్నానన్న విషయం జ్ఞాపకం వచ్చింది. ఒక్కసారి, విజయుడి నుండీ విడివడి, అతనికేసి తేరిపారా చూసింది. ఇన్నాళ్ళు తన కలలో కనిపించి కవ్వించిన రూపం... తాను కొలిచే కనకదుర్గ అమ్మవారు, ‘ఇతడే నీ కాబోయే భర్త...’ అంటూ ధ్యానంలో చూపిన రూపం. ఆ అరవిందలోచనాల నుంచీ జాలువారే అనురాగ వర్షంలో తన కలల లోగిలిలో ఎన్ని సార్లు తడిసిందో ! స్ప్రురద్రూపం, రాజసం, తేజస్సు, అతని మోహంలో ఉట్టిపడుతోంది. ఖచ్చితంగా ఇతనే, తన ప్రాణసఖుడు, సందేహం లేదు. ఆమె కలవరపాటును చూసి, చిరునవ్వు నవ్వాడు విజయుడు. ‘ఆహా, యెంత చక్కటి నవ్వు, సన్నజాజులు అరవిచ్చినట్లు ఉంది...’ అనుకుంటూ సమ్మోహనంగా చూడసాగింది ఆమె. ఎందుకో, స్త్రీ సహజమైన సిగ్గు కూడా ఆ క్షణంలో ఆమెకు గుర్తురాలేదు. కళ్ళ వాకిళ్ళ నుండీ ఆత్మలు తమ అనుబంధాన్నిమరోసారి గుర్తుచేసుకున్నాయి. ఆమె ఏమీ చెప్పలేదు, విజయుడు ఏమీ అడగలేదు. విజయుడి నవ్వుకు బదులుగా సన్నగా నవ్వి, ఇష్టసూచకంగా, మెల్లిగా అతని హృదయంపై వాలింది ఆమె. ఆమె ఆంతర్యాన్ని అర్ధం చేసుకున్న విజయుడు లాలనగా ఆమె తల నిమిరి, సుతారంగా ఆమె నుదుటిపై చుంబించాడు. తనూలత తొలకరిలో తడిసినట్లు పరవశంతో కంపించగా, ప్రేమ నింపుకున్న విప్పారిన నేత్రాలతో అతన్ని చూసింది ఆమె. ‘నువ్వు నా ప్రాణానివి, నిన్ను వదిలి వెళ్ళను, ‘ అన్నట్లుగా, అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది. మనసులో తెలియని ఆనందం ఉప్పొంగింది విజయుడికి, అతనికీ ఆమెను వదలాలని లేదు. ‘ నువ్వు నా జన్మజన్మల సహచరివి, ఇన్నాళ్ళకు నా నిరీక్షణ ఫలించింది,’ అన్నట్లు ఆమెను అపురూపంగా పొదువుకున్నాడు. ఒకరి పరిచయం ఒకరు అడగలేదు. ఒకరి డబ్బు, అంతస్థు, గుణగణాలు మరొకరికి అక్కర్లేదు. తాము ఎక్కడ ఉన్నామో అన్న చింత లేదు. అందం, అర్హతలు, లోపాలు, సుగుణాలు ఎంచనిదేగా ప్రేమ ! భాష, వ్యక్తీకరణ అక్కర్లేకుండానే ఒక్కోసారి మౌనం కూడా మధురంగా పలుకుతుంది. కాలం వెంట పరుగులు తీస్తూ ఉంటాడు మనిషి. కాని కాలం మనిషి ముందు ఓడిపోయి, అసహాయంగా నిలబడే క్షణాలు ఉంటాయి. మనిషి తనను తాను మర్చిపోయే క్షణాలు ఉంటాయి. ప్రపంచంలోని నిధులు, ధనధాన్యాలు, హోదాలు, అన్నింటినీ తృణప్రాయంగా తిరస్కరించే క్షణాలు ఉంటాయి. అవే ,మనిషి అహాన్ని మరచి ప్రేమలో మమేకమయ్యే క్షణాలు. అప్పుడు యుగాలు క్షణాల్లా దొర్లిపోతాయి. ఒకరి కౌగిలిలో ఒకరు అలా చాలా సేపు ఉండిపోయారు ఇద్దరూ... ‘ప్రియంవదా ! రాకుమారి ప్రియంవదా ! ఎక్కడమ్మా... ఎక్కడున్నారు ?’ అన్న పిలుపుతో స్పృహలోకి వచ్చారు ఇద్దరూ. ఒకరి నుండి ఒకరు విడివడి ఆ పిలుపు వినవచ్చిన దిశగా చూసారు. ఆ పిలుపుకు అప్రమత్తమై నిల్చుంది ఆమె. ‘ప్రియంవద’ ప్రియమైన వదనానికి తగ్గ చక్కటి పేరు, అనుకున్నాడు విజయుడు. ఒక నలుగురైదుగురు స్త్రీలు వెనుక భటులు తోడురాగా, అటువైపే వస్తున్నారు. తాను వారితో వెళ్లక తప్పదన్నట్లు నిస్సహాయంగా విజయుడి వైపు చూసింది ప్రియంవద. ఆమె చెయ్యి పట్టుకుని, సుతారంగా నొక్కి, వారి వద్దకు తీసుకు వెళ్ళాడు విజయుడు. వారిద్దరినీ చూసిన చెలులు ఆశ్చర్యంతో చూస్తుండగా, వారితో ఇలా అన్నాడు విజయుడు. ‘ ఓ కోమలులారా ! చూడబోతే మీరు ఈమె నెచ్చెలులని తెలుస్తోంది. నేను భైరవపురం రాకుమారుడను, విజయుడను. ఈమె ఎవరో నాకు తెలియదు కాని, ఆపద నుండీ ఈమెను రక్షించడం రాజధార్మంగా భావించాను. కాని, ఈమెను చూసాకా, తన పట్ల నాకు బలీయమైన అనురాగ భావన కలిగింది. తను కూడా నన్ను ఇష్టపడుతున్నట్లు తెలిసింది. ఈమెను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఈమె తల్లిదండ్రుల అనుమతితో వివాహమాడతాను. మీ పిలుపుతో ఆమె పేరు తెలిసింది. మీరు ఎవరు ?ఈ కారడవిలోకి ఎందుకొచ్చారు ?దయ ఉంచి ఈ వివరాలను కూడా తెలియచెయ్యండి,’ అన్నాడు. అతని రూపంలోని రాజసం, స్త్రీలతో మాట్లాడేటప్పుడు పాటించే మన్నన, అన్నింటికీ సంతోషించి, వారిలో ప్రియంవద ఇష్టసఖి అయిన ఒకామె ముందుకొచ్చి, ‘ రాకుమారా విజయా !నా పేరు చంపకవల్లి. ప్రియంవద ఇష్టసఖిని. ఈమె భైరవకోనకు తూర్పున ఉన్న కుంతలదేశపు రాజు ధర్మవేదుడి కుమార్తె ప్రియంవద. రాజగురువు ఆదేశానుసారం ప్రతీ పున్నమికి భైరవకొన లోని దుర్గ అమ్మవారి ఆరాధనకు అడవికి వస్తుంది. అలా వస్తుండగా, ఒక చిరుతపులి మమ్మల్ని వెంటాడింది. మేము భయంతో పరుగులు తీసాము. మా ప్రానసఖిని రక్షించినందుకు మీకు ఋణపడి ఉంటాము. ఇక మీరు చెయ్యి విడిస్తే, మా రాకుమారిని మాతో తీసుకువెళ్తాం...,’ అంది కొంటెగా ప్రియంవద మొహంలోకి చూస్తూ... సిగ్గుతో ప్రియంవద మొహం కందిపోయింది. ఆమె చేతిని చంపకవల్లి చేతిలో పెడుతూ, ‘మీరు ప్రియంవదను తీసుకువెళ్తుంటే, నా హృదయాన్ని బలవంతంగా పెకిలించి తీసుకువెళ్తున్న భావన కలుగుతోంది. ఈమెను భద్రంగా మీ దేశానికి తీసుకు వెళ్ళండి. ,’ అన్నాడు. కన్నీటితో వెళ్తున్న రాకుమారిని చూసి, ‘చింతించకు ప్రియంవదా, త్వరలోనే మీ దేశం వచ్చి, మీ తల్లిదండ్రుల అనుమతితో నిన్ను పరిణయమాడతాను,’ అంటూ వీడ్కోలు పలికాడు విజయుడు. (సశేషం)
No comments:
Post a Comment